మూక పంచశతి పాదారవిందశతకం 91-103 శ్లోకాలు
మూక పంచశతి పాదారవింద శతకం శ్లోకాలు అనేది మూక కవి రచించిన ప్రసిద్ధ భక్తి స్తోత్రంలో ఒక పవిత్ర భాగం. ఇందులో కామాక్షి దేవి పాదారవిందాల మహిమను అద్భుతంగా వర్ణించారు. ఈ శతకం భక్తి, సమర్పణ భావాన్ని పెంచుతూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది.
ఈ శతకాన్ని భక్తితో పఠించడం ద్వారా మనసుకు ప్రశాంతత, జ్ఞానం, ఐశ్వర్యం మరియు దైవ అనుగ్రహం లభిస్తాయని విశ్వాసం. మూక కవి దైవ కృపతో మౌనస్థితి నుండి కవిత్వాన్ని పొందిన నేపథ్యం ఈ స్తోత్రానికి ప్రత్యేకతను ఇస్తుంది. పాదారవింద ధ్యానం ద్వారా భక్తుడు సంపూర్ణ సమర్పణ భావాన్ని పొందుతూ మోక్ష మార్గంలో ముందుకు సాగుతాడు.
పరిష్కుర్వన్మాతః పశుపతికపర్దం చరణరాట్
పరాచాం హృత్పద్మం పరమభణితీనాం చ మకుటమ్ ।
భవాఖ్యే పాథోధౌ పరిహరతు కామాక్షి మమతా-
పరాధీనత్వం మే పరిముషితపాథోజమహిమా ॥91॥
అమ్మా! నీ చరణములు పద్మముల ప్రకాశమును స్వంతము చేసుకున్నవి. అట్టి పాదములు మమత్వముతో పూర్తిగా నిండిపోయిన నా హృదయమును శుద్ధిపరచుగాక. వేదములచే సర్వదా కీర్తింపబడునవై, మునీశ్వరుల హృదయములలో స్థితమైనవి నీ పాదములు.
ప్రసూనైః సంపర్కాదమరతరుణీకుంతలభవైః
అభీష్టానాం దానాదనిశమపి కామాక్షి నమతామ్ ।
స్వసంగాత్కంకేలిప్రసవజనకత్వేన చ శివే
త్రిధా ధత్తే వార్తాం సురభిరితి పాదో గిరిసుతే ॥92॥
ఓ కామాక్షీ! నీ పాదములు దేవతాస్ర్రీల సిగలలోని అశోక పుష్పములను స్పృశించి, వారి కోరికలను తీర్చి, వారిని నిత్యపరిమళవంతులుగా చేయటం, కామధేనువువలే కోరికలను తీర్చడం, మొదలైన ప్రక్రియల వలన ఆ దేవతాస్త్రీలకు సురభియగుచున్నవి.
మహామోహస్తేనవ్యతికరభయాత్పాలయతి యో
వినిక్షిప్తం స్వస్మిన్నిజజనమనోరత్నమనిశమ్ ।
స రాగస్యోద్రేకాత్సతతమపి కామాక్షి తరసా
కిమేవం పాదోఽసౌ కిసలయరుచిం చోరయతి తే ॥93॥
అమ్మా! జ్ఞానులు, మోహమనే దొంగ తమ హృదయమనే రత్నమును దొంగిలిస్తాడేమో అనే భయముతో దానిని నీ పాదములనే పెట్టెలో దాచారు. ఆ రత్నము పట్ల జగన్మాత ఎంతో అనురాగము పెంచుకున్నది. ఇంతకంటే వారు కోరుకునేదేమున్నది తల్లీ!
సదా స్వాదుంకారం విషయలహరీశాలికణికాం
సమాస్వాద్య శ్రాంతం హృదయశుకపోతం జనని మే ।
కృపాజాలే ఫాలేక్షణమహిషి కామాక్షి రభసాత్
గృహీత్వా రుంధీథారస్తవ పదయుగీపంజరపుటే ॥94॥
మాతా! త్రినేత్రుని దేవేరీ! నా మనసు అనే చిలుక ఇహ భోగములకు అలవాటుపడి, ఆ గింజలను తినీ తినీ ఆయాసపడుతున్నది. ఆ చిలుకను నీ కరుణ అనే వలలో బంధించి, నీ చరణ పంజరములో కదలకుండా ఉంచు.
ధునానం కామాక్షి స్మరణలవమాత్రేణ జడిమ-
జ్వరప్రౌఢిం గూఢస్థితి నిగమనైకుంజకుహరే ।
అలభ్యం సర్వేషాం కతిచన లభంతే సుకృతినః
చిరాదన్విష్యంతస్తవ చరణసిద్ధౌషధమిదమ్ ॥95॥
జగన్మాతా! నేను అనేక విష జ్వరములతో బాధపడుతున్నాను. దానికి దివ్య ఔషధం నీ పాదములే. ఆ ఔషధం నా హృదయమనే అరణ్యంలోనే దాగి ఉంది. దానిని వెదికి బయటకు తీసి సేవించినపుడే, నా వ్యాధులు నయమవుతాయి.
రణన్మంజీరాభ్యాం లలితగమనాభ్యాం సుకృతినాం
మనోవాస్తవ్యాభ్యాం మథితతిమిరాభ్యాం నఖరుచా ।
నిధేయాభ్యాం పత్యా నిజశిరసి కామాక్షి సతతం
నమస్తే పాదాభ్యాం నలినమృదులాభ్యాం గిరిసుతే ॥96॥
అమ్మా! కామాక్షీ! సుందరమై, మధురమైన అందెల సవ్వడులతో, జ్ఞానుల హృదయములలో వసిస్తూ, నఖ కాంతులచే అజ్ఞానమును పారద్రోలుతూ, తన పతిదేవుడైన ఈశ్వరునిచే శిరోభాగమున భద్రపరచుకున్న నీ పాదములకు ప్రణమిల్లు తున్నాను.
సురాగే రాకేందుప్రతినిధిముఖే పర్వతసుతే
చిరాల్లభ్యే భక్త్యా శమధనజనానాం పరిషదా ।
మనోభృంగో మత్కః పదకమలయుగ్మే జనని తే
ప్రకామం కామాక్షి త్రిపురహరవామాక్షి రమతామ్ ॥97॥
జననీ! త్రిపురములను కూల్చిన ఈశ్వరుని దేవేరీ, మచ్చ లేని పౌర్ణమి చంద్రబింబమును పోలిన ముఖము కల మాతా! గిరిరాజపుత్రీ! ఇంద్రియములను, శమదమాదులను జయించిన వారికి మాత్రమే లభ్యమయ్యే నీ పాద పద్మములలో నా మనసు తుమ్మెదవలే విహరించుగాక!
శివే సంవిద్రూపే శశిశకలచూడప్రియతమే
శనైర్గత్యాగత్యా జితసురవరేభే గిరిసుతే ।
యతంతే సంతస్తే చరణనలినాలానయుగలే
సదా బద్ధం చిత్తప్రమదకరియూథం దృఢతరమ్ ॥98॥
మాతా! బాలచంద్రుని శిరసున ధరించి, నీ అతి మెల్లని పాదచలనముతో, ఇంద్రవాహనమైన ఐరావతమును సైతం నివ్వెరపరచిన కామాక్షీ! జ్ఞానులు, జ్ఞానమనే బలమైన త్రాళ్లతో, మదపుటేనుగు వంటి తమ మనసును నీ పాదములనే గుంజలకు కట్టివేస్తారు.
