సౌందర్యలహరి 11-20 శ్లోకాలకు అర్థం

soundarya lahari meaning in telugu
సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం
11. శ్లోకం
చతుర్భిః శ్రీకణ్ఠైశ్శివయువతిభిః పంచభిరపి
ప్రభిన్నాభి శ్శంభోః నవభిరపి మూలప్రకృతిభిః!
చతుశ్చత్వారింశ ద్వసుదళ కలాశ్రత్రివలయ
త్రిరేఖాభి స్సార్థం తవ శరణకోణాః పరిణతా!!
 తాత్పర్యం:
తల్లీ! నాలుగు శివకోణములు, తద్భిన్నములైన అయిదు శక్తికోణములు, తొమ్మిది మూల ప్రకృతులతోనూ, అష్టదళ పద్మము, షోదశదళ పద్మము, మేఖలాత్రయము, భూపురత్రయములతో నీవుండే శ్రీచక్రము 43 త్రికోణములతో అలరారుచున్నది.
 
12. శ్లోకం
త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం
కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః
యదాలోకౌత్సుక్యా అమరలలనాయాంతి మనసా
తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీం.
తాత్పర్యం:
అమ్మా! బ్రహ్మ విష్ణు ఇంద్రాది కవీంద్రులు కూడా ఎంత ప్రయత్నించినా నీ దేహ సౌందర్యముకు సాటి చెప్పలేకపోతున్నారు. దేవతా స్త్రీలు, అప్సరసలు నీ సౌందర్యము చూచుటకు కుతూహలము కలవారై, నీ అందముతో సాటిరాని వారై, కఠిన తపస్సులచే కూడా పొందలేని శివసాయుజ్యమును మనస్సుచే పొందుతున్నారు.
 
13. శ్లోకం
నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం
తవాపాంగాలోకే పతిత మనుధావంతి శతశః
గలద్వేణీ బంధాః కుచకలశ విస్రస్త సిచయాః
హఠాత్  త్తృట్యత్కాంచ్యో విగలిత దుకూలా యువతయః
తాత్పర్యం:
తల్లీ! నీ క్రీగంటి చూపుపడిన మానవుడు, అతడు కురూపియైనా, ముదుసలి అయినా, సరసమెరుగని వాడయినా, అలాంటి వాడిని చూసి- మహా మోహముతో కొప్పులు వీడిపోవగా, పైట చెంగులు జారిపోవగా, గజ్జెలమొలనూళ్ళు తెగిపోవగా, ప్రాయములో ఉన్న వందల కొద్దీ స్త్రీలు అతని వెంటపడతారు. అంటే అమ్మవారి అనుగ్రహము అట్టి కురూపిని కూడా మన్మధుని వంటి అందగాడిని చేయునని భావం.
 
14. శ్లోకం
శ్లోకం:
క్షితౌ షట్పంచాశద్ ద్విసమధికపంచాశదుదకే
హుతాశే ద్వాషష్టిశ్చ తురధిక పంచాశదనిలే
దివి ద్విష్షట్రింశ న్మనసి చ చతుష్షష్టి రితి యే
మయూఖాస్తేషా మప్యుపరి తవపాదాంబుజ యుగం.
తాత్పర్యం:
మూలాధారము పృథ్వీతత్త్వముతో కూడినది. అందు కాంతి కిరణములు 56. మణిపూరకము జలతత్త్వముతో కూడినది. అందు కాంతి కిరణములు 52. స్వాధిష్టానము అగ్నితత్త్వాత్మకము. అందు కిరణములు 62. అనాహతము వాయుతత్త్వాత్మకము, అందు కిరణములు 54. విశుద్ధిచక్రము ఆకాశతత్త్వాత్మకము. అందలి మయూఖములు 72. మనస్తత్త్వాత్మకమగు ఆజ్ఞాచక్రమునందు కిరణములు 64. ఈ వెలుగు కిరణములన్నింటినీ అధిగమించి, వాటి పైన నీ చరణ కమలములు ప్రకాశించుచున్నవి.
 
15. శ్లోకం
శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం
వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం!
సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిదధతే
మధుక్షీర ద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః!!
తాత్పర్యం:
తల్లీ! శరత్కాలపు వెన్నెలవలె శుద్ధమైన తెల్లని కాంతి కలిగినట్టి, చంద్రునితో కూడిన జటాజూటమే కిరీటముగా కలిగినట్టి, వరదాభయ ముద్రలను, స్ఫటిక మాలా పుస్తకములను నాలుగు చేతులలో ధరించి ఉన్న నీకు, ఒకసారైనా నమస్కరించక సజ్జనులు, కవులు తేనె, పాలు, ద్రాక్ష పళ్ళయొక్క మాధుర్యము నిండి యున్న వాక్కులను ఎలా పొందగలరు?
 
16. శ్లోకం
కవీంద్రాణాం చేతః కమలవన బాలాతప రుచిం
భజంతే యే సంతః కతిచి దరుణామేవ భవతీం!
విరించి ప్రేయస్యా స్తరుణతర శృంగారలహరీ
గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనమమీ!!
తాత్పర్యం:
బాల సూర్యుని కాంతి- పద్మములను వికసింపజేసినట్లుగా, కవీంద్రుల హృదయ పద్మములను వికసింపచేసే నిన్ను, అరుణవర్ణముగా ధ్యానించే సత్పురుషులు- సరస్వతీదేవి నవయౌవన శృంగార ప్రవాహము వంటి గంభీరమైన వాగ్విలాస సంపదతో, సత్పురుషుల హృదయములను రంజింపచేసెదరు.
 
17. శ్లోకం
సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంరుచిభిః
వశిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః!
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః
వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః!!
తాత్పర్యం:
జగజ్జననీ! వాక్కులను సృజించు వారు, చంద్రకాంతమణుల శకలముల వలె తెల్లనైన దేహముల కాంతికలవారు అగు – వశినీ మొదలగు శక్తులతో కూడిన నిన్ను ఎవరు చక్కగా ధ్యానించునో వాడు – మహాకవులైన వాల్మీకి కాళిదాసాదుల కవిత్వరచన వలె మధురమైన, శ్రవణరమణీయమైన, సరస్వతీ దేవి యొక్క ముఖ కమల పరిమళములను వెదజల్లు మృదువైన వాక్కులతో – రసవంతమైన కావ్య రచన చేయగల సమర్థుడవుతాడు.
 
18. శ్లోకం
తనుచ్ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభిః
దివం సర్వా ముర్వీ మరుణిమ నిమగ్నాం స్మరతియః,
 భవన్త్యస్య త్రస్యద్వనహరిణ శాలీన నయనా
 సహోర్వశ్యా వశ్యాః కతి కతి న గీర్వాణగణికాః !!
తాత్పర్యం:
జగజ్జననీ! ఉదయించుచున్న బాల సూర్యుని అరుణారుణ కాంతి సౌభాగ్యమును పోలిన నీ దివ్యదేహపు కాంతులలో- ఈ సమస్తమైన ఆకాశము, భూమి మునిగి ఉన్నట్లు భావించి ధ్యానించే సాధకునికి- బెదురు చూపులతో ఉండు లేడి వంటి కన్నులు కలిగిన దేవలోక అప్సర స్త్రీలు ఊర్వశితో సహా వశులవుతారు.
 
19. శ్లోకం
ముఖం బిన్దుం కృత్వా కుచయుగ మధస్తస్య తదధో
హరార్థం ధ్యాయేద్యో హరమహిషితేమన్మథ కలామ్,
స సద్యస్సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు
త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీన్దు స్తనయుగామ్ !!
తాత్పర్యం:
ఓ మాతా! నీ మోమును బిందువుగా జేసి, దానిక్రిందుగా కుచయుగమునుంచి, దాని క్రిందుగా త్రికోణముంచి నీమన్మథకళ నెవడు ధ్యానిస్తాడో, ఆ ధ్యాన ఫలితంగా కామాసక్తులైన వనితలను కలవరపెడుతున్నాడు. అంతే కాదు ఆ సాధకుడు సూర్య చంద్రులను స్తనములుగా కలిగిన త్రిలోకిని అనగా స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలనే స్త్రీలను మోహమునకు గురిచేయుచున్నాడు.
 
20. శ్లోకం
కిరంతీ మంగేభ్యః కిరణనికురుంబామృతరసం
హృది త్వా మాధత్తే హిమకర శిలామూర్తి మివ యః !
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
జ్వర ప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార సిరయా !!
తాత్పర్యం:
అవయవముల నుండి కిరణ సమూహ రూపమున అమృత రసమును వెదజల్లుతున్న చంద్రకాంత శిలామూర్తిగా నిన్ను హృదయమందు ధ్యానించువాడు, గరుత్మంతుని వలె సర్పముల యొక్క మదమడచగలడు. అమృతధారలు ప్రవహించు సిరులు గల దృష్టితో జ్వర పీడితులను చల్లబరచగలడు.