శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 111-120 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అనేది సిరిసంపదలు, అదృష్టం మరియు శుభాలకు ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మీ దేవిని స్తుతిస్తూ పఠించే అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన హిందూ స్తోత్రం. అమ్మవారి విశిష్ట గుణాలను, తత్వాన్ని మరియు విశ్వరూపాన్ని వర్ణించే వెయ్యి నామాలతో కూడిన ఈ పురాతన స్తోత్రం కేవలం భౌతిక సంపదల కోసం చేసే ప్రార్థన మాత్రమే కాదు, ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సాధన. ఈ దివ్య నామాలను స్వచ్ఛమైన భక్తితో పఠించడం లేదా వినడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, జీవితంలోని ఆటంకాలు పటాపంచలై, ఇంట శాంతి, శ్రేయస్సు మరియు సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది భక్తులను నేరుగా ఆ చల్లని తల్లి అనుగ్రహానికి అనుసంధానించే ఒక ఆధ్యాత్మిక వారధిలా పనిచేస్తుంది.
సంస్కృత పఠనం ద్వారా విశేష ఫలితం ఉన్నప్పటికీ, లక్ష్మీ సహస్రనామాలకు మాతృభాషలో అర్థం తెలుసుకుని చదవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. తెలుగులో అర్థం తెలుసుకోవడం ద్వారా పఠనం యాంత్రికంగా కాకుండా, అమ్మవారితో చేసే హృదయపూర్వక సంభాషణగా మారి ఏకాగ్రత, భక్తి ద్విగుణీకృతం అవుతాయి. మనకు అలవాటైన భాషలో ఉండటం వల్ల పిల్లలు, యువతకు కూడా ఈ దైవిక తత్వం సులభంగా అర్థమై, భావితరాలకు చేరువవుతుంది. అంతేకాకుండా, అష్టలక్ష్ముల విశిష్టతను తెలుసుకుని, మనకు అత్యంత అవసరమైన అమ్మవారి రూపంపై మనసును లగ్నం చేసి కోరిన వరాలను పొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
సుగృహా రక్తబీజాంతా హతకందర్పజీవికా |
సముద్రవ్యోమమధ్యస్థా సమబిందుసమాశ్రయా || 111 ||
సుగృహా – మంచి గృహము కలిగినది
రక్తబీజాంతా – రక్తబీజుడను రాక్షసుణ్ణి చంపినది
హత కందర్ప జీవికా – శివుని మూడో కంటిచే చంపబడిన మన్మధుణ్ణి బ్రతికించినది
సముద్ర వ్యోమ మధ్యస్థా – ఆకాశం, సముద్రాల మధ్య ఉండునది
సమబిందు సమాశ్రయా – శ్రీచక్రంలోని బిందువులో నివసించునది
సౌభాగ్యరసజీవాతుః సారాసారవివేకదృక్ |
త్రివళ్యాదిసుపుష్టాంగా భారతీ భరతాశ్రితా || 112 ||
సౌభాగ్య రసజీవాతుః – స్త్రీలకు సుమంగళీత్వమును ప్రసాదించు దేవత
సారాసార వివేకదృక్ – జ్ఞానదృష్టి గల తల్లి
త్రివళ్యాది సుపుష్టాంగా – తుంటిలో మూడు మడతలతో ఆరోగ్యకరమైన శరీరాన్ని కలిగి ఉన్నది
భారతీ – సరస్వతి
భరతాశ్రితా – భరతుని ఆశ్రయించినది
నాదబ్రహ్మమయీవిద్యా జ్ఞానబ్రహ్మమయీపరా |
బ్రహ్మనాడీ నిరుక్తిశ్చ బ్రహ్మకైవల్యసాధనమ్ || 113 ||
నాదబ్రహ్మమయీ – సర్వత్రా వ్యాపించియున్న శబ్దజ్ఞానము
విద్యా – విద్యా స్వరూపిణి
జ్ఞానబ్రహ్మమయీ – బ్రహ్మము యొక్క దివ్య జ్ఞానము
పరా – పరావాక్కు స్వరూపిణి
బ్రహ్మ నాడీ – కుండలినీ శక్తి సంచరించు బ్రహ్మ నాడి- దేవీ స్వరూపము
నిరుక్తిః – నిరుక్తమనగా వైదిక సంస్కృత భాషా నిఘంటువు.
