శ్రీ లలిత సహస్ర నామాలు స్తోత్రాలకు తెలుగులో అర్థం

soundarya lahari meaning in telugu
41. శ్లోకం
తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటమ్ !
ఉభాభ్యా మేతాభ్యాముదయ విధి ముద్ధిశ్య దయయా
సనాథాభ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగ దిదమ్ !!
తాత్పర్యం:
స్త్రీ _ పురుష నాట్యాలకు ప్రతీకలైన సమయ_ తాండవ నృత్య కేళిలో అంబా పరమేశ్వరుల నవరసాత్మక సమ్మేళనం చేతనే, ప్రళయమందు దగ్దమైన జగత్తు తిరిగి సృష్టించబడుతుంది. ఇది ఆనంద తాండవనృత్యం. జగదుత్పాదక సూత్రం.
42. శ్లోకం
గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం
కిరీటం తే హైమం హిమగిరిసుతే కీతయతి యః !
స నీడేయచ్ఛాయా-చ్ఛురణ-శకలం చంద్ర-శకలం
ధనుః శౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణామ్ !!
తాత్పర్యం:
అమ్మా! హిమగిరితనయా! పన్నెండుగురు సూర్యులు మణులుగా ఏర్పడి పొదగబడిన నీ బంగారు కిరీటమును వర్ణించు కవి ఆ కాంతులు నానా విధములుగా వ్యాపించి యున్న నీ శిరము మీది చంద్రకళను చూచి “ఇది ఏమి ఇంద్రధనస్సా” అని సందేహపడగలడు.
43. శ్లోకం
ధునోతు ధ్వాన్తం న స్తులిత దళితేన్దీవర వనమ్
ఘన స్నిగ్ధ శ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే !
యదీయం సౌరభ్యం సహజ ముపలబ్ధుం సుమనసో
వసంత్యస్మిన్మన్యే బలమథన వాటీ విటపినామ్ !!
తాత్పర్యం:
ఓ హిమగిరి తనయా! తల్లీ! పార్వతీ దేవీ! అప్పుడే వికసిస్తున్న నల్ల కలువల సమూహంతో సాటియైనది, మేఘమువలె దట్టమై, నునుపై, సుగంధ తైలముతో కూడిన విధంగా మెత్తనిది అయిన నీ శిరోజముల సమూహము- మాలోని చీకటి అనే అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుగాక ! నీ కేశములకు సహజంగా ఉన్న సుగంధాన్ని తాము పొందడానికేమో, బలుడనే రాక్షసుని చంపిన ఇంద్రుని యొక్క నందనోద్యానములో ఉన్న కల్పవృక్షపు  పుష్పములు, నీకేశ సమూహాన్నిచేరి, అక్కడ ఉంటున్నాయని నేను భావిస్తున్నాను.
44. శ్లోకం
తనోతు క్షేమం నస్తవ వదనసౌందర్యలహరీ-
పరీవాహస్రోతః సరణిరివ సీమంతసరణిః ।
వహంతీ సిందూరం ప్రబలకబరీభారతిమిర-
ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణమ్ ॥ 44
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! నీ ముఖ సౌందర్య ప్రకాశ ప్రవాహము ప్రవహించుటకు వీలుగా నుండు కాలువవలె – నీ పాపట దారి కనబడుచున్నది. ఆ పాపటకు ఇరువైపులా దట్టముగానున్న నీ కురుల సమూహములు – కటికచీకటి రూపముతో ఇరువైపులా బృందములుగా తీరి యున్న శత్రువులవలె కనబడుచుండగా – వాటి మధ్య బందీగా చిక్కబడిన ప్రాతః కాలసూర్య కిరణము వలె – నీ పాపట యందలి సింధూరపు రేఖ భాసించుచున్నది. అట్టి సిందూర రేఖతో నుండు నీ పాపట మాకు నిత్యము శుభ సౌభాగ్య యోగ క్షేమములను విస్తరింపచేయుగాక.
45. శ్లోకం
అరాలై స్స్వాభావ్యా _ దళికలభస శ్రీభి రలకైః
పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహ రుచిమ్!
దరస్మేరేయస్మిన్_ దశన రుచి కింజల్క రుచిరే
సుగంధౌ మాద్యంతి_స్మర దహన చక్షుర్మధులిహః”
తాత్పర్యం:
ఓ జగన్మాతా! సహజంగానే వంకరలు తిరిగినవై, కొదమ తుమ్మెదల కాంతివంటి నల్లని కాంతిని కల్గియున్న ముంగురులతో కూడిన నీముఖము, పద్మ కాంతిని, అందాన్ని పరిహసిస్తూన్నది.  చిరునవ్వుతో వికసించుచున్నది, దంతముల కాంతులు అనే కేసరములచే సుందరమైనది, సువాసన కలది అయిన నీ ముఖపద్మమునందు, మన్మథుని దహించిన శివుని చూపులు అనే తుమ్మెదలు కూడా మోహపడుతున్నాయి.
46. శ్లోకం
లలాటం లావణ్యద్యుతివిమలమాభాతి తవ య-
ద్ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ ।
విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథః
సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః ॥ 46
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! నీ నుదురు భాగము పవిత్రమైన సౌందర్యాతిశయముతో ప్రకాశించుచున్నది. అట్టి ఈ లలాటభాగము నీ కిరీటమునందు కనబడకుండానున్న చంద్రుని రెండవ అర్థభాగముగా ఉన్నట్లు ఊహించుచున్నాను. నా ఈ ఊహ నిజమే అయి వుండవచ్చును. కారణమేమనగా నీ లలాట భాగమును ఆ అర్ధచంద్ర భాగమును కలిపినచో అమృతమును స్రవించు పూర్ణచంద్రుని ఆకారమును పొందుచున్నది. ఆ స్రవింపబడు అమృతముతోనే ఆ రెండూ అతకబడినట్లు గూడా కనబడని విధముగా కలసిపోయి, పూర్ణచంద్రుని వలె భాసించుచున్నవి గదా!
47. శ్లోకం
భ్రువౌ భుగ్నే కించిద్భువన భయభంగ వ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణమ్ ।
ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతేః
ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే ॥ 47
తాత్పర్యం:
సమస్త లోకాలకు కలుగు ఆపదలనుండి వాటిని రక్షించుటయందే పట్టుదలతో గూడిన అసక్తి గల ఓ తల్లీ, ఉమా! కొద్దిగా వంపుగా వంగినట్లున్న నీకనుబొమల తీరు – తుమ్మెదల వంటి శోభను గలిగి, అడ్డముగా వరుసలోనున్న నల్లని కనుదోయిని వింటినారిగా గలిగి – మన్మథుని వామహస్తము యొక్క పిడికిలిచేత నడిమి భాగములో పట్టుబడుటచే కనబడకుండానున్న కొంత నారి భాగమును, దండభాగమును కలిగిన – విల్లుగా అనిపించుచున్నది.
48. శ్లోకం
అహః సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా ।
తృతీయా తే దృష్టిర్దర దలిత హేమాంబుజ రుచిః
సమాధత్తే సంధ్యాం దివసనిశ యోరంత రచరీమ్ ॥ 48
తాత్పర్యం:
అమ్మా! జగజ్జననీ! నీ కుడికన్ను సూర్య సంబంధమైనదగుటచే పగటిని జనింపజేయుతున్నది. నీ యొక్క ఎడమకన్ను చంద్ర సంబంధమైనదగుటచే రాత్రిని పుట్టించుచున్నది. ఎర్రతామరపూవురంగు గల నీ లలాటనేత్రము అహోరాత్రముల నడుమ వర్తించుచూ సాయం పాత్రః కాల సంబంధమైన ఉభయ సంధ్యలను అగ్నిని సూచించు ఎరుపుదనము తన వర్ణ లక్షణముగా గలదని సూచించుట వలన ఈ తృతీయ నేత్రము అగ్ని సంబంధమైనదని గ్రహించబడుతున్నది.
49. శ్లోకం
విశాలా కల్యాణీ స్ఫుటరుచిర యోధ్యా కువలయైః
కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా ।
అవంతీ దృష్టిస్తే బహునగర విస్తారవిజయా
ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే ॥ 49
తాత్పర్యం:
తల్లీ ! జగజ్జననీ ! నీ చూపు
విశాలమై – విశాలయను నగర నామము వ్యవహగించుటకు తగినదియై;
కళ్యాణవంతమై – కళ్యాణీ అనునగర నామ వ్యవహారమునకు యోగ్యమై;
స్పష్టమైన కాంతి గలిగి – నల్ల కలువలు జయించలేని సౌందర్యము కలది అగుచు;
అయోధ్య అను నగరము పేర పిలుచుటకు తగినదై,
కృపారస ప్రవాహమునకు ఆధారవుగుచూ ధారానగర నామముతో వ్యవహరించుటకు తగినదై;
వ్యక్తము చేయ వీలులేని మధుర మనోజ్ఞమగుచు – మధురానగర నామముతో పిలుచుటకు అర్హమై;
విశాలము, పరిపూర్ణ దృక్పథమును గలుగుచు – భోగవతీ నగర నామముతో వ్యవహరించటకు తగినదై;
రక్షణ లక్షణము కలిగి – అవంతీ నగర నామముతో పిలుచుటకు తగినదై;
విజయ లక్షణముతో- విజయనగర నామముతో వ్యవహరింప తగినదై –
ఈ విధమైన ఎనిమిది లక్షణములతో ఎనిమిది నగరముల పేర వ్యవహరించుటకు తగినదై – సర్వోత్కర్షత చేత స్వాతిశయముతో వర్తించుచున్నది.
50. శ్లోకం
కవీనాం సందర్భ స్తబక మకరందైక రసికం
కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగలమ్ ।
అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరలా-
వసూయా సంసర్గాదలిక నయనం కించిదరుణమ్ ॥ 50
తాత్పర్యం:
సుకవీశ్వరుల రసవత్తర రచనలనే పుష్ప గుచ్చముల నుండి జాలువారు తేనెయందు మాత్రమే అత్యంతాసక్తిని చూపు నీ యొక్క చెవుల జతను – కడగంటి చూపులు అను నెపముతో నీ రెండు కన్నులు అను గండు తుమ్మెదలు – శృంగారాది నవరసాస్వాదానానుభూతిని పొందుట యందు అత్యంతాసక్తిని కలిగినవై – ఆ రసాస్వాదన లాంపట్యము చేత నీ కన్నుల జంటను విడువలేక యుండగా – పైన ఉన్న లలాట నేత్రము చూసి – మిక్కిలిగా అసూయ చెంది, ఎరుపు వన్నెకలదైనది అనగా కోపముతో ఎర్రబడినదిఅని భావము.
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *