సంకటమోచన హనుమాన్ స్తోత్రం
సంకటమోచన హనుమాన్ స్తోత్రం అనేది భక్తుల జీవితాల్లో ఉన్న అన్ని రకాల కష్టాలు, భయాలు, అడ్డంకులను తొలగించేందుకు పఠించబడే అత్యంత శక్తివంతమైన స్తోత్రం. ఇది భక్తితో పఠిస్తే మనసుకు ధైర్యం, బుద్ధికి స్థిరత్వం, జీవితానికి రక్షణ కలుగుతాయని విశ్వాసం. ఈ స్తోత్రాన్ని గోస్వామి తులసీదాస్ రచించారు.
ఈ స్తోత్రాన్ని నియమంగా పఠిస్తే ఆపదలు, కష్టాలు తొలగిపోతాయి, మనస్సుకు శాంతి, ధైర్యం కలుగుతుంది, భయాలు, దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుంది, బుద్ధి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ప్రత్యేకంగా శనివారాలు, మంగళవారాలు పఠిస్తే విశేష ఫలితం ఉంటుంది.
బాల సమయ రవి భక్షీ లియో తబ,
తీనహుం లోక భయో అంధియారోమ్ ।
తాహి సోం త్రాస భయో జగ కో,
యహ సంకట కాహు సోం జాత న టారో ।
దేవన ఆని కరీ బినతీ తబ,
ఛాడవోయీ దియో రవి కష్ట నివారో ।
కో నహీం జానత హై జగ మేం కపి,
సంకటమోచన నామ తిహారో । 1
ఓ హనుమంతుడా! నీవు చిన్నవాడిగా ఉన్నప్పుడు సూర్యుడిని పండు అనుకొని మింగివేశావు. దాంతో మూడు లోకాలు అన్నీ చీకటిలో మునిగిపోయాయి. ఆ సంఘటన వల్ల సమస్త లోకాలకూ భయం పట్టుకుంది.
ఈ మహా సంకటాన్ని ఎవ్వరూ తొలగించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దేవతలందరూ కలిసి నీ దగ్గరకు వచ్చి వినయంగా ప్రార్థించి వేడుకున్నారు. వారి ప్రార్థనకు కరిగిన నీవు సూర్యుడిని విడిచిపెట్టి, లోకాల కష్టాన్ని తొలగించావు. ఓ కపివీరా! ఈ జగత్తులో నీవే సంకటాలను తొలగించే వాడవు అని ఎవరికి తెలియదు? నీ పేరు వినగానే కష్టాలు తొలగిపోతాయి.
బాలి కీ త్రాస కపీస బసైం గిరి,
జాత మహాప్రభు పంథ నిహారో ।
చౌంకి మహాముని సాప దియో తబ,
చాహిఏ కౌన బిచార బిచారో ।
కైద్విజ రూప లివాయ మహాప్రభు,
సో తుమ దాస కే శోక నివారో । 2
ఓ కపిరాజా హనుమంతుడా! వాలి భయంతో సుగ్రీవుడు పర్వత ప్రాంతంలో దాక్కొని ఉండగా, శ్రీరాముడు ఆ మార్గంలో వెళ్తూ అతని పరిస్థితిని గమనించాడు. ఆ సమయంలో మహర్షి మాటల (శాపం) వల్ల
రాముడు వాలిని ఎదుర్కోలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇంకెవరి సలహా అవసరం లేకుండా,
స్వయంగా పరిష్కార మార్గం ఆలోచించాల్సి వచ్చింది. అప్పుడు బ్రాహ్మణ వేషాన్ని ధరించి వచ్చి,
సుగ్రీవునితో స్నేహం చేసి అతని దుఃఖాన్ని, భయాన్ని పూర్తిగా తొలగించాడు. అలాగే ఓ హనుమంతుడా! నీవు కూడా నీ శరణు వచ్చిన భక్తుల దుఃఖాలను, కష్టాలను తప్పక నివారిస్తావు.
అంగద కే సంగ లేన గయే సియ,
ఖోజ కపీస యహ బైన ఉచారో ।
జీవత నా బచిహౌ హమ సో జు,
బినా సుధి లాయే ఇహావో పగు ధారో ।
హేరీ థకే తట సింధు సబే తబ,
లాఏ సియా-సుధి ప్రాణ ఉబారో । 3
ఓ హనుమంతుడా! అంగదుడితో కలిసి వానరసేన అంతా సీతమ్మను వెతకడానికి బయలుదేరింది. అప్పుడు అందరూ ఒక మాట స్పష్టంగా చెప్పారు. “సీతమ్మ జాడను తెలియజేయకుండా మేమెవరూ బ్రతికి తిరిగి రాము” అని. అలా వెతుకుతూ సముద్ర తీరానికి చేరుకున్న వానరులందరూ అలసటతో, నిరాశతో ఆగిపోయారు. అప్పుడు నీవే ముందుకు వచ్చి, సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి, సీతమ్మ జాడను తెలుసుకుని తీసుకొచ్చావు. ఆ వార్తతో వానరుల ప్రాణాలు నిలబడ్డాయి, అందరికీ కొత్త ఆశ, ధైర్యం కలిగింది. అందుకే ఓ హనుమంతుడా! నీవు నిజంగా సంకటమోచనుడివి — కష్టంలో ఉన్నవారి ప్రాణాలను కాపాడే మహావీరుడివి.
రావణ త్రాస దీ సియ కో సబ,
రాక్షసీ సోం కహీ శోక నివారో ।
తాహి సమయ హనుమాన మహాప్రభు,
జాఏ మహా రజనీచర మారో ।
చాహత సీయ అసోక సోం ఆగి సు,
దై ప్రభుముద్రికా సోక నివారో । 4
ఓ హనుమంతుడా! రావణుడు సీతమ్మకు ఎన్నో విధాలుగా భయపెట్టి, రాక్షసులతో ఆమెను వేధిస్తూ
ఆమెను తీవ్ర దుఃఖంలో ముంచాడు. అటువంటి కష్ట సమయంలో ఓ మహావీరుడా హనుమంతుడా!
నీవు లంకకు వెళ్లి, అనేక భయంకరమైన రాక్షసులను సంహరించావు.
అశోక వనంలో బాధతో ఉన్న సీతమ్మను దర్శించి, శ్రీరాముడి ముద్రికను ఆమెకు చూపించి, “నీ రక్షణ త్వరలోనే జరుగుతుంది” అని ధైర్యం చెప్పి, ఆమె శోకాన్ని తొలగించావు.
అందుకే ఓ హనుమంతుడా! నీవు కేవలం బలవంతుడే కాదు – భక్తుల హృదయాలలోని భయాన్ని, దుఃఖాన్ని తొలగించే నిజమైన సంకటమోచనుడవు.
బాన లగ్యో ఉర లఛిమన కే తబ,
ప్రాణ తజే సుత రావన మారో ।
లై గృహ బైద్య సుషేన సమేత,
తబై గిరి ద్రోణ సు బీర ఉపారో ।
ఆని సజీవన హాథ దిఏ తబ,
లఛిమన కే తుమ ప్రాణ ఉబారో । 5
యుద్ధ సమయంలో రావణుని కుమారుడైన ఇంద్రజిత్తు వదిలిన బాణం లక్ష్మణుడి హృదయాన్ని తాకింది. ఆ ఘాతంతో లక్ష్మణుడు ప్రాణాలు విడిచే స్థితికి చేరుకున్నాడు. ఆ దుఃఖ సమయంలో శ్రీరాముడు తీవ్రంగా విచారించాడు. అప్పుడు నీవు వైద్యుడు సుషేనుడిని వెంటబెట్టుకుని వచ్చావు. అతని ఆదేశానుసారం ద్రోణగిరి పర్వతాన్ని మొత్తం ఎత్తుకొని తెచ్చావు.
ఆ పర్వతంలోని సంజీవని ఔషధంతో లక్ష్మణుడికి ప్రాణం పోసి, అతని జీవాన్ని రక్షించావు. అందుకే ఓ మహావీరా హనుమంతుడా! నీవు మరణానికి దగ్గరైన వారిని కూడా, మళ్లీ జీవితం వైపు తీసుకొచ్చే అపూర్వ సంకటమోచనుడవు.
రావణ జుధ అజాన కియో తబ,
నాగ కి ఫాంస సబై సిర డారో ।
శ్రీరఘునాథ సమేత సబై దల,
మోహ భయో యహ సంకట భారో ।
ఆని ఖగేస తబై హనుమాన జు,
బంధన కాటి సుత్రాస నివారో । 6
రావణునితో జరిగిన యుద్ధంలో ఇంద్రజిత్తు మాయా యుద్ధాన్ని ప్రారంభించాడు. అతడు ప్రయోగించిన నాగపాశం సర్పాల్లా మారి శ్రీరాముడు, లక్ష్మణుడు సహా సమస్త వానరసేనను బంధించింది.
ఆ బంధనంలో చిక్కుకున్న శ్రీరఘునాథుడు మరియు ఆయన సేన అందరూ మూర్ఛకు లోనయ్యారు. ఇది అత్యంత భయంకరమైన, భారీ సంకటంగా మారింది. అటువంటి వేళలో ఓ హనుమంతుడా! నీవు గరుడదేవుని తీసుకొచ్చావు.
గరుడుని దర్శనంతోనే నాగపాశ బంధనాలు అన్నీ తెగిపోయాయి. శ్రీరాముడు, లక్ష్మణుడు మరియు వానరసేన అంతా మళ్లీ చైతన్యం పొందింది. ఈ విధంగా నీవు అత్యంత భయంకరమైన బంధనాల నుండి భక్తులను విముక్తి చేసి, వారి భయాన్ని పూర్తిగా తొలగించావు. అందుకే ఓ మహావీరా హనుమంతుడా! నీవు నిజంగా అసాధ్యమైన సంకటాలను కూడా తొలగించే అద్వితీయ సంకటమోచనుడవు.
బంధూ సమేత జబై అహిరావన,
లై రఘునాథ పతాల సిధారో ।
దేబిన్హీం పూజి భలి విధి సోం బలి ,
దేఉ సబై మిలి మంత్ర విచారో ।
జాయే సహాఏ భయో తబ హీ,
అహిరావన సైన్య సమేత సంహారో । 7
అహిరావణుడు తన సహచరులతో కలిసి శ్రీరాముడిని, లక్ష్మణుడిని అపహరించి పాతాళ లోకానికి తీసుకెళ్లాడు. అక్కడ దేవతలకు విరుద్ధంగా, అధర్మ విధానంలో పూజలు చేసి బలిని అర్పించాలని అహిరావణుడు మంత్రాలను ప్రయోగించాడు.
అటువంటి భయంకర పరిస్థితిలో ఓ హనుమంతుడా! నీవు వెంటనే అక్కడికి చేరి సహాయానికి ముందుకు వచ్చావు. అహిరావణుడి సేన అంతటిని సంహరించి, అహిరావణుడినే వధించి, రామలక్ష్మణులను రక్షించావు.
ఈ విధంగా అత్యంత గంభీరమైన, ప్రాణాంతకమైన సంకటాన్ని కూడా ఒక్కడివే తొలగించావు. అందుకే ఓ మహావీర హనుమంతుడా! నీవు నిజంగా సర్వ సంకటాలను నశింపజేసే అద్వితీయ సంకటమోచనుడవు.
కాజ కియే బడవో దేవన కే తుమ,
బీర మహాప్రభు దేఖి బిచారో ।
కౌన సో సంకట మోర గరీబ కో,
జో తుమసే నహిం జాత హై టారో ।
బేగి హరో హనుమాన మహాప్రభు,
జో కఛు సంకట హోఏ హమారో । 8
ఓ మహావీరుడా హనుమంతుడా! నీవు దేవతల కోసం కూడా అనేక మహత్తరమైన కార్యాలు నిర్వహించావు.
నీ శౌర్యం, బుద్ధి, శక్తి ఆలోచిస్తే నీవు అపూర్వమైన మహాప్రభువు అని తెలుస్తుంది.
ఓ ప్రభువా! నాలాంటి దీనుడికి వచ్చే ఏ సంకటం అయినా నీ చేత తొలగించలేనిది ఏదైనా ఉందా? అందుకే ఓ హనుమంతుడా! మాకు ఏ చిన్న కష్టం వచ్చినా దయచేసి ఆలస్యం చేయకుండా వెంటనే దాన్ని తొలగించు.
దోహా
లాల దేహ లాలీ లసే, అరు ధరి లాల లంగూర ।
వజ్ర దేహ దానవ దలన, జయ జయ జయ కపి సూర ॥
ఓ కపివీరుడైన హనుమంతుడా! నీ శరీరం ఎర్రని కాంతితో ప్రకాశిస్తోంది, నీ తోక కూడా అగ్నివర్ణంలో వెలిగిపోతోంది. నీ శరీరం వజ్రంలా బలమైనది, రాక్షసులను సంహరించే అపార శక్తి నీది.
ఓ వానర సూర్యుడా. నీ వీరత్వానికి, పరాక్రమానికి జయము.
ఈ స్తోత్రాన్ని పారాయణ చేసే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి
హనుమాన్ చిత్రం లేదా విగ్రహం నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించాలి
వీలైతే ఎర్ర పూలు, ధూపం సమర్పించాలి
ముందుగా శ్రీరామ నామస్మరణ చేసి, ఆ తర్వాత సంకటమోచన హనుమాన్ స్తోత్రం స్పష్టంగా, భక్తితో పఠించాలి
రోజుకి కనీసం ఒకసారి, ప్రత్యేక సంకల్పం ఉంటే 3 లేదా 7 సార్లు చదవాలి.
చదవలేని వారు కనీసం ఈ వీడియొ చూస్తూ విన్నా కూడా ఫలితం ఉంటుంది.
“హే హనుమంతా! నా కష్టాలను తొలగించు” అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. 11, 21 లేదా 41 రోజులు నిరంతరం పఠిస్తే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




