మూక పంచశతి పాదారవిందశతకం 21-30 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 21-30 శ్లోకాలు

మూక పంచశతి పాదారవింద శతకం శ్లోకాలు అనేది మూక కవి రచించిన ప్రసిద్ధ భక్తి స్తోత్రంలో ఒక పవిత్ర భాగం. ఇందులో కామాక్షి దేవి పాదారవిందాల మహిమను అద్భుతంగా వర్ణించారు. ఈ శతకం భక్తి, సమర్పణ భావాన్ని పెంచుతూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది.

ఈ శతకాన్ని భక్తితో పఠించడం ద్వారా మనసుకు ప్రశాంతత, జ్ఞానం, ఐశ్వర్యం మరియు దైవ అనుగ్రహం లభిస్తాయని విశ్వాసం. మూక కవి దైవ కృపతో మౌనస్థితి నుండి కవిత్వాన్ని పొందిన నేపథ్యం ఈ స్తోత్రానికి ప్రత్యేకతను ఇస్తుంది. పాదారవింద ధ్యానం ద్వారా భక్తుడు సంపూర్ణ సమర్పణ భావాన్ని పొందుతూ మోక్ష మార్గంలో ముందుకు సాగుతాడు.

నమస్యాసంసజ్జన్ నముచిపరిపంథిప్రణయినీ-
నిసర్గప్రేంఖోలత్ కురలకులకాలాహిశబలే ।
నఖచ్ఛాయాదుగ్ధోదధిపయసి తే వైద్రుమరుచాం
ప్రచారం కామాక్షి ప్రచురయతి పాదాబ్జసుషమా ॥21॥

అమ్మా! ఇంద్రపత్ని శచీదేవి, నీ పాదములకు ప్రణమిల్లినపుడు, ఆమె ముంగురులు, పాలసముద్రమువంటి నీ పాదములపై తేలియాడుచున్న నాగులవలే కనిపించుచున్నవి. ఇక నీ ఎర్రని పాదముల కాంతి- క్షీరసముద్రముపై అనేకమైన పగడములవలే ప్రతిబింబించుచున్నది.

కదా దూరీకర్తుం కటుదురితకాకోలజనితం
మహాంతం సంతాపం మదనపరిపంథిప్రియతమే ।
క్షణాత్తే కామాక్షి త్రిభువనపరీతాపహరణే
పటీయాంసం లప్స్యే పదకమలసేవామృతరసమ్ ॥22॥

శివ ప్రియా!  ఓ  కామాక్షీ!  పాపకృత్యములచే  బాధలు కలిగినప్పుడు దానినుండి దుఃఖము కలుగుతుంది. ఈ దుఃఖమును దూరము చేయడానికి నీ పాదసేవామృత పానమే శరణ్యము. ఆ భాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుంది తల్లీ,

యయోః సాంధ్యం రోచిః సతతమరుణిమ్నే స్పృహయతే
యయోశ్చాంద్రీ కాంతిః పరిపతతి దృష్ట్వా నఖరుచిమ్ ।
యయోః పాకోద్రేకం పిపఠిషతి భక్త్యా కిసలయం
మ్రదిమ్నః కామాక్ష్యా మనసి చరణౌ తౌ తనుమహే ॥23॥

జగన్మాతా! ఎర్రని సంధ్యాప్రకాశము, నీ పాదములవంటి ఎరుపు రంగును వాంఛిస్తుంది. వెన్నెల అంటావా, నఖముల తెల్లని కాంతిని పొందాలనుకుంటుంది. లేలేత చిగురుటాకులు, నీ పాదములంత మృదువుగా ఉండాలనుకుంటాయి. అటువంటి పాదాలను నిత్యం స్మరిస్తాను.

జగన్నేదం నేదం పరమితి పరిత్యజ్య యతిభిః
కుశాగ్రీయస్వాంతైః కుశలధిషణైః శాస్త్రసరణౌ ।
గవేష్యం కామాక్షి ధ్రువమకృతకానాం గిరిసుతే
గిరామైదంపర్యం తవ చరణపద్మం విజయతే ॥24॥

ఓ గిరిరాజపుత్రీ!  జ్ఞానులు, తపస్సంపన్నులైనవారు జగత్తులోని ప్రతి విషయమును సత్యముగా కాక మిధ్యగానే భావిస్తారు. వేదములు మాత్రం నీ పాదములే గొప్పవని ఎలుగెత్తి ఘోషించుచున్నవి.

