స్తోత్రాలకు తెలుగులో అర్థం » మూక పంచశతి స్తుతి శతకం 91-102 శ్లోకాలు
మూక పంచశతి స్తుతి శతకం 91-102 శ్లోకాలు | Kamakshi Devi Stotram Telugu

మూక పంచశతి స్తుతి శతకం 91-102 శ్లోకాలు

మూక పంచశతి స్తుతిశతకం అనేది కామాక్షీ అమ్మవారిని స్తుతిస్తూ రచించిన అత్యంత పవిత్రమైన స్తోత్రాలలో ఒకటి. దీనిని మహా భక్తుడు మూక కవి రచించారు. ఆయనకు కామాక్షీ దేవి కటాక్షంతో వాక్చాతుర్యం లభించి ఈ దివ్యమైన శ్లోకాలను రచించినట్లు పురాణ కథనం చెబుతుంది. మూక పంచశతి మొత్తం 500 శ్లోకాలతో ఉండి ఐదు శతకాలుగా విభజించబడింది. అందులో స్తుతిశతకం దేవిని స్తుతించే భాగంగా ఎంతో ప్రసిద్ధి పొందింది.

ఈ స్తుతిశతకం పఠించడం వల్ల విద్య, వాక్పటిమ, ఐశ్వర్యం, మనశ్శాంతి మరియు దేవి అనుగ్రహం లభిస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా కామాక్షి దేవి కృప పొందేందుకు ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తారు. ప్రతిరోజూ ఈ శ్లోకాలను పఠించడం వల్ల భక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయని విశ్వాసం.

తమోవిపినధావినం సతతమేవ కాంచీపురే
విహారరసికా పరా పరమసంవిదుర్వీరుహే ।
కటాక్షనిగలైర్దృఢం హృదయదుష్టదంతావలం
చిరం నయతు మామకం త్రిపురవైరిసీమంతినీ ॥91॥

కాంచీపురములో ఎల్లప్పుడూ విహరించే ఆసక్తి కలది, ఈశ్వరుని దేవేరి, అజ్ఞానము అనే కీకారణ్యములో ఘీంకరించే నా మనసనే మదగజమును నీ క్రీగంటి చూపులనే గొలుసులతో బంధించి జ్ఞానమనే వృక్షమునకు బంధించి వేయుము.

త్వమేవ సతి చండికా త్వమసి దేవి చాముండికా
త్వమేవ పరమాతృకా త్వమపి యోగినీరూపిణీ ।
త్వమేవ కిల శాంభవీ త్వమసి కామకోటీ జయా
త్వమేవ విజయా త్వయి త్రిజగదంబ కిం బ్రూమహే ॥92॥

ముజ్జగములను కాచే మాతా, కామాక్షీ నీవే చండికవు, నీవే చాముండవు, అక్షర స్వరూపిణివి, యోగినీ స్వరూపిణివి, శాంభవి, కామకోటి, జయ, విజయ, ఇలా నీ రూపములను ఎన్నిటినని నేను వర్ణించగలను.

పరే జనని పార్వతి ప్రణతపాలిని ప్రాతిభ-
ప్రదాత్రి పరమేశ్వరి త్రిజగదాశ్రితే శాశ్వతే ।
త్రియంబకకుటుంబిని త్రిపదసంగిని త్రీక్షణే
త్రిశక్తిమయి వీక్షణం మయి నిధేహి కామాక్షి తే ॥93॥

అమ్మా! నీవు అందరికంటే ఉన్నతురాలవు. ఓ జగజ్జననీ, నిన్ను శరణు కోరిన వారిని కరుణించి, జ్ఞాన భిక్షను ప్రసాదించి, మూడు జగములకు ఆశ్రయమైన నీవు నిత్యవు, విశ్వరూపిణివి, త్రినేత్రవు, త్రిమూర్తి స్వరూపిణివి, నీ కరుణారస దృష్టిని నాపై కురిపించు తల్లీ.

మనోమధుకరోత్సవం విదధతీ మనీషాజుషాం
స్వయంప్రభవవైఖరీవిపినవేదికాలంబినీ ।
సదా శిశిరితా కృపామధురసేన కంపాతటే
చరాచరవిధాయినీ చరతి కాపి చిన్మంజరీ ॥94॥

మాతా! కామాక్షీ! జ్ఞానుల హృదయమనే తుమ్మెదలకు ఆనందమును కలుగచేస్తూ, తమంత తాముగా ప్రకాశించే వేదములకు ఆధారభూతమై, కరుణా అనే మధువుతో కంపా తీరమును పూర్తిగా తడిపి, సకల జగత్తులను సృష్టించే నీవు, కంపానదీ తీరములో విహరిస్తున్నావు.

కలావతి కలాభృతో ముకుటసీమ్ని లీలావతి
స్పృహావతి మహేశ్వరే భువనమోహనే భాస్వతి ।
ప్రభావతి రమే సదా మహితరూపశోభావతి
త్వరావతి పరే సతాం గురుకృపాంబుధారావతి ॥95॥

అమ్మా! నీవు చంద్రకళలతో ప్రభవిస్తూ, చంద్రుని సిగలో దాల్చినవాని ఇల్లాలివై, మహేశ్వరుని ప్రియురాలివై, స్వయం ప్రకాశము కలిగి, అత్యంత సౌందర్యవతివై, సద్గుణులను రక్షించుటయందు ఆసక్తిగలమాతా! పరదేవతా! గురు మండల స్వరూపిణీ! నా మనసు నీయందే లగ్నమగునుగాక.

త్వయైవ జగదంబయా భువనమండలం సూయతే
త్వయైవ కరుణార్ద్రయా తదపి రక్షణం నీయతే ।
త్వయైవ ఖరకోపయా నయనపావకే హూయతే
త్వయైవ కిల నిత్యయా జగతి సంతతం స్థీయతే ॥96॥

ఈ సమస్త విశ్వము జగజ్జననివైన నీ నుండే ఉద్భవిస్తున్నది. తల్లీ! ఆ విశ్వము నీ చేతనే రక్షించబడుతున్నది. నీ మూడవ నేత్ర జ్వాలలోనే విశ్వము లయము కావించబడుతున్నది. ఈ విశ్వమును రక్షించుటకు నీకు తప్ప మరెవరికి శక్తి కలదు?

చరాచరజగన్మయీం సకలహృన్మయీం చిన్మయీం
గుణత్రయమయీం జగత్త్రయమయీం త్రిధామామయీమ్ ।
పరాపరమయీం సదా దశదిశాం నిశాహర్మయీం
పరాం సతతసన్మయీం మనసి చిన్మయీం శీలయే ॥97॥

ఈ జగత్తులో చరములు, అచరములు అన్నిటిలోనూ నివే నిండి ఉన్నావు. సకల జనుల హృదయములలోనూ నీవే కొలువై ఉన్నావు. నీవు త్రిగుణాత్మికవు. రాత్రి – పగలు నీ రూపమే. శక్తి రూపిణివి, చైతన్య స్వరూపిణివి అయిన నిన్ను నిరంతరం ధ్యానిస్తాను.

జయ జగదంబికే హరకుటుంబిని నేత్రరుచా
జితశరదంబుజే ఘనవిడంబిని కేశరుచా ।
పరమవలంబనం కురు సదా పరరూపధరే
మమ గతసంవిదో జడిమడంబరతాండవినః ॥98॥

ఓ జగదంబికా! ఈశ్వరుని దేవేరీ, నీ నేత్రముల ప్రకాశముతో కమలముల కాంతిని గెలిచిన మాతా! కేశపాశముల కాంతితో, మేఘముల కాంతిని జయించినదానా, జ్ఞానమును పోగొట్టుకుని అజ్ఞాన స్వరూపమై నిలిచిన నన్ను- నీ హస్తమునందించి ఉద్ధరించుము.

భువనజనని భూషాభూతచంద్రే నమస్తే
కలుషశమని కంపాతీరగేహే నమస్తే ।
నిఖిలనిగమవేద్యే నిత్యరూపే నమస్తే
పరశివమయి పాశచ్ఛేదహస్తే నమస్తే ॥99॥

సమస్త లోకములను కన్న తల్లీ! సకల పాపములను తొలగించు మాతా! నిత్యవు, శాశ్వతవు, ఈశ్వరతత్వముతో పూర్తిగా నిండిన దానవు నీవు. అటువంటి నిన్ను నా పాశములను ఛేదించవలసినదిగా ప్రార్ధిస్తూ నమస్కరిస్తున్నాను.

క్వణత్కాంచీ కాంచీపురమణివిపంచీలయఝరీ-
శిరఃకంపా కంపావసతిరనుకంపాజలనిధిః ।
ఘనశ్యామా శ్యామా కఠినకుచసీమా మనసి మే
మృగాక్షీ కామాక్షీ హరనటనసాక్షీ విహరతామ్ ॥100॥

అమ్మా! కామాక్షీ! మధురముగా ధ్వనిస్తున్న నీ మొలనూలుతో, కాంచీపురమనే వీణావాదనకు ఆనందముగా శిరసు ఊపుతూ, కంపానదియే సముద్రమనే నీకు తీరమై, నల్లని వర్ణముతో, జింకల నేత్రములను కలిగి, ఈశ్వరుని తాండవమునకు ఏకైక సాక్షివైన ఓ మాతా! నీవు సదా నా హృదయములో నర్తింతువుగాక.

సమరవిజయకోటీ సాధకానందధాటీ
మృదుగుణమణిపేటీ ముఖ్యకాదంబవాటీ ।
మునినుతపరిపాటీ మోహితాజాండకోటీ
పరమశివవధూటీ పాతు మాం కామకోటీ ॥101॥

ఏ సమరములోనైనా నీవే విజేతవు. నీ ఉపాసకులకు ఆనంద స్వరూపిణివి, సకల గుణస్వరూపిణివి, కదంబవన సంచారిణివి, యోగులచే స్తుతించబడుదానవు, సకల జగత్తును మోహింపచేయు దానవు, కామకోటి పీఠములో స్థితురాలైన మాత నన్ను రక్షించుగాక.

ఇమం పరవరప్రదం ప్రకృతిపేశలం పావనం
పరాపరచిదాకృతిప్రకటనప్రదీపాయితమ్ ।
స్తవం పఠతి నిత్యదా మనసి భావయన్నంబికాం
జపైరలమలం మఖైరధికదేహసంశోషణైః ॥102॥

ఎవరైతే అను నిత్యము- వరప్రదాయిని, సుకుమారి, పరము – అపరము – చిత్‌ అను మూడు రూపములు కలిగినదీ, కాంతి స్వరూపిణీ అయిన కామాక్షీ దేవిని స్మరిస్తారో, వారికి ఇతర మంత్రములతో, జపములతో ఏ మాత్రము పని లేదు.

॥ ఇతి స్తుతిశతకం సంపూర్ణమ్ ॥

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top