బతుకమ్మ
పూలనే దేవతగా కొలిచే పండుగ…
తొమ్మిది రోజుల పాటు ఆడిపాడే పండుగ…
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయ పండుగ — బతుకమ్మ!
అసలు బతుకమ్మను ఎందుకు జరుపుకుంటారు?
ఈ పండుగ వెనుక ఉన్న కథ ఏమిటి?
తొమ్మిది రోజుల నైవేద్యాల ప్రత్యేకత ఏమిటి?
ఈ ఆసక్తికరమైన విశేషాలన్నీ తెలుసుకుందాం.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, జీవన విధానానికి ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. బంధాలను, అనుబంధాలను గుర్తుచేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్తూ, తెలంగాణా ఆడబిడ్డలంతా సంబరంగా జరుపుకునే వేడుక పండుగ బతుకమ్మ. మరి బతుకమ్మ పండుగను ఎలా జరుపుకుంటారు? దాని వెనకాల ఉన్న కథ ఏంటి? పూలను దేవతగా ఎందుకు కొలుస్తారు? ఏమేం నైవేద్యాలు పెడతారు? వంటి విశేషాలను తెలుసుకుందాం.
బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి, గౌరీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం. అంటువ్యాధులు, ప్రకృతి విపత్తులనుంచి కాపాడాలని వేడుకుంటూ ప్రకృతిని గౌరీదేవిగా తలచి ఆటపాటలతో పూజించే వేడుక. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు రోజు వచ్చే పితృ అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మ గా ప్రారంభమయ్యే సంబరాలు- తొమ్మిది రోజుల పాటు సాగి, దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మగా, గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి.
బతుకమ్మ పండుగకు సంబంధించిన చరిత్రను పరిశీలిస్తే, మనకు అనేక ఆధారాలు కనిపిస్తాయి. కొందరు వ్యక్తులు గొల్ల రాజుల కాలంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి అని చెప్తారు. మరికొందరు మాంధాత కాలంలోనే ఈ పండుగ మొదలయ్యింది అని చెబుతారు. అందుకు ప్రతీకగా సిద్దిపేట హుస్నాబాద్ సమీపంలోని మాందాపురం లో బతుకమ్మకు సంబంధించిన పురాతన శిల్పాలు కనిపిస్తాయి. వీటిలో పూల బతుకమ్మ శిల్పాలు ఉండడం విశేషం. బతుకమ్మ సంబరాలకు సంబంధించి పురాణ కథలు కూడా ఉన్నాయి. దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ దేశరాజు ధర్మాంగుడు, అతని సతీమణి సత్యవతి సంతానం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేశారు. వారి భక్తికి ప్రసన్నురాలై ప్రత్యక్షమైన లక్ష్మీదేవిని తమకు కూతురుగా జన్మించమని కోరుకున్నారు. వారి కోరిక మన్నించి లక్ష్మీదేవి ఆ దంపతులకు కూతురుగా పుడుతుంది. అప్పుడు రాజ్యంలోని వేద పండితులు అందరూ కోటకు వచ్చి ఆ బిడ్డను కలకాలం బతుకమ్మ అని ఆశీర్వదించారు. అప్పటినుంచి బతుకు ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలుస్తారు అని చరిత్ర చెబుతోంది.
ఆత్మ త్యాగంతో తెలంగాణలో ఓ పల్లెను వరద బారినుంచి కాపాడిన త్యాగమూర్తి బతుకమ్మ అని కొందరు, మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్ఛపోయిన అమ్మవారికి మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నం అని మరికొందరు చెబుతారు. ఓ రైతు దంపతులకు ఏడుగురు పిల్లలు పుట్టి చనిపోయారని ఎనిమిదవ బిడ్డకు బతుకమ్మ అని పేరు పెట్టడంతో ఆమె బతికింది అనేది మరో కథ.
గౌరిదేవిని పూజించే బతుకమ్మకు సంబంధించిన మరో కథనంలో- గంగా గౌరీ సంవాదంలో భాగంగా “శివుడు తలపై గంగమ్మని పెట్టుకోవడం వల్ల అందరూ గంగను పూజిస్తున్నారు” అని పార్వతీదేవి తన తల్లితో చెప్తుంది. అయితే పార్వతీదేవి తల్లి పార్వతిని ఓదార్చి, గంగ మీద నిన్ను పూల తెప్పలా తేలించి పూజ చేసేలా చేస్తాను అని చెబుతుంది. దాని తరువాత బతుకమ్మగా పార్వతి దేవిని పూజిస్తే పాడిపంటలు సమృద్ధిగా పండుతాయని ప్రచారం కాగా అలా బతుకమ్మ పండుగ ప్రాచుర్యంలోకి వచ్చింది అని కొందరు చెబుతుంటారు. కాకతీయుల కాలంలో కరువు కాటకాలతో తీవ్ర దుర్భిక్షం నెలకొన్న సమయంలో తొమ్మిది రోజులపాటు పూలతో అమ్మవారిని బతుకమ్మగా పూజిస్తే కరువు కాటకాలు తీరి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారని కూడా చెబుతారు.
బతుకమ్మ సంబరాలలో భాగంగా- మహిళలు చక్కగా ముస్తాబై, అత్యంత భక్తి శ్రద్ధలతో తయారు చేసిన బతుకమ్మలను తీసుకుని, ఆలయాలలో వీధులలో అందరూ గుంపుగా కూడి సంబరాలు జరుపుకుంటారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సంబరాలలో పాలుపంచుకుంటారు. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించేలా జానపదాలను పాడుతూ ఈ పండుగ జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి ఉపయోగించే పూలకు కూడా ఒక విశేషం ఉంది. ఔషధ గుణాలు ఉన్న పువ్వులను బతుకమ్మలుగా పేర్చడం కోసం ఉపయోగిస్తారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి, సీతమ్మ జడలు, మల్లె, మందారం, తామర, పట్టుకుచ్చులు ఇలా అనేక రకాల పూలతో చక్కగా బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు. వర్షాకాలంలో చెరువులలోకి కొత్త నీరు చేరుతుంది. వాటిలోని క్రిములను నిర్మూలించడానికి ఎన్నో ఔషధ గుణాలతో నిండిన ఈ పువ్వులతో బతుకమ్మలను తయారుచేసి నిమజ్జనం చేస్తారు.
తెలంగాణలో బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా జరుగుతాయి. బతుకమ్మ వేడుకల్లో రోజుకొక విశిష్టత ఉంటుంది. తొమ్మిది రోజుల పాటు రోజుకు ఒక నైవేద్యం తయారు చేస్తారు.
మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ
మహాలయ అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో ఈ రోజును పితృ అమావాస్య అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారుచేస్తారు. పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని భావించి, మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా వ్యవహరిస్తారు. ఈరోజు కంటే ఒక రోజు ముందుగానే బతుకమ్మను అలంకరించడానికి పూలు సేకరిస్తారు. అవి మరుసటి రోజుకు వాడిపోకుండా నీళ్లలో వేసి, తర్వాత రోజు బతుకమ్మగా పేరుస్తారు.
రెండవ రోజు అటుకుల బతుకమ్మ
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మ
ఈ రోజున మహిళలు ముద్దపప్పును పాలు, బెల్లంతో కలిపి నైవేద్యంగా తయారు చేసి బతుకమ్మకు సమర్పిస్తారు.
నాలుగవ రోజు నానే బియ్యం బతుక మ్మ
నానబెట్టిన బియ్యాన్ని మెత్తగా రుబ్బి అందులో పాలు, బెల్లం కలిపి బియ్యపు చలిమిడి తయారు చేసి గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆపై నానె బియ్యం నైవేద్యాన్ని పంచుతారు.
ఐదవ రోజు అట్ల బతుకమ్మ
ఐదవ రోజు అట్ల బతుకమ్మలో భాగంగా అమ్మవారికి నానబెట్టిన బియ్యం, పప్పుతో చేసిన అట్లు నైవేద్యంగా సమర్పించి ఆడపిల్లలకు వాయినంగా ఇస్తారు.
ఆరో రోజు అలిగిన బతుకమ్మ
ఈరోజు నైవేద్యం ఏమీ సమర్పించరు. దేవీభాగవతం ప్రకారం నవరాత్రుల్లో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాల్లో రాక్షస సంహారం చేసిందని చెబుతారు. భండాసురుణ్ని, చండముండల్ని సంహరించిన తర్వాత అలసిపోయిన అమ్మవారికి ఒక రోజు విశ్రాంతి ఇవ్వాలని ఆరోనాడు బతుకమ్మ ఆడరు. దానినే అలసిన బతుకమ్మ అని పిలుస్తారు. కాలక్రమంలో అదే అలిగిన బతుకమ్మగా స్థిరపడింది.
ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ
బియ్యం పిండిని బాగా వేయించి, వేప పండ్లు లాగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ
బియ్యం పిండి, నువ్వులు, బెల్లం, వెన్న లేదా నెయ్యి కలిపి వెన్నముద్దల నైవేద్యం తయారుచేస్తారు.
తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ
దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. ఈ తొమ్మిదవ రోజు పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం- అని ఐదు రకాల నైవేద్యాలు తయారు చేసి, అమ్మవారికి నివేదిస్తారు. తొమ్మిది రోజులు అమ్మవారికి నైవేద్యం పెట్టే వాటిలో రకరకాల తృణధాన్యాలను వినియోగిస్తారు. బతుకమ్మను పేర్చడం ఒక కళ. తూర్పు లేదా ఉత్తర దిశకు అభిముఖంగా కూర్చుని, బతుకమ్మను అమరుస్తారు. రాగి పళ్ళెంలో గుమ్మడి లేదా తంగేడు ఆకులను పరిచి, ఆ ఆకులపై పసుపు కుంకుమలు అక్షతలు చల్లి, వలయంగా తంగేడు పూలను ముందుగా అమరుస్తారు. వివిధ రంగుల పూలను ఒక వరుస మీద మరొక వరుసగా పెడుతూ గోపురంలా పేరుస్తారు. ముఖ్యంగా బతుకమ్మను పేర్చడానికి తంగేడు, గునుగు, కట్ల పూలను ఎక్కువగా ఉపయోగిస్తారు. పువ్వులతో చక్కగా బతుకమ్మను వలయాకారంగా పేర్చుతారు. పసుపును మంగళానికి, పవిత్రతకు, శుభానికి ప్రతీకగా భావిస్తారు. పసుపుతో గౌరమ్మను తయారు చేసి, బతుకమ్మపై ప్రతిష్ఠించి గౌరీదేవి స్వరూపంగా పూజిస్తారు.
బతుకమ్మ పక్కనే చిన్న బతుకమ్మ రూపొందిస్తారు. దానిపై తమలపాకులో గాని, చిక్కుడు ఆకులో కానీ పసుపు ముద్ద గౌరమ్మను పెట్టి, మధ్యన నొక్కి రెండు శిఖరాలు గా తయారుచేస్తారు. ఇవి శివపార్వతులకు, అర్థనారీశ్వర తత్వానికి ప్రతీకలు. వాటికి వస్త్రాలుగా పత్తితో అలంకరించి, పూజా మందిరం దగ్గర పెట్టి, ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు. తమ కుటుంబాలు సుఖసంతోషాలతో సంపదతో వర్ధిల్లేలా అనుగ్రహించాలి అని ప్రార్థిస్తారు. సాయంత్రం సమయంలో ఆడపడుచులు అందరూ చక్కగా మూస్తాబై, కొత్త బట్టలు ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి, వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, ప్రేమతో మానవహారంలా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు.
ఈ పాటల్లో గౌరీదేవి కథలు, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, తెలంగాణ గ్రామీణ జీవితం, వ్యవసాయం, కుటుంబ బంధాలు, వీరుల కథలు, స్త్రీల జీవన అనుభవాలు ప్రతిబింబిస్తాయి.
అందుకే బతుకమ్మ పాటలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద జీవనానికి ప్రతీకగా నిలిచిన అమూల్యమైన సాంస్కృతిక సంపదగా భావించబడుతున్నాయి.
చీకటి పడే వేళకి ఆడపడుచులు అందరూ బతుకమ్మలను తలపై పెట్టుకుని, దగ్గరలోని చెరువు దగ్గరికి ఊరేగింపుగా వెళ్తారు. ఈ ఊరేగింపు- అందంగా అలంకరించుకున్న స్త్రీలు, బతుకమ్మలతో, వాయిద్యాలతో కన్నుల పండుగగా ఉంటుంది. జలాశయానికి చేరుకున్న మహిళలు బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ ఆ తర్వాత బతుకమ్మలను చెరువులో గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసి, గౌరమ్మను మంగళ సూత్రాలకు పూసుకొని, వారి కుటుంబాలను చల్లగా చూడమని వేడుకుంటారు. తర్వాత ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం, మొక్కజొన్నలు లేదా వేరుశనగ పెసర విత్తనాలను దోరగా వేయించి పిండి చేసి బెల్లం లేదా పంచదార కలిపిన సత్తు పిండిని, ఇంకా చక్కెర రొట్టెతో తయారు చేసిన మలీద అనే వంటకాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని, ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ ఊరు ఆ ఊరు అన్న తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. లక్షలాదిగా మహిళలు పట్టు చీరలు కట్టుకుని, పుత్తడి బొమ్మల్లా ముస్తాబై, సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. పేద ధనిక అనే తారతమ్యం లేకుండా, ప్రతి ఒక్కరూ ఒక చోటచేరి ఆడిపాడి సంతోషంగా గడుపుతారు. ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు తెలిపేలా బతుకమ్మ పాటలను పాడుతారు. బతుకమ్మ పాటలలో పురాణ ఇతిహాస కథలు మొదలుకొని తెలంగాణ వీరుల కథలు, జానపద ఇతివృత్తాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తుంది.
బతుకమ్మను ప్రధానంగా సహజమైన పూలతో తయారు చేయడం మన సంప్రదాయంలో ప్రకృతికి ఇచ్చే గౌరవాన్ని తెలియజేస్తుంది. నేటి కాలంలో ప్లాస్టిక్, కృత్రిమ అలంకరణలకు దూరంగా ఉండి, సహజమైన పూలతో బతుకమ్మను తయారు చేసి, చెరువులు కాలుష్యం కాకుండా జాగ్రత్తగా నిమజ్జనం చేయడం ద్వారా పండుగతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు.
తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ స్థిరపడినా తమ సంస్కృతి, సంప్రదాయాలను మరచిపోకుండా బతుకమ్మను ఘనంగా జరుపుకుంటున్నారు. విదేశాల్లోనూ తెలంగాణ కుటుంబాలు, సంఘాలు కలిసి బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తూ, తమ సంస్కృతిని తరువాతి తరాలకు పరిచయం చేస్తున్నారు. ఇంతచక్కని అందరూ సమిష్టిగా జరుపుకునే అందమైన అద్భుతమైన పండుగ ప్రపంచంలోనే బతుకమ్మ ఒక్కటే అని చెప్పడం తెలంగాణకే గర్వకారణం.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏








