స్తోత్రాలకు తెలుగులో అర్థం » మూక పంచశతి – కటాక్ష శతకం 31-40 శ్లోకాలు
మూక పంచశతి కటాక్ష శతకం 31-40 శ్లోకాలు

మూక పంచశతి – కటాక్ష శతకం 31-40 శ్లోకాలు

మూక పంచశతి – కటాక్ష శతకం అనేది భక్తి సాహిత్యంలో అపూర్వమైన కృతి. దీనిని మూక కవి రచించారు. ఈ శతకం ప్రధానంగా శ్రీ కామాక్షి అమ్మవారు దివ్య కటాక్షాన్ని వర్ణిస్తుంది. కామాక్షి దేవి అనుగ్రహంతో మూగుడైన కవి వాక్కు పొందినదే ఈ కృతి యొక్క విశిష్టత. ఈ శ్లోకాలు భక్తి, శరణాగతి, దైవానుగ్రహాన్ని తెలియజేస్తూ మనసుకు శాంతిని ప్రసాదిస్తాయి.

కటాక్ష శతకం పారాయణం చేయడం వల్ల జ్ఞానం, వాక్పటుత్వం, మనోశాంతి లభిస్తాయని నమ్మకం. ఇది ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ముఖ్యంగా దేవి కటాక్షం ద్వారా జీవితంలో విజయాలు, అడ్డంకుల నివారణ కలుగుతాయని విశ్వాసం ఉంది. భక్తులకు ఇది ఆధ్యాత్మిక బలం, సానుకూల శక్తి ప్రసాదించే పవిత్ర గ్రంథంగా భావించబడుతుంది.

స్నేహాదృతాం విదలితోత్పలకాంతిచోరాం
జేతారమేవ జగదీశ్వరి జేతుకామః ।
మానోద్ధతో మకరకేతురసౌ ధునీతే
కామాక్షి తావకకటాక్షకృపాణవల్లీమ్ ॥31॥

తల్లీ! జగదీశ్వరీ! మన్మథుడు శ్రీవిద్యను ఉపాసించి నీ అభిమానమును పొందినాడు. తనను పరాజితుని చేసిన ఈశ్వరుని మరలా ఓడించాలనే కోరికతో నల్లని కలువ పూవుల కాంతి వర్ణముతో ఉన్న, నీ క్రీగంటి చూపులు అనే ఖడ్గమును, నీ వద్దనుండి దొంగిలించి, ఆ ఖడ్గమును ఈశ్వరునిపై ప్రయోగింపచూస్తున్నాడు.

శ్రౌతీం వ్రజన్నపి సదా సరణిం మునీనాం
కామాక్షి సంతతమపి స్మృతిమార్గగామీ ।
కౌటిల్యమంబ కథమస్థిరతాం చ ధత్తే
చౌర్యం చ పంకజరుచాం త్వదపాంగపాతః ॥32॥

అమ్మా! నీ క్రీగంటి చూపులు చంచలమైనవి, వక్రమైనవి, దొంగబుద్ధి కలవి అయి కర్ణములవరకు విస్తరించి, వేదమార్గమును  అనుసరిస్తూ, మునుల, జ్ఞానుల హృదయములను, బుద్ధిని దోచుకుంటున్నాయి.

నిత్యం శ్రేతుః పరిచితౌ యతమానమేవ
నీలోత్పలం నిజసమీపనివాసలోలమ్ ।
ప్రీత్యైవ పాఠయతి వీక్షణదేశికేంద్రః
కామాక్షీ కింతు తవ కాలిమసంప్రదాయమ్ ॥33॥

అమ్మా! చెవులవరకు విస్తరించిన నీ నేత్రములు ఆ చెవులతో స్నేహము చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.  కానీ నీ నల్లని కలువ పూల కాంతిని మించిన చూపులు అనే గురువు ఈ చెలిమి చేయకుండా పాఠాలు నేర్పుతున్నాడేమో అనిపిస్తోంది.

భ్రాంత్వా ముహుః స్తబకితస్మితఫేనరాశౌ
కామాక్షి వక్త్రరుచిసంచయవారిరాశౌ ।
ఆనందతి త్రిపురమర్దననేత్రలక్ష్మీః
ఆలంబ్య దేవి తవ మందమపాంగసేతుమ్ ॥34॥

జగన్మాతా! నీ ముఖము యొక్క కాంతి పుంజము ఒక మహా సముద్రం. ఆ ముఖములోని చిరునవ్వులు ఆ సముద్రములోని తెల్లని నురగలు. ఈశ్వరుడు అలసట భావమును పొందినపుడు, నీ చూపులలోని నల్లదనమును ఆధారముగా చేసుకొని ఆ సముద్రములో ఈదులాడుచూ సాంత్వన పొందుచున్నాడు.

