శ్రీ చంద్రఘంటా దేవి – శక్తి స్వరూపిణి
దుర్గామాత యొక్క మూడవ అవతారం చంద్రఘంట. ఈమె రూపం ఎంతో శాంతియుతంగా, మంగళకరంగా ఉంటుంది. చంద్రఘంట అమ్మవారికి పది చేతులు ఉంటాయి. ఆ చేతుల్లో ఖడ్గం, గద, త్రిశూలం, ధనుస్సు, బాణం వంటి అనేక ఆయుధాలను ధరించి ఉంటుంది. ఎడమచేతిలో కమండలం, కుడి హస్తం అభయముద్రతో ఉంటుంది. అమ్మవారి నుదుటిపై ఉండే అర్ధచంద్రుడు గంట ఆకారంలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అనే పేరు వచ్చింది. ఫాలభాగంలో మూడో నేత్రంతో, చంద్రఘంటాదేవి బంగారు వర్ణంలో మెరిసిపోతూంటుంది. చండికా, చండీ అని కూడా పిలిచే చంద్రఘంటా దుర్గాదేవి వాహనం పులి లేదా సింహం. ఈ వాహనాలు ధైర్యానికి, సాహసానికీ ప్రతీకలు.
అమ్మవారి గంట నుంచి వచ్చే భయంకరమైన శబ్దాన్ని విన్న వెంటనే దుష్టశక్తులు, రాక్షసులు భయంతో వణికిపోతారని చెబుతారు. అందుకే చంద్రఘంట అమ్మవారిని దుష్టశక్తులను సంహరించి, భక్తులను రక్షించే దేవతగా భావిస్తారు.
శివుడు, పార్వతి దేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తరువాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకా దేవి, హిమవంతులు కూడా పెళ్ళికి అంగీకరిస్తారు. పెళ్ళి రోజున శివుడు దేవతలతోనూ, మునులతోనూ, తన గణాలతోనూ, శ్మశానంలో తనతో ఉండే భూత, ప్రేత, పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడు. వారందరినీ చూసి పార్వతి తల్లి మేనకాదేవి మూర్ఛపోతుంది. ఆ సమయంలో ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి చంద్రఘంట రూపాన్ని ధరించింది. అప్పుడు శివుడు అందమైన యువరాజుగా కనిపించాడు. అప్పుడు ఆమె కుటుంబసభ్యులు, బంధువులూ భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు. ఆ తరువాత శివ,పార్వతులు వివాహం చేసుకుంటారు. దుర్గా అవతారం ధరించి శుంభ, నిశుంభులతో యుద్ధంలో ధూమ్రలోచనుణ్ణి, అతని పరివారాన్ని సంహరిస్తుంది.
నవరాత్రుల్లో మూడవ రోజు చంద్రఘంట అమ్మవారిని పూజించడం ఎంతో విశేషమైనదిగా చెబుతారు. ఈ రోజున సాధకుని మనస్సు మణిపూరక చక్రంపై కేంద్రీకృతమవుతుంది. అమ్మవారి కృపతో సాధకులకు దివ్యమైన సువాసనలు, వివిధ రకాల దివ్య శబ్దాలు అనుభవంలోకి రావచ్చని చెబుతారు. ఇలాంటి అనుభూతులు కలిగినప్పుడు సాధకుడు వాటిపై ఎక్కువ ఆసక్తి చూపకుండా తన సాధనను కొనసాగించాలి. నిరంతరం ఈ అమ్మవారిని ధ్యానం చేసి, భక్తితో సాధన చేసేవారిలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక తేజస్సు ఏర్పడుతుంది.
చంద్రఘంట అమ్మవారు దుష్టులను శిక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నప్పటికీ, భక్తులు, సాధకుల పట్ల మాత్రం ఎంతో సౌమ్యంగా, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఆమె రూపంలో శాంతి, శక్తి రెండూ కనిపిస్తాయి. చంద్రఘంట అమ్మవారి పవిత్ర రూపాన్ని భక్తితో ధ్యానించి, ఆమెను ఆరాధించడం వల్ల ఈ లోకంలో శాంతి, సుఖాలు పొందడంతో పాటు, పరలోకంలో కూడా శుభఫలితాలు లభిస్తాయని విశ్వసిస్తారు.
ధ్యాన శ్లోకం
పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా || ౩ ||
అర్థం:
పిండజ అనే వాహనంపై (సింహంపై) స్వారీ చేస్తూ, కోపంతో శత్రువులను సంహరించే ఆయుధాలను ధరించి ఉన్న చంద్రఘంట అమ్మవారు నాపై కరుణ చూపాలి.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏








