భజగోవిందం
జగద్గురు ఆది శంకరాచార్యులు- అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. ఆచార్యులవారు ఒకనాడు కాశీలో ఒక వృద్ధ పండితుడు వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తూ ఉండటం చూసి ఆశ్చర్యచకితులై, ఆ వృద్ధుని హెచ్చరిస్తూ “ఓ మూఢమతి! కాటికి కాళ్ళు చాచిన నీకు మరణ సమయంలో ఈ వ్యాకరణ సూత్రాలు ముక్తిని కలుగజేయలేవు. ఈ అవసాన దశలో దీన్ని వదలి గోవిందుని (భగవంతుని) భజించు!” అంటూ “భజగోవిందం, భజగోవిందం గోవిందం భజ మూఢమతే!” అనే మకుటంతో హెచ్చరించారు. “మోహ ముద్గరం” అని ఈ శ్లోకాలు ప్రసిద్ధి చెందాయి. ఇందులో శంకరాచార్యులవారు కొన్ని రచిస్తే, వారి శిష్యులు మరికొన్ని రచించారు.
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే.
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృణ్ కరణే ||1||
భావం: గోవిందుని సేవించుము, గోవిందుని సేవించుము. ఓ మూఢ మానవుడా! గోవిందుని సేవించుము. మరణం సమీపించినప్పుడు డుకృఇ్కరణే అనే వ్యాకరణ సూత్రము నిన్ను రక్షించదు.
మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం
యల్లభసే నిజ కర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం ||2||
భావం: ఓ మూర్ఖుడా! ధన సంపాదనపై ఆశ వదులుకుని, మనసులో ఆశలు పెంచుకోకుండా, మంచి ఆలోచనలు నింపుకుని, స్వశక్తితో సంపాదించిన ధనంతో ఆనందించు.
నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా మాగా మోహావేశం
ఏతన్మాంసవసాది వికారం
మనసి విచింతయ వారం వారమ్ ||3||
భావం: స్త్రీల స్తనసౌందర్యాన్ని చూచి మోహావేశం చెందవద్దు. అవి మాంసం, కొవ్వు మొదలైన పదార్థాలతో కూడినవి అని మళ్ళీ మళ్ళీ మనసులో తలువుము.
నళినీ దలగత జలమతి తరలం
తద్వజ్జీవితమతిశయచపలం
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తం ||4||
భావం: తామరాకుపై నీటిబొట్టు వలే జీవితం ఎంతో చంచలమైనది. లోకమంతా వ్యాధులతో, దురభిమానంతో నిండి శోకించుచున్నది అని తెలుసుకొనుము.
యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్ఛతి గేహే ||5||
భావం: ధనము సంపాదించినంత వరకే తనవారంతా ప్రేమగా ఉంటారు. దేహం కాస్త సడలిపోయి, ఏ పనీ చేయగల శక్తి లేనివారైతే ఇక ఇంటిలో ఎవరూ పట్టించుకోరు.
యావత్పవనో నివసతి దేహే
తావత్పృచ్ఛతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే ||6||
భావం: ఎంతవరకైతే ఈ దేహంలో ప్రాణం ఉంటుందో అంతవరకే ఇంట్లోనివారు క్షేమాన్ని అడుగుతారు. శరీరానికి అపాయం కలిగి ప్రాణం పోతే, అతణ్ణి చూసి భార్య కూడా భయపడుతుంది. అతని దగ్గరకు ఎవ్వరూ చేరరు.
బాలస్తావత్ క్రీడాసక్తః
తరుణస్తావత్ తరుణీసక్తః
వృద్ధస్తావత్ చింతాసక్తః
పరే బ్రహ్మణి కోపి న సక్తః ||7||
భావం: మానవుడు – బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు, యౌవనంలో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు. కానీ ఆ పరమాత్మ యందు ఎవరూ మనసు పెట్టరు.
కాతే కాంతా కస్తే పుత్రః
సంసారో యమతీవ విచిత్రః |
కస్య త్వం కః కుతః ఆయాతః
తత్వం చింతయ యదిదం భ్రాతః ||8||
భావం: నీ భార్య ఎవరు? నీ కుమారుడు ఎవరు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నీవు ఎవరు? ఎవరికి చెందినవాడవు? ఎక్కడ నుంచి వచ్చావు? ఓ సోదరా! ఆ తత్వాన్ని ఇక్కడే – ఈ దేహం లో ఉండగానే ఆలోచన చేయి.
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం |
నిర్మోహత్వే నిశ్చలతత్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తి: ||9||
భావం: సత్పురుషులతో సాంగత్యం చేయడం వల్ల, ఈ ప్రాపంచిక విషయాల మీద సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది. మోహం తొలగిపోతే, మనసు భగవంతుడి మీద చలించకుండా నిలిచిపోతుంది. అప్పుడు సకల కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం, జీవన్ముక్తి.
వయసి గతే కః కామవికారః
శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారః
జ్ఞాతే తత్వే కః సంసారః ||10||
భావం: వయస్సు మళ్ళిపోతే కామవికారాలుండవు. నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు. అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే, ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు.
మా కురు ధన జన యవ్వన గర్వం
హరతి నిమేషాత్కాలః సర్వం |
మాయామయమిదం అఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||11||
భావం: ధనమున్నదని, అనుచరగణం ఉన్నదని, యౌవనం ఉన్నదని గర్వించకు. ఈ మొత్తం ఒక్క నిముషంలో హరించిపోతుంది. ఈ ప్రపంచమంతా- భ్రమతో కూడుకున్నది, మాయాజాలమని తెలుసుకొని, ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో. ఆత్మానుభూతిని చెందు.
దినయామిన్యౌ సాయం ప్రాతః
శిశిరవసంతౌ పునరాయాతః |
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః
తదపి న ముంచత్యాశావాయుః ||12||
భావం: రాత్రింబవళ్ళు, ఉదయం సాయంత్రాలు, శిశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి, పోతుంటాయి. కాలచక్రం అలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయుష్కాలం కూడా అలాగే వెళ్లిపోతుంటుంది. అయినప్పటికీ మానవుడు ఆశ అనే గాలిని మాత్రం వదలడు.
కా తే కాంతా ధనగతచింతా
వాతుల కిం తవ నాస్తి నియంతా |
త్రిజగతి సజ్జనసంగాతిరేకా
భవతి భవార్ణవతరణే నౌకా||13||
భావం: ఓరి వెఱ్ఱివాడా! ఎందుకు నీ భార్య గురించి, ధన సంబంధ విషయాల గురించి ఆలోచిస్తావు? అన్నిటిని, అందరిని నియమించే సర్వజ్ఞుడైన ప్రభువు లేడనుకున్నావా? ఈ ముల్లోకాలలో చావు పుట్టుకలనే భవసాగరాన్ని దాటడానికి సజ్జన సాంగత్యమే సరైన నౌక.
ద్వాదశమంజరికాభిరశేషః
కథితో వైయాకరణస్యైషః .
ఉపదేశో భూద్విద్యానిపుణైః
శ్రీమచ్ఛన్కరభగవచ్ఛరణైః ॥13.అ॥
భావం: 12 శ్లోకాలు (2-13) అనే పుష్పగుచ్ఛములతో కూడిన సమస్త శాస్త్రసారభూతమైన ఈ ఉపదేశమంతా, సకల విద్యా ప్రవీణులైన శ్రీశంకరాచార్యుల వారిచే వ్యాకరణ పండితునకు చెప్పబడెను.
జటిలో ముండీ లుంఛితకేశః
కాషాయాంబర బహుకృతవేషః |
పశ్యన్నపి చన పశ్యతి మూఢః
ఉదరనిమిత్తం బహుకృతవేషః ||14||
భావం: అజ్ఞాని జడలు పెంచుకున్నా, గుండు గీయించుకొని బోడితల కలవాడైనా, రకరకాలుగా జుట్టు కత్తిరించుకున్నా, కాషాయ వస్త్రము ధరించినా, పలు విధాలుగా వేషాలు వేసినా, బ్రహ్మమయమైన ఈ జగత్తును చూస్తున్నా, పరమార్థ సత్యమును తెలుసుకోకుండానే ఉన్నాడు. అలాంటివాడు పలు రకాలుగా వేషాలేన్ని వేసినా, పొట్టకూటి కోసం మాత్రమే అగును, అని ఈ శ్లోకాన్ని తోటకాచార్యులవారు చెప్పారు.
అంగం గలితం పలితం ముండం
దశనవిహీనం జాతం తుండం |
వృద్ధో యాతి గృహీత్వా దండం
తదపి న ముంచత్యాశాపిండం ||15||
భావం: శరీరం కృశించిపోయింది, తల నెరసిపోయింది, నోటిలో పళ్ళు ఊడిపోయాయి. ముసలితనం పైబడి కఱ్ఱ చేతికొచ్చింది. ఐనా సరే ఆశల – కోరికల మూట మాత్రం వదిలిపెట్టడు.
అగ్రే వహ్నిః పృష్ఠేభానుః
రాత్రౌ చుబుక సమర్పితజానుః |
కరతలభిక్షస్తరుతలవాసః
తదపి న ముంచత్యాశాపాశః ||16||
భావం: ఎదురుగా చలిమంట పెట్టుకొని, వీపుపై సూర్యుని కిరణాలు పడేలా కూర్చొని, రాత్రిళ్ళు మోకాళ్ళకి గడ్డాన్ని ఆన్చుకుని కూర్చుంటాడు. తిండి తినడానికి రెండు చేతులూ దొప్పలుగా చేసుకొని అందులో తింటాడు. చెట్టు నీడన ఉంటాడు. ఐనా ఆశలు మాత్రం వదలడు. (ఈ శ్లోకాన్ని సుబోధాచార్యులవారు చెప్పారు).
కురుతే గంగాసాగరగమనం
వ్రత పరిపాలన మథవా దానం |
జ్ఞానవిహీనః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మశతేన ||17||
భావం: గంగా సముద్ర సంగమంలో స్నానం చేసినా, పూజలు, నోములు, వ్రతాలు చేసినా, దానధర్మాలు చేసినా కూడా- ఆత్మజ్ఞానము పొందనివాడు, వంద జన్మలెత్తినా సరే ముక్తిని పొందలేడు. ఇది సర్వమత సమ్మతం. (ఈ శ్లోకాన్ని సురేశ్వరాచార్యులవారు చెప్పారు).
సుర మందిర తరు మూల నివాసః
శయ్యా భూతలమజినం వాసః |
సర్వ పరిగ్రహ భోగ త్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః ||18||
భావం: దేవాలయాల్లోనూ, చెట్ల మొదళ్ళలోనూ, కటిక నేల మీద నిద్రిస్తూ, చర్మాన్ని వస్త్రంగా ధరిస్తూ, దేనినీ గ్రహించకుండా, ఏమీ కావాలని కోరుకోకుండా, అన్ని భోగాలను విడిచిపెట్టిన విరాగికి సుఖం తప్పక లభిస్తుంది.
యోగరతో వా భోగరతో వా
సంఘరతో వా సంఘవిహీనః |
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ ||19||
భావం: ఒకడు యోగిగా జీవించవచ్చు, భోగిగా జీవించవచ్చు. ఈ ప్రపంచంలో అందరితో కలిసి మెలిసి జీవించవచ్చు లేదా ఒంటరిగా అందరికీ దూరంగా జీవించవచ్చు. కాని ఎవరైతే తమ మనసును బ్రహ్మతత్వమునందే నిలిపి, తమను తాము బ్రహ్మగా భావిస్తూ ఉంటారో, అలాంటివారే ఆనందిస్తారు. ముమ్మాటికీ అలాంటివారికే ఆనందం. (ఈ శ్లోకాన్ని ఆనందగిరి ఆచార్యులవారు చెప్పారు).
భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికాపీతా |
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా ||20||
భావం: ఎవరైతే భగవద్గీతని కొంచమైనా అధ్యయనం చేస్తారో, గంగా జలాన్ని కొద్దిగా ఐనా తాగుతారో, కొంచమైనా శ్రీకృష్ణుని పూజిస్తారో- అట్టివారికి యమునితో వివాదం ఉండదు. ఈ శ్లోకాన్ని దృఢభక్తాచార్యులవారు చెప్పారు).
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం |
ఇహ సంసారే బహు దుస్తారే
కృపయా పారే పాహి మురారే ||21||
భావం: మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడం – ఈ అంతులేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం కష్టమైన పని. కనుక ఓ కృష్ణా! దయచేసి మమ్ములను రక్షించు. (ఈ శ్లోకాన్ని నిత్యనాథాచార్యులవారు చెప్పారు).
రథ్యా కర్పట విరచిత కంథః
పుణ్యాపుణ్య వివర్జిత పంథః |
యోగి యోగనియోజిత చిత్తో
రమతే బాలోన్మత్తవదేవ ||22||
భావం: దారిలో దొరికే గుడ్డ పీలికలతో తయారైన గోచిని ధరించిన వాడై, ఇది పుణ్యమని, అది పాపమని ఏ మాత్రం ఆలోచించక, నిరంతరం మనసుని యోగమునందే నిలిపిన యోగిపుంగవుడు ఈ లోకంలో బాలునిలాగా, పిచ్చివానిగా ప్రవర్తిస్తూ తనలో తాను ఆనందిస్తూ ఆత్మానందాన్ని పొందుతాడు. (ఈ శ్లోకాన్ని యోగానందాచార్యులవారు చెప్పారు).
కస్త్వం కోహం కుత ఆయాతః
కా మే జనని కో మే తాతః |
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం ||23||
భావం: నీవెవరవు? నేనెవరిని? మనం ఎక్కడ నుండి వచ్చాము? నా తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు?- అని ఈ ప్రకారంగా సంసారం గురించి విచారించి, ఇది అంతా కలలాగా అసత్యమని తెలిసికొని, ఆయా దేహాది పదార్థాలపై వ్యామోహమును విడిచి సత్యమైన పరమాత్మను ఆశ్రయించాలి. (ఈ శ్లోకాన్ని సురేంద్రాచార్యులవారు చెప్పారు).
త్వయి మయి చాన్యత్రైకో విష్ణు:
వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు: |
భవ సమచిత్తః సర్వత్ర త్వం
వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం ||24||
భావం: నీలోను, నాలోను, ఇతరులలోను ఒకే భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. అయినా నా పట్ల అసహనం కలిగి నన్ను కోపగించుకుంటున్నావు. నీవు బ్రహ్మత్వం- అంటే మోక్షాన్ని పొందాలనుకుంటే అంతటా, అన్నివేళలా సమబుద్ధిని కలిగి ఉండు. (సర్వం విష్ణుమయం అని భావం). (ఈ శ్లోకాన్ని మేధాతిథి ఆచార్యులవారు చెప్పారు).
శత్రౌ మిత్రే పుత్రే బంధౌ
మా కురు యత్నం విగ్రహ సంధౌ |
సర్వస్మిన్నపి పశ్యాత్మానం
సర్వత్రోత్సృజ భేదజ్ఞానం ||25||
భావం: శత్రువు, మిత్రుడు, పుత్రుడు, బంధువు ఎవరైనా- వీరిపట్ల శత్రుత్వమో, స్నేహమో చేసే ప్రయత్నం మానుకో. అందరిలోను ఆత్మను చూస్తూ, అన్ని సందర్భాలలోనూ భేదభావాన్ని విడిచిపెట్టు.
కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వాత్మానం భావయ కోహం |
ఆత్మజ్ఞాన విహీనా మూఢాః
తే పచ్యంతే నరకనిగూఢాః ||26||
భావం: కామం, క్రోధం, లోభం, మోహం – వీటన్నిటిని విడిచిపెట్టిన సాధకుడు “ఆ పరమాత్మను నేనే” అనే సత్యాన్ని దర్శిస్తాడు. ఆత్మజ్ఞానం లేనివారు మూఢులు. అలాంటివారు ఈ సంసార జనన మరణ చక్రం అనే నరకంలో బంధింపబడి, హింసించబడతారు. (ఈ శ్లోకాన్ని భారతీవంశాచార్యులవారు చెప్పారు).
గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |
నేయం సజ్జన సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తం ||27||
భావం: భగవద్గీత, విష్ణు సహస్రనామాలను గానం చెయ్యాలి. ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యానించాలి. సజ్జన సాంగత్యంలో మనసుని నడపాలి. దీనులైన వారికి ధనాన్ని దానం చెయ్యాలి. (ఈ శ్లోకాన్నిసుమతాచార్యులవారు చెప్పారు).
సుఖతః క్రియతే రామాభోగః
పశ్చాద్ధంత శరీరే రోగః |
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణం ||28||
భావం: సుఖాన్ని పొందాలని స్త్రీ పురుషులు రతి కార్యంలో నిమగ్నమవుతారు. దాని కారణంగా శరీరం రోగాలపాలవుతుంది. చివరికి మరణం అనేది ఎవరికి తప్పదు. ఐనా సరే మానవుడు పాప కార్యాలను వదలనే వదలడు.
అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితతః సుఖలేశః సత్యం |
పుత్రాదపి ధన భాజాం భీతి:
సర్వత్రైషా విహితా రీతి: ||29||
భావం: డబ్బు దుఃఖాన్ని ఇస్తుందని ఎప్పుడూ గుర్తుపెట్టుకో. దాని వల్ల కొంచెం సుఖం కూడా లేదు అనే మాట సత్యం. ధనవంతునికి తన కుమారుని వల్ల కూడా భయమే. అన్ని చోట్ల డబ్బు యొక్క పద్ధతి ఇంతే.
ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేకవిచారం |
జాప్యసమేత సమాధివిధానం
కుర్వవధానం మహదవధానం ||30||
భావం: క్రమపద్ధతిలో శ్వాసను నియమించడం, విషయాల నుండి మనసుని వెనక్కి మళ్లించడం, నిత్య వస్తువేదో, అనిత్య వస్తువేదో నిరంతరం బుద్ధితో విచారించడం, జపంతో కూడుకున్న ధ్యాననిష్ఠను సాగించి, సర్వ సంకల్పాలను విడిచిపెట్టడం అనే సాధనలను ఎంతో జాగ్రత్తగా అనుష్ఠించు. (ఈ శ్లోకాన్ని శ్రీశంకరాచార్యులవారు చెప్పారు).
గురుచరణా౦బుజ నిర్భర భక్తః
సంసారాద చిరార్భవ ముక్తః |
సేంద్రియమానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ||31||
భావం: గురువు యొక్క పాదపద్మములందు మనస్సును నెలకొల్పి గురుభక్తి కలవాడవై, నీ ఇంద్రియాలను, మనసుని నిగ్రహించడం ద్వారా మాత్రమే ఈ చావు పుట్టుకలతో కూడిన సంసార సాగరం నుండి ముక్తుడవై, నీ హృదయంలోనే ఉన్న పరమాత్మ సాక్షాత్కారం పొందెదవు. (ఈ శ్లోకాన్ని శ్రీశంకరాచార్యులవారు చెప్పారు).
మూఢః కశ్చన వైయాకరణో
డుకృన్కరణాధ్యయన ధురిణః .
శ్రీమచ్ఛమ్కర భగవచ్ఛిష్యై
బోధిత ఆసిచ్ఛోధితకరణః ॥32॥
భావం: ఆత్మజ్ఞానము లేనివాడు, వ్యాకరణ నియమాలతో తనను తాను కోల్పోయి మూఢుడైన ఒకానొక వ్యాకరణ శాస్త్రజ్ఞుడు, శ్రీశంకర భగవత్పాదుల చేతా, వారి శిష్యులచేతా ఈ విధంగా బోధింపబడి, అంతఃకరణము శుద్ధపరచుకొని తరించెను.
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
నామస్మరణాదన్యముపాయం
నహి పశ్యామో భవతరణే ॥33॥
భావం: గోవిందుని భజించు! గోవిందుని భజించు! ఓ మూఢుడా గోవిందుడినే భజించు. సంసార సాగరాన్ని దాటడానికి గోవింద నామస్మరణకి మించినది లేదు.
|| ఇతి భజగోవిందం సంపూర్ణం ||
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




