స్తోత్రాలకు తెలుగులో అర్థం » దేవీ స్తోత్రాలు » లలితా స్తోత్రాలు » శ్రీ లలితా సహస్రనామం తెలుగులో అర్థం 1-20
శ్రీ లలితా సహస్రనామం 1-10 నామాలు తెలుగులో అర్థం

 శ్రీ లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం

మన హిందూ సనాతన ధర్మంలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు బ్రహ్మాండ పురాణంలో సాక్షాత్తు ఆ హయగ్రీవుడు అగస్త్య మహామునికి ఉపదేశించిన మహా మంత్రం ఇది

అమ్మవారి అనుగ్రహం పొందడానికి, జీవితంలో సకల శుభాలు, ప్రశాంతత కలగడానికి ప్రతిరోజూ ఎంతోమంది భక్తులు ఈ సహస్రనామాన్ని పఠిస్తుంటారు అయితే, ఏదైనా స్తోత్రాన్ని కేవలం చదవడం కన్నా అందులోని ప్రతి నామానికి ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుని, భావయుక్తంగా పఠిస్తే ఆ అనుభూతి మరింత అద్భుతంగా ఉంటుంది ఆ జగన్మాత తత్వం మనసుకు మరింత దగ్గరవుతుంది. లలితా పరమేశ్వరి వైభవాన్ని తెలుసుకునే ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం.

శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ ।
చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా ॥ 1 ॥
శ్రీమాతా – లోకానికి తల్లి
శ్రీమహారాజ్ఞీ – లోకాలను పాలించే రాణి
శ్రీమత్సింహాసనేశ్వరీ – సింహాసనంపై కొలువున్న అధిదేవత
చిదగ్నికుండ సంభూతా – పవిత్రమైన జ్ఞానాగ్ని నుండి పుట్టినది
దేవకార్య సముద్యతా – దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించినది

ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా ।
రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ॥ 2 ॥
ఉద్యద్భాను సహస్రాభా – వేయి సూర్యుల ప్రకాశం కలిగిన తల్లి
చతుర్బాహు సమన్వితా – నాలుగు చేతులు కలిగినది
రాగస్వరూప పాశాఢ్యా – ప్రేమనే పాశము (త్రాడు) గా కలిగినది
క్రోధాకారాంకుశోజ్జ్వలా – కోపాన్ని అంకుశంలా మార్చి దుష్టశిక్షణ చేసేది

మనోరూపేక్షుకోదండా, పంచతన్మాత్ర సాయకా ।
నిజారుణ ప్రభాపూర మజ్జద్-బ్రహ్మాండమండలా ॥ 3 ॥
మనోరూపేక్షు కోదండా – మనస్సునే చెరకు విల్లుగా ధరించినది
పంచతన్మాత్ర సాయకా – ఐదు ఇంద్రియాలను బాణాలుగా ధరించినది
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా – తన సహజమైన ఎఱ్ఱని కాంతులతో సమస్త బ్రహ్మాండములను ప్రకాశింప చేయు తల్లి

చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా ।
కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా ॥ 4 ॥
చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా – చంపక, అశోక, పున్నాగ వంటి సుగంధ పుష్పాలతో అలంకరించబడిన జుట్టు కలది
కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా – పద్మరాగమణులతో మెరిసిపోయే కిరీటాన్ని ధరించిన తల్లి

అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా ।
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా ॥ 5 ॥
అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభితా – అష్టమి చంద్రునిలా అర్ధచంద్రాకారంలో మెరిసే నుదురు కలది
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా – ముఖము అనే చంద్రునియందు మచ్చవలె కస్తూరి బొట్టును కలిగినది

వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా ।
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా ॥ 6 ॥
వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా – మన్మథుని గృహద్వార తోరణంలా మంగళకరమైన ముఖమును కలది
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా – ముఖమనే కాంతి ప్రవాహంలో ఈదులాడుతున్న చేపల వంటి కళ్లు కలది

నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా ।
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా ॥ 7 ॥
నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా – కొత్తగా వికసించిన సంపెంగ పువ్వు వంటి అందమైన ముక్కు కలది
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా – నక్షత్రాల కాంతిని కూడా వెనక్కి నెట్టేంతటి ప్రకాశవంతమైన ముక్కుపుడక ధరించినది

కదంబ మంజరీకౢప్త కర్ణపూర మనోహరా ।
తాటంక యుగళీభూత తపనోడుప మండలా ॥ 8 ॥
కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరా – కదంబ పూల గుత్తులను చెవి దుద్దులుగా ధరించిన సుందరి
తాటంక యుగళీభూత తపనోడుప మండలా – సూర్య చంద్రులను తన రెండు చెవులకు కమ్మలుగా ధరించిన తల్లి

పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః ।
నవవిద్రుమ బింబశ్రీః న్యక్కారి రదనచ్ఛదా ॥ 9 ॥
పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః – పద్మరాగమణుల అద్దాల కన్నా మిన్నగా మెరిసిపోయే బుగ్గలు కలిగినది
నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా – దొండపండు మరియు పగడాల ఎరుపును మించిన అందమైన పెదవులు కలది

శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా ।
కర్పూరవీటి కామోద సమాకర్షద్దిగంతరా ॥ 10 ॥
శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా – జ్ఞానమనే మొలకల వలె తెల్లగా మెరిసే పళ్ళ వరుస కలిగినది
కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా – నోటిలోని తాంబూల సుగంధం దిక్కులన్నిటికీ వ్యాపించేలా చేసే తల్లి

నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్ఛపీ ।
మందస్మిత ప్రభాపూర మజ్జత్-కామేశ మానసా ॥ 11 ॥
నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపీ – అమ్మవారి కంఠస్వరం సరస్వతీ దేవి వీణ (కచ్ఛపి) కన్నా మధురమైనది
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా – చిరునవ్వు అనే కాంతితో శివుని మనస్సును గెలుచుకున్నది

అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా ।
కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంథరా ॥ 12 ॥
అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితా – సాటిలేని అందమైన గడ్డం కలిగినది
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరా – శివుడు స్వయంగా కట్టిన మంగళసూత్రంతో శోభిల్లే మెడ కలిగినది

కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా ।
రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా ॥ 13 ॥
కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా – బంగారు మురుగులు, భుజకీర్తులతో మనోహరంగా ఉన్న చేతులు కలది
రత్నగ్రైవేయ చింతాక లోలముక్తా ఫలాన్వితా – రత్నాల హారాలు, మెడలో ఊగులాడే ముత్యాల పతకాలు ధరించినది

కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ ।
నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ ॥ 14 ॥
కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణ స్తనీ – కామేశ్వరుని ప్రేమ అనే విలువైన రత్నానికి, తన హృదయ సౌందర్యాన్ని బదులుగా ఇచ్చిన తల్లి
నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ – నాభి అనే పాదు నుండి వచ్చిన రోమావళి అనే తీగకు కాసిన ఫలాల వంటి వక్షస్థలము కలది

లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా ।
స్తనభారదళన్-మధ్యపట్టబంధవళిత్రయా ॥ 15 ॥
లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా – చూడటానికి కూడా వీలుకాని అంత సన్నని నడుము కలిగినది
స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా – వక్షస్థల భారానికి నడుము విరిగిపోకుండా కట్టిన పట్టీల వంటి మూడు మడతలు కడుపుపై కలది

అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్-కటీతటీ ।
రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా ॥ 16 ॥
అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ – సూర్యోదయ కాంతి వంటి ఎర్రని పట్టువస్త్రం ధరించిన కటి భాగము కలది
రత్నకింకిణికారమ్య రశనాదామ భూషితా – రత్నాలు పొదిగిన చిరుగంటల అందమైన ఒడ్డాణపు త్రాటి చేత అలంకరింపబడింది

కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా ।
మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా ॥ 17 ॥
కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా – శివునికి మాత్రమే తెలిసిన అత్యంత మృదువైన ఊరువు భాగం (తొడలు) కలిగినది
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా – మాణిక్యపు కుప్పల వలె ప్రకాశించే మోకాళ్లు కలిగినది

ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా ।
గూఢగుల్భాకూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా ॥ 18 ॥
ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభ జంఘికా – పట్టుపురుగుల వలె మృదువుగా, మన్మథుని బాణాల పొది వలె అందమైన పిక్కలు కలది
గూఢగుల్ఫా – బయటకు కనపడనీయకుండా లోపలికి ఒదిగి ఉన్న చీలమండలు కలిగినది
కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా – తాబేలు వెన్ను భాగం వలె ఎత్తుగా, అందంగా ఉన్న పాదాల పైభాగం కలది

నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా ।
పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా ॥ 19 ॥
నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా – గోళ్ల వెలుగుతో భక్తుల చీకటి వంటి అజ్ఞానాన్ని తొలగించేది
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా – పద్మాల అందాన్ని కూడా వెనక్కి నెట్టేంతటి కాంతివంతమైన పాద ద్వయం కలది

శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా ।
మరాళీమందగమనా మహాలావణ్యశేవధిః ॥ 20 ॥
శింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజా – నడుస్తుంటే మణిమయమైన అందెలు మధురంగా ధ్వనించే పాద పద్మాలు కలది
మరాళీ మందగమనా – రాజహంస నడక వంటి అతి గంభీరమైన, మందమైన నడక కలది
మహాలావణ్య శేవధిః – అనంతమైన అందానికి ఒక నిధి వంటిది

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 

భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

3.7 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top