శ్రీ స్కందమాత దేవి – కుమారస్వామిని ఒడిలో ధరించిన తల్లి
దుర్గామాత యొక్క ఐదవ స్వరూపము స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి. కుమారస్వామి తల్లి కాబట్టి పార్వతీదేవిని స్కందమాత అని పిలుస్తారు. నాలుగు చేతులతో ఉండే ఈ స్కందమాత సింహవాహనంపై ఉంటుంది.
స్కందమాతకు నాలుగు చేతులు ఉంటాయి. రెండు చేతుల్లో కమలాలను ధరించి ఉంటుంది. ఒక చేయి అభయముద్రలో ఉండగా, ఒడిలో బాలస్కందుడిని కూర్చోబెట్టుకుని అమ్మవారు దర్శనమిస్తారు.
అమ్మవారు తెల్లని కాంతితో ప్రకాశిస్తూ, కమలంపై కూర్చుని దర్శనమిస్తారు. అందుకే ఆమెను పద్మాసన దేవి అని కూడా పిలుస్తారు. సింహం ఆమె వాహనం. ఈ అమ్మవారు మోక్ష, శక్తి, ఐశ్వర్య ప్రదాయినిగా భక్తులు నమ్ముతారు. స్కందమాతను ఉపాసించేవాడు నిరక్షరాస్యుడైనా జ్ఞానం ప్రసాదిస్తుందని పురాణోక్తి. తనను పూజించే భక్తుల కోరికలన్నిటినీ తీర్చే అమ్మవారు ఈమె. ఈ అమ్మవారిని పూజించినప్పుడు, ఆమె ఒడిలో ఉన్న ఆమె కుమారుడు స్కందుడు కూడా భక్తునిచేత పూజింపబడతాడు. దాంతో ఆ ఇద్దరి ఆశీస్సులూ వస్తాయని భక్తుల నమ్మకం. స్కందమాతా దుర్గా దేవిని పూజిస్తే జీవితం చివర్లో తప్పకుండా మోక్షం లభిస్తుందని పురాణోక్తి. ఈ దేవి అగ్నికి అధిదేవత కూడా.
స్కందపురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది. శివతేజంతో కుమారస్వామికి కృత్తికలు జన్మనిస్తారు. తారకాసురునిపై యుద్ధం ప్రకటించి, దేవతల సేనకు అధ్యక్షుడై అతణ్ణి సంహరించడానికి సిద్ధమైన సమయంలో, పార్వతీదేవి దుర్గా అవతారం పొంది, కుమారస్వామిని దీవిస్తుంది. అలా దేవసేనకు అధ్యక్షుడై తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి. తిరిగి శుంభ, నిశుంభులతో యుద్ధ సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాతా దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి అసురులను చంపుతుంది.
ఈ రోజున సాధకుని మనస్సు విశుద్ధి చక్రంపై కేంద్రీకృతమవుతుందని ఆధ్యాత్మికంగా చెబుతారు. ఈ స్థితిలో మనస్సులోని చెడు ఆలోచనలు, అశాంతి, చంచలత్వం తగ్గి, మనస్సు ప్రశాంతంగా మారుతుందని విశ్వసిస్తారు. ఈ అమ్మవారి ఉపాసకులు దైవ శోభతో ప్రకాశిస్తుంటారట.
అందుకే నవరాత్రుల్లో ఐదవ రోజున స్కందమాత అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి, ఆమె అనుగ్రహాన్ని కోరుకుందాం. అమ్మవారి కృపతో మన జీవితంలో సుఖశాంతులు, ధైర్యం, శుభఫలితాలు కలగాలని ప్రార్థిద్దాం.
ధ్యాన శ్లోకం
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ || 5 ||
అర్థం:
ఎల్లప్పుడూ సింహంపై ఆసీనురాలై, తన రెండు చేతుల్లో కమలాలను ధరించి దర్శనమిచ్చే, కీర్తివంతురాలైన స్కందమాత దేవి నాకు ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదించాలి.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏








