మూక పంచశతి పాదారవింద శతకం 31-40 | Kamakshi Devi Stotram Telugu

మూక పంచశతి పాదారవిందశతకం 31-40 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 31-40 శ్లోకాలు

మూక పంచశతి పాదారవింద శతకం శ్లోకాలు అనేది మూక కవి రచించిన ప్రసిద్ధ భక్తి స్తోత్రంలో ఒక పవిత్ర భాగం. ఇందులో కామాక్షి దేవి పాదారవిందాల మహిమను అద్భుతంగా వర్ణించారు. ఈ శతకం భక్తి, సమర్పణ భావాన్ని పెంచుతూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది.

ఈ శతకాన్ని భక్తితో పఠించడం ద్వారా మనసుకు ప్రశాంతత, జ్ఞానం, ఐశ్వర్యం మరియు దైవ అనుగ్రహం లభిస్తాయని విశ్వాసం. మూక కవి దైవ కృపతో మౌనస్థితి నుండి కవిత్వాన్ని పొందిన నేపథ్యం ఈ స్తోత్రానికి ప్రత్యేకతను ఇస్తుంది. పాదారవింద ధ్యానం ద్వారా భక్తుడు సంపూర్ణ సమర్పణ భావాన్ని పొందుతూ మోక్ష మార్గంలో ముందుకు సాగుతాడు.

సురాణామానందప్రబలనతయా మండనతయా
నఖేందుజ్యోత్స్నాభిః విసృమరతమః ఖండనతయా ।
పయోజశ్రీద్వేషవ్రతరతతయా త్వచ్చరణయోః
విలాసః కామాక్షి ప్రకటయతి నైశాకరదశామ్ ॥31॥

అమ్మా! నీ పాదములకు, చంద్రునికి ఎంతో సామ్యమున్నది. చంద్రుడు వెన్నెలను కురిపించడంతోపాటు, అమృత ధారలను కురిపించి దేవతలకు ఆహ్లాదం కలుగచేస్తాడు. నీ పాదాలు, తన నఖములతో చీకట్లను తరిమివేసి, దేవతలకు ఆనందాన్ని కలుగచేస్తాయి.

సితిమ్నా కాంతీనాం నఖరజనుషాం పాదనలిన-
చ్ఛవీనాం శోణిమ్నా తవ జనని కామాక్షి నమనే ।
లభంతే మందారగ్రథిత నవబంధూకకుసుమ-
స్రజాం సామీచీన్యం సురపురపురంధ్రీకచభరాః ॥32॥

జగన్మాతా, దేవతాస్త్రీలు నీ పాదములకు ఎందుకు నమస్కరిస్తారో తెలుసా? నీ పాదముల ఎరుపువర్ణము, నీ కాలి గోళ్ళ తెలుపువర్ణముతో మందార, మంకెన పుష్పములు రెండింటి కాంతులు కల పుష్పములు వారి సిగలోనికి లభిస్తాయి.

స్ఫురన్మధ్యే శుద్ధే నఖకిరణదుగ్ధాబ్ధిపయసాం
వహన్నబ్జం చక్రం దరమపి చ లేఖాత్మకతయా ।
శ్రితో మాత్స్యం రూపం శ్రియమపి దధానో నిరుపమాం
త్రిధామా కామాక్ష్యాః పదనలిననామా విజయతే ॥33॥

అమ్మా! విష్ణుమూర్తి స్వయముగా నీ పాదపద్మములుగా ఏర్పడినాడు. ఆయన మత్స్యావతార రూపముగా నీ పాదములో ఉండి, క్షీరసముద్ర జల మధ్యములో శ్రీ మహాలక్ష్మితో కలసి నీ పాదములలో నిలచాడు.

నఖశ్రీసన్నద్ధస్తబకనిచితః స్వైశ్చ కిరణైః
పిశంగైః కామాక్షి ప్రకటితలసత్పల్లవరుచిః ।
సతాం గమ్యః శంకే సకలఫలదాతా సురతరుః
త్వదీయః పాదోఽయం తుహినగిరిరాజన్యతనయే ॥34॥

హిమవత్పుత్రీ! ఓ కామాక్షీ! నీ పాద నఖముల కాంతులు పువ్వుల గుత్తులు అయితే, నీ పాదముల ఎర్రని కాంతి లేలేత చిగురుటాకులు. అవి భక్తులకు సకల కోరికలను తీరుస్తాయి. దీనిని గమనిస్తే, నీ పాదములు భక్తుల పట్ల, సాధువుల పట్ల కల్పవృక్షమే కదా.

