భగవద్గీత 16 వ అధ్యాయం –దైవాసుర సంపద్విభాగయోగము

Bhagavadgita meaning in telugu

16 వ అధ్యాయం – దైవాసుర సంపద్విభాగయోగము

అర్జునా! భయం లేకపోవడం, చిత్తశుద్ది, జ్ఞానయోగనిష్ట, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, వేదపఠనం, తపస్సు, సరళ స్వభావం, అహింస, సత్యం, కోపం లేకపోవడం, త్యాగబుద్ది, శాంతి, చాడీలు చెప్పకపోవడం, భూతదయ, విషయసుఖాలు వాంచించకపోవడం, మృదుత్వం, సిగ్గు, చపలత్వం లేకపోవడం, తేజస్సు, ఓర్పు, ధైర్యం, శుచిత్వం, ద్రోహం చేయకపోవడం, దురభిమానం లేకపోవడం- ఈ ఇరవై ఆరు సుగుణాలూ, దేవతల సంపద వల్ల పుట్టిన వాడికి కలుగతాయి. పార్ధా! రాక్షస సంపదలో పుట్టిన వాడి లక్షణాలు ఇవి- కపటం, గర్వం, దురహంకారం, కోపం, కరినత్వం, అవివేకం.
దైవ సంపద మూలంగా మోక్షమూ, ఆసుర సంపద వల్ల సంసార బంధమూ కలుగుతాయి. నీవు దైవ సంపదలో జన్మించావు. కనుక విచారించనక్కరలేదు. ఈ లోకంలో ప్రాణుల సృష్టి- దైవమని, అసురమని రెండు రకాలు. దైవ సంపద గురించి వివరంగా ఇది వరకే చెప్పాను. ఇక అసుర సంపద గురించి విను. అసుర స్వభావం కలిగిన వాళ్ళకు చేయదగ్గదేదో, చేయకూడనిదేదో తెలియదు. వాళ్లలో శుచిత్వం, సదాచారం, సత్యం కనిపించవు.
ఈ జగత్తు అసత్యమనీ, ఆధారమూ అధిపతి లేనిదనీ, కామవశంలో స్త్రీ పురుషుల కలయిక తప్ప సృష్టికి మరో కారణం లేదని వారు వాదిస్తారు. అలాంటి నాస్తికులు ఆత్మను కోల్పోయిన అల్ప బుద్దులు, ఘొర కృత్యాలు చేసే లోకకంటకులు, ప్రపంచ వినాశనానికి పుడతారు. వాళ్ళు అంతూదరీ లేని కోరికలతో ఆడంబరం, గర్వం, దరభిమానమనే దుర్గుణాలతో, అవివేకం వల్ల దుష్ప్రభాలతో దురాచారులై తిరుగుతారు. వాళ్లు మృతి చెందే వరకు వుండే మితిలేని చింతలతో, కామభోగాలను అనుభవించడమే పరమవధిగా భావించి, అంతకు మించిందేది లేదని నమ్ముతారు. ఎన్నో ఆశాపాశాలలో చిక్కుకొని, కామక్రోధాలకు వశులై, విషయ సుఖాలను అనుభవించడం కోసం, అక్రమ ధనార్జనకు పూనుకుంటారు.
“ఈ వేళ నాకిది లభించింది. ఇక ఈ కోరిక నెరవేరుతుంది. నాకింత ఆస్తి వున్నది. మరింత సంపాదించబోతున్నాము. ఈ శత్రువును చంపేశాను. మిగిలిన శత్రువులను కూడా సంహరిస్తాను. నేను ప్రభువును, సుఖభోగిని, తలపెట్టిన పనిని సాధించే సమర్ధుణ్ణి, బలవంతుణ్ణి, నేను డబ్బున్న వాణ్ణి, ఉన్నత వంశంలో ఉద్భవించాను. నాకు సాటి అయినవాడు లేడు. నేను యజ్ఞాలు చేస్తాను. దానాలిస్తాను. ఆనందం అనుభవిస్తాను” – అని వాళ్ల అజ్ఞానంలో అనేక విధాలా కలవరిస్తాను. మోహవశులైన ఆ అసుర స్వభావం కలిగిన వాళ్లు, నిరంతరం కామభోగాలలోనే చిక్కుకొని చివరకు ఘోర నరకాల పాలవుతారు.
తమను తామే పొగుడుకుంటూ, వినయ విధేయతలు లేకుండా ధన, మద గర్వంతో, శాస్త్రవిరుద్ధంగా పేరుకు మాత్రం వాళ్ళు యజ్ఞాలు చేస్తారు. అహంకారం, బలం, గర్వం, కామం, క్రోధం వీటిని ఆశ్రయించిన అసూయపరులైన వీళ్ళు తమ శరీరంలోనూ, ఇతర శరీరాలలోనూ ఉంటున్న నన్ను ద్వేషిస్తారు. ద్వేష పూరితులు, పాపచరితులు, క్రూరస్వభావులు అయిన అలాంటి మానవాధములను, మళ్లీ మళ్లీ సంసారంలో పడవేస్తుంటాను. అసుర జన్మ పొందే అలాంటి మూర్ఖులు ఏ జన్మలోనూ నన్ను చేరలేకపోవడమే కాకుండా, అంతకంత అధోగతి పాలవుతారు.
కామం, క్రోధం, లోభం- ఈ నరక ద్వారాలు మూడు ఆత్మ వినాశనానికి కారణాలు. అందువల్ల ఈ మూడింటిని విడిచిపెట్టాలి. ఈ మూడు దుర్గుణాలను విసర్జించినవాడు తనకు తాను మేలు చేసుకొని పరమపదం పొందుతాడు. అందువల్ల చేయదగ్గదేదో, చేయకూడనిదేదో నిర్ణయించుకోవడంలో నీకు శాస్త్రమే ప్రమాణం. శాస్త్ర విధానాలను తెలుసుకొని తదనుగుణంగా ఈ లోకంలో నీవు కర్మలు చేయాలి.

మిగిలిన అధ్యాయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ⬇️

1 వ అధ్యాయం – అర్జున విషాద యోగం
2 వ అధ్యాయం – సాంఖ్య యోగం
3 వ అధ్యాయం – కర్మ యోగం
4 వ అధ్యాయం -జ్ఞాన యోగం
5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము
6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము
7 వ అధ్యాయం  -జ్ఞాన విజ్ఞాన యోగము
8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము
9  వ అధ్యాయం – రాజ విద్య రాజగుహ్య యోగము
10  వ అధ్యాయం –విభూతి యోగము
11  వ అధ్యాయం –విశ్వరూప సందర్శన యోగము
12  వ అధ్యాయం – భక్తి యోగము
13  వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము
14  వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము
15  వ అధ్యాయం- పురుషోత్తమప్రాప్తి యోగము
16  వ అధ్యాయం- దైవాసుర సంపద్విభాగయోగము
17  వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము
18  వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము