A traditional Hindu couple performing Shashtipoorthi ceremony with priests chanting Vedic hymns.

షష్టి పూర్తి మహోత్సవం

షష్టి పూర్తి మహోత్సవం

మనది ఎంతో పవిత్రమైన, ఆదర్శవంతమైన సత్సంప్రదాయాలతో కూడిన సంస్కృతి. మన పెద్దలు దూరదృష్టితో, సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించి కొన్ని ఆచారాలను, సంస్కారాలను మనకు ఏర్పాటు చేశారు. అలాంటి సంస్కారాలలో ఒకటి షష్టి పూర్తి మహోత్సవం. ఈ షష్టి పూర్తి ఎప్పుడు నిర్వహిస్తారు? పాటించే విధానాలేంటి? ఈ కార్యక్రమం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? అసలు ఈ షష్టిపూర్తి వ్రతం ఏ విధంగా ఏర్పడింది? మొదటిగా ఎవరు ఈ షష్టిపూర్తి వ్రతాన్ని జరుపుకున్నారు? అనే విషయాలను ఈ వీడియొలో తెలుసుకుందాం. నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం.

బ్రహ్మ మానస పుత్రుడు, తపశ్శాలి అయిన దక్ష ప్రజాపతికి 60 మంది సంతానం కలిగారు. వీరే ప్రభవ విభవ శుక్ల మొదలైన వారు. ఈ 60 మంది- నారదుని ద్వారా మంత్రోపదేశం పొంది బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేసి, తద్వారా కాలస్వరూపులు అయ్యారు. 60 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరంగా మారారు. వీరు ఆ సంవత్సరాలను నడిపిస్తూ, మానవులకు శుభాశుభాలు అందిస్తారు.

మానవుడి ఆయుర్దాయం ఒక్కొక్క యుగంలో ఒక్కో విధంగా ఉంటుంది. మొదటిదైన కృతయుగంలో మానవులు వేలకొద్దీ యేళ్ళు జీవించేవారు. ఒక్కో యుగానికీ ఆయుర్దాయం తగ్గుతూ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కలియుగంలో మనిషికి ఇప్పుడు 120 సంవత్సరాలు సంపూర్ణ ఆయుష్షు. అదికూడా పూర్తిగా జీవించలేకపోవడానికి కారణం అనేక జన్మలలో మానవులు చేసుకున్న పాప ఫలితం అనే చెప్తారు. కృతయుగం నాటి వైశంపాయన మహర్షి.. కలియుగంలో మనుషుల ఆయుర్దాయం తగ్గుతుందని చింతించాడు. వేద వ్యాసుని కలిసి ‘మహర్షీ! దేహం ఉంటేనే కదా ధర్మాలను పాటించగలిగేది! శరీరం లేకపోయినా, వ్యాధిగ్రస్తమైనా కర్మలను ఎలా ఆచరిస్తారు? కనుక కలియుగంలో ఆయుష్షు పెరిగి.. పుత్ర పౌత్రులతో, సర్వ సంపదలూ అనుభవించేందుకు ఏ ధర్మాన్ని ఆచరించాలి?’ అనడిగితే అప్పుడు వ్యాస మహర్షి “లోకానికి మంచి చేసేది, ఆయుర్వృద్ధిని కలిగించేది, దేహపటుత్వాన్ని పెంచేది అయిన ఒక రహస్యమైన ప్రక్రియ ఉంది. అదే షష్ట్యబ్ధి వ్రతం.  షష్టి వర్షేతు సంప్రాప్తే ద్విజశ్రద్ధాసమన్వితః అని చెప్తారు. అంటే అరవై సంవత్సరాలు రాగానే శ్రద్ధా భక్తులతో వేద వేదాంతాలు తెలిసిన బ్రాహ్మణులను పిలిపించి, నదీ తీరంలోగానీ, స్వగృహంలో గానీ, లేదా తనకు అనుకూలమైన ఏదైనా ఒక చక్కటి ప్రదేశంలో గానీ ఈ ప్రక్రియను వేదోక్త విధంగా ఆచరించి పూర్తి చేయాలి.  ఇలా చేస్తే మానవుడు దీర్ఘాయుష్షు కలవాడై, రోగరహితుడై, వంశాభివృద్ధి కలిగి, ఉత్తమ కర్మలను చేయగలడు” అని చెప్తాడు.

