స్తోత్రాలకు తెలుగులో అర్థం » హనుమాన్ స్తోత్రాలు » హనుమాన్ చాలీసా (తులసీదాస కృతం)
హనుమాన్ చాలీసా తులసీదాస కృతం తెలుగులో అర్థం మరియు ఆంజనేయ స్వామి దివ్యరూపం

హనుమాన్ చాలీసా (తులసీదాస కృతం)

🚩 హనుమాన్ చాలీసా – ప్రతి అక్షరంలో అంతులేని శక్తి! 🚩 నిత్యం మనం చదివే హనుమాన్ చాలీసా కేవలం ఒక స్తోత్రం కాదు, అది భయాలను పారద్రోలే అద్భుత మంత్రం! తులసీదాసు గారు రాసిన ఈ 40 పద్యాలలో ఆంజనేయ స్వామి పరాక్రమం, భక్తి, జ్ఞానం దాగి ఉన్నాయి. అసలు ఈ చాలీసాలోని ఒక్కో వాక్యానికి అర్థం ఏమిటో ఎప్పుడైనా గమనించారా? ఈ పోస్ట్‌లో హనుమాన్ చాలీసా పూర్తి తెలుగు అర్థాన్ని తెలుసుకుందాం. పూర్తిగా చదివి స్వామి కృపకు పాత్రులవ్వండి… 👇🙏

దోహా-

శ్రీ గురు చరణ సరోజ రజ
నిజమన ముకుర సుధారి
వరణౌ రఘువర విమల యశ
జో దాయక ఫలచారి ||

శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరుచుకుని, చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీరఘువర (రామచంద్ర) కీర్తిని నేను తలచెదను.

బుద్ధిహీన తను జానికే
సుమిరౌ పవనకుమార
బల బుద్ధి విద్యా దేహు మోహి
హరహు కలేశ వికార ||

బుద్ధిహీన శరీరమును తెలుసుకొని, ఓ పవనకుమారా (ఆంజనేయా) నిన్ను నేను స్మరించుచున్నాను. నాకు బలము, బుద్ధి, విద్యను ప్రసాదించి నా కష్టాలను, వికారాలను తొలగించుము.

చౌపాఈ-

జయ హనుమాన జ్ఞానగుణసాగర
జయ కపీశ తిహు లోక ఉజాగర || 1

ఓ హనుమంతా, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రమువంటి నీకు, వానరజాతికి ప్రభువైన నీకు, మూడులోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము.

రామదూత అతులిత బలధామా
అంజనిపుత్ర పవనసుత నామా || 2

నీవు శ్రీరామునకు దూతవు, అమితమైన బలము కలవాడవు, అంజనీదేవి పుత్రుడిగా, పవనసుత అను నామము కలవాడవు.

మహావీర విక్రమ బజరంగీ
కుమతి నివార సుమతి కే సంగీ || 3

నీవు మహావీరుడవు, పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు, చెడు మతి గల వారిని నివారించి మంచి మతి కలవారితో కలిసి ఉండువాడవు.

కంచన వరణ విరాజ సువేశా
కానన కుండల కుంచిత కేశా || 4

బంగారురంగు గల దేహముతో, మంచి వస్త్రములు కట్టుకుని, మంచి చెవి దుద్దులు పెట్టుకుని, ఉంగరాల జుట్టు కలవాడవు.

హాథ వజ్ర ఔరు ధ్వజా విరాజై
కాంధే మూంజ జనేవూ సాజై || 5

ఒక చేతిలో వజ్రాయుధము (గద), మరొక చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము (జెండా) పట్టుకుని, భుజము మీదుగా జనేయును (యజ్ఞోపవీతం) ధరించినవాడవు.

శంకర సువన కేసరీనందన
తేజ ప్రతాప మహా జగవందన || 6

శంకరుని అవతారముగా, కేసరీ పుత్రుడవైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనము చేసినవి.

విద్యావాన గుణీ అతిచాతుర
రామ కాజ కరివే కో ఆతుర || 7

విద్యావంతుడవు, మంచి గుణములు కలవాడవు, బుద్ధిచాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీరామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు.

