అచ్యుతాష్టకం తెలుగులో అర్థం శ్రీకృష్ణుడి దివ్య రూపం మరియు భక్తి స్తోత్రం

అచ్యుతాష్టకం తెలుగులో అర్థం

శ్రీ ఆది శంకరాచార్య విరచిత “అచ్యుతాష్టకం”

“అచ్యుతాష్టకం” జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు రచించిన అద్భుతమైన స్తోత్రం. ‘అచ్యుతుడు’ అంటే తన స్థానము నుండి ఎన్నటికీ జారనివాడు (నాశనం లేనివాడు) అని అర్థం. శ్రీ మహావిష్ణువు యొక్క వివిధ అవతారాలను, ముఖ్యంగా రామ, కృష్ణ అవతారాలలోని ఆయన లీలలను ఎంతో అందంగా, భక్తి పూర్వకంగా ఈ ఎనిమిది శ్లోకాలలో శంకరాచార్యుల వారు వర్ణించారు. దీనిని ప్రతిరోజూ పఠించడం వల్ల మనస్సుకు ప్రశాంతత, భగవంతుని కృప కలుగుతాయి.

అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ ।
శ్రీధరం మాధవం గోపికా వల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే ॥ 1 ॥

ఎన్నటికీ నాశనం లేనివాడు, కేశవుడు, రాముడు, నారాయణుడు, కృష్ణుడు, దామోదరుడు, వాసుదేవుడు, హరి, శ్రీధరుడు, మాధవుడు, గోపికలకు ప్రీతిపాత్రుడైనవాడు, జానకీ దేవికి భర్త అయిన ఆ రామచంద్రుడిని నేను సేవిస్తున్నాను.

అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికారాధితమ్ ।
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే ॥ 2 ॥

 శాశ్వతుడైనవాడు, సత్యభామకు భర్త, మాధవుడు, శ్రీధరుడు, రాధచేత ఆరాధించబడేవాడు, లక్ష్మీదేవికి నివాసమైనవాడు, మనస్సుకు అత్యంత సుందరంగా అనిపించేవాడు, దేవకీ దేవికి ఆనందాన్ని ఇచ్చేవాడు, నందుని కుమారుడు అయిన ఆ శ్రీకృష్ణుడిని నేను మనస్ఫూర్తిగా ధ్యానిస్తున్నాను.

విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే
రుక్మిణీ రాగిణే జానకీ జానయే ।
వల్లవీ వల్లభాయార్చితా యాత్మనే
కంస విధ్వంసినే వంశినే తే నమః ॥ 3 ॥

 అంతటా వ్యాపించి ఉన్నవాడు, ఎప్పుడూ విజయం సాధించేవాడు, శంఖం మరియు చక్రాలను ధరించినవాడు, రుక్మిణీ దేవికి ఇష్టమైనవాడు, జానకీ దేవికి భర్త, గోపికల చేత పూజలు అందుకున్నవాడు, కంసుడిని సంహరించినవాడు, మురళి ని అద్భుతంగా ఊదేవాడు, ఆత్మ స్వరూపుడు అయిన ఓ స్వామీ! నీకు నా నమస్కారాలు.

కృష్ణ గోవింద హే రామ నారాయణ
శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే ।
అచ్యుతానంత హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీరక్షక ॥ 4 ॥

ఓ కృష్ణా! గోవిందా! హే రామా! నారాయణా! రమాపతీ (లక్ష్మీపతీ)! వాసుదేవా! అపజయం ఎరుగనివాడా! సంపదలకు నిలయమైనవాడా! అచ్యుతా! ఆనంద స్వరూపా! మాధవా! అధోక్షజా! ద్వారకా నగరాన్ని ఏలేవాడా! ద్రౌపది మానప్రాణాలను కాపాడిన ఆపద్బాంధవా! నీకు వందనం.

రాక్షస క్షోభితః సీతయా శోభితో
దండకారణ్యభూ పుణ్యతాకారణః ।
లక్ష్మణోనాన్వితో వానరైః సేవితో
అగస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ ॥ 5 ॥

 దుష్ట రాక్షసులను భయపెట్టేవాడు, సీతాదేవితో శోభిల్లుతున్నవాడు, తన పాదస్పర్శతో దండకారణ్యాన్ని పావనం చేసినవాడు, లక్ష్మణుడితో కూడి ఉన్నవాడు, వానరులచేత సేవించబడేవాడు, అగస్త్య మహాముని చేత పూజలు అందుకున్నవాడు అయిన ఆ రాఘవుడు (శ్రీరాముడు) నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక!

ధేనుకారిష్టకోఽనిష్టకృద్ద్వేషిణాం
కేశిహా కంసహృద్వణ్శికావాదకః ।
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలగోపాలకః పాతు మాం సర్వదా ॥ 6 ॥

ధేనుకాసురుడు, అరిష్టాసురుడు, కేశి మొదలైన రాక్షసులను సంహరించినవాడు, కంసుడిని వధించినవాడు, మురళిని అద్భుతంగా వాయించేవాడు, పూతనను సంహరించినవాడు, యమునా నది తీరంలో గోపికలతో ఆడుకున్నవాడు అయిన ఆ బాలగోపాలుడు నన్ను ఎప్పుడూ రక్షించుగాక!

విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం
ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహమ్ ।
వన్యయా మాలయా శోభితోరఃస్థలం
లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే ॥ 7॥

మెరుపు తీగలా ప్రకాశించే పసుపు పచ్చని పట్టు వస్త్రాలు ధరించినవాడు, వర్షాకాలపు నల్లని మేఘం లాంటి అందమైన శరీరం కలవాడు, వక్షస్థలంపై వనమాలతో శోభిల్లుతున్నవాడు, ఎర్రటి పాదాలు, పద్మాల లాంటి అందమైన కళ్ళు ఉన్నవాడు అయిన ఆ శ్రీ మహావిష్ణువును నేను సదా సేవిస్తున్నాను.

కుంచితైః కుంతలై భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్-కుండలం గండయోః ।
హారకేయూరకం కంకణ ప్రోజ్జ్వలం
కింకిణీ మంజులం శ్యామలం తం భజే ॥ 8 ॥

ఉంగరాల జుట్టుతో ప్రకాశించే ముఖం ఉన్నవాడు, రత్నాలు పొదిగిన కిరీటాన్ని, చెంపల వరకు ఆడుతున్న మకరకుండలాలను ధరించినవాడు, మెడలో హారాలు, భుజకీర్తులు, ముంజేతికి కంకణాలు, నడుముకు చిరుగజ్జెలు ధరించి అత్యంత మనోహరంగా ఉన్న ఆ శ్యామసుందరుడిని నేను సేవిస్తున్నాను.

అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ ।
వృత్తతః సుందరం కర్తృ విశ్వంభరః
తస్య వశ్యో హరి ర్జాయతే సత్వరమ్ ॥

భక్తుల కోరికలను నెరవేర్చేదీ, ఛందస్సు పరంగా అందమైనది అయిన ఈ ‘అచ్యుతాష్టకం’ను ప్రతిరోజూ ఎవరు భక్తి శ్రద్ధలతో, ఇష్టంతో పఠిస్తారో, ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీహరి వారికి వెంటనే వశమవుతాడు.

ఇతి శ్రీ శంకరాచార్య విరచిత అచ్యుతాష్టకమ్ సంపూర్ణమ్.

భగవంతుని అనేక నామాలను, రూపాలను కీర్తించే ఈ అష్టకం పఠించడానికి ఎంతో సులభంగా ఉంటూనే, అపారమైన భక్తి భావాన్ని కలిగిస్తుంది.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top