దీనిని పూర్వం, నహుష చక్రవర్తి కుమారుడైన యయాతి చేసాడు. అతడు తన మామగారైన శుక్రుడితో శపించబడి ముసలివాడైనపుడు, శాప విముక్తి కోసం యయాతి ప్రార్థించగా, అప్పుడు శుక్రుడు, ” రాజా, షష్టి పూర్తి అనే ఒక రహస్య వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని చేస్తే, తిరిగి యవ్వనాన్నిపొందుతావు. నీ కుమారులలో ఒకరు తన యవ్వనాన్ని నీకిచ్చినా కూడా నీకు యవ్వనం కలుగుతుంది” అని చెప్తాడు. మొదట యయాతి తన కుమారులలో ఒకరి యవ్వనాన్ని తీసుకొని తన వార్ధక్యాన్ని అతడికి ఇచ్చాడు. ఆ తరువాత అది అధర్మమని ఆలోచించి, పుత్రుడి యవ్వనాన్ని అతడికే ఇచ్చేసి, షష్టి పూర్తి వ్రతం చేసి మళ్ళీ యవ్వనవంతుడై, భోగభాగ్యాలు అనుభవించి, యజ్ఞయాగాదులు చేసి, చివరికి విష్ణు సాయుజ్యాన్ని పొందాడు. బోధాయన మహర్షి కూడా తన పండిత పరిష్కారంలో “59 సంవత్సరాలు నిండి 60 వ సంవత్సరంలోకి మానవుడు ప్రవేశించగానే అతని జన్మ తిథిలో షష్టిపూర్తి జరిపించాలి. ఒకవేళ జన్మతిథి లో ఏదైనా విఘ్నాలు సంభవించి కుదరకపోతే, అప్పుడు 60 వ సంవత్సర కాలంలో మంచిరోజున జరిపించుకోవచ్చు” అని తెలిపారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మనుషుల పూర్ణాయుష్షు 120 సంవత్సరాలు. ఈలోపల అన్ని గ్రహాల దశలూ పూర్తిగా జరిగిపోతాయి. బృహస్పతి పన్నెండు సంవత్సరాల కొకసారి, తిరిగి తాను బయలుదేరిన స్థానానికి చేరుకుంటాడు. అలాగే శని 30 సంవత్సరాలకు ఒకసారి, 12 రాశులను చుట్టివస్తాడు. వీరిద్దరూ జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. అంటే అరవై ఏళ్లు నిండేసరికి.. ఆయా గ్రహాలు జాతకుని జన్మ కుండలిలో ఉన్న స్థానాలకు వచ్చి చేరతాయి. ఆయా సమయాల్లో గ్రహసంధుల వల్ల కొన్ని దోషాలు కలగొచ్చు. ప్రభవ నామ సంవత్సరం నుండి అక్షయ నామ సంవత్సరం వరకు 60 సంవత్సరాలు. ఒక విధంగా కాలానికి సంకేతం 60. ఒక రోజుకి 60 ఘడియలు. 60 విఘడియలు. 60 సెకనులు, 60 నిమిషాలు. నవగ్రహాలు వాటి దిశలు ఒక ఆవృత్తికి 120 సంవత్సరాలు పడుతుంది. దీనిని బట్టి ఆవృత్తి ప్రకారం మనిషి ఏ సంవత్సరంలో పుట్టాడో అతనికి మళ్ళీ అదే పేరున్న సంవత్సరానికి షష్టిపూర్తి జరగాలి. అంటే ఉదాహరణకి ప్రభవ నామ సంవత్సరంలో పుట్టి ఉంటే, అరవై యేళ్ళు నిండగానే అరవై ఒకటో సంవత్సరం మళ్ళీ “ప్రభవ” నామ సంవత్సరం వస్తుంది. దీనినే మరొక ఆవృత్తి, మరొక జన్మ అంటారు. కాబట్టి ఈ జనన దోషం తొలగడానికి షష్టిపూర్తి కార్యక్రమం అవసరం అని పండితులు చెబుతారు.

