శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 41-50 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అనేది సిరిసంపదలు, అదృష్టం మరియు శుభాలకు ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మీ దేవిని స్తుతిస్తూ పఠించే అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన హిందూ స్తోత్రం. అమ్మవారి విశిష్ట గుణాలను, తత్వాన్ని మరియు విశ్వరూపాన్ని వర్ణించే వెయ్యి నామాలతో కూడిన ఈ పురాతన స్తోత్రం కేవలం భౌతిక సంపదల కోసం చేసే ప్రార్థన మాత్రమే కాదు, ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సాధన. ఈ దివ్య నామాలను స్వచ్ఛమైన భక్తితో పఠించడం లేదా వినడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, జీవితంలోని ఆటంకాలు పటాపంచలై, ఇంట శాంతి, శ్రేయస్సు మరియు సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది భక్తులను నేరుగా ఆ చల్లని తల్లి అనుగ్రహానికి అనుసంధానించే ఒక ఆధ్యాత్మిక వారధిలా పనిచేస్తుంది.
సంస్కృత పఠనం ద్వారా విశేష ఫలితం ఉన్నప్పటికీ, లక్ష్మీ సహస్రనామాలకు మాతృభాషలో అర్థం తెలుసుకుని చదవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. తెలుగులో అర్థం తెలుసుకోవడం ద్వారా పఠనం యాంత్రికంగా కాకుండా, అమ్మవారితో చేసే హృదయపూర్వక సంభాషణగా మారి ఏకాగ్రత, భక్తి ద్విగుణీకృతం అవుతాయి. మనకు అలవాటైన భాషలో ఉండటం వల్ల పిల్లలు, యువతకు కూడా ఈ దైవిక తత్వం సులభంగా అర్థమై, భావితరాలకు చేరువవుతుంది. అంతేకాకుండా, అష్టలక్ష్ముల విశిష్టతను తెలుసుకుని, మనకు అత్యంత అవసరమైన అమ్మవారి రూపంపై మనసును లగ్నం చేసి కోరిన వరాలను పొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
బిందునాదకళాతీతా బిందునాదకళాత్మికా |
దశవాయుజయాకారా కళాషోడశసంయుతా || 41 ||
బిందునాదకళాతీతా – బీజాక్షరాలలో ఉండు బిందువు, నాదము, కళ మొదలైన వాటికి అతీతమైనది
బిందునాద కళాత్మికా – నాదము, బిందువు, కళలతో కూడిన ‘ఓం ఐం హ్రీం’ అను బీజాక్షరములే తన రూపముగా కలది
దశవాయుజయాకారా – పంచ ప్రాణములు- అంటే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము,
సమానము – పంచ ఉపవాయువులు అంటే నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము. యోగి ఈ దశ వాయువులను జయించినప్పుడు ప్రేరేపించబడే కుండలినీ శక్తిరూపము.
కళాషోడశసంయుతా – చంద్రుని కళల స్వరూపము
కాశ్యపీ కమలాదేవీ నాదచక్రనివాసినీ |
మృడాధారా స్థిరా గుహ్యా దేవికా చక్రరూపిణీ || 42 ||
కాశ్యపీ – కశ్యపునికి దానం చేయబడింది కాబట్టి భూదేవి స్వరూపమైన తల్లి కాశ్యపి
కమలాదేవీ – కమలములు చేతియందు కలది
నాదచక్రనివాసినీ – నాదచక్రమైన ఓంకారము నివాసముగా కలది
మృడాధారా – భక్తులకు సంతోషమును కలిగించునది
స్థిరా – శాశ్వతమైనది
గుహ్యా – అతి రహస్యమైనది, హృదయాకాశములో ఉన్న చిచ్శక్తి స్వరూపిణి
దేవికా – దేవత
చక్రరూపిణీ – శ్రీచక్ర స్వరూపిణి
అవిద్యా శార్వరీ భుంజా జంభాసురనిబర్హిణీ |
శ్రీకాయా శ్రీకళా శుభ్రా కర్మనిర్మూలకారిణీ || 43 ||
అవిద్యా – సృష్టిలోని వైవిధ్యాన్ని తెలుసుకోగల విద్య
శార్వరీ – రాత్రి స్వరూపం
భుంజా – ప్రళయ కాలమున సర్వమును భుజించునది, లయకారిణి
జంభాసురనిభర్హిణీ – ఇంద్రుని రూపంలో జంభాసురుడిని సంహరించినది
శ్రీకాయా – సంపదగా జన్మించినది
శ్రీకళ – మంగళకరమైన రూపము కలది
శుభ్రా – తెల్లనిది, పవిత్రమైనది
కర్మనిర్మూలకారిణీ – కర్మలను నశింపజేసి మోక్షము కలిగించునది
ఆదిలక్ష్మీర్గుణాధారా పంచబ్రహ్మాత్మికా పరా |
శ్రుతిర్బ్రహ్మముఖావాసా సర్వసంపత్తిరూపిణీ || 44 ||