ఆ నిరుక్తి శాస్త్ర స్వరూపిణి అమ్మ
బ్రహ్మకైవల్య సాధనా – బ్రహ్మ కైవల్యం- అంటే మోక్షమును పొందుటకు సాధనమైనది
కాలకేయమహోదారవీర్యవిక్రమరూపిణీ |
బడబాగ్నిశిఖావక్త్రా మహాకబళతర్పణా || 114 ||
కాలకేయ మహోదార వీర్య విక్రమ రూపిణీ
– ఎంతో పరాక్రమశాలురైన కాలకేయులకు శక్తి సామర్ధ్యాలు ప్రసాదించినది
బడబాగ్ని శిఖా వక్త్రా – బడబాగ్ని వంటి ముఖము కలిగి, ప్రళయ కాలమున సృష్టిని లయము చేయునది
మహాకబళ తర్పణా – ప్రళయకాలములో సమస్తమును లయము చేసి తృప్తి పొందునది
మహాభూతా మహాదర్పా మహాసారా మహాక్రతుః |
పంచభూతమహాగ్రాసా పంచభూతాధిదేవతా || 115 ||
మహాభూతా – పంచభూతములకు కారణమైనది
మహాదర్పా – దర్పమునకు కారణమైన మాయా స్వరూపిణి
మహాసారా – సృష్టియందలి అన్ని పదార్థములలోని సారము అమ్మే
మహాక్రతుః యజ్ఞ, యాగ స్వరూపిణి
పంచభూత మహాగ్రాసా – పంచభూతములు ఆహారముగా కలది
పంచభూతాధి దేవతా – పంచభూతములకు అధినేత
సర్వప్రమాణా సంపత్తిః సర్వరోగప్రతిక్రియా |
బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తా విష్ణువక్షోవిభూషిణీ || 116 ||
సర్వ ప్రమాణా – అన్నింటికీ ప్రమాణమైన పరబ్రహ్మ స్వరూపిణి
సంపత్తిః – భక్తుల దారిద్ర్యమును తొలగించి, ఐశ్వర్యమును ప్రసాదించునది
సర్వరోగ ప్రతిక్రియా – అన్ని వ్యాధులను నయం చేయునది
బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తా – బ్రహ్మాండమంతటా నిండి ఉన్నది
విష్ణువక్షో విభూషిణీ – మహావిష్ణువు వక్షస్థలమునందు ఉండునది
శాంకరీ నిధివక్త్రస్థా ప్రవరా వరహేతుకీ |
హేమమాలా శిఖామాలా త్రిశిఖా పంచలోచనా || 117 ||
శాంకరీ – శంకరుని భార్య
నిధి వక్త్రస్థా – నిధులయందు, జ్ఞానమునందు ఉండునది
ప్రవరా – శ్రేష్టురాలు, గొప్పవరుని పొందినది
వరహేతుకీ – వరములను ప్రసాదించునది
హేమమాలా – బంగారు ఆభరణములను ధరించునది
శిఖామాలా – శిరస్సులో పూలదండను ధరించినది
త్రిశిఖా – త్రివేద స్వరూపిణి
పంచలోచనా – అమ్మ మూడు నేత్రములు కాక మనోనేత్రము, జ్ఞాననేత్రము కలిపి 5 కన్నులు కలది
సర్వాగమసదాచారమర్యాదా యాతుభంజనీ |
పుణ్యశ్లోకప్రబంధాఢ్యా సర్వాంతర్యామిరూపిణీ || 118 ||
సర్వాగమ సదాచార మర్యాదా – ఆగమములలోని సదాచార స్వరూపము
యాతు భంజని – రాక్షసులను నాశనం చేయునది
పుణ్యశ్లోక ప్రబంధాఢ్యా – పుణ్య శ్లోకాల రూపంలో ఉన్న సరస్వతి స్వరూపము
సర్వాంతర్యామి రూపిణీ – సర్వ ప్రాణుల యందు అంతర్యామి రూపమున ఉన్నది
సామగానసమారాధ్యా శ్రోత్రకర్ణరసాయనమ్ |
జీవలోకైకజీవాతుర్భద్రోదారవిలోకనా || 119||
సామగాన సమారాధ్యా – సామవేదం గానం చేస్తూ పూజింపబడేది
శ్రోత్రకర్ణ రసాయనా – చెవులకు మిక్కిలి ప్రీతిని కలిగించునది
జీవలోకైక జీవాతుః – ప్రాణులన్నింటికీ జీవనౌషధము
భద్రోదార విలోకనా – మంగళకరమైన దయతో కూడిన చూపులు గల తల్లి
తటిత్కోటిలసత్కాంతిస్తరుణీ హరిసుందరీ |
మీననేత్రా చ సేంద్రాక్షీ విశాలాక్షీ సుమంగళా || 120 ||
తటిత్కోటి లసత్కాంతిః – కోట్లాది మెరుపుల వలె అందంగా ఉన్నది
తరుణీ – నిత్య యవ్వనవతి
హరి సుందరీ – హరికి భార్య అయినటువంటి సౌందర్యవతి
మీననేత్రా – చేపల వంటి కన్నులు గలది
ఇంద్రాక్షీ – ఇంద్రుని వలె కన్నులు కలది, శ్రీలంకలో వెలసి ఉన్న అమ్మవారి పేరు ఇంద్రాక్షి
విశాలాక్షీ – విశాలమైన కన్నులు కలది, కాశీ క్షేత్రంలో వెలసిన విశ్వనాథుని భార్య
సుమంగళా – సువాసిని అయిన స్త్రీ
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




