Rama's Anger at Lord Sea in the Ramayanam

సముద్రునిపై శ్రీరాముడి ఆగ్రహం

సముద్రునిపై శ్రీరాముడి ఆగ్రహం

రావణ సంహారం కోసం భూమిపై అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారమే శ్రీరాముడు. శ్రీరాముని గురించి తెలియని వారు ఉండరు. సత్యం పలికేవాడు, పెద్దల పట్ల భక్తి గౌరవాలు కలవాడు, సౌమ్యుడు, మితభాషి, మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని పేర్కొంటారు. కానీ అంతటి శ్రీరామునికి అమితమైన, భయంకరమైన ఆగ్రహం కలిగించిన సంఘటన ఒకటి రామాయణంలో యుద్ధకాండలో జరిగింది. అది ఏంటో తెలుసుకుందాం.

శ్రీమద్రామాయణంలో యుద్ధకాండ 19వ సర్గలో రాముడు మరియు సముద్రుడు మధ్య జరిగిన సంభాషణ కనిపిస్తుంది. సీతాన్వేషణలో భాగంగా శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు వానరసేనతో కలిసి దక్షిణ సముద్రానికి చేరుకుంటారు. సముద్రాన్ని చూసి సుగ్రీవుడు, హనుమంతుడు మరియు వానరవీరులతో కలిసి ఈ అనంతమైన సముద్రాన్ని ఎలా దాటాలి అని విభీషణుని అడుగుతారు. అప్పుడు విభీషణుడు శ్రీరాముడు సముద్రుని ఆశ్రయించడం మంచిదని చెబుతాడు. ఈ సముద్రాన్ని రాముని పూర్వీకుడైన సగరుడు తవ్వించాడు కాబట్టి సముద్రుడు రాముని కార్యాన్ని నెరవేర్చుతాడని చెప్పాడు.

సుగ్రీవుడు రామలక్ష్మణుల దగ్గరకు వెళ్లి ఈ విషయాన్ని చెప్పగా, రాముడు లక్ష్మణుడు మరియు సుగ్రీవుడిని చూసి మీరు ఇద్దరూ సమర్థులు, మీకు ఏది ఇష్టమో నిర్ణయించి చెప్పమన్నాడు. వారు ఈ భయంకరమైన సముద్రంపై సేతు నిర్మించకుండా దేవతలు కూడా లంకలో ప్రవేశించలేరని, కాబట్టి ఆలస్యం చేయకుండా సముద్రాన్ని ఆదేశించమని సూచించారు.

వారి మాటలు విని రాముడు సముద్రతీరంలో దర్భాలు పరుచుకొని సముద్రానికి నమస్కరించి, చేతులను తలగడగా ఉంచుకొని శయనించాడు. “నేను ఈ సముద్రాన్ని దాటాలి లేదా మరణించాలి” అని దృఢంగా నిశ్చయించుకొని యథాశాస్త్రంగా నియమాలను పాటిస్తూ మూడు రోజులు పాటు సముద్రుని ఆరాధించాడు. అయినా సముద్రుడు ప్రత్యక్షం కాలేదు.

అప్పుడు రాముడు సముద్రునిపై కోపించి లక్ష్మణుడితో ఇలా అన్నాడు: ఈ సముద్రుడికి ఎంత గర్వం! మంచి వారి శాంతి, ఓర్పు, సౌమ్యమైన మాటలను మూర్ఖులు బలహీనతగా పరిగణిస్తారు. దుర్మార్గుడు తనను తాను పొగుడుకుంటూ అందరినీ హింసించే వాడిని సత్కరిస్తారు. అత్యంత శక్తివంతమైన నా బాణాలతో ఈ సముద్రంలోని సర్పాలను, మొసళ్లను, జలచరాలను ఖండించి సముద్రపు నీటిపై తేలేలా చేస్తాను. శంఖాలు, ముత్యాలు, చేపలతో నిండిన ఈ సముద్రాన్ని ఎండబెడతాను. ఓర్పు, సహనం గల నన్ను చూసి ఈ సముద్రుడు అసమర్థుడు అనుకుంటున్నాడు. ఇలాంటి వారి విషయంలో ఓర్పు వహించడం తప్పు. లక్ష్మణా, నా ధనస్సును, బాణాలను తీసుకొని రా. ఈ సముద్రాన్ని ఎండబెడతాను. అప్పుడు వానరులు దీనిని నడుచుకుంటూ దాటగలరు అని మిక్కిలి కోపంతో అన్నాడు.

కళ్లను విప్పార్చి, ప్రజ్వలించే ప్రళయకాల అగ్నిలా భయంకరంగా కనిపించాడు. భయంకరమైన ధనస్సును పట్టుకొని బాణాలను ప్రయోగించగా, మహాతేజస్సుతో మండుతూ మహావేగంతో రాముడు వదిలిన బాణాలు సముద్రంలోకి ప్రవేశించాయి. సముద్రజలాలు పెద్ద పెద్ద అలలతో ఘోరధ్వనితో ఎగసిపడ్డాయి. అందులో నివసించే జీవులు—పాములు, మొసళ్ళు, రాక్షసులు—భయంతో అల్లకల్లోలమయ్యారు. మహాసముద్ర జీవులు తలకిందులయ్యాయి. సముద్రం అల్లకల్లోలమైంది.

అప్పుడు లక్ష్మణుడు వెంటనే రాముని ధనస్సును పట్టుకుని, “వద్దు, ఇలా సముద్రాన్ని నాశనం చేయకండి. అత్యంత పరాక్రమవంతుడైన మీరు సముద్రాన్ని నాశనం చేయకుండానే కార్యాన్ని సాధించగలరు. మీ వంశపారంపర్యమైన సత్పురుషుల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకోండి” అని ప్రార్థించాడు. ఆకాశంలో ఉన్న బ్రహ్మర్షులు, దేవతలు కూడా “వద్దు, వద్దు” అని వారించారు.

అయినా రాముడు భయంకర కోపంతో, “ఓ సముద్రుడా! నా బాణాలతో నీ జలాలను కాల్చివేసి, జంతువులను నాశనం చేసి, పాతాళంతో సహా నిన్ను ఎండబెడతాను. నీవు నా పౌరుషాన్ని, పరాక్రమాన్ని గుర్తించడం లేదు. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తావు” అని చెప్పి బ్రహ్మదండంలో ఉన్న బాణంపై బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు.

భూమి, ఆకాశాలు బద్దలైనట్లు అనిపించింది. పర్వతాలు, దిక్కులు, సరస్సులు, నదులు కంపించాయి. చీకటి కమ్ముకుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు గతి తప్పి సంచరించినట్లయ్యాయి. ఉల్కలు పడుతూ ఆకాశం మండిపోయింది. భయంకర గాలులు వీచాయి. అగ్నితో కలసి పిడుగులు పడ్డాయి. వాటి ప్రభావంతో జీవులు విలవిల్లాడాయి. కనబడని పిశాచాలు భయంకరంగా అరిచాయి.

అప్పుడు ప్రాణులతో, నాగులతో, రాక్షసులతో నిండిన సముద్రజలం ముంచెత్తి ఒక యోజన దూరం దాటి, మరల ఒక యోజనం లోపలికి వెనక్కు తగ్గింది. అలా వెనక్కు తగ్గిన సముద్రుడిపై బాణాలు వేయడం ధర్మం కాదని భావించి శ్రీరాముడు బాణప్రయోగం ఆపాడు.

అప్పుడు మేరు పర్వతం నుండి సూర్యుడు ఉదయించినట్లుగా, రత్నహారాలు, రత్నాలు పొదిగిన వస్త్రాలు, బంగారు ఆభరణాలు ధరించి, తలపై పుష్పమాలలతో అలంకరించుకొని సముద్రుడు సముద్రజలాల నుండి అత్యద్భుతంగా ప్రత్యక్షమయ్యాడు.

దేవతా స్త్రీలతో సమానమైన వివిధ రూపాలు ధరించి గంగా, సింధు మొదలైన నది దేవతలు అతని వెనుక వచ్చారు. సముద్రుడు అంజలి ఘటించి, “భూమి, వాయువు, ఆకాశం, జలము, అగ్ని తమ తమ ధర్మాన్ని అనుసరించి స్వభావాన్ని దాటకుండా ఉంటాయి. అలాగే లోతుగా ఉండటం నా స్వభావం. లోతులేని వాడిగా మారడం నా స్వభావానికి విరుద్ధం. జీవరాశులతో నిండిన ఈ సముద్రాన్ని నేను స్తంభింప చేయలేను. కానీ మీరు దాటడానికి వీలుగా స్థలాన్ని ఏర్పాటు చేస్తాను. వానరసేన సముద్రాన్ని దాటే వరకు సముద్రంలోని జంతువులు ఏ అపకారం తలపెట్టకుండా చేస్తాను” అన్నాడు.

అప్పుడు రాముడు, “నా బాణం వ్యర్థం కావడానికి వీల్లేదు. దీనిని ఎక్కడ ప్రయోగించాలి?” అన్నాడు. సముద్రుడు ఆ మాటలు విని ఇలా అన్నాడు: “నాకు ఉత్తరంగా దుర్మార్గము అనే అపవిత్రమైన స్థలం ఉంది. అక్కడ పాపాత్ములు, భయంకరులు, అభీరులు నా జలాలను తాగుతున్నారు. ఆ పాపాత్ముల స్పర్శను నేను భరించలేను. ఆ ప్రదేశంలో వారిపై ప్రయోగించండి” అన్నాడు.

రాముడు ఆ ప్రదేశంలో బాణాన్ని ప్రయోగించగా, అక్కడ పాతాళం నుండి జలం పైకి ఎగసి వచ్చింది. ఆ ప్రదేశం ‘మరుకాంతరం’ అని ప్రసిద్ధి చెందింది. అక్కడ తేనె, ఫలాలు పుష్కలంగా లభిస్తాయి. అనేక రకాల ఔషధాలు, సుగంధ పుష్పాలతో నివసించడానికి యోగ్యంగా ఉంటుంది అని శ్రీరాముడు వరమిచ్చాడు.

సముద్రుడు రామునితో ఇలా చెప్పాడు: “శ్రీరామా, వీరుడైన ఈ నలుడు విశ్వకర్మ కుమారుడు. తండ్రితో సమానమైన శక్తి సామర్థ్యాలు కలవాడు. అతడు సముద్రం మీద వారధిని నిర్మించగలడు” అని చెప్పాడు.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top