మహిళలు జడకు 3 పాయలు ఎందుకు అల్లుతారో తెలుసా?
ఈ రోజు మన సంస్కృతి, సంప్రదాయాల్లోని మరొక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. మహిళలు జడకు 3 పాయలు ఎందుకు అల్లుతారు. సంప్రదాయాల ప్రకారం స్త్రీల జడకు ఎంతో విశిష్టత ఉంది. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు జడ వేయడం తప్పనిసరి అని భావించేవారు. కానీ కాలక్రమేణా అమ్మాయిలు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడడంతో జుట్టును రకరకాలుగా కత్తిరించుకోవడం ప్రారంభమైంది; జడ వేసుకోవడమే మర్చిపోయారు.
అయితే రెండు తరాల క్రితం మహిళలు జడను చక్కగా అల్లుకొని, రకరకాల పుష్పాలు, నగలు అలంకరించుకుని ఎంతో అందంగా ముస్తాబయ్యేవారు. జుట్టును విరబోసుకుని తిరగడం జ్యేష్ఠా దేవిని ఆహ్వానించినట్లుగా భావించేవారు. అందుకే పెద్దవారు తప్పనిసరిగా జడ వేసుకోవాలని చెప్పేవారు. ఆ జడ ప్రాముఖ్యత ఏమిటి? ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.
కుండలినీ శక్తి అంటే మన శరీరంలోని జీవశక్తి. అది ప్రధానంగా మూడు నాడుల ద్వారా శరీరమంతా ప్రవహిస్తుంది. ఈ మూడు నాడులు కలిసి కుండలినీ ప్రవాహాన్ని సమతుల్యం చేస్తాయి. మన వేగం, మానసిక స్థితి, శారీరక ఆరో్యాన్ని కాపాడడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఆ మూడు నాడులు — ఇడా, పింగళ, సుషుమ్న.
కుడివైపున పింగళ నాడి, ఎడమవైపున ఇడా నాడి ఉంటాయి. మధ్యలో సుషుమ్న నాడి ఉంటుంది. ఈ మూడు నాడులు కలిసి ఒక అల్లికలాగా అన్ని చక్రాలను తాకుతూ తల వరకు ప్రయాణిస్తాయి.
పింగళ నాడిను సూర్య నాడి అని కూడా అంటారు. ఇది స్వాధిష్ఠాన చక్రం వద్ద ప్రారంభమై శరీరానికి కుడివైపున తల వైపు ప్రయాణిస్తుంది. ఇది మనిషి వ్యక్తిత్వం, “నేను–నాది” అనే భావాలను నియంత్రిస్తుంది. జీవక్రియలకు కావలసిన తేజస్సు, సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది పురుష శక్తికి ప్రతీకగా భావించబడుతుంది.
ఇడా నాడిను చంద్ర నాడి అని పిలుస్తారు. ఇది కూడా స్వాధిష్ఠాన చక్రం వద్ద ప్రారంభమై శరీరానికి ఎడమవైపుగా ప్రయాణిస్తుంది. ఇది శ్రీశక్తిని సూచిస్తుంది. మానసిక ప్రక్రియలను నియంత్రించి, ప్రాణశక్తిని నాడీ వ్యవస్థకు చేరవేస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచి, శరీరానికి విశ్రాంతి ఇస్తుంది.
సుషుమ్న నాడి మూడు ప్రధాన నాడుల్లో ప్రాధాన్యమైనది. ఇది మిగిలిన రెండు నాడులను సమతుల్యం చేస్తూ అడ్డంకులు లేకుండా నియంత్రిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. దీనిని బ్రహ్మనాడి అని కూడా అంటారు. ఇది మనస్సులోని నిద్రాణమైన భాగాలను మేల్కొలిపి అనుభూతికి దారితీస్తుంది.
ఈ మూడు నాడులకు సంకేతంగా, వాటిని పరిపుష్టం చేయాలనే భావనతో తలపై మూడు పాయలుగా జడ అల్లుతారు. మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు వెన్నెముకకు సమాంతరంగా సాగే కుండలినీ శక్తికి ఇది సంకేతంగా భావించబడుతుంది. పైభాగంలో విప్పారిన పాము పడగల అల్లిక వలె ఇడా–పింగళ నాడులు, మధ్యలో సుషుమ్న నాడి అంతర్లీనంగా కలిసివుంటాయి.
చంద్ర–సూర్య నాడులకు సంకేతంగా స్త్రీలు తలపై సూర్యుడు, చంద్రుని పోలిన ఆభరణాలు ధరించేవారు. అంతేకాక, మనలోని పాజిటివ్ ఎనర్జీ జుట్టు ద్వారా గురుత్వాకర్షణ ప్రభావంతో బయటకు వెళ్లిపోతుందని, జడగా అల్లుకోవడం వలన అది సమతుల్యంగా నిలుస్తుందని విశ్వసిస్తారు. జుట్టును విరబోసుకోవడం వలన గాలి ద్వారా దుమ్ము, ధూళి చేరి చుండ్రు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కూడా రావచ్చు.
ఆధ్యాత్మిక, శారీరక రహస్యాలను మన హిందూ సనాతన సంస్కృతి స్త్రీల జడ సంప్రదాయంలో పొందుపరిచింది. నిజంగా జడ అల్లుకోవడం వలన కొన్ని శారీరక, మానసిక ప్రయోజనాలు కలుగుతాయని పెద్దలు విశ్వసించారు. మన సనాతన భారతీయ సంస్కృతిలో పాటించే ప్రతి ఆచారానికి వెనుక ఎన్నో ఆధ్యాత్మిక, మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుని, మన ముందు తరాల సువర్ణ బాటలో నడుద్దాం.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.


