శ్రీ సిద్ధిదాత్రి దేవి – సకల సిద్ధులను ప్రసాదించే తల్లి
దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. నవరాత్రుల్లో ఆఖరి రోజైన ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. సర్వవిధ సిద్ధులను ప్రసాదించే తల్లి గనుక సిద్ధిదాత్రి అని పేరు.
ఈమె భక్తులకు వివిధ రకాల సిద్ధులను ప్రసాదించే తల్లిగా ప్రసిద్ధి చెందింది. సిద్ధులు, గంధర్వులు, యక్షులు, దేవతలు, అసురులు కూడా అమ్మవారిని భక్తితో ఆరాధిస్తారని చెబుతారు. ఈ అమ్మవారిని ఆరాధించేవారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి.
పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈ దేవి కృపవలనే పొందాడని దేవీ పురాణములో వివరించబడింది. ఈ దేవియే పరమశివుని శరీరంలో అర్ధబాగమై నిలిచింది. సిద్ధిధాత్రీదేవి నాలుగు చేతులతో కమలముపై ఆసీనురాలై ఉంటుంది. వాహనం సింహం. కుడివైపున ఒకచేతిలో చక్రము, మఱొకచేతిలో గదను ధరిస్తుంది. ఎడమవైపున ఒక చేతిలో శంఖం, మరొక చేతిలో కమలం ఉంటాయి.
సిద్ధిదాత్రి అమ్మవారి కృపకు పాత్రుడైన భక్తుడు సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించే స్థితిని, మనశ్శాంతిని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతాడని చెబుతారు. చివరకు అమ్మవారి అనుగ్రహంతో మోక్షాన్ని పొందాలనే ఉన్నతమైన లక్ష్యం వైపు సాగుతాడు.
అందుకే నవరాత్రుల తొమ్మిదవ రోజున సిద్ధిదాత్రి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి, ఆమె అనుగ్రహాన్ని కోరుకుందాం. అమ్మవారి కృపతో మన కోరికలు నెరవేరి, మన జీవితంలో శుభం, శాంతి, జ్ఞానం, ఆధ్యాత్మిక పురోగతి కలగాలని ప్రార్థిద్దాం.
ధ్యాన శ్లోకం:
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ || 9
అర్థం:
సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా ఎల్లప్పుడూ సేవించే సిద్ధిదాత్రి అమ్మవారు, నాకు ఎల్లప్పుడూ సిద్ధులను, శుభఫలితాలను ప్రసాదించాలి.
తొమ్మిది రోజులలో అమ్మవారి శక్తి శైల పుత్రిగా ప్రారంభమయ్యి, బ్రహ్మచారిణిగా, శివుని అర్ధాంగిగా, స్కంద మాతగా, చివరికి మహిషాసురుణ్ణి వధించిన శక్తి స్వరూపిణిగా మారుతుంది. దుర్గాదేవి మొదటి 7 స్వరూపాలూ మానవ శరీరంలో ఉండే సప్త చక్రాలకు అధిష్టాత్రులుగా చెప్తారు. ఈ నవ దుర్గలను ఉపాసించడం అంటే మోక్ష మార్గాన్ని చేరుకోవడమే. ఈ అవతారాలు, దశలు అన్నీ ప్రతి మహిళ జీవితంలో ఎదురయ్యేవే. ప్రతి స్త్రీ తనలోని శక్తి తత్వాన్ని గుర్తించి బ్రహ్మ జ్ఞానం పొందడమే ఈ నవదుర్గల అవతారంలోని పరమార్ధం.
ఓం దుర్గాయై నమః!
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్సైట్లోని ఇతర పోస్ట్లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.
