లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -4 Lalitha Sahasra namam meaning in telugu

lalitha sahasranamam meaning in telugu
lalitha sahasranamam meaning in telugu
పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ ।
చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61 ॥
పంచప్రేతాసనాసీనా – పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది.
పంచబ్రహ్మ స్వరూపిణీ – పంచబ్రహ్మలైన సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన స్వరూపమైనది.
చిన్మయీ – జ్ఞానముతో నిండినది.
పరమానందా – బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము.
విజ్ఞానఘన రూపిణీ – విజ్ఞానము, స్థిరత్వము పొందిన రూపము గలది.
ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా ।
విశ్వరూపా, జాగరిణీ, స్వపంతీ, తైజసాత్మికా ॥ 62 ॥
ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపా – ధ్యానము యొక్క, ధ్యానము చేయువాని యొక్క, ధ్యాన లక్ష్యము యొక్క సమన్వయ రూపము కలది.
ధర్మాధర్మ వివర్జితా – విహితకర్మలు, అవిహిత కర్మలు లేనిది.
విశ్వరూపా – విశ్వము యొక్క రూపమైనది.
జాగరిణీ – జాగ్రదవస్థను సూచించునది.
స్వపంతీ – స్వప్నావస్థను సూచించునది.
తైజసాత్మికా – తేజస్సువంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్ఠాత్రి.
సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా ।
సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ ॥ 63 ॥
సుప్తా – నిద్రావస్థను సూచించునది.
ప్రాజ్ఞాత్మికా – ప్రజ్ఞయే స్వరూపముగా గలది.
తుర్యా – తుర్యావస్థను సూచించునది.
సర్వావస్థా వివర్జితా – అన్ని అవస్థలను విడిచి అతీతముగా నుండునది.
సృష్టికర్త్రీ – సృష్టిని చేయునది.
బ్రహ్మరూపా – బ్రాహ్మణ లక్షణము గల రూపము గలది.
గోప్త్రీ – గోపన లక్షణము అనగా సంరక్షణ లక్షణం కలది.
గోవింద రూపిణీ – విష్ణుమూర్తితో రూప సమన్వయము కలది.
సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ ।
సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా ॥ 64 ॥
సంహారిణీ – ప్రళయకాలంలో సమస్త వస్తుజీవజాలాన్ని తనలోనికి ఉపసంహరణ గావించి, లీనము చేసుకొనునది.
రుద్రరూపా – రుద్రుని యొక్క రూపు దాల్చింది.
తిరోధానకరీ – మఱుగు పరచుటను చేయునది.
ఈశ్వరీ – ఈశ్వరుని యొక్క శక్తిరూపములో ఉండునది.
సదాశివా – సదాశివ స్వరూపిణి.
అనుగ్రహదా – అనుగ్రహమును ఇచ్చునది.
పంచకృత్య పరాయణా – సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే అయిదు కృత్యముల యందు ఆసక్తి కలది.
భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ ।
పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥
భానుమండల మధ్యస్థా – సూర్య మండలములో కేంద్రము వద్ద ఉండునది.
భైరవీ – భైరవీ స్వరూపిణి.
భగమాలినీ – వెలుగుతూ గమనము చేయువారిచే హారముగా అగుపించునది.
పద్మాసనా – పద్మమును నెలవుగా కలిగినది.
భగవతీ – భగశబ్ద స్వరూపిణి.
పద్మనాభ సహోదరీ – విష్ణుమూర్తి యొక్క సహోదరి.
ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః ।
సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ ॥ 66 ॥
ఉన్మేషనిమిషోత్పన్న విపన్నభువనావళి – తెరువబడుటతోను, మూయబడుటతోను పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలది.
సహస్ర శీర్ష వదనా – వెయ్యి లేదా అనంతమైన శిరస్సులతో, ముఖములు కలది.
సహస్రాక్షీ – వెయ్యి లేదా అనంతమైన కన్నులు కలది
సహస్రపాత్ – అనంతమైన పాదములు కలది.
ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ ।
నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా ॥ 67 ॥
ఆబ్రహ్మకీట జననీ – బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ తల్లి.
వర్ణాశ్రమ విధాయినీ – వర్ణములను, ఆశ్రమములను ఏర్పాటు చేయునది.
నిజాజ్ఞారూప నిగమా – తనయొక్క ఆదేశములే రూపుగట్టుకొనిన వేదములు అయినది.
పుణ్యాపుణ్య ఫలప్రదా – మంచిపనులకు, చెడ్డపనులకు వాటి వాటికి తగిన ఫలములను చక్కగా ఇచ్చునది.

ఇవి కూడా చూడండి 👉విష్ణు సహస్రనామాలకు తెలుగులో అర్థం

 

https://www.youtube.com/watch?v=dilDWKsma_4

శ్రుతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా ।
సకలాగమ సందోహ శుక్తిసంపుట మౌక్తికా ॥ 68 ॥
శృతి సీమంత సిందూరీ కృతపాదాబ్జ ధూళికా – వేదములనే స్త్రీలయొక్క పాపిటలను, సిందూరము ధరించునట్లు చేసిన పాదపద్మము యొక్క ధూళిని కలిగినది.
సకలాగమ సందోహశుక్తి సంపుటమౌక్తికా – అన్ని ఆగమ శాస్త్రములనెడు ముత్యపు చిప్పలచే చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముత్యము.
పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ ।
అంబికా,ఽనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా ॥ 69 ॥
పురుషార్థప్రదా – పురుషునకు కావలసిన ప్రయోజనములు (ధర్మ అర్థ కామ మోక్షములను) ఇచ్చునది.
పూర్ణా – పూర్ణురాలు.
భోగినీ – భోగములను అనుభవించునది లేదా భోగములను ఇచ్చునది.
భువనేశ్వరీ – చతుర్దశ భువనములకు అధినాథురాలు.
అంబికా – తల్లి.
అనాది నిధనా – ఆది, అంతము లేనిది.
హరిబ్రహ్మేంద్ర సేవితా – విష్ణువు చేత, బ్రహ్మ చేత, ఇంద్రుని చేత సేవింపబడునది.
నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।
హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥
నారాయణీ – నారాయణత్వ లక్షణము గలది.
నాదరూపా – నాదము యొక్క రూపము అయినది.
నామరూప వివర్జితా – పేరు, ఆకారము లేనిది
హ్రీంకారీ – హ్రీంకార స్వరూపిణి.
హ్రీమతీ – లజ్జాసూచిత బీజాక్షర రూపిణి.
హృద్యా – హృదయమునకు ఆనందము అయినది.
హేయోపాదేయ వర్జితా – విడువదగినది, గ్రహింపదగినది, లేనిది.
రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥
రాజరాజార్చితా – రాజులకు రాజులైన వారిచేత అర్చింపబడునది.
రాజ్ఞీ – రాణి.
రమ్యా – మనోహరమైనది.
రాజీవ లోచనా – పద్మములవంటి కన్నులు కలది.
రంజనీ – రంజింప చేయునది.
రమణీ – రమింపచేయునది.
రస్యా – రస స్వరూపిణి.
రణత్కింకిణి మేఖలా – మ్రోగుచుండు చిరుగజ్జెలతో కూడిన వడ్డాణము గలది.
రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥
రమా – లక్ష్మీదేవి.
రాకేందు వదనా – పూర్ణిమ చంద్రుని పోలిన ముఖము గలది.
రతి రూపా – ఆసక్తి రూపమైనది.
రతి ప్రియా – ఆసక్తి యందు ప్రీతి కలది.
రక్షాకరీ – రక్షించునది.
రాక్షసఘ్నీ – రాక్షసులను సంహరించునది.
రామా – ఎప్పుడూ సంతోషంగా, క్రీడాత్మకంగా వుండేది.
రమణ లంపటా – రమణునితో అత్యంత సాన్నిహిత్య సంబంధము గలది.
కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥
కామ్యా – కోరదగినటువంటిది.
కామకళారూపా – కామేశ్వరుని కళయొక్క రూపమైనది.
కదంబ కుసుమప్రియా – కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది.
కళ్యాణీ – శుభ లక్షణములు కలది.
జగతీ కందా – జగత్తుకు మూలమైనటువంటిది.
కరుణా రస సాగరా – దయాలక్షణానికి సముద్రము వంటిది.
కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।
వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥
కళావతీ -కళా స్వరూపిణీ.
కళాలాపా – కళలను ఆలాపనా స్వరూపముగా కలిగినది.
కాంతా – కామింపబడినటువంటిది.
కాదంబరీ ప్రియా – పరవశించుటను ఇష్టపడునది.
వరదా – వరములను ఇచ్చునది.
వామనయనా – అందమైన నేత్రములు గలది.
వారుణీ మదవిహ్వలా – వరుణ సంబంధమైన పరవశత్వము చెందిన మనోలక్షణము గలది.
విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।
విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥
విశ్వాధికా – ప్రపంచమునకు మించినది అనగా అధికురాలు.
వేదవేద్యా – వేదముల చేత తెలియదగినది.
వింధ్యాచల నివాసినీ – వింధ్యపర్వత ప్రాంతమున నివాసము గలది.
విధాత్రీ – విధానమును చేయునది.
వేద జననీ – వేదములకు తల్లి.
విష్ణుమాయా – విష్ణుమూర్తి యొక్క మాయా స్వరూపిణి.
విలాసినీ – వినోదాత్మక, క్రీడాత్మక లక్షణము గలది.
క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥
క్షేత్రస్వరూపా – క్షేత్ర పదంచే సంకేతింపబడే వాటి స్వరూపంగా నుండునది.
క్షేత్రేశీ – క్షేత్రమునకు అధికారిణి.
క్షేత్ర క్షేత్రజ్ఞపాలినీ – స్థూలభాగమైన దేహమును, సూక్ష్మభాగమైన దేహిని పాలించునది లేదా రక్షించునది.
క్షయవృద్ధి వినిర్ముక్తా – తరుగుదల, పెరుగుదల లేనిది.
క్షేత్రపాల సమర్చితా – క్షేత్రపాలకులచే చక్కగా అర్చింపబడునది.
విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥
విజయా – విశేషమైన జయమును కలిగినది.
విమలా – మలినములు స్పృశింపనిది.
వంద్యా – నమస్కరింపతగినది.
వందారు జనవత్సలా – నమస్కరించు శీలము గల జనుల యందు వాత్సల్యము గలది.
వాగ్వాదినీ – వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణ నిచ్చు పరావాగ్దేవత.
వామకేశీ – వామకేశ్వరుని భార్య.
వహ్నిమండల వాసినీ – అగ్ని ప్రాకారమునందు వసించునది.
భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥
భక్తిమత్కల్ప లతికా – భక్తికలవారిపట్ల కల్పవృక్షపు తీగవంటిది.
పశుపాశ విమోచనీ – వివిధ పాశములచే బంధింపబడువారిని బంధ విముక్తులను చేయునది.
సంహృతాశేష పాషండా – సంహరింపదగిన సకలమైన పాషండులని సంహరించునది.
సదాచారప్రవర్తికా – సంప్రదాయబద్ధమైన, శ్రోత్రీయ మార్గముననుసరించి యుండునట్లు ప్రవర్తింప చేయునది.
తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥
తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా – ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపములనెడి అగ్నిచేత తపింప చేయబడిన వారలకు మిక్కిలి సంతోషమును కలుగజేయునట్టి వెన్నెల వంటిది.
తరుణీ – ఎప్పుడు తరుణ వయస్సు, అనగా ఒకేరీతి యౌవనము గలది.
తాపసారాధ్యా – తపస్సు చేయువారిచే ఆరాధింపబడునది.
తనుమధ్యా – కృశించిన అనగా సన్నని కటి ప్రదేశము అనగా నడుము గలది.
తమో పహా – చీకటిని లేదా అజ్ఞానమును పోగొట్టునది.
చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।
స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥
చితిః – కూర్పు, జ్ఞానబిందు సమీకరణ.
తత్పదలక్ష్యార్థా – తత్ పదముచే నిర్దేశింపబడు లక్ష్యము యొక్క ప్రయోజనముగా నున్నది.
చిదేకరస రూపిణీ – జ్ఞానచైతన్యమే ఒకే ఒక రసముగా లేదా సర్వసారముగా స్వరూపముగా గలది.
స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః – తనకు సంబంధించిన ఆనందముతో లేశమాత్రమైన బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము – మొదలైన
ఆనందముల సమూహము గలది.
Tags: , , , , , , , , , ,