సౌందర్యలహరి 61-70 శ్లోకాలకు అర్థం

soundarya lahari meaning in telugu
61. శ్లోకం
అసౌ నాసావంశస్తుహిమగిరి వంశ ధ్వజపటి
త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాక ముచితమ్ ।
వహన్నంతర్ముక్తాః శిశిరతర నిశ్వాస గలితం
సమృద్ధ్యా యత్తాసాం బహిరపి చ ముక్తామణిధరః ॥ 61 ॥
తాత్పర్యం:
హిమగిరి వంశధ్వజమునకు పతాకము వంటి ఓ హైమవతీ ! నీ నాసిక అను వెదురు దండము మాకు తగిన విధముగా కోరిన వాటిని ప్రాప్తింపచేయుగాక! ఆ నీ నాసావంశదండము లోపల ముత్యములను ధరించుచున్నదని చెప్పవచ్చును. కారణమేమనగా – నీ నాసాదండము ముత్యములతో సమృద్దిగా నిండి వుండగా చంద్ర సంబంధమైన వామనిశ్వాస మార్గము ద్వారా (ముక్కుకు ఎడమవైపు) ముత్యము బయటకు వచ్చి నాసికకు కింద కొన యందు ముత్యముతో కూడిన ఆభరణమగుచున్నది గదా!
62. శ్లోకం
ప్రకృత్యా రక్తాయాస్తవ సుదతి దంతచ్ఛద రుచేః
ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా ।
న బింబం తద్బింబ ప్రతిఫలన రాగాద రుణితం
తులామధ్యారోఢుం కథమివ విలజ్జేత కలయా ॥ 62 ॥
తాత్పర్యం:
సుందరమైన దంత పంక్తిగల దేవీ! సహజముగానే పూర్తిగా కెంపురంగులో ఉండు నీ రెండు పెదవులకు చక్కని పోలికను చెప్పెదను. పగడపు తీగ పండును పండించగలిగినచో, అది నీ పెదవులను పోల్చుటకు సరిపోవచ్చును. దొండపండువలె ఉన్నవని చెప్పవచ్చును. కానీ, అవి నీ పెదవుల ఎరుపురంగు వాటిపై ప్రతిఫలించగా, ఎరుపుదనమును పొందినవని వాటి “బింబము” (దొండపండుకు మరో పేరు) అన్న పేరే చెప్పుచున్నది.  మరి, నీ ఎర్రని పెదవులలో కనీసము 16వ వంతు సామ్యమును కలిగినవని చెప్పుకొనుటకైనా అవి సిగ్గుపడతాయి.
63. శ్లోకం
స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం
చకోరాణామాసీదతి రసతయా చంచుజడిమా ।
అతస్తే శీతాంశోరమృత లహరీ మమ్ల రుచయః
పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంజికధియా ॥ 63 ॥
తాత్పర్యం:
తల్లీ జగజ్జననీ! నీ ముఖము అనే చంద్రుని యొక్క, చిరునవ్వు అను వెన్నెలనంతా అమితముగా గ్రోలిన చకోర పక్షులకు – ఆ వెన్నెల వెర్రి తీపిగా ఉండుటచేత, వాని నాలుకలు ఆ తీపితో చచ్చుబారి రుచి గూడా పట్టనివయ్యెను. అందువలన ఆ చకోర పక్షులు ఏదైనా పుల్లగా ఉండు వాటిని త్రాగి, తీపితో నాలుక మొద్దుబారినతనమును పోగొట్టుకొనదలచి, చంద్రుని వెన్నెల అను అమృతమును బియ్యపు కడుగునీరు లేదా అన్నపు గంజి అను భ్రాంతితో ప్రతి రాత్రి మిక్కిలిగా తాగుచున్నవి. (అంటే అమ్మ చిరునవ్వు అమృతము కంటే మిన్నగా ఉన్నదని భావం).
64. శ్లోకం
అవిశ్రాంతం పత్యుర్గుణ గణకథా మ్రేడ నజపా
జపాపుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా ।
యదగ్రాసీనాయాః స్ఫటిక దృష దచ్ఛచ్ఛ విమయీ
సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా ॥ 64 ॥
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! నీ నాలుక, నిరంతరము నీ పతియైన సదాశివుని విజయ గుణగణముల చరిత్రలను, ఎడతెరిపి లేకుండా చెప్పుచుండుట వలన, మందార పుష్పము యొక్క ఎర్రని కాంతులు గలదై ప్రకాశించుచుండుటయేగాక, తన నాలుక యందే ఎప్పుడూ ఆసీనురాలై, పూర్తిగా స్ఫటికము వలె తెల్లగా ఉండే సరస్వతీ దేవిని సైతము పద్మరాగమణి కాంతులతో ఎర్రని రూపముగల దానిగా మార్చుచున్నది.
65. శ్లోకం
రణే జిత్వా దైత్యానప హృత శిరస్త్రైః కవచిభిర్-
నివృత్తైశ్చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః ।
విశాఖేంద్రోపేంద్రైః శశి విశద కర్పూరశకలా
విలీయంతే మాతస్తవ వదన తాంబూలకబలాః ॥ 65 ॥
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! యుధ్ధమునందు రాక్షసులను జయించి తమ తలపాగలను తీసివేసి, కవచములు మాత్రము ధరించిన వారై, యుద్ధరంగము నుండి మరలి వచ్చుచు, ప్రమథగణములలో ఒకడైన చండునికి చెందు- శివుడు స్వీకరించి విడిచిన గంధ తాంబూలాదికములను వదలి, జగదంబ నివాసమునకు  వచ్చిన కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువులు- నీ నోటినుండి వెలువడి వచ్చిన తాంబూలపు ముద్దలను గ్రహించగా ఆ తాంబూలపు ముద్దలలో చంద్రుని వలె స్వచ్చముగాను, నిర్మలముగాను ఉండు పచ్చ కర్పూరపు తునకలు గూడా పూర్తిగా నమలబడి, మ్రింగబడి ఆ తాంబూలములు పూర్తిగా జీర్ణమై లీనమైపోవుచున్నవి.
66. శ్లోకం
విపంచ్యా గాయంతీ వివిధ మపదానం పశుపతేః
త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే ।
తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీ కలరవాం
నిజాం వీణాం వాణీ నిచులయతి చోలేన నిభృతమ్ ॥ 66 ॥
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! ఈశ్వరుని యొక్క వివిధ సాహస కృత్యములు, చరిత్రలు మొదలగు వాటిని సరస్వతీ దేవి తన వీణతో గానము చేయుచుండగా, నీవు ఆనందముతో తల ఊపుతూ, ప్రశంసా వాక్యములు పలుకునంతలో, ఆ ప్రశంసావచనములు తన వీణానాదముకన్నా మధురముగా ఉన్నవని తలచి, సరస్వతీ దేవి తన వీణాగానమునాపి, తన వీణను పైముసుగు చేత  కనబడకుండా బాగుగా కప్పుమన్నది.
67. శ్లోకం
కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా
గిరీశేనో దస్తం ముహురధర పానా కులతయా ।
కరగ్రాహ్యం శంభోర్ముఖ ముకుర వృంతం గిరిసుతే
కథంకారం బ్రూమస్తవ చిబుక మౌపమ్యరహితమ్ ॥ 67 ॥
తాత్పర్యం:
ఓ గిరి రాజకుమారీ! తండ్రి అయిన హిమవంతుని చేత, అమితమైన వాత్సల్యముతో మునివేళ్ళతో తాకబడినది, అధరామృతపానమునందలి ఆతృత, తొట్రుపాటులతో శివునిచే మాటి మాటికీ పైకెత్తబడినది, శంభుని హస్తమును చేకొనతగినది, సరిపోల్చతగినది ఏమీ లేనిది అయిన- నీ ముఖము అను అద్దమును పుచ్చుకొనుటకు, అందమైన పిడివలె నున్న నీ ముద్దులొలుకు చుబుకమును(గడ్డము)ను ఏ విధముగా వర్ణించగలను?
68. శ్లోకం
భుజాశ్లేషాన్ నిత్యం పురదమయితుః కంటకవతీ
తవ గ్రీవా ధత్తే ముఖకమల నాలశ్రియమియమ్ ।
స్వతః శ్వేతా కాలాగురుబహు లజంబాల మలినా
మృణాలీలాలిత్యం వహతి యదధో హారలతికా ॥ 68 ॥
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! పురహరుని బాహువులతో, కౌగిలింతలతో నిత్యము గగుర్పాటుతో రోమాంచితమై, కింది భాగము సహజముగానే స్వచ్చముగా ఉండి- నల్లగా, విస్తారముగా ఉన్న అగరుగంధపు సువాసనతో, తామరుతూడు అందమును మించిన ముత్యాల హారముతో ఉండుటవలన – నీ మెడ నీ ముఖమనే పద్మమునకు ఒక కాడవలె ఉన్నది.
69. శ్లోకం
గలే రేఖాస్తిస్రో గతిగమక గీతైక నిపుణే
వివాహవ్యానద్ధప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువః ।
విరాజంతే నానావిధ మధుర రాగాకరభువాం
త్రయాణాం గ్రామాణాం స్థితినియమసీ మాన ఇవ తే ॥ 69 ॥
తాత్పర్యం:
సంగీత స్వరగాననిపుణీ, జగజ్జననీ! నీ కంఠము నందు కనబడు మూడు భాగ్యరేఖలు – వివాహ సమయమునందు పెక్కు నూలు పోగులతో ముప్పేటలుగా కూర్చబడి కట్టిన సూత్రమును గుర్తుతెచ్చుచు, నానా విధములైన మధుర రాగములకు ఆశ్రయ స్థానములైన షడ్జమ, మధ్యమ, గాంధార గ్రామముల ఉనికి యొక్క నియమము కొరకు ఏర్పరచిన సరిహద్దుల వలె ఉన్నట్లు శోభాయామానముగా ప్రకాశించుచున్నవి.
70. శ్లోకం
మృణాలీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం
చతుర్భిః సౌందర్యం సరసిజభవః స్తౌతి వదనైః ।
నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమ మథనాదంధ కరిపో-
శ్చతుర్ణాం శీర్షాణాం సమమభయ హస్తార్పణధియా ॥ 70 ॥
తాత్పర్యం:
తల్లీ జగజ్జననీ! తామర తూడువలె మృదువుగా తీగలవలె ఉండు నీ బాహువుల చక్కదనమును చూసి, బ్రహ్మ తన నాలుగు ముఖములతో – పూర్వము తన ఐదవ శిరస్సును గోటితో గిల్లి వేసిన శివుని గోళ్ళకు భయపడుచూ, ఒక్కసారిగా తన మిగిలిన నాలుగు శిరస్సులకు నీ నాలుగు హస్తముల నుండి అభయ దానము కోరుచూ, నిన్ను స్తుతించుచున్నాడు.