గోదాదేవి చరిత్ర
అనన్యసామాన్యమైన భక్తితో సాక్షాత్తూ శ్రీరంగనాథుని మెప్పించి, ఆయననే పతిగా పొందింది గోదాదేవి. గోదాదేవిని కోదై, చూడిక్కొడుత్త నాచ్చియార్, ఆండాళ్, ఆముక్తమాల్యద అని కూడా పిలుస్తారు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువునే వివాహం చేసుకునేంత భక్తి ఆమెకు ఎలా వచ్చింది? ఆ స్వామిని ఎలా మెప్పించింది? ఏ వ్రతం ఆచరించింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోదాదేవి తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడికి తులసివనంలో అయోనిజగా ప్రత్యక్షమైంది. శ్రీవిల్లిపుత్తూరుకు సంబంధించిన ఒక పురాణగాథ ఉంది. వరాహావతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించిన అనంతరం, శ్రీ ఆదివరాహస్వామి భూదేవి కోరిక మేరకు ఆమెతో కలిసి కొంతకాలం ఈ ప్రాంతంలో నివసించాడని నమ్మకం. తరువాత అవతార సమాప్తి సమయంలో మర్రి ఆకుపై తేలియాడుతూ వటపత్రశాయిగా లోకాన్ని రక్షించాడని విశ్వాసం. తరువాతి కాలంలో విల్లి అనే కిరాతరాజు స్వామివారి ఆజ్ఞతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో వటపత్రశాయి ప్రధానదైవంగా కొలువై ఉన్నాడు.
విష్ణుచిత్తుడు నిత్యం స్వామికి పుష్పమాలలు, తులసిమాలలు తయారుచేసి సమర్పించేవాడు. ఆయన అసలు పేరు భట్టనాథుడు. గరుత్మంతుని అంశంతో జన్మించాడని చెబుతారు. ఆయన చిత్తం ఎల్లప్పుడూ విష్ణుమూర్తిపైనే ఉండేది కాబట్టి “విష్ణుచిత్తుడు” అనే పేరు వచ్చింది. 12 మంది ఆళ్వార్లలో ఒకరిగా ఆయనను గౌరవించి, “పెరియాళ్వారు” అనే బిరుదునిచ్చారు.
కలియుగ ప్రారంభంలో, సా.శ. 776 నల సంవత్సరం, కర్కాటక మాసం, పుబ్బ నక్షత్రం, ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున విష్ణుచిత్తుడు తులసి మొక్కల కోసం మట్టిని త్రవ్వుతుండగా, జనక మహారాజుకు సీతాదేవి లభించినట్లే తులసివనంలో ఒక బాలిక కనిపించింది. ఆమెను భగవంతుని ప్రసాదంగా భావించి పెంచసాగాడు. ఆమెకు “కోదై” (పూలమాల) అనే పేరు పెట్టాడు. ఆ పేరు క్రమంగా “గోదా”గా మారింది.
తండ్రి పెంపకంలో గోదాదేవి అచంచలమైన కృష్ణభక్తితో పెరిగింది. తండ్రి పుష్పమాలలు అల్లుతుంటే తానూ నేర్చుకుంది. వేదాలు, పురాణాలు, భాగవతం, రామాయణం, తమిళ ప్రబంధాలు, పాశురాలు అన్నీ వింటూ ఎదిగింది. చిన్ననాటి నుంచే కృష్ణలీలలు ఆడుకుంటూ పెరిగిన ఆమెకు యౌవనంలో ఆ భక్తి ప్రేమగా మారింది. కళ్లుమూసినా, తెరిచినా కృష్ణుడే కనిపించసాగాడు. తన స్నేహితురాళ్లను గోపికలుగా, విల్లిపుత్తూరును గోకులంగా భావించసాగింది.
విష్ణుచిత్తుడు ప్రతిరోజూ తయారుచేసిన మాలను దేవాలయానికి తీసుకెళ్లే ముందు, గోదా దానిని రహస్యంగా ధరించి అద్దంలో చూసుకుని, “నేను భగవంతునికి తగిన వధువునా?” అని తనను తాను పరిశీలించేది. ఒక రోజు మాలలో వెంట్రుక కనిపించడంతో విషయం తెలిసి విష్ణుచిత్తుడు బాధపడ్డాడు. కానీ స్వప్నంలో కృష్ణుడు ప్రత్యక్షమై, “ఆమె భూదేవి అవతారం; ఆమె ధరించిన మాల నాకు మరింత ప్రీతికరం” అని చెప్పాడు.
అప్పటి నుండి ఆమెను “ఆండాళ్” అని పిలిచారు. ఆండాళ్ అంటే “ఆండినది” లేదా “రక్షించడానికి వచ్చినది” అనే అర్థం. ప్రతిరోజూ ఆమె ధరించిన మాలనే స్వామికి సమర్పించసాగారు.
గోదాదేవి కృష్ణునినే భర్తగా కోరుకుంది. విష్ణుచిత్తుడు 108 దివ్యదేశాల వివరాలు చెప్పగా, గోదాదేవి శ్రీరంగంలో వెలసిన శ్రీరంగనాథునినే వరుడిగా ఎంచుకుంది.
గోపికలు కృష్ణుని పొందడానికి కాత్యాయనీ వ్రతం చేసినట్లు విని, గోదాదేవి కూడా ధనుర్మాసంలో కాత్యాయనీ వ్రతం ఆచరించింది. ప్రతిరోజూ ఒక పాశురం చొప్పున 30 పాశురాలు రచించి వటపత్రశాయి సన్నిధిలో పాడింది. ఇవే ప్రసిద్ధమైన “తిరుప్పావై” పాశురాలు. ఇవి నేటికీ ధనుర్మాసంలో వైష్ణవాలయాలలో పఠించబడుతున్నాయి.
గోదాదేవి భక్తికి మెచ్చి శ్రీరంగనాథుడు స్వప్నంలో విష్ణుచిత్తునికి ప్రత్యక్షమై, గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. రాజు వల్లభదేవునితో పాటు అంగరంగ వైభవంగా ఆమెను శ్రీరంగానికి తీసుకువెళ్లారు. స్వామివారి సన్నిధిలో వివాహం జరిపించారు. పెళ్లికూతురిగా గర్భగుడిలో ప్రవేశించిన గోదాదేవి, స్వామి పాదాలకు నమస్కరించి శ్రీరంగనాథునిలో లీనమైంది.
విష్ణుచిత్తుడు దుఃఖించగా, స్వామి జ్ఞానోపదేశం చేసి ఆయనను ఓదార్చాడు. భోగి రోజున ఈ దివ్యకళ్యాణం జరిగినట్లు చెబుతారు. అందుకే భోగి నాడు గోదాదేవి-రంగనాథుల కళ్యాణం జరుపుతారు.
గోదాదేవి రచించిన “తిరుప్పావై” (30 పాశురాలు) మరియు “నాచ్చియార్ తిరుమొళి” (143 పాశురాలు) విశేష ఖ్యాతి పొందాయి. 12 మంది ఆళ్వార్లలో గోదాదేవి ఏకైక మహిళా ఆళ్వారు.
శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి ప్రత్యక్షమైన తులసివనం, ఆమె మాలలు ధరించి చూసుకున్న బావి, విష్ణుచిత్తుడు నివసించిన మండపం నేటికీ దర్శనమిస్తాయి.
ఇలా స్వచ్ఛమైన మనస్సుతో, అచంచల భక్తితో తన హృదయాన్ని శ్రీరంగనాథునికి సమర్పించి, ఆయననే పతిగా పొందిన మహాభక్తురాలు గోదాదేవి.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.


