శ్రీ లలిత సహస్ర నామాలు స్తోత్రాలకు తెలుగులో అర్థం

soundarya lahari meaning in telugu
సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం
1.           మొదటి శ్లోకము 
శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్
న చే దేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి 
అతస్త్వామారాధ్యాం హరి హర విరిఞ్చాదిభిరపి
ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి 1  
తాత్పర్యముః 
సర్వమంగళస్వరూపుడైన పరమశివుడు, పరాశక్తి అయిన నీతో కూడి ఉన్నప్పుడు మాత్రమే, సకల సృష్టి నిర్మాణము చేయడానికి సమర్ధుడై ఉన్నాడు. నీతో కూడి ఉండకపోతే, అంతటి శుభప్రదుడైన పరమశివుడు సైతం కనీసం కదలడానికి కూడా అశక్తుడౌతాడు. హరి హర బ్రహ్మాదులచేత మరియు వేదములచేత కూడా ఆరాధింపబడే నీకు నమస్కారం చేయాలన్నా, స్తోత్రం చేయాలన్నా, కనీసం స్మరించాలన్నా పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యబలం లేకపోతే ఎట్లా సాధ్యం అమ్మా!

2.           శ్లోకము 
తనీయాంసం పాంశుం తవచరణ పఙ్కేరుహభవమ్
విరిఞ్చి స్సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ 
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్ 2
తాత్పర్యముః 
అమ్మా! నీ పాదపద్మములనంటిన లేశమాత్ర ధూళిని గ్రహించి, బ్రహ్మ ఈ లోకాలన్నింటినీ ఏ విధమైన లోపములు లేకుండా సృష్టి చేయగలుగుతున్నాడు. అలాగే శ్రీమహావిష్ణువు కూడా నీపాదపద్మములనంటిన లేశమాత్ర ధూళిని గ్రహించి, ఆదిశేషుడి సహాయంతో ఈ లోకాలన్నిటినీ అతికష్టం మీద మోయుచున్నాడు. నీపాద ధూళి మహిమచే సృష్టింపబడిన ఈ లోకాలన్నిటినీ శివుడు యుగాంతములలో బాగా మెదిపి, ఆయన ఒళ్ళంతా విభూతిగా పూసుకొంటున్నాడు.

3.           శ్లోకం
అవిద్యానామంత-స్తిమిర-మిహిరద్వీపనగరీ
జడానాం చైతన్య-స్తబక-మకరంద-స్రుతిఝరీ

దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు-వరాహస్య భవతి
3
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! నీ పాద పద్మ పరాగము అజ్ఞానుల పట్ల సూర్యుడుదయించు పట్టణము వంటిది. మంద బుద్ధి గల జడుల పట్ల జ్ఞానమను తేనెను జాలువార్చు ప్రవాహము వంటిది. దరిద్రుల పట్ల చింతామణుల వరుస వంటిది. సంసార సాగరమున మునిగి సతమతమగు వారికి, సముద్రమున దిగబడి వున్న భూమిని పైకి ఉద్దరించిన విష్ణుమూర్తి అవతారమైన ఆది వరాహవు కోరవంటిది.

4.           శ్లోకం
త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా ।
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ ॥ 4
తాత్పర్యం:
సర్వలోకముల వారికి దిక్కైన ఓ జగజ్జననీ! ఇంద్రాది ఇతర దేవతలందరు తమ రెండు హస్తములందు వరద, అభయ ముద్రలను దాల్చుచుండగా నీవు ఒక్కదానివి నీ హస్తములతో వాటిని అభినయించకున్నావు. భయము నుండి రక్షించుటకు, కోరిన వాటిని మించి వరములను ప్రసాదించుటకు – నీ రెండు పాదములే సమర్థములై ఉన్నవి గదా! (మరి ఇంక హస్తముల అవసరము నీకేల యుండును అని భావము).

5.           శ్లోకం
హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం
పురానారీ భూత్వా పురరిపు మపి క్షోభమనయత్
స్మరోపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా
మునీనా మప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్. 5
తాత్పర్యం:-
నమస్కారము చేసేవారికి సమస్త సౌభాగ్యములు ప్రసాదించే ఓ తల్లీ! ముందు నిన్ను హరి ఆరాధించి మోహినీ రూపమును పొంది శివునికి చిత్త క్షోభను కలిగించాడు. మన్మథుడు నిన్ను ప్రార్థించి రతీదేవి కనులకు లేహ్యము వంటి మేనితో మునులను మహామోహవశులను చేయగలిగాడు.

