మూక పంచశతి – కటాక్ష శతకం 61-70 శ్లోకాలు
మూక పంచశతి – కటాక్ష శతకం అనేది భక్తి సాహిత్యంలో అపూర్వమైన కృతి. దీనిని మూక కవి రచించారు. ఈ శతకం ప్రధానంగా శ్రీ కామాక్షి అమ్మవారు దివ్య కటాక్షాన్ని వర్ణిస్తుంది. కామాక్షి దేవి అనుగ్రహంతో మూగుడైన కవి వాక్కు పొందినదే ఈ కృతి యొక్క విశిష్టత. ఈ శ్లోకాలు భక్తి, శరణాగతి, దైవానుగ్రహాన్ని తెలియజేస్తూ మనసుకు శాంతిని ప్రసాదిస్తాయి.
కటాక్ష శతకం పారాయణం చేయడం వల్ల జ్ఞానం, వాక్పటుత్వం, మనోశాంతి లభిస్తాయని నమ్మకం. ఇది ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ముఖ్యంగా దేవి కటాక్షం ద్వారా జీవితంలో విజయాలు, అడ్డంకుల నివారణ కలుగుతాయని విశ్వాసం ఉంది. భక్తులకు ఇది ఆధ్యాత్మిక బలం, సానుకూల శక్తి ప్రసాదించే పవిత్ర గ్రంథంగా భావించబడుతుంది.
ఆశ్చర్యమంబ మదనాభ్యుదయావలంబః
కామాక్షి చంచలనిరీక్షణవిభ్రమస్తే ।
ధైర్యం విధూయ తనుతే హృది రాగబంధం
శంభోస్తదేవ విపరీతతయా మునీనామ్ ॥61॥
అమ్మా! నీ చూపులు చంచలమైనవి. విశేషమేమిటంటే తల్లీ, ఆ చూపులు మన్మథునికి అభయదాయకములై ఉండగా, అవే చూపులు ఈశ్వరుని చంచలుని చేసి నీ పట్ల అనురాగమును పెంచుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అవే చూపులు మునీశ్వరులలో ధైర్యమును పెంచుతున్నాయి.
జంతోః సకృత్ప్రణమతో జగదీడ్యతాం చ
తేజస్వితాం చ నిశితాం చ మతిం సభాయామ్ ।
కామాక్షి మాక్షికఝరీమివ వైఖరీం చ
లక్ష్మీం చ పక్ష్మలయతి క్షణవీక్షణం తే ॥62॥
జగన్మాతా! ఎవరైతే కనీసం ఒక్కసారి మనఃపూర్వకముగా నీకు నమస్కరిస్తారో, వారికి నీవు ఈ విశ్వములో పరమ పూజ్యతను, వర్చస్సును, సూక్ష్మ బుద్ధిని, తీయనైన వాక్పటిమను, ఐశ్వర్యమును ప్రసాదిస్తావు.
కాదంబినీ కిమయతే న జలానుషంగం
భృంగావలీ కిమురరీకురుతే న పద్మమ్ ।
కిం వా కలిందతనయా సహతే న భంగం
కామాక్షి నిశ్చయపదం న తవాక్షిలక్ష్మీః ॥63॥
అమ్మా! నీ నేత్ర సౌందర్యమును దేనితో పోల్చగలము. నల్లని నీటితో కూడిన మేఘముతో పోలుద్దామా అంటే, నీ కళ్ళలో నీరు లేదు. తుమ్మెదలతో పోలుద్దామా అంటే నీ కళ్ళు పద్మములను త్రోసిరాజన్నవి. యమునా నదితో పోల్చుదామా అంటే నల్లని నీ నేత్రములు తెల్లని గంగను సహించవు.
కాకోలపావకతృణీకరణేఽపి దక్షం
కామాక్షి బాలకసుధాకరశేఖరస్య ।
అత్యంతశీతలతమోఽప్యనుపారతం తే
చిత్తం విమోహయతి చిత్రమయం కటాక్షః ॥64॥
కామాక్షీ! నీ నేత్రముల కటాక్షము ఎంత చిత్రమైనదంటే, అది అత్యంత భయంకరమైన కాలకూట విషమును కూడా ఒక పండులాగా చేసి మింగిన చంద్రశేఖరుని మనసును, ఎప్పుడూ మోహమునకు గురి చేస్తుంది.