ప్రభు చరిత్ర సునివే కో రసియా
రామ లఖన సీతా మన బసియా || 8

శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది, శ్రీ సీతా, రామ, లక్ష్మణులను నీ మనస్సులో ఉంచుకున్నవాడవు.

సూక్ష్మరూప ధరి సియహి దిఖావా
వికటరూప ధరి లంక జరావా || 9

సూక్ష్మరూపము ధరించి సీతమ్మకు కనిపించినవాడవు, భయానకరూపము ధరించి లంకను కాల్చినవాడవు.

భీమరూప ధరి అసుర సంహారే
రామచంద్ర కే కాజ సంవారే || 10

మహాబలరూపమును ధరించి రాక్షసులను సంహరించినవాడవు, శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చినవాడవు.

లాయ సంజీవన లఖన జియాయే
శ్రీరఘువీర హరషి ఉర లాయే || 11

సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించిన నీ వల్ల శ్రీరఘువీరుడు (రాముడు) చాలా ఆనందించాడు.

రఘుపతి కీన్హీ బహుత బడాయీ
తుమ మమ ప్రియ భరత సమ భాయీ || 12

అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకుని, తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైనవాడవు అని పలికెను.

సహస వదన తుమ్హరో యశ గావై
అస కహి శ్రీపతి కంఠ లగావై || 13

వేనోళ్ల నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగిలించుకున్నాడు.

సనకాదిక బ్రహ్మాది మునీశా
నారద శారద సహిత అహీశా || 14

యమ కుబేర దిగపాల జహాఁ తే
కవి కోవిద కహి సకే కహాఁ తే || 15

సనకాది ఋషులు, బ్రహ్మాది దేవతలు, నారదుడు, విద్యావిశారదులు, ఆదిశేషుడు, యమ కుబేరాది దిక్పాలురు, కవులు, కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు.

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా
రామ మిలాయ రాజ పద దీన్హా || 16

నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారము ఏమిటంటే రామునితో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు.

తుమ్హరో మంత్ర విభీషణ మానా
లంకేశ్వర భయె సబ జగ జానా || 17

నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికి తెలుసు.

యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో తాహి మధుర ఫల జానూ || 18

యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్న భానుడిని (సూర్యుడిని) మధురఫలమని అనుకుని అవలీలగా నోటిలో వేసుకున్నవాడవు.

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ
జలధి లాంఘి గయే అచరజ నాహీ || 19

అలాంటిది శ్రీరామ ప్రభు ముద్రిక (ఉంగరమును) నోటకరచి సముద్రాన్ని ఒక్క ఉదుటన దూకావు అంటే ఆశ్చర్యం ఏముంది?

దుర్గమ కాజ జగత కే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || 20

జగములో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహం వలన సుగమం కాగలవు.

రామ దువారే తుమ రఖవారే
హోత న ఆజ్ఞా బిను పైఠారే || 21

శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు. నీ అనుమతి లేకపోతే ఎవరైనా అక్కడే ఉండిపోవాలి.

సబ సుఖ లహై తుమ్హారీ శరణా
తుమ రక్షక కాహూ కో డరనా || 22

నీ ఆశ్రయములో అందరు సుఖముగా ఉంటారు. నీవే రక్షకుడవు అయితే ఇంకా భయం ఎందుకు?

ఆపన తేజ సంహారో ఆపై
తీనోఁ లోక హాంక తేఁ కాంపై || 23

నీ తేజస్సును నీవే నియంత్రించగలవు. నీ కేకతో మూడులోకాలు కంపించగలవు.

భూత పిశాచ నికట నహిఁ ఆవై
మహావీర జబ నామ సునావై || 24

భూతములు, ప్రేతములు దగ్గరకు రావు, మహావీర అనే నీ నామము చెప్తే.

నాసై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత వీరా || 25

రోగములు నశిస్తాయి, పీడలు హరింపబడతాయి, ఓ హనుమంతా! వీరా! నీ జపము వలన.

సంకటసే హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యాన జో లావై || 26

మనస్సు, కర్మ, వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి, ఓ హనుమంతా, నీవు విముక్తునిగా చేయగలవు.