వషట్కుర్వన్మాంజీర కలకలైః కర్మలహరీ-
హవీంషి ప్రోద్దండం జ్వలతి పరమజ్ఞానదహనే ।
మహీయాన్కామాక్షి స్ఫుటమహసి జోహోతి సుధియాం
మనోవేద్యాం మాతస్తవ చరణయజ్వా గిరిసుతే ॥35॥

జగన్మాతా! నీ పాదములు యజ్ఞ కుండములో హోమమును ఆచరించే కర్త అయితే, నీ పాదముల అందియల స్వరములు వేదమంత్రములు. జీవుల కర్మములే యజ్ఞములో వేసే హవిర్భాగములు. మండుతున్న అగ్ని జ్ఞానము. సద్గుణుల హృదయమే హోమవేదిక. యజ్ఞకర్త సాక్షాత్తు నీ రూపమే.

మహామంత్రం కించిన్ మణికటకనాదైర్మృదు జపన్
క్షిపందిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మనరజః ।
నతానాం కామాక్షి ప్రకృతిపటురుచ్చాట్య మమతా-
పిశాచీం పాదోఽయం ప్రకటయతి తే మాంత్రికదశామ్ ॥36॥

అమ్మా! నీ పాదములు ఒక మహా మాంత్రికుడు. ఆ పాదముల అందెల ధ్వనులు మహా మంత్రములుగా, ఆ మాంత్రికుడు, నీ పాదనఖముల తెల్లని భస్మముతో, మమత్వము అనే పిశాచమును తొలగిస్తాడు. దుష్టశక్తులనుండి రక్షణకు నీ పాదములే శరణము.

ఉదీతే బోధేందౌ తమసి నితరాం జగ్ముషి దశాం
దరిద్రాం కామాక్షి ప్రకటమనురాగం విదధతీ ।
సితేనాచ్ఛాద్యాంగం నఖరుచిపటేనాంఘ్రియుగలీ-
పురంధ్రీ తే మాతః స్వయమభిసరత్యేవ హృదయమ్ ॥37॥

మాతా! నా సాధనతో, నాలో ఉన్న అజ్ఞానము నెమ్మదిగా తొలగిపోతుండగా, జ్ఞానోదయం కలుగుతుండగా, నీ పాద నఖములనే తెల్లని వస్త్రముగా ధరించి, ఒక స్త్రీ మూర్తి నన్ను వెదకుతూ, స్వయముగా నా హృదయములో ప్రవేశిస్తుందమ్మా.

దినారంభః సంపన్నలిన విపినానామభినవో
వికాసో వాసంతః సుకవిపికలోకస్య నియతః ।
ప్రదోషః కామాక్షి ప్రకటపరమజ్ఞానశశినః
చకాస్తి త్వత్పాదస్మరణమహిమా శైలతనయే ॥38॥

ఓ హిమగిరితనయా! పద్మములు వికసించడానికి సూర్యకాంతి ఎంత అవసరమో, మాలో జ్ఞానసంపద వృద్ధి పొందటానికి నీ పాదములు అంతే అవసరము. నీ పాదములు వసంత ఋతువులో కోయిలలాగా, రాత్రిపూట ఉదయించే చంద్రునిలాగా మాలో జ్ఞానమును పెంపొందింపచేస్తాయి.

ధృతచ్ఛాయం నిత్యం సరసిరుహమైత్రీపరిచితం
నిధానం దీప్తీనాం నిఖిలజగతాం బోధజనకమ్ ।
ముముక్షూణాం మార్గప్రథనపటు కామాక్షి పదవీం
పదం తే పాతంగీం పరికలయతే పర్వతసుతే ॥39॥

మాతా! ముక్తిని పొందినవారు, సూర్యమండలము ద్వారా మోక్షమును చేరుకుంటారు. నీ పాదములు- ధృతి అనే ఛాయతో కలసి ధైర్యమును ప్రసాదించడమే కాక, జీవులకు జ్ఞానముతో పాటు మోక్షమార్గమును దర్శింపచేస్తాయి.

శనైస్తీర్త్వా మోహాంబుధిమథ సమారోఢుమనసః
క్రమాత్కైవల్యాఖ్యాం సుకృతిసులభాం సౌధవలభీమ్ ।
లభంతే నిఃశ్రేణీమివ ఝటితి కామాక్షి చరణం
పురశ్చర్యాభిస్తే పురమథనసీమంతిని జనాః ॥40॥

మాతా కామాక్షీ! పవిత్రమైన నీ మంత్రములను నిత్యము జపించే ఉపాసకులు సంసార సాగరమును దాటి, మోక్షపదవి అనే భవనమును అధిరోహించడానికి, నీ పాదములను నిచ్చెనలాగా ఆసరా చేసుకుంటారు.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

🕉️ మూక పంచశతి పాదారవిందశతకం తెలుగులో అర్థం

మూక పంచశతి పాదారవిందశతకం 1-10 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 11-20 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 21-30 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 31-40 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 41-50 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 51-60 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 61-70 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 71-80 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 81-90 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 91-103 శ్లోకాలు

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top