అన్నపూర్ణా దేవి చేతిలో అన్నపాత్రతో కరుణామయ రూపం

అన్నపూర్ణా స్తోత్ర౦

అన్నపూర్ణా స్తోత్ర౦

“అన్నపూర్ణా స్తోత్రం” అనేది అన్నపూర్ణాదేవిని స్తుతించే పవిత్రమైన స్తోత్రం. ఈ దేవి పార్వతీ దేవి అవతారంగా భావించబడుతూ, భక్తులకు అన్నం, ఐశ్వర్యం మరియు సంపూర్ణతను ప్రసాదించే దైవంగా పూజించబడుతుంది. ఈ స్తోత్రం ప్రధానంగా ఆది శంకరాచార్యులచే రచించబడినదిగా ప్రసిద్ధి.

ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించడం వల్ల ఆహారాభావం తొలగి, సంపద, శాంతి మరియు సంతృప్తి లభిస్తాయని విశ్వాసం. ఇది కుటుంబంలో ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు ఆనందాన్ని పెంపొందించే శక్తిని కలిగినదిగా భావిస్తారు.

 నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ।
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 1 ॥

నిత్యమైన ఆనందమునిచ్చుదానవు, వరములను, అభయమును  ప్రసాదించుదానవు, సముద్రమంత సౌందర్యమును కలదానవు, ఘోరమైన పాపములనన్నిటినీ కడిగి వేయుదానవు, హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.

నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ
ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ ।
కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 2 ॥

వివిధ రత్నములతో కూడిన విచిత్రాభరణములను ధరించినదానవు, బంగారు వస్త్రములను కట్టుకున్నదానవు, వక్షస్థలముపై ప్రకాశించు ముత్యాల హారములు ధరించిన దానవు, కుంకుమ- అగురులు పూసుకొనుటచే సువాసనలు వెదజల్లు శరీరము కలదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.

 యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ ।
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 3 ॥

యోగముచే పొందు ఆనందమును కలిగించుదానవు, శత్రువులను నాశనం చేయు దానవు, ధర్మనిష్టను ఏర్పరచుదానవు, చంద్రుడు- సూర్యుడు- అగ్నులతో సమానమైన కాంతి ప్రవాహమైనదానవు, మూడులోకములను రక్షించుదానవు, సమస్త్యైశ్వర్యములను ప్రసాదించుదానవు, తపస్సులకు ఫలమునిచ్చుదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.

కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ ।
మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 4 ॥

కైలాస పర్వత గుహయందుడు దానవు, తెల్లని దానవు, ఉమాదేవివి, శంకరుని భార్యవు, కుమారివి, వేదార్థమును బోధించు దానవు, ఓంకార బీజాక్షర స్వరూపము కలదానవు, మోక్షద్వారపు తలుపులను తెరచెడి దానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.

 దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాణ్డభాణ్డొదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాఙ్కురీ|
శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||5||

 కనబడీ కనబడని మహిమలు కలదానవు, గర్భమునందు బ్రహ్మాండములను మోయుచున్న దానవు, లీలానాటకమునకు సూత్రధారివి, విజ్ఞానదీపమును వెలిగించుదానవు, పరమేశ్వరుని ఆనందింపచేయుదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.

ఉర్వీసర్వజయేశ్వరీ భగవతీ [జయకరీ] మాతా కృపాసాగరీ
వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ ।
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 6 ॥

 భూమియందలి సమస్త జనులకు నాయకురాలవు, విజయమునిచ్చుదానవు, తల్లివి, దయాసముద్రమైనదానవు, స్త్రీమూర్తివి, నల్లని కురులు కలదానవు, నిత్యము అన్నదానము చేయుదానవు, సాక్షాత్తుగా మోక్షమునిచ్చుదానవు, ఎల్లప్పుడు శుభమును కలిగించుదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.

ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ ।
స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 7 ॥

’అ’ కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరముల సముదాయమైన దానవు, పరమేశ్వరునకు ప్రియురాలవు, శంకరుని భార్యవు, కాశ్మీర త్రిపురేశ్వరివి, మూడుకన్నులు కలదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.

 దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ
వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ ।
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 8 ॥

దేవివి, విచిత్రములైన సర్వరత్నములతో అలంకరింపబడినదానవు, దక్షుని కుమార్తెవు, సుందరివి, యువతివి, మధురమైన పాలిండ్లు కలదానవు, ప్రియమునిచ్చుదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.

 చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ
చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ
మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 9 ॥

కోట్లాది చంద్రులు, సూర్యులు, అగ్నులతో సమానముగా ప్రకాశించుదానవు, సూర్యబింబము వలే ఎర్రనైన క్రింది పెదవి కలదానవు, చంద్రుడు, సూర్యుడు, అగ్నుల వలే ప్రకాశించు కుండలములు ధరించిన దానవు, చంద్రుడు, సూర్యుడు వంటి వర్ణము కలదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.

 క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ ।
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 10 ॥

వీరులను రక్షించుదానవు, మహాభయంకరివి, తల్లివి, దయా సముద్రమైన దానవు, అందరికీ ఆనందము కల్గించు దానవు, ఎల్లప్పుడు శుభము కల్గించుదానవు, విశ్వమునకు రాణివి, శోభిల్లుదానవు, దక్షప్రజాపతికి (యాగనాశనము ద్వారా) దుఃఖమును కల్గించుదానవు, సుఖము నిచ్చుదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే ।
జ్ఞాన-వైరాగ్య-సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ ॥ 11 ॥

ఓ అన్నపూర్ణా| ఎల్లప్పుడు పూర్ణముగా ఉండు తల్లి| శంకరుని ప్రాణవల్లభురాలా| పార్వతీ| జ్ఞానము, వైరాగ్యము సిద్ధించుటకు భిక్షపెట్టుము.

 మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః ।
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం ॥ 12 ॥

తల్లి పార్వతీదేవి, తండ్రి పరమేశ్వరుడు, బంధువులు శివభక్తులు, మూడులోకములు స్వదేశము.

సర్వ-మంగళ-మాంగళ్యే శివే సర్వార్థ-సాధికే ।
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే ॥ 13 ॥

ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ అన్నపూర్ణా స్తోత్రమ్ ।

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top