పండుగలు (Festivals) » శ్రీ కూష్మాండ దేవి – సృష్టికి మూలశక్తి
కూష్మాండ దేవి – నవదుర్గలలో నాలుగవ రూపం

శ్రీ కూష్మాండ దేవి – సృష్టికి మూలశక్తి

దుర్గామాత నాలుగవ స్వరూపం కూష్మాండ. తన చిరునవ్వుతోనే బ్రహ్మాండాన్ని సృష్టించిన దేవి కాబట్టి ఈమెకు కూష్మాండ అనే పేరు వచ్చింది. ఈ అవతారం సృష్టి ప్రారంభానికి ముందు అంటే- సృష్టి అంతా శూన్యంలో, అంధకారంలో ఉన్నప్పుడు వచ్చిన అవతారం. ఒకసారి- శూన్యం నుండి తేజోవంతమైన కాంతి ఉద్భవించింది. ఆ కాంతి మెల్లగా ఒక స్త్రీ స్వరూపం ధరించి, అఖండమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. చిన్న అండం నుండి సమస్త బ్రహ్మాండాలు సృష్టించింది కనుక అమ్మవారికి కుష్మాండ అని పేరు వచ్చింది.

శూన్యంలో ఉన్న సృష్టిలో తన చిరు మందహాసంతో సూర్యచంద్రులను నవగ్రహాలను, నక్షత్రాలను, భూమి ఆకాశాలను సృష్టించింది. సూర్య మండలానికి మధ్యలో తానే స్వయంగా ఉండి సమస్త సృష్టినీ ప్రకాశవంతం చేసింది. సూర్యుడి లోపల ఉండే అపారమైన శక్తి, తేజస్సు అమ్మవారిదేనని భక్తుల విశ్వాసం. ఆమె శరీరం నుంచి వెలువడే కాంతి సూర్యకిరణాల్లా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమె తేజస్సుతోనే దశదిశలు వెలుగొందుతున్నాయని చెబుతారు. ఈ సృష్టిలోని జీవులలో కనిపించే తేజస్సు కూడా అమ్మవారి శక్తి వల్లే అని భావిస్తారు.

కూష్మాండ అమ్మవారికి ఎనిమిది చేతులు ఉంటాయి. అందుకే ఆమెను అష్టభుజాదేవి అని కూడా పిలుస్తారు. ఆమె చేతుల్లో కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలశం, చక్రం, గద ఉంటాయి. ఎనిమిదవ చేతిలో జపమాల ఉంటుంది. ఆమె సింహంపై స్వారీ చేస్తూ దర్శనమిస్తారు.

సంస్కృతంలో ‘కూష్మాండ’ అంటే గుమ్మడికాయ అని అర్థం. గుమ్మడికాయతో చేసే బలిని అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనదిగా చెబుతారు. అందువల్ల కూడా ఆమెకు కూష్మాండ అనే పేరు వచ్చిందని చెబుతారు. కుష్మాండ దేవి తన 3 నేత్రముల నుండి 3 శక్తులను ఉద్భవింపచేసింది. అమ్మవారి మూడవ నేత్రం నుండి మహాలక్ష్మీదేవి, ఎడమ నేత్రం నుండి మహాకాళి, కుడి నేత్రం నుండి మహా సరస్వతి ఉద్భవించారు. మహాకాళి నుండి శివుడు, సరస్వతి దేవి- మహాలక్ష్మి నుండి బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి- మహాసరస్వతి నుండి విష్ణుమూర్తి, ఆదిశక్తి ఉద్భవించారు. అందుకే విష్ణుమూర్తిని పార్వతీదేవికి అన్నగా చెబుతారు.

కుష్మాండ దేవి ఉపాసన వల్ల అనాహత చక్రం ఉత్తేజితం అవుతుంది. దానివల్ల మనుషులలోని ద్వేషాలను, అహంకారాన్ని అంతం చేస్తుంది. కూష్మాండ అమ్మవారిని భక్తితో పూజిస్తే ఆమె ప్రసన్నమై భక్తుల రోగాలను, బాధలను, శోకాలను తొలగిస్తుందని విశ్వాసం. అందుకే నవరాత్రుల్లో నాలుగవ రోజున మనమందరం కూష్మాండ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి, ఆమె అనుగ్రహాన్ని కోరుకుందాం. ఆమె కృపతో మన జీవితంలో ఆరోగ్యం, సుఖశాంతులు, సౌభాగ్యం, అభివృద్ధి కలగాలని ప్రార్థిద్దాం.

ధ్యాన శ్లోకం

సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే
|| 4 ||

అర్థం:

తన రెండు చేతులతో అమృతంతో నిండిన కలశాన్ని, అలాగే రక్తంతో తడిసిన పాత్రను ధరించిన కూష్మాండ అమ్మవారు నాకు శుభాలను ప్రసాదించాలి.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top