శ్రీ కాలరాత్రి దేవి – దుష్ట సంహారిణి
నవరాత్రుల ఏడవ రోజు అయిన ఆశ్వయుజ శుద్ధ సప్తమినాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. శరీరఛాయ చీకటిలాగా నల్లగా ఉన్నందువల్ల ఈ దేవికి కాళరాత్రి అని పేరు. తలపై కేశాలు చెల్లాచెదురుగా ఉండి, చూడటానికి భయంకరంగా ఉంటుంది. మెడలోని హారం కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. మూడు నేత్రాలు ఉంటాయి. ఉచ్వాస నిశ్వాసాలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెలిగక్కుతూ ఉంటాయి. ఈమె వాహనము గాడిద.
కాళరాత్రి అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి. ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో ఇనుప ఆయుధం ఉంటుంది. మిగిలిన రెండు చేతులతో అభయముద్ర, వరముద్రలను చూపిస్తూ భక్తులను ఆశీర్వదిస్తారు. ఈ రూపాన్ని చూసి దుష్టశక్తులు, రాక్షసులు భయపడతారు.
ఈమె చూడటానికి భయంకరముగా ఉన్నా ఎల్లప్పుడూ శుభాలనే ప్రసాదించడం వల్ల ఈ దేవిని శుభంకరి అని పిలుస్తారు. భక్తులు అమ్మవారిని భక్తితో పూజిస్తే ఎలాంటి భయం కలగదని, అన్ని రకాల కష్టాల నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. దుష్టులను అంతంచేసే ఈ దేవిని స్మరించినంత మాత్రం చేతనే రాక్షసులు, భూతప్రేతపిశాచాలు భయంతో పారిపోతాయి.
కాళరాత్రి దుర్గను ఉపాసించే వారికి అగ్ని, జలము, జంతువుల వల్ల భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు.
నవరాత్రుల్లో ఏడవ రోజున కాళరాత్రి అమ్మవారిని శ్రద్ధగా పూజించి, మనలోని భయాలు, కష్టాలు, అడ్డంకులు తొలగించాలని ప్రార్థిస్తాము. అమ్మవారి అనుగ్రహంతో మనకు ధైర్యం, ప్రశాంతత, శుభఫలితాలు కలగాలని కోరుకుందాం.
ధ్యాన శ్లోకం:
ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా |
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ||
వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా |
వర్ధన్మూర్ధధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ || 7 ||
అర్థం:
ఒకే జడతో, మందార పువ్వులను చెవులకు అలంకారంగా ధరించి, గాడిదపై కూర్చుని, భయంకరమైన రూపంతో ఉన్న కాళరాత్రి అమ్మవారు దర్శనమిస్తారు.
ఆమె పెదవులు, చెవులు పెద్దగా ఉంటాయి. ఆమె శరీరం నూనెతో తడిసినట్లుగా ఉంటుంది. నల్లని శరీరకాంతితో, భయంకరమైన రూపంతో ఆమె దర్శనమిస్తుంది.
ఆమె ఎడమ పాదానికి ఇనుప ముళ్లతో కూడిన ఆభరణం ఉంటుంది. తలపై ధ్వజం ఉంటుంది. ఇలా భయంకరమైన రూపంతో ఉన్న కాళరాత్రి అమ్మవారు మన భయాలను తొలగించి, మనకు శుభాలను ప్రసాదించాలి.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏








