మూక పంచశతి – కటాక్ష శతకం 41-50 శ్లోకాలు
మూక పంచశతి – కటాక్ష శతకం అనేది భక్తి సాహిత్యంలో అపూర్వమైన కృతి. దీనిని మూక కవి రచించారు. ఈ శతకం ప్రధానంగా శ్రీ కామాక్షి అమ్మవారు దివ్య కటాక్షాన్ని వర్ణిస్తుంది. కామాక్షి దేవి అనుగ్రహంతో మూగుడైన కవి వాక్కు పొందినదే ఈ కృతి యొక్క విశిష్టత. ఈ శ్లోకాలు భక్తి, శరణాగతి, దైవానుగ్రహాన్ని తెలియజేస్తూ మనసుకు శాంతిని ప్రసాదిస్తాయి.
కటాక్ష శతకం పారాయణం చేయడం వల్ల జ్ఞానం, వాక్పటుత్వం, మనోశాంతి లభిస్తాయని నమ్మకం. ఇది ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ముఖ్యంగా దేవి కటాక్షం ద్వారా జీవితంలో విజయాలు, అడ్డంకుల నివారణ కలుగుతాయని విశ్వాసం ఉంది. భక్తులకు ఇది ఆధ్యాత్మిక బలం, సానుకూల శక్తి ప్రసాదించే పవిత్ర గ్రంథంగా భావించబడుతుంది.
కామాక్షి సంతతమసౌ హరినీలరత్న-
స్తంభే కటాక్షరుచిపుంజమయే భవత్యాః ।
బద్ధోఽపి భక్తినిగలైర్మమ చిత్తహస్తీ
స్తంభం చ బంధమపి ముంచతి హంత చిత్రమ్ ॥41॥
అమ్మా! కామాక్షీ! నా మనసు ఒక మద గజము. భక్తి అనే పాశముతో ఆ గజమును నీ చూపుల కాంతి అనే స్తంభమునకు కట్టివేశాను. విచిత్రమేమిటంటే మాతా! అంతటి మద గజము కూడా ఆ పాశమును, స్తంభమును వదిలించుకుని నీ పాదముల వద్ద కూర్చుండిపోయింది.
కామాక్షి కార్ష్ణ్యమపి సంతతమంజనం చ
బిభ్రన్నిసర్గతరలోఽపి భవత్కటాక్షః ।
వైమల్యమన్వహమనంజనతాం చ భూయః
స్థైర్యం చ భక్తహృదయాయ కథం దదాతి ॥42॥
అమ్మా! నీ క్రీగంటి చూపులు, కాటుకతో కలసి ఎప్పుడూ నల్లని వర్ణముతో చల్లగా ఉంటాయి. అటువంటి చూపులు భక్తుల మనసులలో ఉండే మాలిన్యాన్ని తొలగించి స్వచ్ఛతను నింపుతూనే ఉంటాయి.
మందస్మితస్తబకితం మణికుండలాం
అంశుస్తోమప్రవాలరుచిరం శిశిరీకృతాశమ్ ।
కామాక్షి రాజతి కటాక్షరుచేః కదంబం
ఉద్యానమంబ కరుణాహరిణేక్షణాయాః ॥43॥
కామాక్షీ! నీ చిరునవ్వులనే పుష్పగుచ్ఛములు, పగడాల కాంతితో ఎర్రని చిగుళ్లవలే ఉన్న నీ కర్ణాభరణములు, తన వృక్షపు గాలులతో అన్ని దిక్కులను చల్లబరుస్తూ, నీ క్రీగంటి చూపుల కడిమి చెట్ల తోటలో, కరుణ అనే మాత విహరిస్తున్నది.
కామాక్షి తావకకటాక్షమహేంద్రనీల-
సింహాసనం శ్రితవతో మకరధ్వజస్య ।
సామ్రాజ్యమంగలవిధౌ మణికుండలశ్రీః
నీరాజనోత్సవతరంగితదీపమాలా ॥44॥
జగన్మాతా! నీ క్రీగంటి చూపు అత్యంత గొప్పవైన ఇంద్రనీల మణులు, ఇతర రత్నములతో కూర్చబడిన సింహాసనము. ఆ చూపును వరముగా పొందిన మన్మథుడు ఆ సింహాసనముపై ఆసీనుడయ్యాడు. నీ కుండలముల ప్రకాశము దీప శిఖల మంగళ హారతులా అన్నట్టు తోచుచున్నది.