ఆదిలక్ష్మీ – లక్ష్మి స్వరూపము
గుణాధారా – సమస్త సద్గుణములకు ఆధారమైనది
పంచబ్రహ్మాత్మికా – సకల దేవతా స్వరూపిణి
పరా – పరా రూపంలో ఉన్న సృష్టి స్వరూపిణి, అన్నింటికంటే ఉన్నతమైనది
శ్రుతిః – వేద స్వరూపిణి
బ్రహ్మముఖావాసా – వేదాల స్వరూపమైన బ్రహ్మ ముఖములలో నివసించే సరస్వతి
సర్వ సంపత్తి రూపిణీ – సకల సంపదల స్వరూపిణి
మృతసంజీవనీ మైత్రీ కామినీ కామవర్జితా |
నిర్వాణమార్గదా దేవీ హంసినీ కాళికా క్షమా || 45 ||
మృత సంజీవనీ – సంజీవనీ మంత్ర స్వరూపిణీ
మైత్రీ – సమస్త జీవులపట్ల మైత్రి కలది
కామినీ – కోరికలు నెరవేర్చునది
కామవర్జితా – ఏ కోరికలూ లేనిది
నిర్వాణమార్గదా దేవి – మోక్షానికి మార్గం చూపించు తల్లి
హంసినీ – హంస స్థితిలో ఉన్నది, సూర్యుని తేజస్సు
కాళికా – ఉగ్ర స్వరూపిణి, పార్వతీ దేవి అవతారము
క్షమా – ఓర్పు కలిగినది
సపర్యా గుణినీ భిన్నా నిర్గుణాఖండితాఽశుభా |
స్వామినీ వేదినీ శక్యా శాంబరీ చక్రధారిణీ || 46 ||
సపర్యా – సేవింపదగినది
గుణినీ – మంచి గుణాలు కలది
భిన్నా – అనేక రూపములు కలది
నిర్గుణా – గుణ రహితమైనది, మాయా శక్తి స్వరూపిణి
అఖండితా – శత్రువులచేత ఖండింపబడనిది
శుభా – మంగళకరమైనది
స్వామినీ – యజమాన స్వరూపిణి
వేదినీ – యజ్ఞ వేది స్వరూపిణి
శక్యా – భక్తులను సులభముగా అనుగ్రహించునది
శాంబరీ – మాయా స్వరూపిణీ
చక్రధారిణీ – చక్రాయుద్ధమును ధరించినది
దండినీ ముండినీ వ్యాఘ్రీ శిఖినీ సోమసంహతిః |
చింతామణిశ్చిదానందా పంచబాణప్రబోధినీ || 47 ||
దండినీ – దుష్టులను శిక్షించునది
ముండినీ – శివుని శక్తి స్వరూపిణి
వ్యాఘ్రీ – శక్తివంతమైనది
శిఖినీ – శివుని శక్తి
సోమసంహతిః – చంద్రుని సోదరి, చంద్రుని వలె కాంతివంతమైనది
చింతామణిః – కోరికలు తీర్చునది, చింతామణులతో నిర్మించిన గృహములో నివసించునది
చిదానందా – దివ్య ఆనంద స్థితిలో ఉండునది
పంచబాణ ప్రబోధినీ – పంచ పూలబాణములు కల మన్మధుణ్ణి బ్రతికించినది
బాణశ్రేణిః సహస్రాక్షీ సహస్రభుజపాదుకా |
సంధ్యా బలిస్త్రిసంధ్యాఖ్యా బ్రహ్మాండమణిభూషణా || 48 ||
బాణశ్రేణిః – బాణాల వరుసను కలిగి ఉన్నది
సహస్రాక్షీ – వేయి కన్నులు కలది
సహస్ర భుజ పాదుకా – సహస్ర అంటే అనంతమైన భుజములు, పాదములు కలది
సంధ్యా బలిః – త్రికాల సంధ్యలలో పూజలు అందుకునేది
త్రిసంధ్యాఖ్యా – తెల్లవారుజాము, మధ్యాహ్నం, సంధ్యా సమయములో పూజించతగినది
బ్రహ్మాండ మణిభూషణా – బ్రహ్మాండములనెడి మణులతో కూడిన భూషణములు కలది
వాసవీ వారుణీసేనా కుళికా మంత్రరంజనీ |
జితప్రాణస్వరూపా చ కాంతా కామ్యవరప్రదా || 49||
వాసవీ – ఇంద్రుని శక్తి స్వరూపిణి
వారుణి – వరుణ సంబంధమైన శక్తి స్వరూపిణి
సేనా – సేన కలది
కుళికా – సృష్టి రచనా సమర్ధురాలు
మంత్ర రంజనీ – వేద మంత్రముల వలన సంతోషించు తల్లి
జితప్రాణ స్వరూపా – ఆత్మను గెలుచుకున్న రూపం కలిగినది
కాంతా – అందరినీ ఆకర్షించునది
కామ్య వరప్రదా – కోరుకున్న వరాలు ఇచ్చేది
మంత్రబ్రాహ్మణవిద్యార్థా నాదరూపా హవిష్మతీ |
ఆథర్వణిః శ్రుతిః శూన్యా కల్పనావర్జితా సతీ || 50 ||
మంత్రబ్రాహ్మణ విద్యార్థా – వేద విద్యలకు ప్రయోజనమును కలిగించునది
నాదరూపా – శబ్ద స్వరూపిణి
హవిష్మతీ – అగ్ని యందు ప్రేల్వదగిన హవిస్సులు కలది
ఆథర్వణి – అథర్వణ వేదమంత్ర స్వరూపిణి
శ్రుతిః – వేద స్వరూపిణి
శూన్యా – ఆది, మధ్య, అంతములు లేనిది
కల్పనా – సమస్త సృష్టికి కారణభూతమైనది
వర్జితా – సంకల్ప, వికల్పములు విడిచిన పరబ్రహ్మ స్వరూపిణి
సతీ – పతివ్రతా స్వరూపిణి
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




