పురాణాలు » పురాణ కథలు » 18 పురాణాలో ఏముంది?
18 మహాపురాణాలలో ఏముంది? ప్రతి పురాణం యొక్క ప్రధాన అంశాలు మరియు విశిష్టతలు

18 పురాణాలో ఏముంది?

పురాణాలు హిందూ మత గ్రంథాలు. ఇవి వేదాలకు ఉపబృంహణాలుగా భావించబడతాయి. “పురాణం” అంటే పూర్వకాలంలో జరిగినది అనే అర్థం. అయితే ఇవి నిత్యనూతన సత్యాలను కూడా తెలియజేస్తాయి. అనంత విశ్వం గురించి విస్తృతమైన సమాచారం వీటిలో లభిస్తుంది. దేవాలయంలో చేసే పూజల నుంచి ఆకాశంలో జరిగే అద్భుతాల వరకు అనేక విషయాలకు ఇవే ఆధారం. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడే పురాణాలను సంకలనం చేశారు.

పురాణాలు ప్రణవనాదమైన ఓంకారం నుండి ఉద్భవించాయని భాగవతంలోని ద్వాదశ స్కందం చెబుతుంది. వేదాలు మంత్రరూపంలో క్లిష్టంగా ఉండటంతో, వేదవ్యాసుడు వేదోపనిషత్తుల సారంతో అష్టాదశ పురాణాలను రచించారు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణునికి ఉపదేశించాడు. ఆయన వాటిని తన శిష్యులైన త్రయారుణి, సావర్ణి, కశ్యపుడు మొదలైన వారికి అందించాడు. అలా గురుపరంపర ద్వారా ఇవి వ్యాపించాయి.

సత్రయాగం జరుగుతున్నప్పుడు అష్టాదశ పురాణాలను తెలుపుతూ భాగవత పురాణం ప్రథమ స్కంధంలో చెప్పబడిన ఈ శ్లోకంతో 18 పురాణాలను సులభంగా గుర్తుంచుకోవచ్చు:

అష్టాదశ పురాణ శ్లోకం - 18 మహాపురాణాలను గుర్తించే పురాణ శ్లోకం

మద్వయం – “మ” అక్షరంతో రెండు పురాణాలు: మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
భద్వయం – “భ” అక్షరంతో రెండు పురాణాలు: భాగవత పురాణం, భవిష్య పురాణం
బ్రత్రయం – “బ్ర” అక్షరంతో మూడు పురాణాలు: బ్రహ్మ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
వ చతుష్టయం – “వ” అక్షరంతో నాలుగు పురాణాలు: విష్ణు పురాణం, వాయు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం

అనాపద్లింగకూస్కాని – మొదటి అక్షరాలతో ఒక్కొక్క పురాణం:
అ – అగ్ని పురాణం
నా – నారద పురాణం
పద్ – పద్మ పురాణం
లింగ్ – లింగ పురాణం
గ – గరుడ పురాణం
కూ – కూర్మ పురాణం
స్క – స్కంద పురాణం

ఈ పురాణాలన్నీ శ్రీమహావిష్ణువు శరీర భాగాలుగా ఉపమానించబడ్డాయి. ఇవి శ్లోకరూపంలో రచించబడ్డాయి. అన్నింటిలో పద్మ పురాణం పెద్దది; మార్కండేయ పురాణం చిన్నది. అనంతమైన పౌరాణిక విజ్ఞానాన్ని, అపారమైన వేదరాశిని వేదవ్యాసుడు అంశాల వారీగా విభజించాడు. ఎంతో విస్తారమైన ఈ పురాణాలను పూర్తిగా చదవలేనివారికి, ఏ పురాణంలో ఏముందో సంక్షిప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం.

1. బ్రహ్మ పురాణం

శ్లోకాల సంఖ్య: సుమారు 12 వేల శ్లోకాలు

ఇది విష్ణువు శిరస్సుగా వర్ణించబడింది. దక్షునికి బ్రహ్మదేవుడు బోధించిన ఈ పురాణంలో

  • వర్ణధర్మాలు
  • స్వర్గ–నరక వర్ణన
  • శ్రీకృష్ణుడు, మార్కండేయుడు, కశ్యపుడు తదితరుల చరిత్ర
  • గాయత్రీ దేవి ఆవిర్భావం
  • పూరి జగన్నాథ క్షేత్ర మహిమ
  • భూమి–ద్వీప–సముద్ర–పర్వత–నదుల వర్ణనలు
  • బ్రహ్మసృష్టి
  • జంబుద్వీపం
  • భరతఖండ వర్ణన మొదలైన విషయాలు ఉన్నాయి.

2. పద్మ పురాణం

శ్లోకాల సంఖ్య: సుమారు 55 వేల శ్లోకాలు

ఈ పురాణం విష్ణువు హృదయంగా పోల్చబడింది.

  • మధు–కైటభుల వధ
  • గంగామహత్యం
  • గీతాసారం
  • నిత్యపూజావిధానం
  • కార్తీకమాస ప్రాశస్త్యం
  • కలియుగ లక్షణాలు
  • శనిగ్రహ పీడ నివారణ మార్గాలు వంటి విషయాలు ఇందులో ఉన్నాయి.

3. విష్ణు పురాణం

శ్లోకాల సంఖ్య: సుమారు 23 వేల శ్లోకాలు

ఇది విష్ణువు కుడిభుజంగా భావించబడుతుంది.

  • విష్ణువుకు సంబంధించిన అవతారాలు
  • ధృవుడు, ప్రహ్లాదుడు, భరతుడు వంటి భక్తుల చరిత్ర
  • జంబుద్వీప వర్ణన
  • నవగ్రహాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

శివ–కేశవుల మధ్య భేదం లేదని ఈ పురాణం బోధిస్తుంది.

4. వాయు పురాణం

శ్లోకాల సంఖ్య: సుమారు 24 వేల శ్లోకాలు

ప్రస్తుతం సుమారు 11 వేల శ్లోకాలు లభ్యమవుతున్నాయి. ఇది విష్ణువు ఎడమ భుజంగా భావించబడుతుంది.

  • శివమహిమ
  • కాలమానం
  • భూగోళ–సౌరమండల వర్ణన
  • అంజనాదేవి చరిత్ర
  • వాలి–సుగ్రీవుల కథలు ఇందులో ఉన్నాయి.

5. భాగవత పురాణం

శ్లోకాల సంఖ్య: సుమారు 18 వేల శ్లోకాలు

వ్యాసుడు శుకునికి, శుకుడు పరీక్షిత్తుకు ఉపదేశించాడు. ఇది నారాయణుని ఊరువుగా చెప్పబడుతుంది.

  • శ్రీకృష్ణ జననం, లీలలు
  • గజేంద్రమోక్షం
  • క్షీరసాగర మథనం
  • ప్రహ్లాద చరిత్ర
  • నరసింహావతారం
  • కల్కి అవతారం మొదలైనవి ఇందులో ఉన్నాయి.

6. నారద పురాణం

శ్లోకాల సంఖ్య: సుమారు 25 వేల శ్లోకాలు

ఇది విష్ణువు నాభిగా పోల్చబడింది.

  • ఏకాదశి–ద్వాదశి వ్రతవిధులు
  • కాశీ, అయోధ్య, గయ, ప్రయాగ, బదరి వంటి పుణ్యక్షేత్రాల మహిమ
  • మంత్రాలు
  • కవచాలు
  • అన్నదాన మహత్యం ఇందులో ఉన్నాయి.

7. మార్కండేయ పురాణం

శ్లోకాల సంఖ్య: సుమారు 9 వేల శ్లోకాలు

ఇది విష్ణువు కుడి పాదంగా వర్ణించబడింది.

  • దేవీ మహత్యం
  • చండీ హోమం
  • మన్వంతరాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

8. అగ్ని పురాణం

శ్లోకాల సంఖ్య: సుమారు 15400 శ్లోకాలు

ఇది విష్ణువు ఎడమ పాదంగా భావించబడుతుంది.

  • వ్యాకరణం
  • ఛందస్సు
  • జ్యోతిష్యం
  • శిల్పశాస్త్రం
  • ఆయుర్వేదం
  • రాజనీతిశాస్త్రం
  • యాగవిధులు వంటి అనేక శాస్త్ర విషయాలు ఇందులో ఉన్నాయి.

9. భవిష్య పురాణం

శ్లోకాల సంఖ్య: సుమారు 4,500 శ్లోకాలు

ఇది విష్ణువు కుడి మోకాలిగా చెప్పబడుతుంది.

  • సూర్యోపాసన
  • వర్ణాశ్రమధర్మాలు
  • అక్షయ తృతీయ
  • రథసప్తమి ప్రాముఖ్యత
  • వివాహ విధానాలు వంటి విషయాలు ఇందులో ఉన్నాయి.

10. బ్రహ్మవైవర్త పురాణం

శ్లోకాల సంఖ్య: సుమారు 18 వేల శ్లోకాలు

ఇది విష్ణువు ఎడమ మోకాలిగా వర్ణించబడుతుంది.

  • రాధాకృష్ణుల లీలలు
  • తులసి మహత్యం
  • సాలగ్రామ మహిమ
  • పంచప్రకృతి శక్తుల విశేషాలు ఇందులో ఉన్నాయి.

11. లింగ పురాణం

శ్లోకాల సంఖ్య: సుమారు 11 వేల శ్లోకాలు

ఇది విష్ణువు కుడి చీలమండగా చెప్పబడుతుంది.

  • శివుని అవతారాలు
  • వ్రతవిధులు
  • వారణాసి–శ్రీశైలం క్షేత్ర మహత్యం వంటి విషయాలు ఉన్నాయి.

12. వరాహ పురాణం

శ్లోకాల సంఖ్య: సుమారు 24 వేల శ్లోకాలు

ఇది విష్ణువు ఎడమ చీలమండగా భావించబడుతుంది.

  • వరాహావతార కథ
  • శ్రాద్ధవిధులు
  • పుణ్యక్షేత్ర వర్ణనలు ఇందులో ఉన్నాయి.

13. స్కంద పురాణం

శ్లోకాల సంఖ్య: సుమారు 81 వేల శ్లోకాలు

ఇది విష్ణువు రోమరూపంగా చెప్పబడుతుంది.

  • వేంకటాచల, రామేశ్వరం,
  • ద్వారకా మహత్యం, కార్తీకమాస ప్రాశస్త్యం వంటి విషయాలు ఉన్నాయి.

14. వామన పురాణం

శ్లోకాల సంఖ్య: సుమారు 10 వేల శ్లోకాలు

ఇది విష్ణువు చర్మంగా చెప్పబడుతుంది.

  • శివపార్వతుల కళ్యాణం,
  • దేవాసుర సంగ్రామం,
  • ప్రళయకాల వర్ణన ఇందులో ఉన్నాయి.

15. కూర్మ పురాణం

శ్లోకాల సంఖ్య: సుమారు 17 వేల శ్లోకాలు

  • ఖగోళశాస్త్రం
  • క్షీరసాగర మథనం
  • భక్తియోగ మహిమ ఇందులో ఉన్నాయి.

16. మత్స్య పురాణం

శ్లోకాల సంఖ్య: సుమారు 14 వేల శ్లోకాలు

ఇది విష్ణువు మస్తిష్కంగా చెప్పబడుతుంది.

  • వాస్తుశాస్త్రం
  • సృష్టిరహస్యాలు
  • శ్రాద్ధవిధులు ఇందులో ఉన్నాయి.

17. గరుడ పురాణం

శ్లోకాల సంఖ్య: సుమారు 19 వేల శ్లోకాలు

ఇది విష్ణువు మజ్జగా చెప్పబడుతుంది.

  • జనన–మరణ రహస్యాలు
  • పాపపుణ్యాలు
  • యమలోక వర్ణన ఇందులో ఉన్నాయి.

18. బ్రహ్మాండ పురాణం

శ్లోకాల సంఖ్య: సుమారు 12 వేల శ్లోకాలు

ఇది విష్ణువు ఎముకలతో పోల్చబడుతుంది.

  • లలితా సహస్రనామం
  • యుగధర్మాలు
  • పరశురామ–శ్రీరామ చరిత్ర ఇందులో ఉన్నాయి.

ఈ పురాణాలు మనిషి నియమబద్ధమైన జీవితం గడిపి, మోక్షమార్గాన్ని పొందేందుకు అవసరమైన ధర్మసూక్ష్మాలను తెలియజేస్తాయి. ఆధ్యాత్మిక విషయాలతో పాటు సామాన్యులకు ఉపయోగపడే నీతులు, జీవనవిధానాలు కూడా పురాణాల్లో విస్తృతంగా వివరించబడ్డాయి. అందుకే నేటికీ అనేక దేవాలయాల్లో నిత్యపురాణ ప్రవచనాలు జరుగుతున్నాయి.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top