మాతః క్షణం స్నపయ మాం తవ వీక్షితేన
మందాక్షితేన సుజనైరపరోక్షితేన ।
కామాక్షి కర్మతిమిరోత్కరభాస్కరేణ
శ్రేయస్కరేణ మధుపద్యుతితస్కరేణ ॥45॥
మాతా! నీ చూపులు సిగ్గుల మొగ్గలుగా ఉన్నాయి. అవి జ్ఞానులకు ఎప్పుడూ దర్శనమిస్తాయి. జీవుల కర్మముల ఫలితములను అవి సూర్య కాంతివలే తొలగిస్తాయి. మోక్షమును ప్రసాదించే ఆ చూపుల ధారలను నాపై కొద్దిసేపు వర్షింపచేయి మాతా!
ప్రేమాపగాపయసి మజ్జనమారచయ్య
యుక్తః స్మితాంశుకృతభస్మవిలేపనేన ।
కామాక్షి కుండలమణిద్యుతిభిర్జటాలః
శ్రీకంఠమేవ భజతే తవ దృష్టిపాతః ॥46॥
అమ్మా! కామాక్షీ! నీ రూపము నాకు ఎలా దర్శనమిస్తున్నదో తెలుసా! ఈశ్వరునిపై ప్రేమ అనే శుద్ధ జలములలో స్నానమాడి, నీ మోముపై చెరగని చిరునవ్వు ప్రకాశమే తెల్లని భస్మముగా చేసుకొని, నీ కర్ణాభరణములకున్న మణులనే జడలుగా చేసి ఈశ్వర కటాక్షము కొరకు నీవు ప్రార్థిస్తున్నట్లున్నది.
కైవల్యదాయ కరుణారసకింకరాయ
కామాక్షి కందలితవిభ్రమశంకరాయ ।
ఆలోకనాయ తవ భక్తశివంకరాయ
మాతర్నమోఽస్తు పరతంత్రితశంకరాయ ॥47॥
మాతా! కామాక్షీ! నీ చూపులు మోక్షదాయకములు, దయారస ప్రవాహములు. ఈశ్వరునే చాంచల్యమునకు గురిచేసి నీ స్వాధీనము చేసుకొన్నవి. ఆ చూపులకు నేను నిరంతరము భక్తితో ప్రణమిల్లుతున్నాను.
సామ్రాజ్యమంగలవిధౌ మకరధ్వజస్య
లోలాలకాలికృత తోరణమాల్యశోభే ।
కామేశ్వరి ప్రచలదుత్పలవైజయంతీ
చాతుర్యమేతి తవ చంచలదృష్టిపాతః ॥48॥
అమ్మా! జగజ్జననీ! కామేశ్వరీ! మన్మథునికి సామ్రాజ్య పట్టాభిషేక సమయమున, నీ కదలే ముంగురులు అతని సామ్రాజ్యమునకు తోరణములగుచున్నవి. చంచలములుగా ఉండి రెపరెపలాడే నీ కనురెప్పలు మన్మథుని సామ్రాజ్యమునకు ధ్వజమువలే కనిపించుచున్నవి.
మార్గేణ మంజుకచకాంతితమోవృతేన
మందాయమానగమనా మదనాతురాసౌ ।
కామాక్షి దృష్టిరయతే తవ శంకరాయ
సంకేతభూమిమచిరాదభిసారికేవ ॥49॥
అమ్మా! అత్యంత నల్లనైన నీ కేశపాశముల కాంతులు చీకటిగా మారగా, ఆ చీకటిలో నెమ్మదిగా నడుస్తూ, నీ చూపులు ఒక అభిసారికలాగ శంకరుని వెదుకుతూ వెళుతున్నట్లున్నది.
వ్రీడానువృత్తిరమణీకృతసాహచర్యా
శైవాలితాం కలరుచా శశిశేఖరస్య ।
కామాక్షి కాంతిసరసీం త్వదపాంగలక్ష్మీః
మందం సమాశ్రయతి మజ్జనఖేలనాయ ॥50॥
మాతా కామాక్షీ! నీ క్రీగంటి చూపులనే లక్ష్మి, సిగ్గు అనే సహచరి తోడురాగా, ఈశ్వరుని కంఠము యొక్క నలుపువర్ణమనే నాచుతో నిండిన, పరమేశ్వరుడనే సరసులో స్నానము చేయుటకు బయలుదేరినట్లుగా తోచుచున్నది.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




