Telugu translation and meaning of Lalitha Sahasranamam Phalasruthi section with devotional background

లలితా సహస్రనామం ఫలశృతి

లలితా సహస్రనామం ఫలశృతి

లలితా సహస్రనామం ఫలశృతి అనేది లలితా సహస్రనామం చివరలో వచ్చే పవిత్రమైన భాగం. ఇందులో లలితా త్రిపురసుందరి దేవిని భక్తితో స్మరించి సహస్రనామాలను జపించిన వారికి లభించే దైవిక ఫలితాలు వివరించబడతాయి. ఈ మహిమాన్వితమైన స్తోత్రం బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం నుండి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. ఫలశృతి ద్వారా ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే శుభఫలాలు, ఆధ్యాత్మిక మహిమ భక్తులకు తెలియజేయబడుతుంది.

లలితా సహస్రనామం ఫలశృతిని భక్తితో పఠిస్తే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం మరియు మనశ్శాంతి లభిస్తాయని విశ్వాసం. నిత్యం లేదా పర్వదినాల్లో దీనిని జపించడం ద్వారా దుష్ట ప్రభావాలు తొలగి సానుకూల శక్తి పెరుగుతుందని భావిస్తారు. అమ్మవారి అనుగ్రహంతో కుటుంబంలో శాంతి, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. 🙏✨

ఇత్యేతన్నామసాహస్రం కథితం తే ఘటోద్భవ   ||1||

ఓ అగస్త్యుడా! ఇక్కడితో నీకు చెప్పబడిన వేయి సహస్రనామములు సమాప్తిని పొందినవి.

రహస్యానాం రహస్యం చ లలితాప్రీతిదాయకమ్ అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్యతి   || 2 ||

రహస్యములలోకెల్లా మిక్కిలి రహస్యమైన లలితాదేవికి ప్రీతికరమైన ఈ లలితా స్తోత్రముతో సమానమైన స్తోత్రము ఇదివరకు లేదు, ఇకముందు కలుగబోదు.

సర్వరోగప్రశమనం సర్వసంపత్ప్రవర్ధనమ్

సర్వాపమృత్యుశమనం కాలమృత్యునివారణమ్ || 3 ||

ఈ లలితా సహస్రనామం సమస్తమైన వ్యాధులను శాంతింపచేయునది, సమస్తమైన సంపత్తులను వృద్ధి చెందించునది, సమస్తమైన అపమృత్యు దోషాలను, కాలమృత్యువును పోగొట్టునది.

సర్వాజ్వరార్తిశమనం దీర్ఘాయుష్యప్రదాయకమ్   

పుత్రప్రదమపుత్రాణాం పురుషార్థప్రదాయకమ్ || 4 ||

ఈ లలితా సహస్రనామం సకల బాధలను శాంతింపచేయునది, దీర్ఘాయుష్షును ఇచ్చునది, పుత్రులు లేనివారికి పుత్రులను ఇచ్చునది, నాలుగు విధాల పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షములను కలిగించునది.

ఇదం విశేషాచ్ఛ్రీదేవ్యాః స్తోత్రం ప్రీతివిధాయకమ్   

జపేన్నిత్యం ప్రయత్నేన లలితోపాస్తితత్పరః || 5 ||

లలితాదేవియొక్క ఉపాసన చేయుటయందు ఆసక్తి కలవాడు- శ్రీదేవికి ఎంతో సంతోషమును కలిగించే ఈ స్తోత్రమును ప్రతి దినము శ్రద్ధగా జపించవలెను.

ప్రాతః స్నాత్వా విధానేన సంధ్యాకర్మ సమాప్య చ   

పూజాగృహం తతో గత్వా చక్రరాజం సమర్చయేత్ || 6 ||

ఉదయాన్నే స్నానం చేసి,  సంధ్యావందనం మొదలైన వైదిక కర్మలను పూర్తి చేసి, తరువాత పూజా గృహానికి వెళ్ళి, శ్రీ చక్రాన్ని పూజించాలి.

విద్యాం జపేత్సహస్రం వా త్రిశతం శతమేవ వా   

రహస్యనామసాహస్రమిదం పశ్చాత్పఠేన్నరః || 7 ||

మనుష్యులు వెయ్యి సార్లు కానీ, మూడువందల సార్లు గానీ, నూట ఎనిమిది సార్లు గానీ, పంచదశీ మంత్రాన్ని లేదా షోడశీ మంత్రాన్ని గానీ జపించాలి. తరువాత అతి రహస్యమైన ఈ సహస్రనామాలను పారాయణ చేయాలి.

జన్మమధ్యే సకృచ్చాపి య ఏవం పఠతే సుధీః   

తస్య పుణ్యఫలం వక్ష్యే శృణు త్వం కుంభసంభవ || 8 ||

ఓ అగస్త్యుడా! ఏ పండితుడైతే తన జీవితకాలంలో ఒక్కసారి అయినా, ఇప్పుడు చెప్పిన ప్రకారంగా నామ పారాయణం చేస్తాడో, వానికి లభించే పుణ్య ఫలమును చెప్తాను. విను.

గంగాదిసర్వతీర్థేషు యః స్నాయాత్కోటిజన్మసు   

కోటిలింగప్రతిష్ఠాం చ యః కుర్యాదవిముక్తకే || 9 ||

ఈ రకంగా పారాయణం చేసినవారికి- గంగానది మొదలైన సమస్త తీర్థాలలో, కోటి జన్మలలో స్నానం చేసినంత, అవిముక్తకమనే క్షేత్రంలో, కాశీలో కోటిశివలింగాలను ప్రతిష్ఠ చేసినంత పుణ్యం కలుగుతుంది.

కురుక్షేత్రే తు యో దద్యాత్  కోటివారం రవిగ్రహే   

కోటిం సువర్ణభారాణాం శ్రోత్రియేషు ద్విజన్మసు || 10 ||

ఈ రకంగా పారాయణం చేసినవారికి- కురుక్షేత్రంలో, సూర్యగ్రహణకాలంలో, బ్రాహ్మణులకు అనేక కోట్ల తులాల బంగారు నాణెములను, కోటి సార్లు ఇచ్చినంత పుణ్యఫలం కలుగుతుంది.

యః కోటిం హయమేధానాం ఆహరేద్గాంగరోధసి   

ఆచరేత్కూపకోటీర్యో నిర్జలే మరుభూతలే || 11 ||

ఈ రకంగా నామ పారాయణం చేసినవారికి- గంగా నదీ తీరంలో కోటి అశ్వమేధ యాగాలను చేసినంత  ఫలము, నీరు లేని బీడుభూమిలో కోటి నూతులను తవ్వించినంత పుణ్యము కలుగుతుంది.

దుర్భిక్షే యః ప్రతిదినం కోటిబ్రాహ్మణభోజనమ్   

శ్రద్ధయా పరయా కుర్యాత్ సహస్ర పరివత్సరాన్ || 12 ||

ఈ లలితా సహస్రనామ పారాయణం చేసినవారికి- కరువుకాలంలో పన్నెండు వేల సంవత్సరాలు, శ్రద్ధతో ప్రతిరోజూ కోటిమంది బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేసినంత పుణ్యఫలం కలుగుతుంది.

తత్పుణ్యం కోటిగుణితం లభేత్పుణ్యమనుత్తమమ్   

రహస్యనామసాహస్రే నామ్నోఽప్యేకస్య కీర్తనాత్ || 13 ||

పై శ్లోకములలో చెప్పబడిన పుణ్యమునంతటినీ మరలా కోటి సంఖ్యతో గుణిస్తే వచ్చే పుణ్యమంతా- ఈ సహస్రనామాలలోని కేవలం ఒక్క నామమును పారాయణం చేస్తే కలుగుతుంది.

రహస్యనామసాహస్రే నామైకమపి యః పఠేత్   

తస్య పాపాని నశ్యంతి మహాంత్యపి న సంశయః || 14 ||

రహస్యమైన ఈ దేవీ సహస్రనామాలలో ఒక్క నామమును చదివినా, అనేక జన్మల పాపాలు నిస్సందేహంగా నశించిపోతాయి.

నిత్యకర్మాననుష్ఠానాత్ నిషిద్ధకరణాదపి   

యత్పాపం జాయతే పుంసాం తత్సర్వం నశ్యతి దృతమ్ || 15 ||

ఈ పారాయణం చేయడం వల్ల- నిత్యము చేయవలసిన కర్మలను ఆచరించకపోవడం వల్ల, శాస్త్రములో నిషేధించిన కర్మలను చేయడం వల్ల కలిగే అంతటి పాపం కూడా  నశించిపోతుంది.

బహునాత్ర కిముక్తేన శృణు త్వం కుంభసంభవ  (కలశీసుత)

అత్రైకనామ్నో యా శక్తిః పాతకానాం నివర్తనే

తన్నివర్త్యమఘం కర్తుం నాలం లోకాశ్చతుర్దశ || 16 || 

ఓ అగస్త్యుడా! పాపములను పోగొట్టే విషయంలో ఈ నామాలకు గల శక్తిని గురించి అనేక విధాలుగా నీకు చెప్పాను. పద్నాలుగు లోకాలలోని ప్రాణులు చేసిన పాపమునంతా ఈ నామము పోగొట్టగలదు.

యస్త్యక్త్వా నామసాహస్రం పాపహానిమభీప్సతి

స హి శీతనివృత్త్యర్థం హిమశైలం నిషేవతే   || 17 ||

ఏ ఉపాసకుడైనా తన పాపాలను పోగొట్టుకోవడానికి, ఈ సహస్రనామాలను విడిచి, ఇతర ప్రాయశ్చిత్తములను చేయాలనుకుంటాడో- అది, చలి బాధను పోగొట్టుకోవడానికి హిమవత్పర్వతాన్ని సేవించినట్టు అవుతుంది.

భక్తో యః కీర్తయేన్నిత్యమిదం నామసహస్రకమ్

తస్మై శ్రీలలితాదేవీ ప్రీతాఽభీష్టం ప్రయచ్ఛతి   || 18 ||

నిత్యమూ ఈ సహస్రనామ పారాయణం చేయు భక్తుని పట్ల సంతోషించి, లలితాదేవి- అతడు ఏ కోరిక అడిగినా తప్పకుండా తీరుస్తుంది.

అకీర్తయన్నిదం స్తోత్రం కథం భక్తో భవిష్యతి || 19 ||

ఈ స్తోత్రం పారాయణం చేయనివాడు భక్తుడు ఎలా కాగలడు.

నిత్యం సంకీర్తనాశక్తః కీర్తయేత్పుణ్యవాసరే   

సంక్రాంతౌ విషువే చైవ స్వజన్మత్రితయేఽయనే || 20 ||

ప్రతిరోజూ నామపారాయణం చేయడానికి శక్తి లేనివారు- పవిత్రమైన దినాలైన సంక్రాంతి, తన జన్మతిథి, సూర్యుడు కర్కాటక, మకరరాశులలో ప్రవేశించిన పుణ్యతిథులలో అంటే మకర సంక్రమణం, కర్కాటక సంక్రమణంలలో  పారాయణం చేయవచ్చు.

నవమ్యాం వా చతుర్దశ్యాం సితాయాం శుక్రవాసరే   

కీర్తయేన్నామసాహస్రం పౌర్ణమాస్యాం విశేషతః

ప్రతిదినమూ చేయలేనివారు శుక్లపక్షంలో వచ్చే అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి తిథులలో, శుక్రవారం నాడు తప్పకుండా పారాయణ చేయాలి.

పౌర్ణమాస్యాం చంద్రబింబే ధ్యాత్వా శ్రీలలితాంబికామ్   

పంచోపచారైః సంపూజ్య పఠేన్నామసాహస్రకమ్ || 21 ||

పౌర్ణమి రోజు, చంద్రబింబంలో లలితాదేవి స్వరూపాన్ని భావన చేసుకొని- గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అనే పంచోపచారాలతో పూజచేసి, తరువాత లలితాసహస్రనామ పారాయణం చేయాలి.

సర్వేరోగాః ప్రణశ్యంతి దీర్ఘాయుష్యం చ విందతి   

అయమాయుష్కరో నామ ప్రయోగః కల్పనోదితః || 22 ||

ఈ విధంగా పూజించి, ధ్యానం చేసి, నామపారాయణం చేసేవారికి సకల రోగాలూ నశించి, దీర్ఘాయుష్షు కలుగుతుంది.

జ్వరార్తం శిరసి స్పృష్ట్వా పఠేన్నామసహస్రకమ్   

తత్‍క్షణాత్ప్రశమం యాతి శిరస్తోదో జ్వరోఽపి చ || 23 ||

ఉపాసకుడు- జ్వరంతో బాధపడుతున్న వారి తలమీద చేయి ఉంచి, ఈ సహస్రనామాలను చదివితే, వెంటనే తలనొప్పి, జ్వరము మొదలైన బాధలన్నీ నశిస్తాయి.

సర్వవ్యాధినివృత్త్యర్థం స్పష్ట్వా భస్మ జపేదిదమ్   

తత్ భస్మధారణాదేవ నశ్యంతి వ్యాధయః క్షణాత్ || 24 ||

సహస్రనామాలతో విభూతిని మంత్రించి (అంటే నామాలను చదువుతూ, విభూతిని చేతివేళ్ళతో కదపడం), రోగి శరీరానికి పూస్తే, వెంటనే సర్వరోగాలూ శాంతిస్తాయి.

జలం సమ్మంత్ర్య కుంభస్థం నామసాహస్రతో మునే   

అభిషించేత్  గ్రహగ్రస్తాన్ గ్రహాః నశ్యంతి తత్‍క్షణాత్ || 25 ||

ఓ అగస్త్యమునీ! ఒక బిందెలో నీటిని పోసి, ఆ నీటిని ఈ సహస్రనామాలతో అభిమంత్రించి, ఆ నీటితో గ్రహం పట్టుకున్న వారిని స్నానం చేయిస్తే, వెంటనే ఆ గ్రహాలన్నీ (బాలగ్రహములు, పిశాచాలు, నవగ్రహములు మొదలైనవాటి బాధలన్నీ) వదిలిపోతాయి.

సుధాసాగరమధ్యస్థాం ధ్యాత్వా శ్రీలలితాంబికామ్   

యః పఠేన్నామసాహస్రం విషం తస్య వినశ్యతి || 26 ||

శ్రీలలితాదేవిని సుధాసముద్రమధ్యలో ఉన్నదానినిగా భావన చేసి, సహస్రనామపారాయణం చేసిన వాని విషము (కష్టము) నశిస్తుంది.

వంధ్యానాం పుత్రలాభాయ నామసాహస్రమంత్రితమ్   

నవనీతం ప్రదద్యాత్తు పుత్రలాభో భవేద్ధ్రువమ్ || 27 ||

సంతానభాగ్యం అస్సలు లేనివారికి కూడా – ఈ సహస్రనామాలతో మంత్రించిన వెన్నను తింటే, తప్పక సంతానం కలుగుతుంది.

దేవ్యాః పాశేన సంబద్ధా మాకృష్టామంకుశేన చ   

ధ్యాత్వాఽభీష్టాం స్త్రియం రాత్రౌ పఠేన్నామసహస్రకమ్

ఆయాతి స్వసమీపం సా యద్యప్యంతఃపురం గతా   || 28 ||

సాధకుడు ధర్మార్థకామములలో ధర్మబద్ధమైన కామమును సాధించుటకు తగు స్త్రీని లలితాదేవి యొక్క తాడుతో కట్టబడినదిగా చేసి ధ్యానం చేసి, రాత్రిలో సహస్రనామమును పారాయణ చేయవలెను.

రాజాకర్షణకామశ్చేత్ రాజావసథ దిఙ్ముఖః || 29 ||

త్రిరాత్రం యః పఠేత్ ఏతత్ శ్రీదేవీధ్యానతత్పరః   

స రాజా పారవశ్యేన తురంగం వా మతంగజమ్ || 30 ||

రాజును స్వాధీనం చేసుకోవాలి అనే కోరిక కలవాడు- ఆ రాజగృహము వైపుకు ముఖము పెట్టి, లలితాంబను ధ్యానం చేస్తూ, మూడు రాత్రింబవళ్ళు ఈ లలితా సహస్రనామ స్తోత్రమును పారాయణ చేసినచో, ఆ రాజు తనంతటతానే గుర్రమును గానీ, ఏనుగును గానీ ఎక్కి పారవశ్యంతో ఉపాసకుని దగ్గరకు వచ్చి, సేవకుని వలె నమస్కరించి, తన రాజ్యమును, ధనమును కూడా బుద్ధి పూర్వకంగా ఉపాసకునికి ఇచ్చును.

ఆరుహ్యాయాతి నికటం దాసవత్ప్రణిపత్య చ   

తస్మై రాజ్యం చ కోశం చ దదాత్యేవ న సంశయః|| 31 ||

అట్టి రాజు దొంగవలె ఒంటరిగాను, రహస్యముగాను రాక గుర్రమునెక్కి అందరికీ తెలియునట్లు వచ్చి, ప్రయోగించిన వానికి లోబడి, వాని ఆజ్ఞ ప్రకారం చేస్తాడు.

రహస్యనామసాహస్రం యః కీర్తయతి నిత్యశః   

తన్ముఖాలోకమాత్రేణ ముహ్యేల్లోకత్రయం మునే || 32 ||

ఓ అగస్త్యమునీ! ప్రతిదినము విడిచిపెట్టక, జీవితాంతము ఈ నామ పారాయణము చేయువాని ముఖమును చూసినంత మాత్రము చేతనే మూడు లోకాలలోని వారు మోహమును పొందుదురు.

యస్త్విదం నామసాహస్రం సకృత్పఠతి భక్తిమాన్   

తస్య యే శత్రవస్తేషాం నిహంతా శరభేశ్వరః || 33 ||

భక్తితో ఒక్కసారి నామపారాయణ చేసినవాని ముఖాన్ని చూసినంత మాత్రం చేతనే, మూడు లోకాలలోని వారు మోహన్ని పొందుతారు.

యో వాఽభిచారం కురుతే నామసాహస్రపాఠకే   

నివర్త్య తత్క్రియాం హన్యాత్తం వై ప్రత్యంగిరా స్వయమ్ || 34 ||

నామసాహస్ర పారాయణం చేయు వానిమీద ఎవ్వరైనా మంత్ర ప్రయోగమును చేస్తే, ప్రత్యాంగిరా దేవత ఆ మంత్ర ప్రయోగాన్ని వెనకకు తిప్పి, దానిచేతనే ప్రయోగించిన వానిని సంహరించును.

యే క్రూరదృష్ట్యా వీక్షంతే నామసాహస్రపాఠకమ్   

తానంధాన్కురుతే క్షిప్రం స్వయం మార్తాండభైరవః || 35 ||

లలితా నామపారాయణం చేసేవారిని చెడు దృష్టితో చూస్తే, మార్తాండ భైరవుడు స్వయంగా వెంటనే వారిని గుడ్డివారిగా చేయును.

ధనం యో హరతే చోరైర్నామసాహస్రజాపినః   

యత్ర కుత్ర స్థితం వాపి క్షేత్రపాలో నిహంతి తమ్ || 36 ||

దొంగల నాయకుడు తన దగ్గరగా ఉన్న దొంగల ద్వారా సహస్ర నామ పారాయణ చేయువాని ధనమును అనుభవిస్తే, వాడెక్కడ ఉన్నా క్షేత్రపాలుడు వారిని సంహరించును.

విద్యాసు కురుతే వాదం యో విద్వాన్నామజాపినః

తస్య వాక్ స్తంభనం సద్యః కరోతి నకులేశ్వరీ || 37 ||

సహస్ర నామ పారాయణము చేయువాని విద్యలయందు వివాదమును పెట్టుకొన్న పండితునకు నకులేశ్వరి వెంటనే వాక్కు రాకుండా చేయును.

యో రాజా కురుతే వైరం నామసాహస్రజాపినా   

చతురంగబలం తస్య దండినీ సంహారేత్స్వయమ్ || 38 ||

నామ పారాయణ చేసేవానితో విరోధమును పెట్టుకొన్న రాజుగారి సేననంతా- రథ, గజ, తురగ, పదాతి సేనలను దండినీదేవి స్వయముగా సంహరించును.

యః పఠేన్నామసాహస్రం షణ్మాసం భక్తిసంయుతః   

లక్ష్మీశ్చాంచల్యరహితా సదా తిష్ఠతి తద్గృహే || 39 ||

భక్తితో ఆరునెలలు నామ పారాయణము చేసిన వాని ఇంటిలో, లక్ష్మీదేవి సదా నిలకడగా ఉంటుంది.

మాసమేకం ప్రతిదినం త్రివారం యః పఠేన్నరః   

భారతీ తస్య జిహ్వాగ్రే రంగే నృత్యతి నిత్యశః || 40 ||

రోజుకు మూడు సార్లు చొప్పున, ఒక నెల రోజులు ఈ నామ పారాయణమును చేసినవాని నాలుక మీద సరస్వతీ దేవి ఎల్లప్పుడూ నాట్యము చేయును.

యస్త్వేకవారం పఠతి పక్షమాత్రమతంద్రితః   

ముహ్యంతి కామవశగా మృగాక్ష్యస్తస్య వీక్షణాత్ || 41 ||

అలసత్వము, నిద్ర, కునికిపాటు లేకుండా 15 రోజుల పాటు, రోజుకొక్కసారి పారాయణము చేసినవారు, ఏ స్త్రీలను చూసినా ఆ స్త్రీలందరూ మన్మధావేశము కలవారై, మోహమును చెందుదురు.

యః పఠేన్నామసాహస్రం జన్మమధ్యే సకృన్నరః   

తద్దృష్టిగోచరాః సర్వే ముచ్యంతే సర్వకిల్బిషైః || 42 ||

జీవితకాలంలో ఎప్పుడైనా ఒక్కసారి, సహస్ర నామ పారాయణమును చేసినవారిని చూసినా, పారాయణ చేసినవారిచే చూడబడినా పాపాలు నశిస్తాయి.

యో వేత్తి నామసాహస్రం తస్మై దేయం ద్విజన్మనే   

అన్నం వస్త్రం ధనం ధాన్యం నాన్యేభ్యస్తు కదాచన || 43 ||

ఉపాసకులు ఎప్పుడు దానము చేయదలచినా సహస్ర నామపారాయణ చేసే బ్రాహ్మణునికే అన్నము, వస్త్రము, ధనము, ధాన్యమును ఈయవలెను. ఉపాసన చేయని వారికి ఎప్పుడూ ఇవ్వకూడదు.

శ్రీమంత్రరాజం యో వేత్తి శ్రీచక్రం యః సమర్చతి   

యః కీర్తయతి నామాని తం సత్పాత్రం విదుర్బుధాః || 44 ||

శ్రీ విద్యా మంత్రము ఎరిగినవాడు, శ్రీ చక్ర పూజ చేయువాడు, సహస్ర నామ పారాయణ చేయువాడు – వీరు ముగ్గురూ దానం తీసుకోవడానికి మంచి యోగ్యులు.

తస్మై దేయం ప్రయత్నేన శ్రీదేవీప్రీతిమిచ్ఛతా   || 45 ||

అలాంటి యోగ్యులకు అన్న, వస్త్రాలను దానమిస్తే, వారి మీద శ్రీదేవికి ప్రేమ కలుగుతుంది.

న కీర్తయతి నామాని మంత్రరాజం న వేత్తి యః || 46 ||

పశుతుల్యః స విజ్ఞేయః తస్మై దత్తం నిరర్థకమ్   

పరీక్ష్య విద్యావిదుషః తేభ్యో దద్యాద్విచక్షణః || 47 ||

సహస్ర నామ పారాయణ చేయని వాడు, పంచదశీ మంత్రార్థము తెలియనివాడు పశువుతో సమానము. అలాంటివారికి దానం చేస్తే అది నిరర్థకమవుతుంది. కనుక వివేకవంతుడు, శ్రీ విద్యా పండితులను పరిశీలించి వారికే దానం చేయాలి.

శ్రీమంత్రరాజసదృశో యథా మంత్రో న విద్యతే   

దేవతా లలితాతుల్యా యథా నాస్తి ఘటోద్భవ || 48 ||

రహస్యనామసాహస్రతుల్యా నాస్తి తథా స్తుతిః   || 49 ||

ఓ అగస్త్యుడా! పంచదశాక్షరీ మంత్రముతో సమానమైన మంత్రము గానీ, లలితా దేవితో సమానమైన దేవత గానీ, రహస్యమైన లలితా సహస్రనామముతో సమానమైన స్తోత్రము గానీ లేదు.

లిఖిత్వా పుస్తకే యస్తు నామసాహస్రముత్తమమ్

సమర్చయేత్సదా భక్త్యా తస్య తుష్యతి సుందరీ   || 50 ||

ఉపాసకుడైనా, ఉపాసకుడు కానివాడైనా ఎవరైనా సరే, ఈ సహస్ర నామములు పుస్తకంలో రాసి, భక్తితో, బ్రతికి ఉన్నంతకాలం పూజిస్తే వారిని చూసి దేవి సంతోషిస్తుంది.

బహునాత్ర కిముక్తేన శృణు త్వం కుంభసంభవ

నానేన సదృశం స్తోత్రం సర్వతంత్రేషు దృశ్యతే   || 51 ||

తస్మాదుపాసకో నిత్యం కీర్తయేదిదమాదరాత్ || 52 ||

ఓ అగస్త్యమునీ! ఈ విషయంలో అనేక వాక్యాలను చెప్పడం వలన ప్రయోజనం లేదు. ఒక్క మాట చెప్తాను విను. ఈ సహస్రనామ స్తోత్రముతో సమానమైన స్తోత్రము ఏ తంత్రములోనూ లేదు. కనుక ఉపాసకుడు ప్రతిదినము భక్తితో ఈ స్తోత్రాన్ని పారాయణం చేయాలి.

ఏభిర్నామసహస్రైస్తు శ్రీచక్రం యోఽర్చయేత్సకృత్   

పద్మైర్వా తులసీపుష్పైః కల్హారైర్వా కదంబకైః || 53 ||

చంపకైర్జాతికుసుమైః మల్లికా కరవీరకైః   

ఉత్పలైః బిల్వపత్రైర్వా కుందకేసరపాటలైః || 54 ||

అన్యైః సుగంధికుసుమైః కేతకీమాధవీముఖైః   

తస్య పుణ్యఫలం వక్తుం న శక్నోతి మహేశ్వరః || 55 ||

ఒక్కసారి సహస్రనామాలను పద్మములు, తులసీ పుష్పములు, ఎరుపు తెలుపు కూడిన కలువలు, కడిమిపువ్వులు, సంపెంగ పువ్వులు, మాలతి పువ్వులు, మల్లె పూలు, కరవీర పుష్పములు, నల్ల కలువలు, మారేడు దళములు, మొల్ల పూలు, పొగడ పూలు, పాటలీ పువ్వులు, మొగలి పువ్వులు, విరజాజి మొదలైన పరిమళముగల పువ్వులతో పూజించినవారికి కలుగు పుణ్య ఫలమును సదాశివుడుగూడా లెక్కించి చెప్పలేడు.

సా వేత్తి లలితాదేవీ స్వచక్రార్చనజం ఫలమ్   

అన్యే కథం విజానీయుః బ్రహ్మాద్యాః స్వల్పమేధసః || 56 ||

శ్రీ చక్రార్చన వలన కలిగే ఫలము ఆ దేవికే తెలియునుగానీ, (లలితా దేవికంటే) తక్కువ బుద్ధి కల బ్రహ్మాదులకు ఎలా తెలుస్తుంది.

ప్రతిమాసం పౌర్ణమాస్యాం ఏభిర్నామసహస్రకైః   

రాత్రౌ యశ్చక్రరాజస్థాం అర్చయేత్పరదేవతామ్ || 57 ||

నెలనెలా వచ్చే పుష్పములతో రాత్రివేళ ఈ సహస్ర నామాలతో, శ్రీ చక్రార్చన చేస్తూ లలితా దేవిని ఎవరు పూజిస్తారో వారు లలితా స్వరూపులు.

స ఏవ లలితారూపః తద్రూపా లలితా స్వయమ్   

న తయోర్విద్యతే భేదో భేదకృత్పాపకృద్భవేత్ || 58 ||

లలితాదేవి- ఈ రకంగా పూజించిన వారి రూపంలో ఉంటుంది. వీరిద్దరికీ భేదము లేదు. భేదము కలదని చెప్పినవాడు పాపము చేసినవాడవుతాడు.

మహానవమ్యాం యో భక్తః శ్రీదేవీం చక్రమధ్యగామ్   

అర్చయేన్నామసాహస్రైః తస్యముక్తిః కరే స్థితా || 59 ||

శ్రీ చక్రం మధ్యనున్న శ్రీ లలితాదేవిని, మహా నవమినాడు సహస్ర నామాలతో పూజించిన వారికి, మోక్షము- చేతియందున్న వస్తువులాగా సులభంగా లభిస్తుంది.

యస్తు నామసహస్రేణ శుక్రవారే సమర్చయేత్   

చక్రరాజే మహాదేవీం తస్య పుణ్యఫలం శృణు || 60 ||

శ్రీచక్రమందు శుక్రవారమునాడు సహస్ర నామాలతో త్రిపుర సుందరిని పూజించిన వారికి కలుగు పుణ్యమును చెప్తాను విను.

సర్వాన్ కామానవాప్యేహ సర్వసౌభాగ్యసంయుతః   

పుత్రపౌత్రాదిసంయుక్తో భుక్త్వా భోగాన్యథేప్సితాన్ || 61 ||

అంతే శ్రీలలితాదేవ్యాః సాయుజ్యమతిదుర్లభమ్   

ప్రార్థనీయం శివాద్యైశ్చ ప్రాప్నోత్యేవ న సంశయః || 62 ||

శ్రీచక్రమందు శుక్రవారమునాడు సహస్ర నామాలతో త్రిపుర సుందరిని పూజించిన వారు, ఈ భూలోకములోని అన్ని కోరికలను పొంది, సకల సౌభాగ్యములు కలవాడై, కొడుకులతో మనుమలతో కూడి కోరిన భోగములన్నింటినీ అనుభవించును. మరణించిన తరువాత- ఎవరికీ పొందశక్యము కానిది, శివాదులచే కూడా ప్రార్థింపదగినది అయిన శ్రీ లలితా సాయుజ్యమోక్షమును అనగా కైవల్యమును తప్పక పొందుతాడు. ఈ విషయంలో సందేహము లేదు.

యః సహస్రం బ్రాహ్మణానాం ఏభిర్నామసహస్రకైః   

సమర్చ్య భోజయేద్భక్త్యా పాయసాపూపషడ్రసైః || 63 ||

తస్మై ప్రీణాతి లలితా స్వసామ్రాజ్యం ప్రయచ్ఛతి   

న తస్య దుర్లభం వస్తు త్రిషు లోకేషు విద్యతే || 64 ||

పరమాన్నము, అప్పములు, షడ్రుచులు గల పదార్థములతో, ఎవరు వెయ్యి మంది బ్రాహ్మణులను భక్తితో పూజించి భోజనము పెట్టునో, దానివలన లలితాదేవికి ప్రేమ కలిగి తన సామ్రాజ్యమును ఇచ్చును. అట్టివాడు మూడు లోకములలో పొందశక్యముగాని వస్తువులు ఉండవు.

నిష్కామః కీర్తయేద్యస్తు నామసాహస్రముత్తమమ్   

బ్రహ్మజ్ఞానమవాప్నోతి యేన ముచ్యేత బంధనాత్ || 65 ||

శ్రేష్టమైన శ్రీదేవీ సహస్రనామాలను కోరికలు లేకుండా పారాయణము చేసినవాడు- సంసార బంధమునుండి విడిపించగలిగే బ్రహ్మజ్ఞానమును పొందుచున్నాడు.

ధనార్థీ ధనమాప్నోతి యశోఽర్థీ ప్రాప్నుయాద్యశః   

విద్యార్థీ చాప్నుయాద్విద్యాం నామసాహస్రకీర్తనాత్ || 66 ||

ఈ సహస్ర నామ పారాయణం చేయువాడు- ధనమును కోరువాడు ధనమును, కీర్తిని కోరువాడు కీర్తిని, విద్యార్థి విద్యను పొందుతున్నాడు.

నానేన సదృశం స్తోత్రం భోగమోక్షప్రదం మునే   

కీర్తనీయమిదం తస్మాత్  భోగమోక్షార్థిభిర్నరైః || 67 ||

ఈ సహస్రనామ స్తోత్రము ఏ కోరికలూ లేకుండా పారాయణ చేయడం ప్రారంభించి, కొంత కాలమైన తరువాత దానిని విడిచి కోరికతో పారాయణము చేసినా ఏ తప్పూ లేదు. ఏ కోరికతో చేసినా ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. భోగమక్కరలేని వారికి మోక్షము, మోక్షమక్కర లేనివారికి భోగము, రెండునూ కావలసిన వారికి ఈ రెండూ లభించును.

చతురాశ్రమనిష్ఠైశ్చ కీర్తనీయమిదం సదా   

స్వధర్మసమనుష్ఠాన వైకల్యపరిపూర్తయే || 68 ||

బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి అనే నాలుగు ఆశ్రమముల వారికి, వారివారి ధర్మాలను ఆచరించేటపుడు వైగుణ్యము, వైకల్యము కలిగితే దానివలన అయ్యే దోషాలు ఈ నామ పారాయణ చేయడం వలన నశించి, ధర్మకార్యము పరిపూర్ణమవుతుంది. కనుక నాలుగు ఆశ్రమములవారు ఈ నామ పారాయణము ఎప్పుడూ ఆచరించాలి.

కలౌ పాపైకబహుళే ధర్మానుష్ఠానవర్జితే   

నామానుకీర్తనం ముక్త్వా నృణాం నాన్యత్పరాయణమ్ || 69 ||

అనేక పాపములతో నిండినది, వర్ణాశ్రమ ఆచారములచే విడువబడినది అయిన కలియుగమందు- ఈ సహస్ర నామ పారాయణం తప్ప, మనుష్యులకు వేరొక దిక్కు (దారి) లేదు.

లౌకికాద్వచనాన్ముఖ్యం విష్ణునామానుకీర్తనమ్   

విష్ణునామ సహస్రాచ్చ శివనామైకముత్తమమ్ || 70 ||

శివనామ సహస్రాచ్చ దేవ్యా నామైకముత్తమమ్   

లోకములో ఉచ్చరించబడిన అన్ని మాటల కంటే విష్ణు నామం పుణ్యప్రదమైనది. విష్ణు సహస్ర నామముల కంటే, ఒక్క శివనామము ఉత్తమమైనది, వెయ్యి శివ నామముల కంటే, ఒక్క లలితాదేవి నామము ఉత్తమమైనది, శ్రేష్టమైనది.

దేవీనామసహస్రాణి కోటిశః సంతి కుంభజ || 71 ||

తేషు ముఖ్యం దశవిధం నామసాహస్రముచ్యతే   

రహస్యనామసాహస్రం ఇదం శస్తం దశస్వపి || 72 ||

ఓ అగస్త్యమునీ! అతి శ్రేష్టములైన దేవీ సహస్రనామములు కోట్ల కొలదీ కలవు.  వాటిలో పది రకాలైన సహస్ర నామములు అత్యంత ముఖ్యమైనవి. అవి- గంగా, భవానీ, గాయత్రీ, కాళీ, లక్ష్మీ, సరస్వతీ, రాజరాజేశ్వరీ, బాలా, శ్యామలా, లలితా).

తస్మాత్సంకీర్తయేన్నిత్యం కలిదోషనివృత్తయే   

ముఖ్యం శ్రీమాతృనామేతి న జానంతి విమోహితాః || 73 ||

కాబట్టి కలియుగ దోష నివారణం కోసం దేవీ నామములను నిత్యమూ పారాయణం చేయవలెను. అజ్ఞానమోహితులై లలితా సహస్ర నామమే ముఖ్యమయినదని తెలుసుకోలేకపోతున్నారు.

విష్ణునామపరాః కేచిత్ శివనామపరాః పరే   

న కశ్చిదపి లోకేషు లలితానామతత్పరః || 74 ||

కొందరు విష్ణు నామమందు ఆసక్తి కలవారుగా, కొందరు శివ నామమందు ఆసక్తి కలవారుగా ఉన్నారు. కానీ దేవీనామమందు ఆసక్తి కలవారు ప్రజలలో ఒక్కడూ లేదు.

యేనాన్యదేవతానామ కీర్తితం జన్మకోటిషు   

తస్యైవ భవతి శ్రద్ధా శ్రీదేవీనామకీర్తనే || 75 ||

కోట్లకొలదీ జన్మలలో ఇతర దేవతా నామములను పఠించినవారికి- లలితా నామములను పఠించాలి అనే శ్రద్ధ కలుగుతుంది.

చరమే జన్మని యథా శ్రీవిద్యోపాసకో భవేత్   

నామసాహస్రపాఠశ్చ తథా చరమజన్మని || 76 ||

పంచదశీ మంత్రోపాసనము, లలితా సహస్రనామ పారాయణము చేయడం- అన్నింటిలో చివరి జన్మలో మాత్రమే కలుగుతుంది. అంటే ఈ రెండూ చేసినవారికి ఇంకొక జన్మ కలుగదు. అదే చివరి జన్మము.

యథైవ విరళా లోకే శ్రీవిద్యాచారవేదినః   

తథైవ విరళో గుహ్య నామ సాహస్ర పాఠకః || 77 ||

శ్రీవిద్యను, దాని ఆచారాలను తెలిసినవారు లోకములో తక్కువగా ఉన్నారు. అలాగే రహస్యమైన సహస్రనామ పారాయణము చేయువారు కూడా తక్కువగా ఉన్నారు.