కార్పణ్యపూరపరివర్ధితమంబ మోహ-
కందోద్గతం భవమయం విషపాదపం మే ।
తుంగం ఛినత్తు తుహినాద్రిసుతే భవత్యాః
కాంచీపురేశ్వరి కటాక్షకుఠారధారా ॥65॥
మాతా! నీ దృష్టి ఎంతో పదునైన గండ్రగొడ్డలి. ఆ గొడ్డలి యొక్క పదునైన అంచులు నాలో ఉన్న మోహమును, అహంకారమును, మనసులోని తమస్సును, అజ్ఞానము అనే మహా విష వృక్షమును మొదలంటా నరికివేయుగాక.
కామాక్షి ఘోరభవరోగచికిత్సనార్థం
అభ్యర్థ్య దేశికకటాక్షభిషక్ప్రసాదాత్ ।
తత్రాపి దేవి లభతే సుకృతీ కదాచితే
అన్యస్య దుర్లభమపాంగమహౌషధం తే ॥66॥
జగన్మాతా! అత్యంత ఘోరమైన సంసారము అనే భవరోగముతో బాధపడుతున్న నేను సరియైన చికిత్స కోసం, సద్గురువు అనే వైద్యుణ్ణి ప్రార్థిస్తే ఆయన నాకు నీ కరుణ అనే ఒక అద్భుతమైన ఔషధమును ప్రసాదించారు.
కామాక్షి దేశికకృపాంకురమాశ్రయంతో
నానాతపోనియమనాశితపాశబంధాః ।
వాసాలయం తవ కటాక్షమముం మహాంతో
లబ్ధ్వా సుఖం సమధియో విచరంతి లోకే ॥67॥
అమ్మా! నీ కరుణారసపూరిత చూపులు భక్తిగలవారికి నివాస గృహములు, ఎవరైతే, నీపై భక్తిని ఆసరాగా చేసుకుని, పూజలు, నియమములు, యజ్ఞములు చేస్తూ, తమ పాశములు తెంచుకుంటారో, వారు నీ దయ అనే గృహములో ప్రవేశించగలుగుతారు.
సాకూతసంలపితసంభృతముగ్ధహాసం
వ్రీడానురాగసహచారి విలోకనం తే ।
కామాక్షి కామపరిపంథిని మారవీర-
సామ్రాజ్యవిభ్రమదశాం సఫలీకరోతి ॥68॥
అమ్మా! కామాక్షీ! – ఈశ్వరునిపై ఓడిన మన్మథుడు నిన్ను శరణుజొచ్చాడు. అతనిపై గల అభిమానముతో నీ చిరునవ్వు, సిగ్గు, ప్రేమలతో ఈశ్వరుని లోబరుచుకుని, మన్మథ సామ్రాజ్యమునకు లోబడేలా చేశావు.
కామాక్షి విభ్రమబలైకనిధిర్విధాయ
భ్రూవల్లిచాపకుటిలీకృతిమేవ చిత్రమ్ ।
స్వాధీనతాం తవ నినాయ శశాంకమౌలేః
అంగార్ధరాజ్యసుఖలాభమపాంగవీరః ॥69॥
మాతా! కామాక్షీ! నీ దృష్టి అనే మహాయోధుడు నీ విలాసములనే ఆయుధముగా చేసుకుని, నీ కనుబొమలు అనే వింటిని ఎక్కుపెట్టి ఈశ్వరుని నీకు వశపరుస్తున్నాడు. దానివలన నీవు శివునిలో అర్థ శరీరమును ఆక్రమించావు.
కామాంకురైకనిలయస్తవ దృష్టిపాతః
కామాక్షి భక్తమనసాం ప్రదదాతు కామాన్ ।
రాగాన్వితః స్వయమపి ప్రకటీకరోతి
వైరాగ్యమేవ కథమేష మహామునీనామ్ ॥70॥
మాతా! కామాక్షీ! నీ చూపులు ప్రసరిస్తే, కోరికలు అనే మొక్కలు పెరిగి పుష్పించి ఫలిస్తాయి. కానీ అమ్మా! ఒక ప్రక్కన నీ చూపులు రాగపూరితమైన కోరికలను అనుగ్రహిస్తుంటే, మరియొక ప్రక్కన అవి మునీశ్వరుల రాగములను తొలగిస్తున్నాయి. ఇది ఎంతో ఆశ్చర్యకరం.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