కృతస్నానం శాస్త్రామృతసరసి కామాక్షి నితరాం
దధానం వైశద్యం కలితరసమానందసుధయా ।
అలంకారం భూమేః మునిజనమనశ్చిన్మయ మహా-
పయోధేరంతస్స్థం తవ చరణరత్నం మృగయతే ॥25॥

అమ్మా! నాకు నీ పాద దర్శనము కాలేదు. నీ పాద పద్మములు ఎక్కడ ఉన్నాయో వెతుకగా, శాస్త్రజ్ఞానములో అమృత స్నానమాచరించి, రససారవంతమై, ఈ పృధ్వికే భూషణమై, మునీశ్వరుల హృదయమనే సముద్రములో దాగి ఉన్నాయవి.

మనోగేహే మోహోద్భవతిమిరపూర్ణే మమ ముహుః
దరిద్రాణీకుర్వన్ దినకరసహస్రాణి కిరణైః ।
విధత్తాం కామాక్షి ప్రసృమరతమోవంచనచణః
క్షణార్ధం సాన్నిధ్యం చరణమణిదీపో జనని తే ॥26॥

అమ్మా! నా మనసనే గృహము, మోహమనే అంధకారముతో నిండి ఉన్నది. కేవలము వేలాది సూర్యకాంతుల ప్రభలు కల నీ పాదములనే దీపకాంతులే, ఆ తిమిరమును తరిమి వేయగలవు. అటువంటి దీపములను నా మనసులో కొద్దిసేపైనా వెలిగించు తల్లీ,

కవీనాం చేతోవన్ నఖరరుచిసంపర్కి విబుధ-
స్రవంతీ స్రోతోవత్పటుముఖరితం హంసకరవైః ।
దినారంభశ్రీవన్నియతం అరుణచ్ఛాయసుభగం
మదంతః కామాక్ష్యాః స్ఫురతు పదపంకేరుహయుగమ్ ॥27॥

అరుణారుణ కాంతులతో ప్రకాశిస్తూ, చంద్రకాంతివలె చల్లనై, హంసధ్వనులను పోలిన అందెల సవ్వడులతో ప్రతిధ్వనిస్తూ, ప్రాతఃకాల శోభతో ఉండే నీ పాద పద్మములు నా మనసులో నిత్య నివాసముండుగాక.

సదా కిం సంపర్కాత్ ప్రకృతికఠినైర్నాకిముకుటైః
తటైర్నీహారాద్రేరధికం అణునా యోగిమనసా ।
విభింతే సంమోహం శిశిరయతి భక్తానపి దృశాం
అదృశ్యం కామాక్షి ప్రకటయతి తే పాదయుగలమ్ ॥28॥

ఓ కామాక్షీ! నీ పాదములకు దేవతలు నమస్కరించినపుడు, వారి కిరీటముల ఒరిపిడికి అవి రాటుదేలిపోయాయి. కానీ హిమాలయ సానువులపై సంచరించిన పాదములు, శీతలమై యోగుల హృదయములను చల్లబరుస్తూ, నిన్ను దర్శింప చేస్తున్నాయి.

పవిత్రాభ్యామంబ ప్రకృతిమృదులాభ్యాం తవ శివే
పదాభ్యాం కామాక్షి ప్రసభమభిభూతైః సచకితైః ।
ప్రవాలైరంభోజైరపి చ వనవాసవ్రతదశాః
సదైవారభ్యంతే పరిచరితనానాద్విజగణైః ॥29॥

అమ్మా! నీ పాదముల మృదుత్వముచే తిరస్కరించబడిన లేత ఆకులేమో అడవులలోనూ, కమలములేమో నీటిలోను వనవాస దీక్ష చేయదలచి, ముందుగా బ్రాహ్మణులను ఆరాధించసాగాయి.

చిరాద్దృశ్యా హంసైః కథమపి సదా హంససులభం
నిరస్యంతీ జాడ్యం నియతజడమధ్యైకశరణమ్ ।
అదోషవ్యాసంగా సతతమపి దోషాప్తిమలినం
పయోజం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్జయుగలీ ॥30॥

అమ్మా! ఈ లోకములోని పద్మములు నీ పాదముల ముందు దిగదుడుపే. ఎందుకంటే పద్మములు రాత్రి వేళలలో ముడుచుకుంటాయి. నీ పాదములు ఎప్పటికీ ముడుచుకోవు. పద్మములు ఎప్పుడు హంసలకు లభ్యమే. కానీ నీ పాదపద్మములు మాత్రం యోగులకు ఎప్పుడో కానీ దర్శనమివ్వవు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top