పురాణాలు » పురాణ కథలు » క్షీరసాగర మథనం – పురాణాల్లోనే అత్యంత గొప్ప సంఘటన!
క్షీరసాగర మథనం సందర్భంగా దేవతలు, అసురులు వాసుకి నాగును తాడుగా ఉపయోగించి మందర పర్వతాన్ని మథిస్తున్న దృశ్యం. కూర్మావతారంలో శ్రీమహావిష్ణువు పర్వతానికి ఆధారంగా ఉన్న పురాణ ఘట్టం.

క్షీరసాగర మథనం

క్షీరసాగర మథనం ముఖ్యంగా భాగవతంలో ప్రస్తావించబడుతుంది. దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మథనం జరుపుతారు. చాక్షుషువు మనువుగా ఉన్న సమయంలో క్షీరసాగర మథనం జరిగింది.

బలి చక్రవర్తి నేతృత్వంలో రాక్షసులు విజృంభించి, దేవతలతో పోరాడి, వారిని ఓడించారు. దేవతలు పరాజితులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. రాక్షసుల బాధ పడలేక, దేవతలు శివుని, బ్రహ్మను వెంట బెట్టుకొని, శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి కష్టాలు చెప్పుకొంటారు.

Lord Vishnu seated on Adishesha with Goddess Lakshmi in Vaikuntha as Devas seek divine guidance after their defeat.

అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి, రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత, వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మథనం జరపండి. ఆ మథన సమయంలో అమృతం పుడుతుంది. అమృతాన్ని త్రాగితే ఆయుష్షు పెరుగుతుంది. మరణం లేని జీవితం దొరుకుతుంది. అప్పుడు మీరు రాక్షసులను జయించి మరల స్వర్గాన్ని పొందగలుగుతారు. మీరందరూ పాలసముద్రంలో రకరకాల వనమూలికలను, తీగలను, ఔషదులనూ అధికంగా తెచ్చి వేయండి. సర్పరాజైన వాసుకిని, కవ్వపు త్రాడుగా చేసుకొని జాగ్రత్తగా పాలకడలిని చిలకండి. మీకు లాభం కలుగుతుంది. సకల సంపదలూ సిద్ధిస్తాయి. ఆ మథనానికి కవ్వంగా మందరగిరి ని వాడండి అని అంటాడు.

ఆ మాటలు విని, దేవతలు ఆనందించి, వారివారి గృహాలకు వెళ్ళిపోతారు. కొంతమంది రాక్షసులు దేవతా సంహారానికి ముందుకువస్తుంటే, బలి చక్రవర్తి వారిని వారిస్తాడు. ఆ తరువాత అలా కాలం వెళ్లబుచ్చుతున్న సమయంలో, ఒకరోజు దేవేంద్రుడు రాక్షసవీరులతో “మనం అక్కచెల్లెండ్ర బిడ్డలం. మనకింక విరోధం వద్దు. బలి చక్రవర్తి ఆజ్ఞకు కట్టుబడి ఉందాం. కలిసికట్టుగా బ్రతుకుదాం” అని నచ్చచెప్పాడు. మంధర పర్వతాన్ని మథిస్తే మనం అందరం సుఖపడతామని చెప్పి ఒప్పించాడు. దేవతల సమూహానికి ఇంద్రుడూ, రాక్షసుల సమూహానికి బలి చక్రవర్తీ నాయకులై, అందరూ కలిసి ఐకమత్యంతో, అమృతాన్ని సంపాదించడానికి నిశ్చయించుని మంధర పర్వతం దగ్గర చేరారు.

Ultra-realistic depiction of Samudra Manthan showing Devas and Asuras churning the Kshira Sagara with Mount Mandara and Vasuki while Lord Vishnu supports the mountain as Kurma Avatar.

మందరగిరిని త్రవ్వి తీసుకొని రాగా, అది మహాభారమైనదై క్రింద పడబోతే, శ్రీ మహా విష్ణువు గరుడారూఢుడై వచ్చి, మందరగిరిని క్షీర సాగరములో వదిలాడు. వాసుకిని ప్రార్థించి, అమృతంలో భాగమిస్తామని చెప్పి, ఒప్పించి దాని రజ్జుగా చేసి పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. ఆలా చిలకడం ప్రారంభించేటప్పుడు దేవతలు వాసుకి పడగ వైపు నడిచారు. దాoతో రాక్షసులు కోపించి, తోక వైపు నిలబడి చిలికే నీచులమా అని అనగా దేవతలు తోక పట్టుకొని చిలకడానికి అంగీకరించారు. ఆ విధంగా చిలుకుతుండగా, ఆ మంధరగిరి క్రింద నిలిచే ఆధారము లేక క్షీరసాగరములోనికి జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారము ఎత్తి, ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకొన్నాడు. మంధరగిరితో మథనం జరుపుతుండగా, విపరీతమైన శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి ఎన్నో జీవరాశులు మరణించాయి.

