పంచమ దశకం – విరాట్ పురుషుని ఆవిర్భావం
నారాయణీయంలోని ఐదవ దశకంలో ఈ విశ్వ సృష్టి ఎలా ప్రారంభమైందో వివరించారు. పరబ్రహ్మలో లీనమై ఉన్న మాయాశక్తి ఎలా మేల్కొని, మహత్తత్త్వం, అహంకారం, ఇంద్రియాలు, పంచభూతాలు, బ్రహ్మాండం, చివరకు విరాట్ పురుషుని రూపం ఎలా ఏర్పడ్డాయో ఇందులో చెప్పబడింది.
వ్యక్తావ్యక్తమిదం న కించిదభవత్ ప్రాక్ ప్రాకృతప్రక్షయే
మాయాయాం గుణసామ్యరుద్ధవికృతౌ త్వయ్యాగతాయాం లయమ్ |
నో మృత్యుశ్చ తదామృతం చ సమభూన్నాహ్నో న రాత్రేః స్థితి-
–స్తత్రైకస్త్వమశిష్యథాః కిల పరానందప్రకాశాత్మనా || 1 ||
ఓ ప్రభూ! సృష్టికి ముందు ప్రళయ సమయంలో కనిపించే ప్రపంచం కానీ, కనిపించని మూలప్రకృతి కానీ ఏవీ ప్రత్యేకంగా లేవు. సత్త్వ, రజస, తమో గుణాలు ఎలాంటి కదలిక లేకుండా సమస్థితిలో ఉండి, మాయాశక్తి నీలోనే లీనమై ఉంది. అప్పుడు మరణం లేదు, అమరత్వం లేదు, పగలు లేదు, రాత్రి లేదు. పరిపూర్ణమైన ఆనందం, జ్ఞానం, ప్రకాశమే స్వరూపంగా ఉన్న నీవు మాత్రమే ఉన్నావు.
కాలః కర్మ గుణాశ్చ జీవనివహా విశ్వం చ కార్యం విభో
చిల్లీలారతిమేయుషి త్వయి తదా నిర్లీనతామాయయుః |
తేషాం నైవ వదంత్యసత్త్వమయి భోః శక్త్యాత్మనా తిష్ఠతాం
నో చేత్ కిం గగనప్రసూనసదృశాం భూయో భవేత్ సంభవః || 2 ||
ఓ విభో! ఆ సమయంలో కాలం, కర్మ, గుణాలు, జీవరాశులు, ఈ విశ్వమంతా నీలోనే సూక్ష్మమైన శక్తిరూపంలో లీనమై ఉన్నాయి. అవన్నీ పూర్తిగా లేవని చెప్పలేము. ఎందుకంటే అవి నీలో కారణరూపంగా దాగి ఉన్నాయి. అసలు ఏమీ లేకపోతే, మళ్లీ ఈ సృష్టి ఎలా ఉద్భవించగలదు?.
ఏవం చ ద్విపరార్ధకాలవిగతావీక్షాం సిసృక్షాత్మికాం
బిభ్రాణే త్వయి చుక్షుభే త్రిభువనీభావాయ మాయా స్వయమ్ |
మాయాతః ఖలు కాలశక్తిరఖిలాదృష్టం స్వభావోఽపి చ
ప్రాదుర్భూయ గుణాన్ వికాస్య విదధుస్తస్యాః సహాయక్రియామ్ || 3 ||
చాలా దీర్ఘమైన ప్రళయకాలం గడిచిన తరువాత, నీలో సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది. ఆ సంకల్పంతో మాయాశక్తిలో కదలిక మొదలైంది. మాయ నుంచి కాలశక్తి, జీవుల పూర్వకర్మ ఫలాలు, స్వభావం బయటకు వచ్చాయి. అవి సత్త్వ, రజస, తమో గుణాలను చైతన్యపరచి, సృష్టి కార్యానికి సహాయపడ్డాయి.

మాయాసన్నిహితోఽప్రవిష్టవపుషా సాక్షీతి గీతో భవాన్
భేదైస్తాం ప్రతిబింబితో వివిశివాన్ జీవోఽపి నైవాపరః |
కాలాదిప్రతిబోధితాఽథ భవతా సంచోదితా చ స్వయం
మాయా సా ఖలు బుద్ధితత్త్వమసృజద్యోఽసౌ మహానుచ్యతే || 4 ||
ఓ ప్రభూ! నీవు మాయకు దగ్గరగా ఉన్నా, దానితో బంధింపబడకుండా సాక్షిగా ఉంటావు. అందుకే వేదాలు నిన్ను సాక్షి స్వరూపుడని చెబుతాయి. మాయలో కనిపించే నీ ప్రతిబింబమే జీవుడిగా చెప్పబడుతుంది. నీ ప్రేరణతో, కాలశక్తి ప్రభావంతో మాయ మొదట బుద్ధితత్త్వాన్ని సృష్టించింది. దీనినే మహత్తత్త్వం అంటారు.
తత్రాసౌ త్రిగుణాత్మకోఽపి చ మహాన్ సత్త్వప్రధానః స్వయం
జీవేఽస్మిన్ ఖలు నిర్వికల్పమహమిత్యుద్బోధనిష్పాదకః |
చక్రేఽస్మిన్ సవికల్పబోధకమహంతత్త్వం మహాన్ ఖల్వసౌ
సంపుష్టం త్రిగుణైస్తమోఽతిబహులం విష్ణో భవత్ప్రేరణాత్ || 5 ||
మహత్తత్త్వం మూడు గుణాలతో కూడి ఉన్నప్పటికీ, మొదట సత్త్వగుణం ఎక్కువగా ఉండటం వల్ల జీవుడిలో “నేను ఉన్నాను” అనే స్వచ్ఛమైన భావం కలుగుతుంది. తరువాత నీ ప్రేరణతో మహత్తత్త్వం నుంచి అహంకారం ఉద్భవించింది. తమోగుణం ఎక్కువగా ఉండే ఈ అహంకారం వల్ల “నేను”, “నాది”, “ఇది వేరు” అనే భేదభావాలు ఏర్పడ్డాయి.