6.           శ్లోకం
ధనుఃపౌష్పం మౌర్వీ మధుకర మయీ పంచవిశిఖాః
వసంతస్సామంతో మలయమరుదాయోధన రథః
తథాప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపికృపాం
అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే!!6
తాత్పర్యం:
ఓ హిమవత్పర్వత రాజపుత్రీ! పుష్పమయమైన విల్లు, తుమ్మెదల వరుసతో కూర్చిన అల్లెత్రాడు, లెక్కకు ఐదు మాత్రమే బాణములు, అల్పాయుష్కుడు-జడుడు అయిన వసంతుడు చెలికాడు, మలయ మారుతమే రథము. ఇలా ఏ మాత్రము సమర్దములు కానివగు ఇట్టి సాధన సామగ్రితో కనీసము శరీరము గూడా లేనివాడైన మన్మథుడు నిన్ను ఆరాధించి, అనిర్వచనీయమైన నీ కరుణా కటాక్షమును పొంది ఈ సమస్త జగత్తును జయించుచున్నాడు కదా!

7.           శ్లోకం
క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా
పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్ర వదనా
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః పురమథితు రాహోపురుషికా! 7
తాత్పర్యం:
చిరుసవ్వడి చేయు గజ్జెల వడ్డాణము గలది, గున్న ఏనుగు కుంభములను పోలు స్తనములు కలిగి కొద్దిగా వంగినట్లు కనబడునది, సన్నని నడుము గలది, శరదృతువు నందలి పరిపూర్ణమైన పూర్ణిమ చంద్రుని పోలే ముఖము గలదినాలుగు చేతులయందు వరుసగా ధనుస్సు, బాణములు,  పాశము, అంకుశములను ధరించి యుండునది, శివుని యొక్క శక్తి స్వరూపిణియునగు జగన్మాత మాకు ఎదురుగా సుఖాసీనురాలై సాక్షాత్కరించుగాక!

8.           శ్లోకం
సుధాసింధోర్మధ్యే  సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే
శివాకారే మంచే – పరమశివపర్యంక నిలయామ్
భజంతి త్వాం ధన్యాః – కతిచన చిదానందలహరీమ్ 8
తాత్పర్యం:
అమ్మా…అమృతసముద్రము మధ్యలో కల్పవృక్షాలతో నిండియున్న మణిద్వీపంలో, కదంబపుష్ప వృక్ష  తోటలో, చింతామణులతో నిర్మించిన గృహమునందు, త్రికోణాకారపు మంచము మీద, పరమశివుని పర్యంకస్థితవై ప్రకాశించుచు, జ్ఞాన స్వరూపమై నిరతిశయ సుఖప్రవాహ రూపముగా ఉన్న నిన్ను- స్వల్ప సంఖ్యాకులైన ధన్యులు మాత్రమే సేవించుకోగలుగుతున్నారు.

9.           శ్లోకం
మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి
మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే .. 9
తాత్పర్యం:
అమ్మా! నీవు సుషుమ్నా మార్గములో మూలాధార చక్రమునందు భూతత్త్వమును, మణిపూరకమందు జలతత్త్వమును, అనాహత మందు వాయుతత్త్వమును, విశుద్ద చక్రమందు ఆకాశతత్త్వమును, ఆజ్ఞా చక్రమునందు మనోతత్త్వమును చేధించుకొని సహస్రార చక్రమందు నీ భర్తతో ఏకాంతముగా విహరిస్తున్నావు.

10.        శ్లోకం
సుధాధారాసారై శ్చరణయుగలాంతర్విగలితైః
ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయమహసః
అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం
స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుణ్డే కుహరిణి. 10
తాత్పర్యం:
తల్లీ! నీపాదద్వయము నుండి జాలువారిన అమృతధారలచే లోకమును తడుపుదువు. అమృత  రూపమగు చంద్రుని వలన, నీ స్వస్థానము చేరుటకు- పాము వలె నీ నిజరూపమును పొంది సూక్ష్మరంధ్రము గల సుషుమ్నా ద్వారమున వున్న మూలాధారమందు సర్వదా నిద్రించెదవు.

One response to “సౌందర్యలహరి 1-10 శ్లోకాలకు అర్థం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *