దిష్టి నిజంగానే తగులుతుందా? కంటికి ఇతరులకు చెడు చేసేంత శక్తి ఉందా?
“నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా పగిలిపోతుంది” అని అంటారు. దిష్టి తీయడం అనే ప్రక్రియ మన భారతదేశంలో పురాతన కాలం నుంచి కొనసాగుతోంది. ఉన్నట్టుండి ఆరోగ్యం క్షీణించడం, లాభాల్లో నడిచే వ్యాపారం అకస్మాత్తుగా నష్టాల్లో పడడం, ఉద్యోగం లేదా వృత్తిలో రాణించలేకపోవడం, బాగా పండిన పంటకు హాని కలగడం, పాడి పశువులు పాలు ఇవ్వకపోవడం, చిన్నపిల్లలు గుక్కపట్టి ఏడవడం, అన్నం తినకపోవడం — ఇలాంటి అనేక విషయాలు మనం చూస్తూ, వింటూ ఉంటాం.
ఇవి యాదృచ్ఛికమా? లేక దిష్టి కారణమా? ఇందులో శాస్త్రీయత ఉందా? లేక ఇది కేవలం మూఢనమ్మకమా? అసలు దిష్టి అంటే ఏమిటి? దిష్టి తగిలితే దాని నుండి ఎలా బయటపడాలి? ముందుగానే చెడు దృష్టి పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
దిష్టి అంటే ఏమిటి?
మనము ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు, ఆర్థికంగా రాణిస్తున్నప్పుడు కొందరు అసూయతో చూడవచ్చు. వారి అసూయ, ద్వేషభావాలు మనపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పెద్దలు నమ్ముతారు.
కొన్ని దేవతల చిత్రాలలో వెనుక భాగంలో కాంతి వలయం కనిపిస్తుంది. మానవ శరీరం చుట్టూ కూడా అలాంటి కాంతి వలయం ఉందని కొందరు నమ్ముతారు. దానిని “ఆరా” (Aura) అంటారు.
మన శరీరంలో విద్యుత్ ప్రవాహం జరుగుతుందని శాస్త్రం చెబుతుంది. ఆ శక్తి భావోద్వేగాల ద్వారా వ్యక్తమవుతుందని అంటారు. ప్రేమతో చూసే చూపు మనకు ఆనందాన్ని ఇస్తుంది. అసూయతో చూసే చూపు మనసుకు బాధ కలిగించవచ్చు. దీనినే పెద్దలు దిష్టి అంటారు.
దిష్టి తగిలినప్పుడు తలనొప్పి, వికారం, అలసట, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని నమ్మకం ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని తొలగించేందుకు చేసే చర్యనే దిష్టి తీయడం అంటారు.
దిష్టి ఎవరికి తగులుతుందని నమ్ముతారు?
- పెద్దవారు
శుభకార్యాల సమయంలో అందరి దృష్టి ఒకరిపై కేంద్రీకృతమవుతుంది. ఆ తరువాత తలనొప్పి, నీరసం, వాంతులు, జీర్ణ సమస్యలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే దిష్టి అంటారు.
- చిన్నపిల్లలు
చిన్నపిల్లలకు దిష్టి త్వరగా తగులుతుందని పెద్దలు చెబుతారు. అకస్మాత్తుగా ఏడవడం, జ్వరం, నిద్రలో ఉలిక్కిపడి లేవడం, అన్నం తినకపోవడం వంటి లక్షణాలను దిష్టిగా భావిస్తారు.
- వ్యాపారం, పంటలు, పశువులు
వ్యక్తులకే కాకుండా వ్యాపారాలు, పంటపొలాలు, పాడిపశువులు, కొత్త ఇళ్లు, వాహనాలకు కూడా దిష్టి తగులుతుందని నమ్మకం ఉంది.
దిష్టి నివారణకు పాటించే కొన్ని పద్ధతులు
- ఉప్పు, ఎండుమిరపకాయలు తల చుట్టూ మూడు సార్లు తిప్పి మంటల్లో వేయడం
- పసుపు, సున్నం కలిపిన నీటితో దిష్టి తీయడం
- కొబ్బరికాయ లేదా గుమ్మడికాయతో తిప్పి పగులగొట్టడం
- నిమ్మకాయలను గుమ్మానికి కట్టడం
- నల్ల దారం కట్టడం
- పిల్లల నుదుటిపై కాజల్ లేదా కాటుక చుక్క పెట్టడం
పిల్లలకు దిష్టి తీసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వారు నిద్రలో ఉన్నప్పుడు దిష్టి తీయకూడదు. దిష్టి తీసిన వస్తువులను ఎవరూ తొక్కని చోట పడేయాలి.
కొన్ని ఆచారాలు
- ఉదయం నిద్రలేవగానే అరచేతులను చూసి ఈ శ్లోకం చదవడం:
కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతీ, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం - స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు లేదా ఉప్పు కలపడం
- సాయంత్రం దీపం వెలిగించడం
- భోజనం ముందు భగవంతుని స్మరించడం
- దేవతా నామస్మరణ చేయడం
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
కొన్ని ఆలయాల్లో దృష్టి దోష నివారణకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
- తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం
- ప్రత్యంగిరా దేవి ఆలయం
- మదుర కాళీ అమ్మన్ ఆలయం
ముగింపు
నర దిష్టి నిజంగానే ఉందా? దిష్టి తీయడం వల్ల ఉపయోగం ఉందా? అన్నది వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన విషయం. అయితే దిష్టి తీసే ఆచారాలు మనసుకు ఓదార్పు, మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. పెద్దలు ప్రేమతో దిష్టి తీయడం వారి మమకారాన్ని తెలియజేస్తుంది.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.


