శ్రీ లలితా సహస్రనామాలు – తెలుగులో అర్థం -1 Lalitha Sahasra namam meaning in telugu

lalitha sahasranamam meaning in telugu
lalitha sahasranamam meaning in telugu
శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ ।
చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా ॥ 1 ॥
శ్రీమాతా               : మంగళకరమైన, శుభప్రదమైన తల్లి.
శ్రీమహారాజ్ఞీ            : శుభకరమైన గొప్పదైన రాణి.
శ్రీమత్సింహాసనేశ్వరీ : శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది.
చిదగ్ని కుండ సంభూతా : చైతన్యమనే అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది.
దేవకార్య సముద్యతా : దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించినది.
ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా ।
రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ॥ 2 ॥
ఉద్యద్భాను సహస్రాభా : ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది.
చతుర్బాహు సమన్వితా : నాలుగు చేతులతో కూడినది.
రాగస్వరూప పాశాఢ్యా : అనురాగ స్వరూపముగా గల పాశముతో ఒప్పుచున్నది.
క్రోధాకారాంకుశోజ్జ్వలా : క్రోధమును స్వరూపముగా గలిగిన అంకుశముతో ప్రకాశించుచున్నది.
మనోరూపేక్షుకోదండా, పంచతన్మాత్ర సాయకా ।
నిజారుణ ప్రభాపూర మజ్జద్-బ్రహ్మాండమండలా ॥ 3 ॥
మనో రూపేక్షు కోదండా : మనస్సును రూపముగా గల్గిన చెఱకుగడ విల్లును ధరించింది.
పంచతన్మాత్ర సాయకా : శబ్ద స్పర్శ రూప రస గంధములు అనే ‘తన్మాత్ర’లను బాణములుగా ధరించినది.
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా : తన సహజమైన ఎఱ్ఱని కాంతుల నిండుదనమునందు మునుగుచూ వున్న బ్రహ్మాండముల సముదాయము కలది.
చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా
కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా ॥ 4 ॥
చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా : సంపంగి, అశోక, పున్నాగ, చెంగల్వ పుష్పముల చేత ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగినది.
కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండితా : పద్మరాగముల వరుసచేత ప్రకాశించుచున్న కిరీటముచే అలంకరింపబడింది.
అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా ।
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా ॥ 5 ॥
అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా : అష్టమినాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న (అర్థచంద్రాకారము కలిగిన) ఫాలభాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది.
ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా : ముఖము అనే చంద్రునియందు మచ్చవలె ఒప్పే కస్తూరి బొట్టును కలిగినది.
వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా ।
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా ॥ 6 ॥
వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా : ముఖమనే మన్మథుని శుభమైన నివాసమునకు తోరణమువలె ఒప్పు కనుబొమలు కలిగినది.
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా : ముఖదీప్తి అనే సంపదప్రదమైన ప్రవాహము నందు కదలాడుచున్న చేపలవలె ఒప్పు కన్నులు కలిగినది.
నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా ।
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా ॥ 7 ॥
నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా : కొత్తగా వికసించుచున్న సంపెంగ పువ్వును పోలే ముక్కుదూలముతో ప్రకాశించునది
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా : ఆకాశములో ప్రకాశించునట్లు కనబడు చుక్కల యొక్క కాంతిని తిరస్కరించుచున్న ముక్కు బులాకీ చేత ప్రకాశించునది.
కదంబ మంజరీకౢప్త కర్ణపూర మనోహరా ।
తాటంక యుగళీభూత తపనోడుప మండలా ॥ 8 ॥
కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా : కడిమి పూల గుచ్చములచే, ఆభరణములచే సింగారించిన చెవులతో మనస్సును దోచునంత అందము కలిగినది.
తాటంక యుగళీభూత తపనోడుప మండలా : సుర్య చంద్ర మండలమును చెవి కమ్మలుగా కలది.
పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః ।
నవవిద్రుమ బింబశ్రీః న్యక్కారి రదనచ్ఛదా ॥ 9 ॥
పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః – పద్మరాగ మణుల అద్దమును పరిహసించు చెక్కిళ్ళ యొక్క ప్రదేశము గలది.
నవవిద్రుమబింబ శ్రీ న్యక్కారి రథనచ్ఛదా – కొత్తదైన పగడముల యొక్క దొండపండు యొక్క శోభను తిరస్కరించు పెదవులు గలది.
శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా ।
కర్పూరవీటి కామోద సమాకర్షద్దిగంతరా ॥ 10 ॥
శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్జ్వలా – బ్రహ్మ విద్య లేదా శ్రీవిద్యకు బీజప్రాయము వలె ఆకారము గల రెండు పండ్ల వరుసలచే ప్రకాశించునది.
కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా – కర్పూరపు తాంబూలము యొక్క పరిమళమును చక్కగా గ్రహించుచున్న దిగంతముల వరకు ఆవరణములు గలది.
నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్ఛపీ ।
మందస్మిత ప్రభాపూర మజ్జత్-కామేశ మానసా ॥ 11 ॥
నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ – తన యొక్క సంభాషణ యొక్క తియ్యదనము చేత విశేషముగా అదలింపబడిన కచ్ఛపీ అను పేరుగల వీణ గలది.
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా – చిరునవ్వు నిండిన కాంతి ప్రవాహమునందు మునుగుచున్న శివుని యొక్క మనస్సు కలిగినది.
అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా ।
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా ॥ 12 ॥
అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా – పోలిక లేని గడ్డము యొక్క శోభ చేత ప్రకాశించునది.
కామేశ బద్ధ మాంగల్యసూత్ర శోభిత కంధరా – పరమశివుని చేత కట్టబడిన మంగళసూత్రముచే, పవిత్ర సౌందర్యముతో ప్రకాశించుచున్న మెడ గలిగినది.
కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా ।
రత్నగ్రైవేయ చింతాక లోలముక్తా ఫలాన్వితా ॥ 13 ॥
కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా – బంగారు ఆభరణాలు, వంకీలతో అందమైన బాహువులు కలిగినది.
రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా – రత్నముల చేత అలంకరించిన కంఠమునందు ‘చింతాకు’ అనే కదులుచున్న ముత్యాలతో కూడిన ఆభరణము ధరించునది.
కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తనీ।
నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ ॥ 14 ॥
కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతి పణ స్తనీ – కామేశ్వరుని యొక్క ప్రేమ అనే శ్రేష్టమైన మణిని పొందుటకై బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్తనములు గలది.
నాభ్యాలవాల రోమాళి లతాఫలకుచద్వయీ – బొడ్డు అనే పాదు లోని నూగారు అనే తీగకు పండ్లవలె ఒప్పు జంట స్తనములు గలిగినది.
లక్ష్యరోమలతా ధారతా సమున్నేయ మధ్యమా ।
స్తనభార దళన్-మధ్య పట్టబంధ వళిత్రయా ॥ 15 ॥
లక్ష్య రోమలతాధారతా సమున్నేయ మధ్యమా – కనబడుచున్న నూగారు అనెడు తీగను అనుసరించి ఉద్ధరింపబడిన నడుము గలది.
స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా – వక్షముల బరువు చేత విరుగుచున్న నడుమునకు కట్టిన పట్టీల యొక్క బంధముల వలె కనబడు మూడు ముడుతలు గలది.
అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్-కటీతటీ ।
రత్నకింకిణి కారమ్య రశనాదామ భూషితా ॥ 16 ॥
అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ – ఉదయ సూర్యుని రంగువలె కుంకుమపువ్వు రంగువలె అగుపడు వస్త్రముతో వెలుగొందు కటి ప్రదేశము గలది.
రత్నకింకిణికా రమ్యా రశనాదామ భూషితా – రత్నములతో కూడిన చిరుగంటలతో అందమైన ఒడ్డాణపు త్రాటి చేత అలంకరింపబడింది.
కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా ।
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా ॥ 17 ॥
కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా – కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మృదువైన తొడలను కలిగినది.
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా – మాణిక్య సంబంధమైన కిరీటము వంటి ఆకారముతో ఉన్న మోకాళ్లతో ప్రకాశించునది.
ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికా ।
గూఢగుల్భా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా ॥ 18 ॥
ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికా – ఆరుద్ర పురుగుల చేత చుట్టును పొదగబడిన మన్మథుని యొక్క అమ్ముల పొదులతో ఒప్పు పిక్కలు గలది.
గూఢగుల్ఫా – నిండైన చీలమండలు గలది.
కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా – తాబేలు యొక్క ఉపరితలం అనగా వీపు భాగపు నునుపును గెలుచు స్వభావము గల పాదాగ్రములు కలిగినది.
నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా ।
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా ॥ 19 ॥
నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా – కాలి గోళ్ళ కాంతి వలన నమస్కరించుచున్న జనుల అజ్ఞానము పోగొట్టునది
పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా – పద్మములను తిరస్కరించు కాంతి కల పాదములు కలిగినది
శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజా ।
మరాళీ మందగమనా, మహాలావణ్య శేవధిః ॥ 20 ॥
శింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజా – ధ్వని చేయుచున్న మణులు గల అందెలచేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు గలది.
మరాళీ మందగమనా – హంసవలె ఠీవి నడక కలిగినది.
మహాలావణ్య శేవధిః – అతిశయించిన అందమునకు గని లేదా నిధి.

DOWNLOAD "SRI LALITHA SAHASRANAMAM MEANING IN TELUGU" PDF HERE

Tags: , , , , , , , , , ,