యశః సూతే మాతర్మధురకవితాం పక్ష్మలయతే
శ్రియం దత్తే చిత్తే కమపి పరిపాకం ప్రథయతే ।
సతాం పాశగ్రంథిం శిథిలయతి కిం కిం న కురుతే
ప్రపన్నే కామాక్ష్యాః ప్రణతిపరిపాటీ చరణయోః ॥99॥
శ్రీ కామాక్షీ దేవికి పాద నమస్కారము చేసినవారికి లభించనిదేమైనా ఉంటుందా! చిర యశస్సు, కవితా పటిమ, పరిపక్వమైన మనసు, మోహమనే పాశమును తొలగించుట, ఇలా ఆ తల్లి కరుణిస్తే ఏమైనా చేయగలదు.
మనీషాం మాహేంద్రీం కకుభమివ తే కామపి దశాం
ప్రధత్తే కామాక్ష్యాశ్చరణతరుణాదిత్యకిరణః ।
యదీయే సంపర్కే ధృతరసమరందా కవయతాం
పరీపాకం ధత్తే పరిమలవతీ సూక్తినలినీ ॥100॥
కామాక్షీ దేవి పాదములు ఉదయిస్తున్న సూర్య కిరణములు. అవి తూర్పు కొండలలో ఉదయించి, బుద్ధిని వికసింపచేసి, తద్వారా, వికసించిన బుద్ధినుండి, మధురమైన కవితా ధారలను వర్షింపచేస్తాయి.
పురా మారారాతిః పురమజయదంబ స్తవశతైః
ప్రసన్నాయాం సత్యాం త్వయి తుహినశైలేంద్రతనయే ।
అతస్తే కామాక్షి స్ఫురతు తరసా కాలసమయే
సమాయాతే మాతర్మమ మనసి పాదాబ్జయుగలమ్ ॥101॥
అమ్మా! నగరాజపుత్రీ! కామాక్షీ! ఈశ్వరుడు నిన్ను అనేక స్తోత్రములతో స్తుతించి, నీ కరుణను పొందిన తరువాతే త్రిపురములను కూల్చివేశాడు. జగన్మాతా, అలాగే, నా ప్రాణత్యాగ సమయములో, నీవు నీ చరణములను ప్రకాశింపచేస్తేనే కదా నేను ఆ పాదములలో ఐక్యమవగలను.
పదద్వంద్వం మందం గతిషు నివసంతం హృది సతాం
గిరామంతే భ్రాంతం కృతకరహితానాం పరిబృఢే ।
జనానామానందం జనని జనయంతం ప్రణమతాం
త్వదీయం కామాక్షి ప్రతిదినమహం నౌమి విమలమ్ ॥102॥
జననీ! కామాక్షీ! మెల్లగా సంచరిస్తూ, సత్పురుషుల హృదయములలో వసిస్తూ, వేదసంచారిణియై, శరణన్న భక్తులను కరుణించే నీ పాదాలకు నిత్యం సాష్టాంగముగా ప్రణమిల్లుతాను.
ఇదం యః కామాక్ష్యాః చరణనలినస్తోత్రశతకం
జపేన్నిత్యం భక్త్యా నిఖిలజగదాహ్లాదజనకమ్ ।
స విశ్వేషాం వంద్యః సకలకవిలోకైకతిలకః
చిరం భుక్త్వా భోగాన్పరిణమతి చిద్రూపకలయా ॥103॥
సకల జగములకు ముక్తిని ప్రసాదించే ఈ పాదారవింద శతకమును భక్తితో జపించేవారు, ఈ లోకములోని అందరిచే నమస్కరించబడతారు. కవీశ్వరులుగా సుప్రసిద్ధులవుతారు. భోగ భాగ్యములను పొంది అమ్మ పాదారవిందములలో ఐక్యమవు తారనేది సత్యం.
॥ ఇతి పాదారవిందశతకం సంపూర్ణమ్ ॥
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.
🕉️ మూక పంచశతి పాదారవిందశతకం తెలుగులో అర్థం
మూక పంచశతి పాదారవిందశతకం 1-10 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 11-20 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 21-30 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 31-40 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 41-50 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 51-60 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 61-70 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 71-80 శ్లోకాలు