అలా చిలుకుతుండగా ముందు హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవదానవులకు తోచక, బ్రహ్మ వద్దకు వెళ్తారు. బ్రహ్మ, విష్ణువు వద్దకు అక్కడ నుండి కైలాసంలో ఉన్న శివుడి వద్దకు వెళ్ళి, క్షీరసాగర మథనం జరుపుతుండగా వచ్చిన దానిని, అగ్రతాంబూలంగా స్వీకరించుమని ప్రార్థించగా, శివుడు పార్వతిని అడగగా- మ్రింగేవాడు తన భర్త అని తెలిసీ, మ్రింగేది విషమని తెలిసీ దానివల్ల ప్రజలకు మేలు కలుగుతుందనే ఉద్దేశంతో, సర్వమంగళ అయిన పార్వతీదేవి తన భర్తను ఆ విషాన్ని మ్రింగమని చెప్పింది. వెంటనే దేవతలందరూ జయజయ ద్వానాలు చేసారు.

పరమేశ్వరుడు అంతటా వ్యాపించిన మహా విషాన్ని తన చేయి చాచి పట్టుకొని, ముద్దగా చేసి, నేరేడు పండువలె భుజించాడు. పరమేశ్వరుని కడుపు సమస్త లోకాలకు నివాస స్థానం. అందుకని శివుడు ఆ విషాగ్నిని మ్రింగకుండా గొంతులో పట్టి ఉంచాడు. ఆ హాలాహలం గ్రొంతులో ఉంచడం వలన ఈశ్వరుని కంఠంపై నలుపు రంగు ఏర్పడి అది ఒక కంఠాభరణంలా ఒప్పింది.

Lord Shiva holds the deadly Halahala poison in His throat as Goddess Parvati protects Him, creating the Neelakantha form.

ఆ తరువాత దేవదానవులు మళ్ళీ క్షీరసాగర మథనం ప్రారంభించారు.

ఇలా చిలుకుతున్న పాలసముద్రం నుండి మొదట “కామధేనువు” పుట్టింది. దానిని దేవ మునులు తీసుకున్నారు.

తరువాత “ఉచ్చైశ్రవం” అనే గుఱ్ఱం పుట్టింది. దానిని బలి చక్రవర్తి తీసుకొన్నాడు.

తరువాత వరుసగా “ఐరావతం” అనే ఏనుగు, “కల్పవృక్షం” పుట్టాయి. వాటిని ఇంద్రుడు తీసుకున్నాడు.

దాని వెనుక మెరుపు తీగల వంటి శరీరాలు గల “అప్సరసలు” ఉదయించారు.

ఆ వెనుక “చంద్రుడు” జన్మించాడు.

ఆ వెంట సముద్రం నుండి అందచందాలకు పెన్నిది అయిన లక్ష్మీదేవి అవతరించింది.

Goddess Lakshmi gracefully emerges from the Milky Ocean standing on a blooming lotus during the Samudra Manthan.

క్షీరసాగరమధన సమయంలో, పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మీదేవికి, ఇంద్రుడు వెలలేని రత్నాలపీఠం, సముద్రుడు పట్టుబట్టల జతను, వరుణుడు వైజయంతీ మాలను, విశ్వకర్మ బంగారు అలంకారాలను, సరస్వతి మంచిముత్యాల హారాన్ని, బ్రహ్మదేవుడు చేతిలో ధరించే లీలాకమలాన్ని, నాగరాజు కర్ణాభరణాలు ఇచ్చి దీవించారు. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తనకు తగిన భర్త అని ఎంచుకుంది. కలువపూల మాలతో విష్ణుమూర్తి కంఠాన్ని అలంకరించింది. లోకాలకు తండ్రియైన విష్ణువు, లోకాలకు తల్లియైన లక్ష్మీదేవిని, తన వక్షాన్న చేర్చుకొన్నాడు. అల్లుడైన శ్రీమహావిష్ణువుకు, సముద్రుడు కౌస్థుభమనే అమూల్యరత్నాన్ని ఇచ్చాడు. దానిని విష్ణువు తన వక్షాన్న ధరించాడు. అప్పుడు శ్రీవత్సమూ, కౌస్థుభమూ, వైజయంతిమాలికా, ముత్యాలహారమూ, వాటితో కూడిన సొగసైన విష్ణువు ఎదపై లక్ష్మీదేవి నివసించింది.

ఆ తరువాత పాలసముద్రం నుండి సురకు అధిదేవత అయిన “వారుణి” అనే అందగత్తె పుట్టింది. ఆ కన్యను విష్ణువు అనుమతితో రాక్షసులు తీసుకున్నారు.

చిలకగా చిలకగా చివరకు ఆ సముద్రం నుండి “అమృతపాత్రతో సహా ధన్వంతరి” అనే దివ్య పురుషుడు ఉదయించాడు..

ఆ తరువాత ధన్వంతరి అమృత కలశంతో ఆవిర్భవిస్తాడు. అమృతాన్ని చూడగానే దానవులు ఒకరి మీద మరొకరు పడి, కొట్టుకోవడం ఆరంభించారు. దానవులు కొట్టుకోవడంతో, అమృతం చేతులు మారిపోతోంది. దేవతలు దీన వదనులై శ్రీమహావిష్ణువుని ప్రార్థించారు. శ్రీమహావిష్ణువు వారిని ఓదార్చి, జగన్మోహిని అవతారం ఎత్తి, ఆ దానవుల వద్దకు వస్తాడు. జగన్మోహినీ రూపుడైన శ్రీ మహావిష్ణువు, వయ్యారాలు ఒలకపోసుకొంటూ అటుఇటు తిరుగుతుంటే, రాక్షసులు ఆ జగన్మోహిని వెంటబడి, అప్పటి వరకు జరిగిన గాథ చెప్పి, దేవదానవులు అన్నదమ్ములు అవుతారని, సాగర మథనం వల్ల అమృతం వచ్చిందని, ఆ అమృతాన్ని వారిద్దరకి పంచమని కోరుతారు. అప్పుడు ఆ జగన్మోహిని, దేవదానవులను రెండు పంక్తులలో కోర్చోబెట్టి, దర్భలమీద అమృతకలశాన్ని పెట్టి, దేవతలకు అమృతం పోస్తూ, దానవులను తన వయ్యారాలతో మభ్యపెట్టింది. రాహువు అనే రాక్షసుడు అది గ్రహించి, దేవతల పంక్తిలో కూర్చొంటాడు. ఆ విషయాన్ని సూర్యచంద్రులు సంజ్ఞ ద్వారా జగన్మోహిని రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు కి తెలుపగా, విష్ణువు సుదర్శన చక్రముతో వాడి తల తెగ నరికాడు. ఆ విషయం ప్రక్కన ఉన్న దానవులకు తెలియలేదు.

కాని అప్పటికే అమృతం తీసికొని ఉన్నందున, రాహువు చావలేదు. తల, మొండెము విడిపోయి, తల రాహువు గాను, మొండెము కేతువు గాను పిలువబడుతూవచ్చారు. సూర్య, చంద్రులు అపకారం చేశారనే ఉద్దేశంతో, ప్రతీ సంవత్సరం రాహు, కేతువులు సూర్య, చంద్రులను మ్రింగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీనినే సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం అంటాము.

జరిగిన విషయం అంతా చూసి, వాసుకి తెల్లపోయాడు. క్షీరసాగర మథన సమయంలో, కవ్వానికి త్రాడుగా ఉన్నందుకు తనకు వాటాగా ఇస్తానన్న అమృతం రాకపోయేసరికి, ఏమీ చెయ్యలేక, అమృత కలశం పెట్టిన చోటికి వెళ్లి, దర్భలను నాకేడు, వాటిమీద ఏమైనా అమృతం పడిందేమోనని. అమృతం దక్కలేదు కాని, దర్భల పదునుకి, నాలుక నిలువునా చీరుకు పోయింది. అప్పటినుంచీ, వాసుకి సంతానమైన సర్పాలకు, నాలుక నిలువునా చీరుకుని ఉండి, రెండు నాలుకలున్నట్లుగా అనిపిస్తుంది.

అమృతం పంచడం అయిపోయింది. జగన్మోహిని అదృశ్యమైపోయింది. ఇది చూసిన రాక్షసులు, అమృతాన్ని త్రాగడం కోసం కష్టపడి సముద్రాన్ని చిలికి, చివరకు అమృతం పొందలేకపోయామని దుఃఖించారు. విష్ణుభక్తిలేని వివేకహీనులు తాము కోరిన సంపదలను పొందలేరు.

విష్ణుమూర్తి దేవతలను హెచ్చరించి, గరుత్మంతుడిపై కూర్చొని తన నివాసానికి వెళ్ళిపోయాడు. తరువాత జరిగిన దేవాసుర యుద్ధంలో, దేవతలు విజయం సాధించి, మరల స్వర్గాన్ని సంపాదించుకున్నారు.

సముద్రాన్ని చిలికేటప్పుడు, సముద్ర మధ్యంలో మునిగిపోతున్న మంధర పర్వతాన్ని మోయడంకోసం కూర్మావతారాన్ని ధరించిన విష్ణువు కథను వినినా, చదివినా సంసార సముద్రంలో మునిగిపోయే జనులు గొప్ప పుణ్యాన్ని, సుఖాన్నీ పొందుతారు. శివుని “హాలాహలభక్షణం” కథను విన్నా, వ్రాసినా, చదివినా వారు భయానికి గురికారు. పాముల వల్లనూ, త్రేళ్ళ వల్లనూ, అగ్ని వల్లనూ కష్టాన్ని పొందరు. మోహిని రూపం ధరించి, ఆపదలో ఉన్న దేవతలకు అమృతాన్ని పంచిపెట్టిన ఆ విష్ణురూపాన్ని ఊహించి స్మరిస్తే, అది మన జీవితంలోనిపాపపు చీకట్లను రూపుమాపుతుంది.

క్షీర సాగర మథనం దృశ్యాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

3 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top