సబ పర రామ తపస్వీ రాజా
తిన కే కాజ సకల తుమ సాజా || 27

అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు. ఆయనకే నీవు సంరక్షకుడవు.

ఔర మనోరథ జో కోయీ లావై
సోయి అమిత జీవన ఫల పావై || 28

ఎవరు కోరికలతో నీవద్దకు వచ్చినా, వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు.

చారోఁ యుగ ప్రతాప తుమ్హారా
హై పరసిద్ధ జగత ఉజియారా || 29

నాలుగు యుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియపరచబడినది.

సాధుసంతకే తుమ రఖవారే
అసుర నికందన రామ దులారే || 30

సాధువులకు, సంతులకు నీవు రక్షకుడవు. అసురులను అంతము చేసినవాడవు, రాముని ప్రేమపాత్రుడవు.

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా
అస వర దీన్హ జానకీ మాతా || 31

ఎనిమిది సిద్ధులు, తొమ్మిది నిధులు ఇవ్వగలిగిన శక్తి జానకీమాత నీకు వరంగా ఇచ్చినది.

రామ రసాయన తుమ్హరే పాసా
సదా రహో రఘుపతి కే దాసా || 32

నీ వద్ద రామరసామృతం ఉన్నది. దానితో ఎల్లప్పుడు రఘుపతికి దాసునిగా ఉండగలవు.

తుమ్హరే భజన రామ కో పావై
జన్మ జన్మ కే దుఖ బిసరావై || 33

నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి, జన్మ జన్మలలో దుఃఖముల నుండి ముక్తుడను అవ్వగలను.

అంతకాల రఘుపతి పుర జాయీ
జహాఁ జన్మ హరిభక్త కహాయీ || 34

అంత్యకాలమున శ్రీరఘుపతి పురమునకు వెళితే, తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తింపబడుతారు.

ఔర దేవతా చిత్త న ధరయీ
హనుమత సేయి సర్వసుఖకరయీ || 35

వేరే దేవతలను తలుచుకునే అవసరంలేదు. ఒక్క హనుమంతుడే సర్వసుఖాలు కలిగించగలడు.

సంకట హటై మిటై సబ పీరా
జో సుమిరై హనుమత బలవీరా || 36

కష్టాలు తొలగిపోతాయి, పీడలు చెరిగిపోతాయి, ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారో.

జై జై జై హనుమాన గోసాయీ
కృపా కరహు గురు దేవ కీ నాయీ || 37

జై జై జై హనుమాన స్వామికి. గురుదేవుల వలె మాపై కృపను చూపుము.

యహ శతవార పాఠ కర కోయీ
ఛూటహి బంది మహాసుఖ హోయీ || 38

ఎవరైతే వందసార్లు దీనిని పఠిస్తారో బంధముక్తులై మహా సుఖవంతులు అవుతారు.

జో యహ పఢై హనుమాన చాలీసా
హోయ సిద్ధి సాఖీ గౌరీసా || 39

ఎవరైతే ఈ హనుమాన చాలీసాను చదువుతారో, వారి సిద్ధికి గౌరీశుడే (శివుడు) సాక్షి.

తులసీదాస సదా హరి చేరా
కీజై నాథ హృదయ మహ డేరా || 40

తులసీదాసు వలె నేను కూడా ఎల్లప్పుడూ హరికి సేవకుడిని. కాబట్టి నా హృదయమును కూడా నీ నివాసముగా చేసుకో ఓ నాథా.

దోహా-

పవనతనయ సంకట హరణ
మంగళ మూరతి రూప
రామ లఖన సీతా సహిత
హృదయ బసహు సుర భూప ||

పవన కుమారా, సంకటములను తొలగించువాడా, మంగళమూర్తి స్వరూపా, ఓ హనుమంతా, రామ లక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమందు నివసించుము.

✨ జై శ్రీరామ్! జై హనుమాన్! ✨

హనుమాన్ చాలీసా అర్థం తెలిసి చదివితే ఆ అనుభూతే వేరు కదా! ఈ రోజు నుంచి ఆ సంకటమోచనుడిని భావంతో పాటు మరింత భక్తి శ్రద్ధలతో స్మరించుకుందాం.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top