1 వ అధ్యాయం – అర్జున విషాద యోగము

Bhagavadgita meaning in telugu
ప్రపంచంలో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో లేనిది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు.
-భగవద్గీత.
భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. మహాభారతంలో శ్రీమద్భగవద్గీతకు ప్రత్యేక స్థానం ఉంది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. మహాభారత యుద్ధం జరగకూడదని శ్రీ కృష్ణ పరమాత్ముడు అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ యుద్ధం అనివార్యమైంది. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. సొంతవారు నాచే చంపబడుతున్నారు అన్న మొహం అర్జునుణ్ణి ఆవహించి విషాదాన్ని కలుగజేయగా, యుద్ధం చేయనన్న అర్జునుడి విషాదాన్ని పోగొట్టి, జ్ఞానాన్ని కలుగచేయడానికి, కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీ కృష్ణ పరమాత్మ  బోధించిన విషయమే భగవద్గీత. సంజయుడు దృతరాష్ట్రుడి సారథి. ఇతడికి వేదవ్యాసుడు దివ్య దృష్టిని ప్రసాదించాడు. ఆ దివ్యదృష్టి సాయంతో గీతా బోధనను దృతరాష్ట్రుడికి వినిపించాడు.  
మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వములోని 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. దీనిని “గీతోపనిషత్తు” అని కూడా అంటారు. ప్రపంచ సాహిత్యంలోనే కేవలం భగవద్గీత గ్రంథానికి మాత్రమే జయంతిని జరుపుతారు. గీత కేవలం పారాయణ గ్రంథం కాదు. గీతా సందేశాన్ని తెలుసుకుని, ఆచరించాలి. అందుకే అది ఆచరణ గ్రంథం.  ఆచరిస్తే ఫలితం వస్తుంది.

1 అధ్యాయం – అర్జున విషాద యోగం

ధృతరాష్ట్రుడు ఈ విధంగా పలికాడు. “సంజయా! ధర్మానికి నిలయమైన కురుక్షేత్రంలో యుద్ద సన్నద్ధులై నిలచిన నా వాళ్ళు, పాండవులు ఏం చేశారు?
అప్పుడు సంజయుడు ఇలా పలికాడు. “మహారాజా! యుద్దానికి సంసిద్దులై పున్న పాండవ సైన్యాలను చూసి ధుర్యోధనుడు ద్రోణచార్యుల దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. “ఆచార్య! మీ శిష్యుడు, ధీమంతుడు అయిన దృష్టద్యుమ్ముడు వ్యూహం పన్నిన మహా సైన్యాన్ని చూడండి. ఈ పాండవుల సైన్యంలో, ధైర్య సాహసవంతులు, అస్త్రవిద్యా నిపుణులు, శౌర్యంలో భీమార్జున సమానులు ఉన్నారు. సాత్యకి, విరాటుడు, ధ్రుపదుడు, దృష్టకేతుడు, చేకితాసుడు, కాశీరాజు, పురుజిత్తు, శైబుడు, యుధామాన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు కూడా ఉన్నారు. వీళ్ళంతా మహారధులే. ఇక మన సైన్యంలో వున్న నాయకులూ, సుప్రసిద్దులూ అయిన వాళ్ల గురించి కూడా చెబుతాను. మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామా, వికర్ణుడు, సౌమధత్తి ఉన్నారు. ఇంకా ఎంతో మంది శురాగ్రేసరులు, యుద్దావిశారదులు, నా కోసం జీవితాల మీద ఆశ వదిలి, సిద్ధంగా ఉన్నారు.
భీష్ముడు రక్షిస్తున్న మన సైన్యం అపరిమితం. భీముడి రక్షణలో వున్న పాండవ సైన్యం పరిమితం. అందువల్ల మీరంతా యుద్దరంగంలో, మీమీ స్థానాలు వదిలిపెట్టకుండా ఉండి భీష్ముడిని కాపాడాలి” అన్న దుర్యోధనుడికి సంతోషం కలిగిస్తూ, కురువృద్ధుడైన భీష్ముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు. వెంటనే కౌరవవీరుల ధక్కమృదంగ గోముఖాది ధ్వనులతో ధిక్కులన్ని పిక్కటిల్లాయి. అప్పడు, తెల్లగుర్రాలు కట్టిన మహారధం మీద కూర్చున్న కృష్ణార్జునులు కూడా, తమ దివ్య శంఖాలు పూరించారు. శ్రీకృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌడ్రకం ఊదారు. ధర్మరాజు అనంత విజయం, నకుల సహదేవులు సుఘోష, మణిపుష్పకాలు పూరించారు. కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్ముడు,విరాటుడు, సాత్యకి ద్రుపదుడు, ఉప పాండవులు, అభిమన్యుడు తమ తమ శంఖాలు అని వైపులా ఊదారు. ఆ శంఖ ద్వనులు భూమి ఆకాశాలను దద్ధరిల్లజేస్తూ, కౌరవ వీరుల హృదయాలను బద్దలు చేశాయి.
అప్పుడు అర్జునుడు యుద్దసన్నద్ధులైన దుర్యోధనాదులను చూసి, గాండీవం ఎత్తినట్టి శ్రీ కృష్ణుడితో “అచ్యుతా! రెండు సేనల మధ్య నా రధాన్ని నిలబెట్టు. శత్రు వీరులను, దుష్టుడైన దుర్యోధనుడికి సాయం చేయడానికి, సమర రంగానికి వచ్చిన వాళ్ళందరిని చూడాలనుకుంటున్నాను” అన్నాడు.
అర్జునుడి మాటలు ఆలకించిన శ్రీ కృష్ణుడు, రెండు సేనల మధ్య భీష్మ ద్రోణాదులకు ఎదురుగా రధం ఆపి, అక్కడ చేరిన కౌరవ బలాన్ని అవలోకించమన్నాడు. అప్పుడు అర్జునుడు ఉభయ సేనలలోను యుద్దానికి సిద్ధంగా ఉన్న, తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, బంధువులందరిని చూశాడు. చూసి మిక్కిలి దయగలిగి దుఖిఃస్తు, విశేష కృప తరంగుడూ, విషాదవశుడు అయి, ఇలా అన్నాడు. “కృష్ణా! యుద్దాసక్తులై ఎదురుగా ఉన్న బంధువులను చూడగానే నా హావభావాలు తడబడ్తున్నాయి. నోరు ఎండిపోతున్నది. శరీరమంతా గగుర్పాటుతో కంపిస్తోంది. గాండీవం చేతిలో నుంచి జారిపోతున్నది. దేహం మండుతున్నది. నిలబడడానికి కూడా శక్తి లేదు. నా మనస్సు తల్లడిల్లుతున్నది. దుశ్శకునాలు కాన వస్తున్నాయి. యుద్దంలో బంధువులను చంపడం వల్ల కలిగే మేలు గోచరించడం లేదు.
యుద్ద విజయం మీద, రాజ్యసుఖాల మీద నాకు ఆసక్తి లేదు. రాజ్య భోగాలతో కూడిన జీవిత ప్రయోజనం ఏమి లేదు. ఎవరి కోసం రాజ్యం, భోగం, సుఖం కోరుతున్నామో వాళ్ళంతా గురువులు, తండ్రులు, కుమారులు, ఇతర బంధువులు. ధన, ప్రాణాల మీద ఆశ వదిలి, ఈ రణ రంగంలోనే వున్నారు. వాళ్ళు నన్ను చంపితే చంపనీ. ముల్లోకాలని ఏలే అవకాశం కలిగినా, నేను మాత్రం వాళ్ళను వధించలేను. అలాంటప్పుడు ఈ రాజ్యం కోసం వాళ్ళని చంపుతానా? దుర్యోధనాదులను సంహరించి, మనం పొందే సంతోషమేమిటి? ఈ పాపాత్ములను చంపితే, మనకూ పాపమే. రాజ్యకాంక్ష పరులైన కౌరవులు- వంశ నాశనం, మిత్ర ద్రోహం వల్ల కలిగే పాతకాన్ని గ్రహించలేకపోతున్నారు. జనార్ధన! వంశక్షయం వల్ల వచ్చే దోషాన్ని బాగా తెలిసిన మనం, ఆ పాపం నుంచి ఎందుకు తప్పించుకోకూడదు. వంశనాశనంతో ప్రాచీన కులధర్మాలు నశిస్తాయి. వంశమంతట అధర్మం అమలుకుంటుంది. అధర్మం ప్రబలితే కులస్త్రీలు చెడిపోతారు. దాంతో జాతి సంకరం జరుగుతుంది.
వర్ణ సంకరం వల్ల కులానికి, కుల నాశకులకు కలిగేది నరకమే. వారి పితృ దేవతలు పిండోదకాలు లేక, అధోగతి పాలవుతారు. కులాన్ని నాశనం చేసే వాళ్ల మూలంగా కలిగే వర్ణ సంకరం కారణంగా, శాశ్వతాలైన జాతి ధర్మాలు, కుల ధర్మాలు అడుగంటిపోతాయి. కుల ధర్మాలు నశించిన కుటుంబాల వారు, శాశ్వత నరకవాసులవుతారని వింటున్నాము.  ఎంత ఆశ్చర్యం! రాజ్య లోభంతో బంధువులను చంపడానికి పూనుకొని ఘోర పాపాలు చేయడానికి సిద్దపడ్డాము కదా. ఆయుధాలు ధరించిన ధార్త రాష్ట్రులు, అస్త్రశస్త్రాలు విసర్జించిన నన్ను యుద్దంలో సంహరిస్తే, అది నాకు మరింత మంచిదే కదా” అర్జునుడు ఇలా చెప్పి, దుఃఖాక్రాంతుడై, విల్లమ్ములు విడిచి పెట్టి, రణరంగంలో రధం మీద చతికిలబడ్డాడు.

మిగిలిన అధ్యాయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ⬇️

1 వ అధ్యాయం – అర్జున విషాద యోగం
2 వ అధ్యాయం – సాంఖ్య యోగం
3 వ అధ్యాయం – కర్మ యోగం
4 వ అధ్యాయం -జ్ఞాన యోగం
5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము
6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము
7 వ అధ్యాయం  -జ్ఞాన విజ్ఞాన యోగము
8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము
9  వ అధ్యాయం – రాజ విద్య రాజగుహ్య యోగము
10  వ అధ్యాయం –విభూతి యోగము
11  వ అధ్యాయం –విశ్వరూప సందర్శన యోగము
12  వ అధ్యాయం – భక్తి యోగము
13  వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము
14  వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము
15  వ అధ్యాయం- పురుషోత్తమప్రాప్తి యోగము
16  వ అధ్యాయం- దైవాసుర సంపద్విభాగయోగము
17  వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము
18  వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము
Tags: , , , , , , , , , , ,