14 లోకాల రహస్యం
కమలంపై సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. కమలానికి ఉండే కాడలాగా 14 లోకాలు ఉంటాయి. పరమపురుషుడు ఒక బ్రహ్మాండాన్ని విడివిడిగా చేసి 14 లోకాలను తీర్చిదిద్దాడు. ఈ లోకాలలో పైనున్న ఏడు లోకాలను విష్ణువుకు నడుము నుండి పైనున్న శరీరంగా, కిందనున్న ఏడు లోకాలను కింద శరీరంగా పరిగణిస్తారు. మొత్తం ఈ 14 లోకాలు భగవంతుని శరీరమే.ఈ 14 లోకాలు ఏవి? ఆ లోకాల్లో ఎవరెవరు ఉంటారు? ఆ లోకాల ప్రధాన నగరాలు ఏవి? అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఆ మహావిష్ణువుకు కటి స్థలం భూలోకం, హృదయం సువర్లోకం, మహర్లోకం స్థనాలు, తపోలోకం కంఠం, శిరస్సు సనాతనమైన బ్రహ్మ నివసించే సత్యలోకం. ఇక కింద లోకాల గురించి చూస్తే, అతల లోకం తొడలు, విటల లోకం మోకాళ్లు, సుతల లోకం జంఘాలు, తలాతల లోకం చీలమండలు, మహాతల లోకం పాదాలు, రసాతల లోకం పాదతళాలు, పాతాళం పాదవేళ్లు.
మరికొంతమంది ఆయన పాదాల నుండి భూలోకం, నాభి నుండి భువర్లోకం, శిరస్సు నుండి స్వర్గం పుట్టాయని మూడు లోకాల సృష్టిని వివరిస్తారు.పైన ఉండే ఏడు ఉర్ధ్వలోకాలు: సత్యలోకం, తపోలోకం, జనలోకం, మహర్లోకం, సువర్లోకం, భువర్లోకం, భూలోకం. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం.
మొదటిది సత్యలోకం. ఇక్కడ బ్రహ్మదేవుడు సరస్వతి దేవితో కలిసి ఉంటాడు. విద్యాధరులు, దివ్యజనులు ఇక్కడ నివసిస్తారు. ఈ లోకానికి ప్రధాన నగరం పురాణపురం.రెండవది తపోలోకం. ఇక్కడ సాధ్యులు, కుమారులు, మహాసాధువులు నివసిస్తారు. ఈ లోకానికి రాజధాని అంజనావతి పురం. ఇది సత్యలోకం నుండి 12 కోట్ల యోజనాల కింద ఉంటుంది.
మూడవది జనలోకం. తపోలోకం నుండి ఎనిమిది కోట్ల యోజనాల కింద జనలోకం ఉంటుంది. ప్రధాన నగరం అమరావతిపురం. ఈ లోకంలో బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు ఉంటారు. వీరు బ్రహ్మచారులే. లోకసంచారం చేస్తూ జ్ఞానాన్ని పంచుతుంటారు. ఎప్పుడూ ఐదు సంవత్సరాల బాలురులా కనిపిస్తారు. విష్ణు దర్శనార్థం వచ్చిన సనత్‌కుమారులను అడ్డగించిన జయవిజయులు వీరి శాపానికి గురై మూడు జన్మలు విష్ణువుకు విరోధులుగా భూలోకంలో జన్మించారు.
నాలుగవది మహర్లోకం. జనలోకం నుంచి నాలుగు కోట్ల యోజనాల కింద మహర్లోకం ఉంటుంది. అష్టసిద్ధులు కైవసం చేసుకున్న ఋషులు, మునులు నివసిస్తారు. వీరి ప్రధాన నగరం జ్యోతిష్మతిపురం. వీరు సత్యలోకానికి, భూలోకానికి సంచరిస్తూ ఉంటారు. ఇక్కడి కాలపరిమాణం ఎంతో విశేషమైనది. 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మదేవుని ఒక రోజుతో సమానం.
ఐదవది సువర్లోకం, దీనినే స్వర్గలోకం అంటారు. ఇక్కడ నుంచి 80 వేల యోజనాల కింద అమరావతి అనే రాజధాని ఉంటుంది. అక్కడ ఇంద్రుని పరిపాలనలో అమరులైన 33 కోట్ల దేవతలు నివసిస్తూ ఉంటారు. వీరితో పాటు ఇతర దేవగణాలు, అప్సరసలు, దేవదూతలు మొదలైన వారు కూడా ఉంటారు. వీరంతా రాక్షసులను ఎదుర్కొంటూ ఈ బ్రహ్మాండాన్ని రక్షిస్తూ ఉంటారు. అంతా బంగారంతో నిర్మితమై ఎంతో అందంగా, అద్భుతంగా ఉంటుంది. పాలసముద్రం నుంచి లభించిన కల్పవృక్షం, కోరికలు తీర్చే కామధేనువు, ఉచ్చైశ్రవసు అనే రెక్కల గుర్రం, ఐరావతం అనే మూడు తలల ఏనుగు అక్కడ ఉంటాయి. అక్కడి వారు స్వర్గలోకం, సత్యలోకం ఇంకా ఇతర లోకాలకు కూడా సంచరించగలరు. భువర్‌లోకం, గ్రహాలు, నక్షత్రాలు, అంతరిక్షం ఈ లోకంలోనే ఉంటాయి. దేవశిల్పి అయిన విశ్వకర్మ నిర్మించిన మహానగరాలు అక్కడ కనిపిస్తాయి.
ఆ లోకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది పాలపుంత మధ్యలో ధృవలోకం నుంచి కోటి యోజనాల కింద ఉంటుంది. జనలోకం ధృవలోకం నుంచి లక్ష యోజనాల కింద ఉంటుంది. ఈ లోకంలో సప్తర్షులు నివసిస్తూ ఉంటారు. నక్షత్రలోక మండలం కూడా ఉంటుంది. సౌర లోకం సౌరమండలంలోని గ్రహాలు ఈ లోకంలోనే ఉంటాయి. సూర్యలోకం సూర్యుడు నివసించే లోకం. ఇది భూమి నుంచి లక్ష యోజనాల దూరంలో ఉంటుంది. చంద్రలోకం భూమి నుంచి 30 వేల యోజనాల దూరంలో ఉంటుంది. ఈ లోకంలో చంద్రుడు ఉంటాడు. రాహు కేతు లోకం ఇక్కడ సూర్యచంద్ర గ్రహణాలకు కారకులైన రాహు, కేతువులు నివసిస్తారు. అంతరిక్షం దీనినే ఆకాశలోకం అని కూడా అంటారు. ఈ లోకం భూలోకం నుంచి కొన్ని యోజనాల పైన మాత్రమే ఉంటుంది. ఇక్కడ గాలి, మబ్బులు, యక్షులు, పిశాచాలు, భూతాలు ఉంటాయి.
ఏడవది భూలోకంలో సప్తసముద్రాలు, సప్తద్వీపాలు ఉన్నాయి. ఈ సప్తద్వీపాల మధ్యలో మనం నివసించే జంబుద్వీపం ఉంటుంది. ఇది తొమ్మిది ఖండాలుగా విభజించబడింది. అందులో దక్షిణ దిశలో ఉన్న ఖండం భరతఖండం. ఈ లోకంలో మనుషులతో పాటు ఇతర జీవులు కూడా ఉంటాయి. కాలచక్రం ప్రకారం జనన మరణాల చక్రం కొనసాగుతుంది.
భూమికి కింద ఉన్న అధోలోకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భూమండలం కింద ఒకదాని కింద ఒకటిగా అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం అనే లోకాలు ఉన్నాయి. ఈ లోకాల మధ్య ఒక్కొక్క దానికి పది వేల యోజనాల దూరం ఉంటుంది. ఇవి కింద ఉన్నా కూడా స్వర్గంలా సుఖసంపన్నంగా ఉంటాయి. దానవులు, నాగులు అక్కడ నివసిస్తారు. అందరూ ఐశ్వర్యంతో సుఖభోగాలతో జీవిస్తారు. అందమైన ఉద్యానవనాలు, మణులతో పొదిగిన గృహాలు ఉంటాయి. భార్యబిడ్డలతో, చుట్టాలతో, దాసదాసీజనంతో ఎటువంటి వ్యాధులు లేకుండా సర్వసుఖాలను అనుభవిస్తారు. ఉద్యానవనాల్లో చిలకలు, గోరింకలు, రకరకాల పూలు, పండ్లు కనులపండుగలా ఉంటాయి. అందమైన సరోవరాల్లో తెల్ల కలువలు, రంగురంగుల తామరపూలు, సుందర పక్షులు కనిపిస్తాయి. పగలు రాత్రి అనే తేడా ఉండదు. శేషుడు మొదలైన సర్పరాజుల పడగలపై ఉన్న మణుల ప్రకాశం వల్ల ఎప్పుడూ పగలులాగానే ఉంటుంది. రకాల మూలికలు, రసాయనాలు ఆహారంగా స్వీకరించడం వల్ల వారికి వ్యాధులు ఉండవు. విష్ణు సుదర్శన చక్ర భయం తప్ప వేరే భయం ఉండదు.
ఇప్పుడు 7 లోకాల గురించి తెలుసుకుందాం. మొదటిది అతలం. బోలోకని కింద తెల్లని రంగులో ఉంటుంది. అతలలోకంలో మయుని కుమారుడైన బల అనే అసురుడు 96 విధాలైన మాయలతో విహరిస్తూ ఉంటాడు. ఈ మాయలకు భూలోకంలోని ప్రజలు ఆకర్షితులవుతారు. పిశాచగణాలు కూడా అక్కడ ఉంటాయి. రెండవది వితలం ఈ లోకానికి హటకేశ్వరుడు అనే పేరుతో పార్వతీపతి శివుడు అధిదేవతగా ఉంటాడు. అక్కడ పార్వతీ పరమేశ్వరుల వల్ల హాటక అనే బంగారం పుట్టింది. ఆ లోకంలోని వారు ఆ బంగారంతో చేసిన ఆభరణాలు ధరిస్తారు.
సుతలలోకంలో రెండు ప్రధాన నగరాలు ఉన్నాయి. ఒకటి అలకాపురి. అక్కడ కుబేరుడు నిధులను కాపలా కాసే యక్షులతో కలిసి నివసిస్తాడు. మరొకటి యోగినీపురం. మూడవది సుతలం రెండు భాగాలుగా ఉంటుంది. ఒక భాగంలో విరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి ఉంటాడు. ధర్మప్రవర్తనకు మెచ్చి శ్రీమన్నారాయణుడు ఈ లోకానికి అతడిని అధిపతిగా చేశాడు. బలిచక్రవర్తి భవనానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శంఖచక్రధారిగా కాపలా కాస్తాడు. గర్వంతో జయించాలనే కోరికతో రావణుడు అనుమతి లేకుండా సుతలంలోకి ప్రవేశించినప్పుడు, శ్రీమన్నారాయణుడు తన కాలి బొటనవేలితో రావణుణ్ణి పది కోట్ల యోజనాల దూరంలోకి నెట్టివేశాడు.
మరొక భాగంలో యమలోకం ఉంటుంది. యమలోకంలోని వైవస్వతపురం అనే నగరంలో యమధర్మరాజు నివసిస్తాడు. వైవస్వతపురం లోనే వైతరణి నది ప్రవహిస్తుంది. నల్గావోది తలాతలలోకానికి అధిపతి మయుడు. రాక్షసుల పట్టణాలు నిర్మించిన మహాశిల్పిగా మయుడు ప్రసిద్ధి చెందాడు. సుదర్శనచక్రం వల్ల తప్ప మరే కారణంతో మరణభయం ఉండదని విష్ణుమూర్తి వరమిచ్చి తలాతలానికి రాజుగా చేశాడు. మహాతలంలో కృష్ణాపురం అనే నగరం ఉంది. అక్కడ భేతాళుడు, యక్షులు, అసురగణాలు, భూతగణాలు నివసిస్తూ ఉంటారు.
అయిదవది మహాతలం’ ఈ లోకంలో కద్రువు కొడుకులైన సర్పరాజులు ఉంటారు. ఎప్పుడూ కోపావేశాలతో ఉండే వీరికి అనేకమైన పడగలు ఉంటాయి. మిత్రులతో కలిసి ఉంటారు. పితృదేవతలు కూడా ఈ లోకంలోనే ఉంటారు. మనం చేసే శ్రాద్ధకర్మలు, పిండప్రదానాలు ఈ పితృదేవతల ద్వారానే మరణించిన మనవారికి చేరుతాయి.
ఆరవది రసాతలం. నైరుతి దిక్కుకు అధిపతి అయిన నిరృతి నివసిస్తూ ఉంటాడు. హిరణ్యపుర వాసులు, నివాతకవచులు, కాలకేయులు ఉంటారు. దేవతలకు శత్రువులు, మహా సాహసవంతులు, అత్యంత శక్తిసామర్థ్యాలు కలవారు అయిన వీరు శ్రీహరి తేజస్సుకు భయపడి బ్రతుకుతూ ఉంటారు. ఇక్కడ ప్రధాన నగరం పుణ్యపురం. రాక్షసులు భూతగణాలతో కలిసి ఉంటారు.
ఏడవది పాతాళలోకం. పాతాళలోకంలో వాసుకి, శంఖుడు, కులికుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంకచూడుడు మొదలైన మహానాగులు నివసిస్తారు. వీరిలో ఐదు తలలు, వంద తలలు, వెయ్యి తలలు కలిగిన నాగులు కూడా ఉంటారు. పాతాళంలో సూర్యరశ్మి ఉండదు. వారి పడగల మీదున్న మణుల నుండి వచ్చే మెరుపులతో పాతాళం అంతా ప్రకాశిస్తుంది. పాతాళలోకం అడుగున ఆదిశేషుడు ముప్పై వేల యోజనాల వెడల్పుతో చుట్టచుట్టుకుని ఉంటాడు. ఈ లోకంలో సరీసృపజాతికి చెందిన కొన్ని జీవులు కూడా ఉంటాయి.
ఈ లోకాలన్నింటిపైనా వైకుంఠం, కైలాసం ఉంటాయి. ఈ లోకాలు అన్నింటికంటే పైగా శ్రీనగరం అనే ఒక లోకం ఉంటుంది. అక్కడి నుంచి ఆదిపరాశక్తి ఈ బ్రహ్మాండాలన్నింటిని పరిపాలిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీమహావిష్ణువులోనే సకల దేవతలు, బ్రహ్మాండాలు, లోకాలు ఉన్నాయి. ఇవన్నీ ఆయన అర్జునుడికి చూపించిన విశ్వరూప దర్శనంలో మనం చూడొచ్చు.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.


