రామాయణంలో శబరి భక్తి మహిమ
సంస్కృత రామాయణంలోని ప్రతి పాత్ర ఆసక్తికరమే. అందులో కొన్ని చిన్న పాత్రలకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. శబరి పాత్ర కూడా అలాంటిదే. కానీ అసలు శబరి ఎవరు? రాముని కోసం ఎందుకు జీవితాంతం ఎదురుచూసింది? శ్రీరాముడు దర్శించాక శబరి ఏమైంది? శబరి ఆశ్రమంలో శ్రీరాముడు ఏమి కోరుకున్నాడు? ఈ వివరాలను తెలుసుకుందాం.
వాల్మీకి రామాయణం అరణ్యకాండ 72వ సర్గలో రాక్షసుడైన కబంధుడు రామలక్ష్మణుల చేతిలో హతమై జ్ఞానోదయం పొంది శాపవిమోచనం పొందిన తరువాత శబరి గురించి వివరిస్తాడు. దగ్గరలోని పంపా సరోవరం తీరంలో మతంగ మహర్షి ఆశ్రమం ఉంది. పూర్వం మతంగ మహర్షి మరియు ఆయన శిష్యులు అక్కడ నివసించేవారు. ఎంతో ఏకాగ్రత కలిగిన శిష్యులు ఆయనకు ఎంతో సేవ చేసేవారు. మహర్షి మరియు ఆ శిష్యులు అందరూ వెళ్లిపోయిన తరువాత కూడా వారికి సేవలు చేస్తూ ఉండే శబరి అనే ఒక సన్యాసిని మాత్రం నేటికీ అక్కడే ఉంది.
ఆమె జీవితం సేవలోనే నిమగ్నమైంది. శబరి గిరిజన కుటుంబంలో పుట్టింది. పంపా నది తీరాన ఉన్న మతంగముని ఆశ్రమంలో పెరిగింది. శుభ్రం చేయడం, ఆవులకు మేత పెట్టడం, కావలసిన పూలు, పళ్ళు, సమిధలు తేవడం ఆమె దినచర్య. గురువులు చెప్పే భక్తి మాటలు వింటూ పెరిగింది. ఆమె గురువులందరూ వెళ్లిపోయారు. ఆమెకు ముసలితనం వచ్చింది. ఒకసారి గురువులు ఆమెతో, “శ్రీరాముడు ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. ఆయనను దర్శించిన తరువాతనే నీవు స్వర్గాన్ని చేరుతావు” అని చెప్పారు.
కబంధుడు తెలిపిన మార్గాన్ని అనుసరించి రామలక్ష్మణులు ఆ వనానికి పడమర దిక్కుగా ప్రయాణించి, పూల చెట్లతో, పండ్ల చెట్లతో కళకళలాడుతున్న శబరి ఆశ్రమానికి చేరారు. వారిని చూసిన శబరి నమస్కరించి వారికి పాదాభివందనం చేసింది. తన శక్తిమేరకు అతిథి మర్యాదలు చేసింది.
తపస్సులో నిష్ఠతో ఉన్న ఆ శబరిని శ్రీరాముడు అడిగాడు: “నీవు క్షేమంగా ఉన్నావా? నీ తపోవిధులకు, ఆహార నియమాలకు ఎటువంటి ఆటంకాలు లేవు కదా? ఇంద్రియ విక్షేపాలు నీ దరి చేరడం లేదు కదా? గురుసేవలో తరిచి ప్రశాంత జీవితం గడుపుతున్నావు కదా?”
అప్పుడు శబరి శ్రీరాముడితో ఇలా చెప్పింది: “రామచంద్రా! నిన్ను కనులారా దర్శించడంతో నా తపస్సు సిద్ధించింది. నా జీవితం సఫలమైంది. నేను చేసిన సేవలు సార్థకమయ్యాయి. నీ కరుణాకటాక్షంతో నేను పరంధాముని సన్నిధికి చేరుతాను. నా గురువులను నేను భక్తిశ్రద్ధలతో సేవించాను. వారు మోక్షమార్గాన్ని చేరుతూ, ‘శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి ఈ ఆశ్రమానికి వస్తాడు. భక్తితో అతిథి మర్యాదలు చేయి. ఆయన దర్శనభాగ్యంతో నీవు కైవల్యాన్ని పొందుతావు’ అని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. సరోవర తీరంలోని వనంలో దొరికే ఫలములను నీకోసం ప్రతిరోజూ సిద్ధం చేస్తున్నాను” అని పలికింది.
శ్రీరాముడు శబరి మాటలను విని, “నీ తపస్సు, నీ గురువుల మహత్యం, ఈ వనం గురించి కబంధుని ద్వారా తెలుసుకున్నాను. ఈ పవిత్రమైన ఆశ్రమాన్ని, పంపా నది తీరంలోని ఈ సుందర వనాన్ని చూడాలనుకుంటున్నాను” అన్నాడు.
శబరి వారికి ఆశ్రమాన్ని చూపించింది. మృగాలు, పక్షులు, పూలు, పళ్ళతో నిండిన ఆ ప్రదేశం గురించి వివరించింది. “మా గురువుగారు మంత్రబలంతో గంగానది జలాలను ఇక్కడికి ఆహ్వానించారు. ఈ తీర్థాన్ని సప్తసాగర తీర్థం అంటారు. ఉపవాసశ్రమ కారణంగా సప్తసాగరాలకు స్వయంగా వెళ్లలేక, ప్రార్థించగా ఆ జలాలు ఇక్కడికి వచ్చాయి. ఇక్కడే స్నానం చేసి, తడి వస్త్రాలను చెట్లపై ఆరేసేవారు. వారి తపస్సు ప్రభావంతో ఇవి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. వారు సమర్పించిన పుష్పమాలలు కూడా వాడిపోకుండా ఉన్నాయి” అని చెప్పింది.
తరువాత శబరి ఇలా అడిగింది: “మీ అనుమతితో ఈ తనువును విడిచిపెట్టాలని అనుకుంటున్నాను. మా గురువులు చేరిన పరంధాముని సన్నిధికి నేను కూడా చేరాలనుకుంటున్నాను. దయచేసి అనుమతించండి.”
శ్రీరాముడు ఆమె గురుభక్తిని చూసి ఎంతో సంతోషించాడు. “భక్తితో నీవు చేసిన పూజలకు సంతోషించాను. నీ ఇష్టానుసారం నీ గురువులను చేరుకో” అని అన్నాడు.నారచీరలు, జింకచర్మం ధరించిన ఆ వృద్ధురాలైన శబరి, శ్రీరాముని ఆజ్ఞతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి, అగ్నితేజస్సుతో వెలుగుతూ పరంధాముని చేరింది. పరంధామునికి బయలుదేరేటప్పుడు ఆమె దివ్యాభరణాలతో, అపూర్వహారాలతో, అద్భుత వస్త్రాలతో మెరిసింది. విద్యుల్లతలా ప్రకాశిస్తూ ఆ ప్రదేశమంతా వెలుగులు నింపింది. తన సమాధియోగ ప్రభావంతో ఆమె అక్షయలోకాలను చేరింది.
శ్రీరామ లక్ష్మణులు ఆ మహర్షుల ప్రభావాన్ని స్మరించి, శబరిని మరొకసారి మనసారా ఆలోచించి, సుగ్రీవుని వద్దకు బయలుదేరారు.వేదాంత గ్రంథాలు చదవలేదు అయినా, శ్రీరాముడు తనను వెతుక్కుంటూ వచ్చాడు. కారణం ఆమె అకుంఠిత భక్తి, దీక్ష, సహనం. మొత్తానికి శబరి జీవిత లక్ష్యం నెరవేరింది. తాను కోరుకున్న రాముని నేరుగా సేవించింది. నేరుగా మోక్షాన్ని అందుకుంది.
శబరి జీవితం కేవలం భక్తులకు మాత్రమే కాదు, జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, దానిని నమ్మకంతో ఎదురుచూస్తూ, దానికి అనుగుణంగా జీవించినప్పుడు తప్పక విజయం సాధ్యమవుతుందని తెలియజేస్తుంది.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