సోఽహం చ త్రిగుణక్రమాత్ త్రివిధతామాసాద్య వైకారికో
భూయస్తైజసతామసావితి భవన్నాద్యేన సత్త్వాత్మనా |
దేవానింద్రియమానినోఽకృత దిశావాతార్కపాశ్యశ్వినో
వహ్నీంద్రాచ్యుతమిత్రకాన్ విధువిధిశ్రీరుద్రశారీరకాన్ || 6 ||
ఓ విష్ణూ! అహంకారం సత్త్వ, రజస, తమో గుణాల ప్రభావంతో మూడు రూపాలుగా విడిపోయింది. సాత్త్విక అహంకారం నుంచి ఇంద్రియాలకు అధిదేవతలైన దిక్పాలకులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీదేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి మొదలైనవారు ఉద్భవించారు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తాలకు అధిదేవతలైన చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, క్షేత్రజ్ఞుడు కూడా ఉద్భవించారు.
భూమన్ మానసబుద్ధ్యహంకృతిమిలచ్చిత్తాఖ్యవృత్త్యన్వితం
తచ్చాంతఃకరణం విభో తవ బలాత్ సత్త్వాంశ ఏవాసృజత్ |
జాతస్తైజసతో దశేంద్రియగణస్తత్తామసాంశాత్ పున-
–స్తన్మాత్రం నభసో మరుత్పురపతే శబ్దోఽజని త్వద్బలాత్ || 7 ||
ఓ గురువాయూరప్పా! సాత్త్విక అహంకారం నుంచి మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం కలిసిన అంతఃకరణం ఏర్పడింది. రాజస అహంకారం నుంచి ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు కలిపి పది ఇంద్రియాలు పుట్టాయి. తామస అహంకారం నుంచి మొదట శబ్దం అనే సూక్ష్మ గుణం ఉద్భవించింది. అదే ఆకాశ సృష్టికి మూలమైంది.

శబ్దాద్వ్యోమ తతః ససర్జిథ విభో స్పర్శం తతో మారుతం
తస్మాద్రూపమతో మహోఽథ చ రసం తోయం చ గంధం మహీమ్ |
ఏవం మాధవ పూర్వపూర్వకలనాదాద్యాద్యధర్మాన్వితం
భూతగ్రామమిమం త్వమేవ భగవన్ ప్రాకాశయస్తామసాత్ || 8 ||
ఓ మాధవా! శబ్దం నుంచి ఆకాశం, ఆకాశం నుంచి స్పర్శ, స్పర్శ నుంచి వాయువు ఉద్భవించాయి. వాయువు నుంచి రూపం, రూపం నుంచి అగ్ని పుట్టాయి. అగ్ని నుంచి రుచి, రుచి నుంచి నీరు, నీటి నుంచి వాసన, వాసన నుంచి భూమి ఉద్భవించాయి. ఈ క్రమంలో తరువాత పుట్టిన ప్రతి భూతం, ముందుగా పుట్టిన భూతాల గుణాలను కూడా తనలో కలిగి ఉంది
ఏతే భూతగణాస్తథేంద్రియగణా దేవాశ్చ జాతా పృథక్
నో శేకుర్భువనాండనిర్మితివిధౌ దేవైరమీభిస్తదా |
త్వం నానావిధసూక్తిభిర్నుతగుణస్తత్త్వాన్యమూన్యావిశం-
–శ్చేష్టాశక్తిముదీర్య తాని ఘటయన్ హైరణ్యమండం వ్యధాః || 9 ||
పంచభూతాలు, ఇంద్రియాలు, వాటి అధిదేవతలు విడివిడిగా ఉన్నంతవరకు ఈ విశ్వాన్ని నిర్మించలేకపోయాయి. అప్పుడు నీవు ఆ తత్త్వాలన్నింటిలో ప్రవేశించి, వాటికి పనిచేసే శక్తిని ప్రసాదించావు. వాటన్నింటినీ ఒకటిగా కలిపి, బంగారు కాంతితో ప్రకాశించే హిరణ్యగర్భ అండాన్ని సృష్టించావు.
అండం తత్ఖలు పూర్వసృష్టసలిలేఽతిష్ఠత్ సహస్రం సమాః
నిర్భిందన్నకృథాశ్చతుర్దశజగద్రూపం విరాడాహ్వయమ్ |
సాహస్రైః కరపాదమూర్ధనివహైర్నిశ్శేషజీవాత్మకో
నిర్భాతోఽసి మరుత్పురాధిప స మాం త్రాయస్వ సర్వామయాత్ || 10 ||
ఆ హిరణ్యగర్భ అండం వెయ్యి సంవత్సరాల పాటు కారణజలంలో నిలిచి ఉంది. తరువాత నీవు దానిని చీల్చుకొని, పద్నాలుగు లోకాలతో కూడిన విరాట్ పురుషుని రూపంలో వెలిశావు. వేల చేతులు, పాదాలు, శిరస్సులు కలిగి, సమస్త జీవుల్లో ఆత్మగా వెలుగుతున్న ఓ గురువాయూరప్పా! నన్ను అన్ని రోగాలు, బాధల నుంచి రక్షించు.
5 వ దశకం సమాప్తమ్
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏









