శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 11-20 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అనేది సిరిసంపదలు, అదృష్టం మరియు శుభాలకు ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మీ దేవిని స్తుతిస్తూ పఠించే అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన హిందూ స్తోత్రం. అమ్మవారి విశిష్ట గుణాలను, తత్వాన్ని మరియు విశ్వరూపాన్ని వర్ణించే వెయ్యి నామాలతో కూడిన ఈ పురాతన స్తోత్రం కేవలం భౌతిక సంపదల కోసం చేసే ప్రార్థన మాత్రమే కాదు, ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సాధన. ఈ దివ్య నామాలను స్వచ్ఛమైన భక్తితో పఠించడం లేదా వినడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, జీవితంలోని ఆటంకాలు పటాపంచలై, ఇంట శాంతి, శ్రేయస్సు మరియు సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది భక్తులను నేరుగా ఆ చల్లని తల్లి అనుగ్రహానికి అనుసంధానించే ఒక ఆధ్యాత్మిక వారధిలా పనిచేస్తుంది.
సంస్కృత పఠనం ద్వారా విశేష ఫలితం ఉన్నప్పటికీ, లక్ష్మీ సహస్రనామాలకు మాతృభాషలో అర్థం తెలుసుకుని చదవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. తెలుగులో అర్థం తెలుసుకోవడం ద్వారా పఠనం యాంత్రికంగా కాకుండా, అమ్మవారితో చేసే హృదయపూర్వక సంభాషణగా మారి ఏకాగ్రత, భక్తి ద్విగుణీకృతం అవుతాయి. మనకు అలవాటైన భాషలో ఉండటం వల్ల పిల్లలు, యువతకు కూడా ఈ దైవిక తత్వం సులభంగా అర్థమై, భావితరాలకు చేరువవుతుంది. అంతేకాకుండా, అష్టలక్ష్ముల విశిష్టతను తెలుసుకుని, మనకు అత్యంత అవసరమైన అమ్మవారి రూపంపై మనసును లగ్నం చేసి కోరిన వరాలను పొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
కాళికా పంచికా వాగ్మీ హవిఃప్రత్యధిదేవతా |
దేవమాతా సురేశానా వేదగర్భాఽoబికా ధృతిః || 11 ||
కాళికా – నల్లనిది, కాలరాత్రి స్వరూపిణి
పంచికా – పంచభూతాల ద్వారా వ్యాపించినది
వాగ్మి – వేద వాక్కులచే స్తుతించబడునది
హవిః – అగ్నిహోత్రములో ప్రేల్వబడిన ఆజ్యము
పృత్యధిదేవతా – మంత్రములకు అధిదేవత
దేవమాతా – దేవతలకు తల్లి
సురేశానా – దేవతలందరినీ పాలించు పరాశక్తి
వేదగర్భ – వేదములనుండి పుట్టినది / వేద స్వరూపిణి
అంబిక – తల్లి
ధృతిః – ధైర్యం
సంఖ్యా జాతిః క్రియాశక్తిః ప్రకృతిర్మోహినీ మహీ |
యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యవిద్యా విభావరీ || 12 ||
సంఖ్యా – సంఖ్యాజ్ఞాన స్వరూపిణి
జాతిః – ప్రతి జీవ జాతిలో ఉండు శక్తి స్వరూపిణి
క్రియాశక్తిః – ఆలోచనలను ఆచరణలో పెట్టగల చర్య వెనుక ఉన్న శక్తి
ప్రకృతి – సృష్టికి కారణభూతమైనది
మోహినీ – సమస్త జగత్తును మోహింపజేయునది
మహీ – భూమి
యజ్ఞవిద్యా – యజ్ఞములకు సంబంధించిన జ్ఞానం ప్రసాదించునది
మహావిద్యా – జ్ఞానమును కలిగించునది
గుహ్య విద్యా – రహస్య, తాంత్రిక విద్యాస్వరూపిణి
విభావరీ – చీకటిని/అజ్ఞానాన్ని దూరం చేయునది
జ్యోతిష్మతీ మహామాతా సర్వమంత్రఫలప్రదా |
దారిద్ర్యధ్వంసినీ దేవీ హృదయగ్రంథిభేదినీ || 13 ||
జ్యోతిష్మతి – మెరుపుతీగ వంటి కాంతిని కలిగినది
మహామాతా – గొప్ప తల్లి
సర్వమంత్ర ఫలప్రదా – సమస్త వేదమంత్ర ఫలములను ఇచ్చునది
దారిద్ర్యధ్వంసినీ – పేదరికాన్ని నాశనం చేసేది
దేవి – దేవత
హృదయగ్రంథివిబేధినీ – కుండలినీ శక్తి స్వరూపిణి
సహస్రాదిత్యసంకాశా చంద్రికా చంద్రరూపిణీ |
గాయత్రీ సోమసంభూతిః సావిత్రీ ప్రణవాత్మికా || 14 ||
సహస్రాదిత్య సంకాశా – వేయి సూర్యుల తేజస్సు కలిగినది
చంద్రికా – చంద్రుని వంటి కాంతి కలది
చంద్రరూపిణీ – చంద్రుని వంటి రూపము కలది
గాయత్రి – గాయత్రీ మంత్ర అధిష్టాన దేవత
సోమసంభూతిః – చంద్రవంకను ధరించినది
సావిత్రి – సూర్యుని తేజస్సు కలిగినది
ప్రణవాత్మికా – ఓంకారస్వరూపిణి
శాంకరీ వైష్ణవీ బ్రాహ్మీ సర్వదేవనమస్కృతా |
సేవ్యదుర్గా కుబేరాక్షీ కరవీరనివాసినీ || 15 ||
శాంకరీ – శంకరుని భార్య
వైష్ణవీ – మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపిణి
బ్రాహ్మీ – బ్రహ్మ స్వరూపిణి
సర్వదేవనమస్కృతా – దేవతలందరిచే నమస్కరింపబడినది
సేవ్యదుర్గా – దుర్గాదేవిచే సేవింపబడునది
కుబేరాక్షీ – అందమైన కన్నులు కలది
కరవీర నివాసినీ – ఎర్రని గన్నేరు పూవులలో ఉండునది / ఖడ్గములలోని శక్తి
జయా చ విజయా చైవ జయంతీ చాఽపరాజితా |
కుబ్జికా కాళికా శాస్త్రీ వీణాపుస్తకధారిణీ || 16 ||
జయా – జయించునది
విజయా – విజయమును కలిగించునది
జయంతి – మంగళప్రదమైనది / పార్వతి
అపరాజితా – ఎవరూ ఓడించలేనిది
కుబ్జికా – 8 సంవత్సరముల బాలిక
కాళికా – పార్వతి దేవి
శాస్త్రీ – శాస్త్రము తెలిసినది, వేదజ్ఞాన రూపిణి
వీణాపుస్తక ధారిణి – వీణను, పుస్తకమును ధరించునది,
సంగీత సాహిత్యాలకు అధిదేవత
సర్వజ్ఞశక్తిః శ్రీశక్తిర్బ్రహ్మవిష్ణుశివాత్మికా |
ఇడాపింగళికామధ్యమృణాళీతంతురూపిణీ || 17 ||
సర్వజ్ఞ శక్తిః – బ్రహ్మ, విష్ణు మరియు శివుని వెనుక ఉన్న శక్తి
శ్రీ శక్తి – జ్ఞానం యొక్క శక్తి
బ్రహ్మవిష్ణుశివాత్మికా – బ్రహ్మ, విష్ణు, శివ శక్తి స్వరూపిణి
ఇడాపింగళికామధ్య మృణాళీ తంతురూపిణీ
– ఇడా మరియు పింగళ నాడుల మధ్య నుండి సహస్రారానికి చేరుకునే కుండలినీ శక్తి
యజ్ఞేశానీ ప్రథా దీక్షా దక్షిణా సర్వమోహినీ |
అష్టాంగయోగినీ దేవీ నిర్బీజధ్యానగోచరా || 18 ||
యజ్ఞేశానీ – యజ్ఞాలను పాలించునది
ప్రథా – కీర్తి కలది, ప్రసిద్ధి చెందినది
దీక్షా – పవిత్రమైన కార్యములను నెరవేర్చడంలో పట్టుదల కలది
దక్షిణా – సర్వలోకములకు తల్లి
సర్వమోహిని – అందరినీ మోహింపజేయునది
అష్టాంగయోగినీ దేవీ – అష్టాంగ యోగమును తెలిసిన దేవత
నిర్బీజధ్యానగోచరా – భక్తితో చేయు యోగమునకు అనుగ్రహించి దర్శనమిచ్చునది
సర్వతీర్థస్థితా శుద్ధా సర్వపర్వతవాసినీ |
వేదశాస్త్రప్రమా దేవీ షడంగాదిపదక్రమా || 19||
సర్వతీర్థస్థితా – అన్ని తీర్థాలలోనుండునది
శుద్ధా – స్వచ్ఛమైనది
సర్వపర్వతవాసినీ – అన్ని పర్వతాలపై నివసించేది
వేదశాస్త్రప్రమా దేవీ – వేదశాస్త్రములలోని జ్ఞాన స్వరూపిణి
షడంగాది పదక్రమా – వేదాలలోని ఆరు శాఖలు అనగా శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పములను క్రోడీకరించినది, వేదస్వరూపము
శివా ధాత్రీ శుభానందా యజ్ఞకర్మస్వరూపిణీ |
వ్రతినీ మేనకాదేవీ బ్రహ్మాణీ బ్రహ్మచారిణీ || 20 ||
శివా – శివుని భార్య
ధాత్రి – సర్వమును ధరించునది, సర్వ సంపదలను ఇచ్చునది
శుభానందా – భక్తులకు శుభములను, ఆనందమును ఇచ్చునది
యజ్ఞకర్మ స్వరూపిణీ – యజ్ఞములలో నిర్వహించు కర్మల రూపము
వ్రతినీ – వ్రత నియమములు కలది
మేనకాదేవీ – మేనకాదేవి కుమార్తె
బ్రహ్మాణి – చైతన్య శక్తి
బ్రహ్మచారిణి – శివుని వివాహమాడక ముందు తపస్సులో ఉన్న పార్వతి రూపం, నవదుర్గా రూపాలలో రెండవది
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