శ్యామా తవ త్రిపురసుందరి లోచనశ్రీః
కామాక్షి కందలితమేదురతారకాంతిః ।
జ్యోత్స్నావతీ స్మితరుచాపి కథం తనోతి
స్పర్ధామహో కువలయైశ్చ తథా చకోరైః ॥35॥

ఓ త్రిపురసుందరీ! ఎంతో గొప్పదైన నీ నేత్రముల నల్లని కాంతి, కనుపాపలతో కలిసి మరింత గొప్పదైనది. ఆ కాంతి నీ చిరునవ్వులనే తెల్లని కాంతితో కలిసి మరింత ప్రకాశించినది. అటువంటి నీవు కలువ పూలతో, చకోర పక్షులతో స్పర్ధ కలిగి ఉండటం ఎంతో ఆశ్చర్యం.

కాలాంజనం చ తవ దేవి నిరీక్షణం చ
కామాక్షి సామ్యసరణిం సముపైతి కాంత్యా ।
నిశ్శేషనేత్రసులభం జగతీషు పూర్వం
అన్యత్త్రినేత్రసులభం తుహినాద్రికన్యే ॥36॥

ఓ పర్వతరాజ పుత్రీ! కాలాంజనము అనే కాటుకకు, నీ నల్లని నేత్రములకు దగ్గర సామ్యమున్నది. కాటుక అందరికీ సులభముగా లభిస్తుంది కానీ, నీ చల్లని నేత్రముల చూపులు అందరికీ లభ్యం కావు. కేవలము త్రినేత్రుడైన ఈశ్వరునికే అది సులభముగా లభిస్తుంది.

ధూమాంకురో మకరకేతనపావకస్య
కామాక్షి నేత్రరుచినీలిమచాతురీ తే ।
అత్యంతమద్భుతమిదం నయనత్రయస్య
హర్షోదయం జనయతే హరిణాంకమౌలేః ॥37॥

జగన్మాతా! సూర్య చంద్ర అగ్నులను నేత్రములుగా కలిగినవాడు ఈశ్వరుడు. శివుడు దహించిన మన్మథుని యొక్క పొగను నీ కనుల నీలిమగా చేసుకొని, మూడవ కంటికి కూడా తెలియకుండా అతనిని పునర్జీవితుని చేయటం ఈశ్వరునికి తెలిసి చాలా ఆనంద పడ్డాడు. ఇది ఎంతో ఆశ్చర్యకరం.

ఆరభ్భలేశసమయే తవ వీక్షణస్య
కామాక్షి మూకమపి వీక్షణమాత్రనమ్రమ్ ।
సర్వజ్ఞతా సకలలోకసమక్షమేవ
కీర్తిస్వయంవరణమాల్యవతీ వృణీతే ॥38॥

అమ్మా! ఎప్పుడైతే కరుణాపూరితములైన నీ క్రీగంటి చూపు ప్రసరిస్తుందో, తత్‌ క్షణమే, అతడు పుట్టుమూగవాడైనా సరే, కవితా కన్యక అతడికి వంగి నమస్కరించి, అతని మెడలో కీర్తి అనే హారమును వేసి అతనిని వరిస్తుంది.

కాలాంబువాహ ఇవ తే పరితాపహారీ
కామాక్షి పుష్కరమధఃకురుతే కటాక్షః ।
పూర్వః పరం క్షణరుచా సముపైతి మైత్రీం
అన్యస్తు సంతతరుచిం ప్రకటీకరోతి ॥39॥

అమ్మా! నీ క్రీగంటి చూపు నీటితో నిండిన వర్షాకాలపు నల్లని మేఘమువలే వర్షించి  మా పరితాపమును హరిస్తుంది. నీ చూపులు, వర్షాకాలపు మేఘము ఈ రెండూ కూడా కమలముల కాంతిని క్షీణపరిచేవే. ఒక్క విశేషమేమిటంటే! మబ్బులలోని మెరుపు కాంతులు క్షణికములే, కానీ నీ కన్నుల కాంతి శాశ్వతమైనది.

సూక్ష్మేఽపి దుర్గమతరేఽపి గురుప్రసాద-
సాహాయ్యకేన విచరన్నపవర్గమార్గే ।
సంసారపంకనిచయే న పతత్యమూం తే
కామాక్షి గాఢమవలంబ్య కటాక్షయష్టిమ్ ॥40॥

అమ్మా! ముక్తిని పొందు మార్గము చాలా క్లిష్టతరమైనది. అందులో ప్రయాణము చాలా కష్టతరమైనది. కేవలము గురువు మాత్రమే ఆ దారిలోని బురద, రాళ్ళనుండి తప్పించి, నీ కరుణ అనే కర్రను ఆలంబనముగా చేసి కైవల్యమునకు చేర్చగలడు.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top