మంత్రరాజజపశ్చైవ చక్రరాజార్చనం తథా   

రహస్యనామ పాఠశ్చ నాల్పస్య తపసః ఫలమ్ || 78 ||

ఈ విద్యా మంత్ర జపము, శ్రీ చక్రార్చనము, సహస్ర నామ పారాయణము- ఈ మూడూ పూర్వజన్మములలో అపరిమితమైన తపస్సు చేసిన వారికి ఫలముగా ఈ జన్మములో సంప్రాప్తిస్తుంది. లేకపోతే మూడూ కూడా ఒక్క జన్మలో సంభవించవు.

అపఠన్నామ సాహస్రం ప్రీణయేద్యో మహేశ్వరీమ్   

స చక్షుషా వినా రూపం పశ్యేదేవ విమూఢధీః || 79 ||

కన్ను లేనివాడు స్వరూపమును గ్రహించలేనట్టుగానే, సహస్ర నామ పారాయణము చేయనివాడు దేవీ ప్రీతిని సంపాదించలేడు.

రహస్యనామ సాహస్రం త్యక్త్వా యః సిద్ధికాముకః   

స భోజనం వినా నూనం క్షున్నివృత్తిమభీప్సతి || 80 ||

భోజనము చేయనివారికి ఆకలి తగ్గదు. అలాగే సహస్ర నామ పారాయణం చేయని వారికి దేవతానుగ్రహము లభ్యము కాదు.

యో భక్తో లలితాదేవ్యాః స నిత్యం కీర్తయేదిదమ్   

నాన్యథా ప్రీయతే దేవీ కల్పకోటిశతైరపి || 81 ||

లలితా దేవి భక్తుడైనవాడు ఈ సహస్ర నామములను నిత్యమూ పఠించవలెను. నిత్య పారాయణ చేసినవాడే దేవీ భక్తుడు.

తస్మాద్రహస్యనామాని శ్రీమాతుః ప్రయతః పఠేత్   

ఇతి తే కథితం స్తోత్రం రహస్యం కుంభసంభవ || 82 ||

ఓ అగస్త్యుడా! దేవీ ప్రీతి కలుగును కనుక ఏకాగ్రత, శుచి కలవాడై లలితా రహస్య నామములను పారాయణం చేయాలని ఈ రహస్య స్తోత్రమును నీకు నేను చెప్పితిని.

నావిద్యావేదినే బ్రూయాత్ నాభక్తాయ కదాచన   

యథైవ గోప్యా శ్రీవిద్యా తథా గోప్యమిదం మునే || 83 ||

ఓ అగస్త్యుడా! శ్రీవిద్యను తెలియనివారికి ఈ సహస్రనామ స్తోత్రమును చెప్పకూడదు. భక్తిలేని వారికి ఎప్పుడూ చెప్పకూడదు. శ్రీవిద్య ఎంత రహస్యమో ఈ స్తోత్రము కూడా అంత రహస్యము.

పశుతుల్యేషు న బ్రూయాత్ జనేషు స్తోత్రముత్తమమ్   

యో దదాతి విమూఢాత్మా శ్రీవిద్యారహితాయ చ || 84 ||

ఈ స్తోత్రాన్ని పశుస్వభావం కల మానవులకు, మూఢుడైన వాడికీ చెప్పకూడదు.

తస్మై కుప్యంతి యోగిన్యః సోఽనర్థః సుమహాన్ స్మృతః   

రహస్యనామసాహస్రం తస్మాత్సంగోపయేదిదమ్ || 85 ||

శ్రీవిద్య, భక్తి- రెండూ లేనివారికి ఎవరు ఈ స్తోత్రాన్ని చెప్తారో, వానియందు యోగినులు కోపము పొందుదురు. కాబట్టి దీనిని రహస్యముగా కాపాడవలెను.

స్వతంత్రేణ మయానోక్తం తవాపి కలశోద్భవ   

లలితాప్రేరణేనైవ మయోక్తం స్తోత్రముత్తమమ్ || 86 ||

ఓ అగస్త్యుడా! నీవు విద్య, శ్రద్ధ, భక్తులు కలవాడవైనా నా అంతట నేను నీకు ఇది చెప్పలేదు. లలితా దేవి ఆజ్ఞతో నేను నీకు చెప్పితిని.

కీర్తనీయమిదం భక్త్యా కుంభయోనే నిరంతరం

తేన తుష్టా మహాదేవీ తవాభీష్టం ప్రదాస్యతి   || 87 ||

ఓ అగస్త్యుడా! ఎప్పుడూ భక్తితో లలితాసహస్రనామ పారాయణ చేస్తే, లలితాదేవి సంతోషించి కోరికలను నెరవేర్చును.

శ్రీసూత ఉవాచ

ఇత్యుక్త్వా శ్రీహయగ్రీవో ధ్యాత్వా శ్రీలలితాంబికామ్

ఆనందమగ్నహృదయః సద్యః పులకితోఽభవత్   || 88 ||

శ్రీ హయగ్రీవుడు ఇలా పలికి, లలితాదేవిని ధ్యానం చేసి, వెంటనే ఆనందములో మునిగిన హృదయము కలవాడై గగుర్పాటు కలవాడాయెను.

ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీహయగ్రీవాగస్త్యసంవాదే శ్రీలలితాసహస్రనామస్తోత్ర ఫలనిరూపణం నామ తృతీయోఽధ్యాయః

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top