18 వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము
అర్జునుడు కృష్ణుడితో ఇలా పలికాడు. “కృష్ణా ! సన్యాసం, త్యాగం వీటి స్వరూపాలను విడి విడిగా తెలుసుకోదలచాను. శ్రీ భగవానుడు అర్జునుడితో “ఫలాన్ని ఆశించి చేసే కర్మలను విడిచి పెట్టడమే సన్యాసమని, కొంతమంది పండితులు చెబుతారు. సమస్త కర్మల ఫలితాలనూ వదిలి పెట్టడమే త్యాగమని కొందరి అభిప్రాయం. దోషంలేని కర్మ అంటూ ఏదీ వుండదు కనుక కర్మలను విడిచి పెట్టాలని కొందరు బుద్ధిమంతులు చెబుతారు. మరికొంతమంది యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలను పరిత్యజించకూడదని పలుకుతారు. అర్జునా! కర్మత్యాగ విషయంలో నా నిర్ణయం విను. త్యాగం మూడు విధాలు. యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలు బుద్ధిమంతులకు చిత్తశుద్ధిని చేకూరుస్తాయి. అందువల్ల వాటిని విడిచి పెట్టకూడదు. తప్పకుండా చేయాలి.