లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -2 Lalitha Sahasra namam meaning in telugu

lalitha sahasranamam meaning in telugu
lalitha sahasranamam meaning in telugu
సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణ భూషితా ।
శివకామేశ్వరాంకస్థా, శివా, స్వాధీన వల్లభా ॥ 21 ॥
సర్వారుణా – సర్వము అరుణ వర్ణంగా భాసించునది.
అనవద్యాంగీ – వంక పెట్టుటకు వీలులేని అవయవములు గలది.
సర్వాభరణ భూషితా – సమస్తమైన నగల చేత అలంకరించబడింది.
శివకామేశ్వరాంకస్థా – కామ స్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది.
శివా – వ్యక్తమైన శివుని రూపము కలది.
స్వాధీన వల్లభా – తనకు లోబడిన భర్త గలది.
సుమేరు మధ్యశృంగస్థా, శ్రీమన్నగర నాయికా ।
చింతామణి గృహాంతస్థా, పంచబ్రహ్మాసనస్థితా ॥ 22 ॥
సుమేరు మధ్యశృంగస్థా – మేరు పర్వతపు శిఖరము యొక్క మధ్య ప్రదేశములో ఉంది.
శ్రీమన్నగర నాయికా – శుభప్రథమైన ఐశ్వర్యములతో కూడిన నగరానికి అధిష్ఠాత్రి.
చింతామణి గృహాంతఃస్థా – చింతామణుల చేత నిర్మింపబడిన గృహము లోపల ఉండునది.
పంచబ్రహ్మాసనస్థితా – ఐదుగురు బ్రహ్మ రూపాలు ధరించినటువంటి శివునిచే నిర్మింపబడిన ఆసనములో కూర్చున్నది.
మహాపద్మాటవీ సంస్థా, కదంబ వనవాసినీ ।
సుధాసాగర మధ్యస్థా, కామాక్షీ కామదాయినీ ॥ 23 ॥
మహాపద్మాటవీ సంస్థా – గొప్పవైన పద్మములు గల అడవియందు ఉన్నట్టిది.
కదంబ వనవాసినీ – కడిమి చెట్ల యొక్క తోటయందు వసించునది.
సుధాసాగర మధ్యస్థా – అమృత సముద్రము అనగా క్షీర సాగర మధ్య భాగములో స్థితురాలైనది.
కామాక్షీ – అందమైన కన్నులు గలది.
కామదాయినీ – కోరికలను నెరవేర్చునది.
దేవర్షి గణసంఘాత స్తూయమానాత్మ వైభవా ।
భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా ॥ 24 ॥
దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా – నరకము నుండి దేవతలను, ఋషులను, గణములను రక్షింప కొనియాడబడుచున్న దివ్యత్వము గలది.
భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా – భండుడు అను రాక్షసుని సంహరించుట యందు ప్రయత్నించు స్త్రీ దేవతల సేనలతో చక్కగా కూడియున్నది.
సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా ।
అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటి భిరావృతా ॥ 25 ॥
సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా – సంపత్కరీ దేవి అధిరోహించిన ఏనుగుల సముదాయము చేత సేవింపబడునది.
అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతా – అశ్వారూఢ అనే దేవి చేత ఎక్కబడిన గుఱ్ఱముల యొక్క కోట్లానుకోట్లచే చుట్టుకొనబడింది.
చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా ।
గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా ॥ 26 ॥
చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా – చక్రరాజము అను పేరుగల రథములో అధిష్ఠించిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడింది.
గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా – గేయచక్రము అని పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రిణిచే అన్ని వైపుల నుండి సేవింపబడునది.
కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా ।
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా ॥ 27 ॥
కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా – కిరిచక్రము అను పేరుగల రథమును ఎక్కిన దండము చేతియందు వుండు దేవిచే సేవింపబడునది.
జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా – జ్వాలామాలిని అను పేరు గల నిత్యదేవత చేత వెదజల్లబడి నిర్మింపబడిన అగ్నిప్రాకారము యొక్క మధ్యనున్నది.
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా ।
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ॥ 28 ॥
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షితా – భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని సంహరించడానికి సంసిద్ధురాలైన తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూచి ఆనందించినది.
నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా – నిత్యాదేవతల యొక్క- పరులను ఆక్రమించుకోగల శక్తి, సామర్థ్య, ఉత్సాహాలను చూసి సంతోషించింది.
భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా ।
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా ॥ 29 ॥
భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా – భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతసించునది.
మంత్రిణ్యంగా విరచిత విషంగ వధతోషితా – మంత్రిణీ దేవి చేత చేయబడిన విషంగ వధను విని సంతసించింది.
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా ।
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా ॥ 30 ॥
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా – విశుక్రుని ప్రాణాలను హరించిన వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించింది.
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా – కామేశ్వరుని యొక్క ముఖమును చూచినంత మాత్రమున కల్పించబడిన గణపతిని గలది.
మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా ।
భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ ॥ 31 ॥
మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా – మహాగణపతి చేత నశింపచేయబడిన జయ విఘ్న యంత్రమునకు మిక్కిలి సంతోషించింది.
భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్ర వర్షిణీ – రాక్షస రాజైన భండాసురుని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించునది.
కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః ।
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా ॥ 32 ॥
కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః – చేతివ్రేళ్ళ గోళ్ళ నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములు గలది.
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా – మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్నిచేత – నిశ్శేషంగా దహింపబడిన రాక్షస సైన్యము గలది.
కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా ।
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా ॥ 33 ॥
కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా – కామేశ్వరాస్త్ర ప్రయోగముతో నిశ్శేషంగా భండాసురుణ్ణి దహించి అతడు పాలించే ‘శూన్యక నగరము’ యొక్క పేరు సార్థకం చేసినది.
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవా – బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్తుతింపబడిన పరాక్రమ వైభవం గలది.
హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః ।
శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా ॥ 34 ॥
హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః – శివుని యొక్క మూడవ కంటికి నిశ్శేషంగా దహింపబడిన మన్మథునికి సంజీవని వంటి మందువలె పునర్జీవనము ప్రసాదించునది.
శ్రీ మద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా – మంగళకరమైన పంచదశి మంత్రములోని ‘వాగ్భవము’ అను పేరుగల అక్షర సముదాయమే ముఖ్యమైన స్వరూపముగాగల పద్మము వంటి ముఖము గలది.
కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ ।
శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ ॥ 35 ॥
కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ – కంఠము యొక్క క్రింద నుండి నడుము లేదా నాభి ప్రదేశము వరకు గల శరీరమును పంచదశి మంత్రములోని ‘మధ్యకూట’ స్వరూపముగా గలది.
శక్తికూటైక తాపన్న కట్యధోభాగ ధారిణీ – పంచదశి మంత్రములోని ‘శక్తికూటము’తో సామ్యమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించింది.
మూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా ।
కుళామృతైక రసికా, కుళసంకేత పాలినీ ॥ 36 ॥
మూలమంత్రాత్మికా – మూలమంత్రమును అనగా పంచదశాక్షరీ మంత్రమును ఆత్మస్వరూపముగా గలది.
మూలకూట త్రయకళేబరా – మూలమంత్రము యొక్క కూటత్రయమును తన శరీరముగా గలది.
కులమృతైక రసికా – కులమునకు సంబంధించిన అమృతములో మిక్కిలి ఆసక్తి కలది.
కులసంకేత పాలినీ – కుల సంబంధమైన ఏర్పాటులను పాలించింది.
కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ ।
అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ॥ 37 ॥
కులాంగనా – కుల సంబంధమైన స్త్రీ.
కులాంతస్థా – బాహ్యమున శ్రీచక్రార్చన చేయు విధానమును ‘కౌళము’ లేదా కులాచారము అంటారు. కులము యొక్క మధ్యములో స్థితమై ఉన్నది పరమేశ్వరి.
కౌలినీ – కులదేవతల రూపంలో ఆరాధింపబడునది. శివ, శక్తుల సమరస్యము కలిగినది ‘కౌళిని’.
కులయోగినీ – కుండలినీ యోగ దేవతా స్వరూపిణి.
అకులా – అకులా స్వరూపురాలు (కుల మార్గం అనగా షట్చక్రములు ఉన్న దారి. అటుపైన సహస్రార చక్రమును ‘అకులం’ అంటారు.)
సమయాంతస్థా – సమయాచారమనగా మానస పూజ. సమయాచారులకు పురశ్చరణ, హోమ, జప, బాహ్య పూజా విధి విధానాలు వర్తించవు. మహాదేవి సమయాచార అంతర్వర్తిని.
సమయాచార తత్పరా – సమయాచారములో ఆసక్తి కలది.
మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ ।
మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ ॥ 38 ॥
మూలాధారైక నిలయా – మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా గలది.
బ్రహ్మగ్రంథి విభేదినీ – బ్రహ్మగ్రంథిని విడగొట్టునది.
మణిపూరాంత రుదితా – మణిపూర చక్రము యొక్క లోపలి నుండి ఉదయించునది.
విష్ణుగ్రంథి విభేదినీ – విష్ణుగ్రంథిని విడగొట్టునది.
ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ ।
సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ॥ 39 ॥
ఆజ్ఞాచక్రాంతరాళస్థా – ఆజ్ఞాచక్రము యొక్క మధ్యలో ఉండునది.
రుద్రగ్రంథి విభేదినీ – రుద్రగ్రంథిని విడగొట్టునది.
సహస్రారాంబుజారూఢా – వెయ్యి దళములు గల పద్మమును అధిష్టించి యున్నది.
సుధాసారాభివర్షిణీ – అమృతము యొక్క ధారాపాత వర్షమును కురిపించునది.
తటిల్లతా సమరుచిః, షట్-చక్రోపరి సంస్థితా ।
మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ ॥ 40 ॥
తటిల్లతా సమరుచిః – మెఱపుతీగతో సమానమగు కాంతి గలది.
షట్చక్రోపరి సంస్థితా – ఆరు విధములైన మూలాధారాది చక్రముల యొక్క పైభాగమందు చక్కగా నున్నది.
మహాశక్తిః – బ్రహ్మమునందు ఆసక్తి గలది.
కుండలినీ – పాము వంటి ఆకారము గలది.
బిసతంతు తనీయసీ – తామరకాడలోని ప్రోగువలె సన్నని స్వరూపము గలది.
Tags: , , , , , , , , ,