91. శ్లోకం
పదన్యాస క్రీడాపరిచయ మివారబ్ధు మనసః
స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా న జహతి ।
అతస్తేషాం శిక్షాం సుభగ మణిమంజీర రణిత-
చ్ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే ॥ 91 ॥
తాత్పర్యం:
ఓ చారుచరితా! అందమైన నీ పాద విన్యాస, క్రీడాభ్యాసమును, తామునూ పొందగోరినవైన నీ పెంపుడు రాజహంసలు తొట్రుపాటు చెందుచూ, నీ విలాస గమనమును వీడలేకున్నవి. అందువలన నీ పాదపద్మము – కెంపులు మొదలగు రత్నములు తాపిన అందియల చిరుసవ్వడులనెడి నెపముతో ఆ రాజహంసలకు విలాస గమనక్రీడా శిక్షణను నేర్చుచున్నట్లున్నది.
92. శ్లోకం
గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః
శివః స్వచ్ఛచ్ఛాయా ఘటిత కపట ప్రచ్ఛదపటః ।
త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా
శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్ ॥ 92 ॥
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు నలుగురు నీవు అధిష్టించు మంచము యొక్క నాలుగు కోడుల రూపమున ఉన్నారు. సదాశివుడు తన స్వచ్చమైన తెల్లని కాంతితో ఆ మంచముపై కప్పు దుప్పటి అగుచూ ఎర్రని నీ మేని కాంతులు తనపై ప్రతిఫలించుట వలన తానూ పూర్తిగా ఎర్రగా మారి, మూర్తీభవించిన శృంగార రసము వలె నయనములకు ఆనందమును ఇచ్చుచున్నాడు.
93. శ్లోకం
అరాలా కేశేషు ప్రకృతిసరలా మందహసితే
శిరీషాభా చిత్తే దృషదుపలశోభా కుచతటే ।
భృశం తన్వీ మధ్యే పృథు రురసి జారోహ విషయే
జగత్త్రాతుం శంభోర్జయతి కరుణా కాచిదరుణా ॥ 93 ॥
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! తలకురులయందు వంకరయైనది, లేత నవ్వునందు స్వభావము చేతనే చక్కనిది, మనస్సునందు దిరిసెన పువ్వువలె మెత్తదనము గలది, వక్షములు సన్నికల్లు పొత్రము వలె బలము గలది, నడుమునందు మిగుల సన్నదనము గలది, వక్షస్థలము వద్ద, పిరుదుల వద్ద విశాలత్వము గలది, ఈ విధముగా ఉండునని చెప్పనలవి కానిది, శంభుని కరుణారూపమైన “అరుణ” అనుశక్తి – జగద్రక్ష నిపుణయై సర్వోత్కర్షతో విరాజిల్లుచున్నది.
94. శ్లోకం
కలంకః కస్తూరీ రజనికరబింబం జలమయం
కలాభిః కర్పూరైర్మరకత కరండం నిబిడితమ్ ।
అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం
విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే ॥ 94 ॥
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! ఆకాశములో కనబడు చంద్రమండలము – మరకత మణులచే చేయబడి, నువ్వు – కస్తూరి, కాటుక, పన్నీరు మొదలైన వస్తువులను ఉంచుకొను బరణియే! చంద్రునిలో మచ్చవలె నల్లగా కనబడునది కస్తూరి. ఆ చంద్రునిలోని జలతత్త్వ్యము – నువ్వు జలకమాడుటకు ఉపయోగించు పన్నీరు. చంద్రుని కళలుగా భావించబడునవి – పచ్చకర్పూరపు ఖండములు. ఈ వస్తువులు ఆ బరణి నుండి నువ్వు ప్రతిదినము వాడుకొనుచుండుట వలన తరిగి పోవుటచే -నీ ఆజ్ఞను అనుసరించి నీ పాలనలో సృష్టిపనిచేయు బ్రహ్మ మరల ఆ వస్తువులను పూరించుచున్నాడు.
95. శ్లోకం
పురారాతేరంతఃపురమసి తతస్త్వచ్చరణయోః
సపర్యామర్యాదా తరల కరణా నామసులభా ।
తథా హ్యేతే నీతాః శతమఖముఖాః సిద్ధిమతులాం
తవ ద్వారోపాంత స్థితిభిరణిమాద్యాభిరమరాః ॥ 95 ॥
తాత్పర్యం:
అమ్మా! జగజ్జననీ! నీవు త్రిపురహరుడైన శివుని పట్టమహిషివి. అందువలన నీ పాద పద్మపూజ చేయగల భాగ్యము చపల చిత్తులైన వారికి లభించునది గాదు. అందువలననే ఈ ఇంద్రాది దేవతలందరూ, తాము కోరుకున్న అల్పమైన అణిమాది అష్టసిద్దుల గూడి, వారితో పాటు నీ ద్వార సమీపమునందే కావలివారి వలె పడిగాపులు గాచుచున్నారు.
96. శ్లోకం
కలత్రం వైధాత్రం కతికతి భజంతే న కవయః
శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః ।
మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే
కుచాభ్యామాసంగః కురవకతరోరప్యసులభః ॥ 96 ॥
తాత్పర్యం:
ఓ పతివ్రతా శిరోమణీ! పార్వతీ! బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతిని ఎందరెందరు కవులు సేవింపకున్నారు? లక్ష్మీదేవి యొక్క ధనసంపదలను పొంది ఏ పురుషుడు ధనపతి కాకున్నాడు? కాని పతివ్రతలలో మొట్టమొదట లెక్కింపదగిన దేవీ! నీ స్తనయుగముతోడి కౌగిలింత ఆ సదాశివునికి ఒకనికే తప్ప గోరంట చెట్టుకు గూడా లభించదు కదా!
97. శ్లోకం
గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీ మాగమవిదో
హరేః పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయామ్ ।
తురీయా కాపి త్వం దురధిగమ నిఃసీమ మహిమా
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి ॥ 97 ॥
తాత్పర్యం:
ఓ పరబ్రహ్మమైన సదాశివుని పట్టమహిషీ! ఆగమ రహస్యార్థములు తెలిసిన విద్వాంసులు నిన్ను – బ్రహ్మదేవుని ఇల్లాలు, వాగ్దేవి అయిన సరస్వతీదేవిగా చెప్పుదురు. ఆ నిన్నే – శ్రీ, మహావిష్ణుమూర్తి భార్య, కమలవాసిని అయిన మహాలక్ష్మీదేవిగా – చెప్పుదురు. మరియు ఆ నిన్నే – శివుని సహధర్మచారిణి అయిన పార్వతిగా గూడా చెప్పుదురు. కాని, నీవు ఈ ముగ్గురికంటె వేరుగా నాల్గవ దానివై, ఇట్టిదని చెప్పనలవికాని ఆమెవై, అనిర్వాచ్యమై, మహాకష్టసాధ్యమై, మహామాయా తత్త్వమై, ఈ సర్వజగత్తును నానా విధములుగా మోహపెట్టుచున్నావు.
98. శ్లోకం
కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం
పిబేయం విద్యార్థీ తవ చరణనిర్ణే జనజలమ్ ।
ప్రకృత్యా మూకానామపి చ కవితాకారణతయా
కదా ధత్తే వాణీముఖకమలతాంబూల రసతామ్ ॥ 98 ॥
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! స్వాభావికముగానే – చెవిటివారికి వినికిడి శక్తిని, మూగవారికి మాట్లాడుశక్తిని కలిగించునదై, పూర్వానుభవము, సామర్ధ్యము లేకున్నా కవిత్వరచనా సౌభాగ్యమును ప్రసాదించునదై, సరస్వతీదేవి తాంబూల రసము వంటిదగు లత్తుకరసముతో కలసిన నీ పాద ప్రక్షాళన జలమును- విద్యార్థినైన నేను ఎప్పుడు గ్రోలుదునో చెప్పుము.
99. శ్లోకం
సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే
రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా ।
చిరం జీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికరః
పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్ ॥ 99 ॥
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! నిన్ను సేవించు భక్తుడు సరస్వతీ కటాక్షము చేత, లక్ష్మీ కటాక్షము చేత వరుసగా బ్రహ్మ, విష్ణువులకు ప్రత్యర్థిగా మారి విహరించును. అత్యంత సుందరమైన రూపముతో మన్మథపత్ని అయిన రతీదేవి పాతివ్రత్యమును కూడా సడలింపచేయును. చివరకు జీవ సంబంధ, అవిద్యాసంబంధముల నుండి దూరుడై, జీవన్ముక్త స్థితిలో పరానంద సుఖమును అనగా మోక్షానందమును అనుభవించును.
100. శ్లోకం
ప్రదీప జ్వాలాభిర్దివసకర నీరాజనవిధిః
సుధాసూతేశ్చంద్రోపల జలల వైరర్ఘ్యరచనా ।
స్వకీయైరంభోభిః సలిలనిధి సౌహిత్యకరణం
త్వదీయా భిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియమ్ ॥ 100 ॥
తాత్పర్యం:
వాక్రపంచమున కెల్ల తల్లివగు ఓదేవీ! భగవతీ! తన సంబంధము వలనే జ్వలించు దివిటీ జ్వాలల చేత- సూర్యునికి హారతి నిచ్చుట ఎట్లో, అట్లే తన సంబంధము వలననే స్రవింపబడు చంద్రకాంతా శిలాజల బిందువుల చేత చంద్రునికి అర్ఘ్యము సమర్పించుట ఎట్లో, అట్లే తనకు సంబంధించినవే అయిన సముద్రోదకముల చేతనే ఆ సముద్రుని తృప్తికి తర్పణము చేయుట ఎట్లో -అట్లే – నీ అనుగ్రహము వలన నీ స్వరూపములో నా నుండి వ్యక్తమగు వాక్కుల కూర్చులచే ఈ స్తుతి నీకు నా చేత చేయబడుచున్నది.
సౌందర్యలహరి ముఖ్యస్తోత్రం సంవార్తదాయకమ్ ।
భగవద్పాద సన్క్లుప్తం పఠేన్ ముక్తౌ భవేన్నరః ॥
॥ ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య
శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ సౌందర్యలహరీ సంపూర్ణా ॥
॥ ఓం తత్సత్ ॥
(అనుబంధః)
సమానీతః పద్భ్యాం మణిముకురతామంబరమణి-
ర్భయాదాస్యాదంతఃస్తిమితకిరణశ్రేణిమసృణః ।
(పాఠభేదః – భయాదాస్య స్నిగ్ధస్త్మిత, భయాదాస్యస్యాంతఃస్త్మిత)
దధాతి త్వద్వక్త్రంప్రతిఫలనమశ్రాంతవికచం
నిరాతంకం చంద్రాన్నిజహృదయపంకేరుహమివ ॥ 101 ॥
సముద్భూతస్థూలస్తనభరమురశ్చారు హసితం
కటాక్షే కందర్పః కతిచన కదంబద్యుతి వపుః ।
హరస్య త్వద్భ్రాంతిం మనసి జనయంతి స్మ విమలాః
పాఠభేదః – జనయామాస మదనో, జనయంతః సమతులాం, జనయంతా సువదనే
భవత్యా యే భక్తాః పరిణతిరమీషామియముమే ॥ 102 ॥
నిధే నిత్యస్మేరే నిరవధిగుణే నీతినిపుణే
నిరాఘాతజ్ఞానే నియమపరచిత్తైకనిలయే ।
నియత్యా నిర్ముక్తే నిఖిలనిగమాంతస్తుతిపదే
నిరాతంకే నిత్యే నిగమయ మమాపి స్తుతిమిమామ్ ॥ 103 ॥
Leave a Reply