సగం ఆయుర్దాయము గడచిన తర్వాత ప్రతి ఇక్కరూ ఆధ్యాత్మికం గా ఎంతో కొంత ఉన్నతిని సాధించి ఉంటారు. అందుకు కృతజ్ఞత గా భగవంతునికి ఆరాధనాపూర్వకముగా చాలామంది ఈ షష్టి పూర్తిని జరుపుకుంటారు. గడచిన తమ అరవై సంవత్సరాలలో అంటే ఆయుర్దాయపు మొదటి ఆవృతంలో చేసిన పాప ఫలము రెండవ ఆవృతంలో తక్కువ కష్టముతోనో, బాధ తెలియకుండానో తీరాలన్నా, ఆ పాపాల తీవ్రత తగ్గాలన్నా శంకరుడైన రుద్రుని ఆరాధించాలి. రుద్రుడు సాధారణముగా అందరినీ, అన్నింటినీ లయము చేసే కార్యంలో ఉంటాడు. ఈ రుద్రులు చాలామంది ఉంటారు.

వీరిలో చాలామంది సౌమ్యులు, శాంతస్వభావం కలవారు. కొందరు రుద్రులు ఉగ్రంగా, రౌద్రంగా ఉంటారు. ఉగ్రరథుడు అనే రుద్రుడు మానవులను 60వ ఏట హింసిస్తాడు. సంసారంలో ఇబ్బందులు, ఆయుష్షు తీరిపోవడం, అప మృత్యువు పాలవడం, శరీరం అనారోగ్యం పాలై అవయవాల పనితీరు, శక్తి మందగించడం మొదలైన పరిణామాలు కలిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఆయా కుదుపులకు తట్టుకుని, మళ్ళీ శక్తిని పుంజుకోవటానికి, ఉగ్రరథుడు అనే ఆ రుద్రుని శాంతింపచేయాలి. జననకాలం నుండి 60వ సంవత్సరం వచ్చినపుడు , జన్మ నామ సంవత్సరం, జన్మ మాసం, జన్మ నక్షత్రం, జన్మ తిథిలో సర్వ అరిష్ట పరిహారం కోసం అచరించాల్సిన శాంతి క్రమమే ఉగ్రరథ శాంతి. మిగతా 60 సంవత్సరాలు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా కేవలం ఆధ్యాత్మిక చింతనతో బ్రతకాలని ధర్మ శాస్త్రం చెబుతోంది.

ఇదేవిధంగా 70 సంవత్సరాలు నిండితే ‘భీమరథ‘ అనే మృత్యుదోషం కలుగుతుంది. కాబట్టి ‘భీమరథశాంతి‘ చేయాలి. అలాగే 78 సంవత్సరాలు నిండితే ‘విజయరథశాంతి‘ చేయాలి. చాలామందికి ఈ సంవత్సరాలలోనే అనేక గండాలు ఉంటాయి. పుట్టినప్పటినుండి 83 సంవత్సరాల 4 మాసాలకు వేయి చంద్రదర్శనాలు పూర్తవుతాయి.  కాబట్టి అప్పుడు ‘సహస్ర చంద్ర దర్శనం‘ వేడుక చేయాలి. సహస్ర చంద్ర దర్శనం ఎలా చేయాలి, ఏ వయసులో చేయాలి? మొదలైన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ వీడియొ చూడండి. లింక్ descriptionలో ఉంది. నూరు సంవత్సరాలు పూర్తిగా నిండితే ‘పూర్ణ శతాభిషేకం‘ నిర్వహించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

షష్టి పూర్తిని చాలామంది షోడశ సంస్కారాలలో ఒకటి అనుకుంటారు. కానీ ఇది కేవలం ఒక శాంతి ప్రక్రియ మాత్రమే. అథర్వణ వేదంలోను, యజుర్వేద బ్రాహ్మణంలోను, ఋగ్వేదంలోను ఈ శాంతికి సంబంధించిన కొన్ని మంత్రాలున్నాయి. ఆపస్తంబ, బోధాయన, ఇతర గృహ్య సూత్రాలలో షష్టిపూర్తికి సంబంధించిన తంతు క్లుప్తంగా వివరించబడింది. మగవారికి 60 వ సంవత్సరం రాగానే, దంపతులిద్దరూ కలిసి ఈ షష్టిపూర్తి వ్రతాన్ని ఆచరించాలి. మన భారతీయ సంస్కృతిలో భర్తకి అర్థాంగిగా సహధర్మచారిణిగా అన్ని భౌతికమైన, దైవ సంబంధమైన కార్యాలలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి పురుషునిలో సగభాగమైన ఆడవారికి ప్రత్యేకముగా ఈ ప్రక్రియ లేదు. భర్తకు 60 సంవత్సరాలు నిండి భార్య ఉన్నట్లయితే ఇద్దరికీ కలిపి షష్టిపూర్తి నిర్వహిస్తారు. ఒకవేళ భార్య కంటే ముందుగా 60 సంవత్సరాలు నిండకుండానే భర్త వెళ్ళిపోయినట్లయితే భార్యకు 60 సంవత్సరాలు వచ్చాక షష్టిపూర్తి నిర్వహించవచ్చు. హోమం మొదలైన క్రతువులు తప్ప మిగిలినవి జరిపించొచ్చు. సహస్ర చంద్ర దర్శనం కూడా నిర్వహించవచ్చు. షష్టిపూర్తి చేసుకోవాలనుకున్న వారు ముందుగా బ్రాహ్మణులను సంప్రదించి, వారు సూచించిన విధంగా ఈ వేడుక జరిపించుకోవాలి. మూడు రోజుల పాటు ఈ వేడుకను జరుపుకుంటారు.

మొదటిరోజు ఉదయమే పుణ్యాహము చేసి, ఏకాదశ రుద్రులకు, ఇతర దేవతలకూ కలశాలను స్థాపించి, ఆవాహన చేసి ఉదకశాంతి ప్రయోగం చేయించాలి. కొందరు “సర్వతో భద్ర మండలాన్నితీర్చిదిద్ది, రంగవల్లులతో అలంకరించి, దానిపై కలశాలను స్థాపించి, సర్వదేవతలనూ ఆవాహన చేస్తారు. ఆనాటి సాయంకాలం ఈశ్వరుడికి మహాన్యాస పూర్వకముగా అభిషేకం, షోడశోపచార పూజ, నవగ్రహ మంత్ర జపం, మృత్యుంజయ మంత్ర జపం వంటివి చేయించాలి. తెల్లవారితే షష్టిపూర్తి చేసుకొనే వారి ఇంటిముందు సకల దేవతాగణాలు ఆహ్వానించబడి, అక్కడ నివసించడం నిజంగా ఆ మానవుని అదృష్టం.

కలశాలను స్థాపించడంలో భిన్నమైన ఆచారాలున్నాయి. ప్రాంతాన్ని బట్టి, ఆచారాలను బట్టి స్తోమతను బట్టి కలశాలను ఏర్పాటు చేస్తారు. ఇత్తడివి కానీ, దారుపాత్రలు అంటే చెక్కతో చేసిన కలశాలు కానీ వాడాలి. మరునాడు తెలతెలవారుతూ ఉండగానే మళ్ళీ పుణ్యాహవచనం చేసి,  నవగ్రహ పూజ, సప్త చిరంజీవుల పూజ, సంవత్సర పూజ, నక్షత్ర పూజ,  నవగ్రహ హోమం, ఆయుష్య హోమం, మృతుంజయ హోమం చేయాలి. సమిధలలో తిప్ప, పాలక, చంద్ర, అట్టి, జిల్లేడు, మోదుగ, జమ్మి మొదలైనవి వాడతారు. వీటితో పాటు గంధర్వులకు ప్రీతికరమైన కుశ, అశ్వత్థ ప్లాక్ష, ఔదంబర అనే సమిధలు విధిగా హోమాలలో వాడతారు.

షష్టిపూర్తి సందర్భంగా ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. అదెలాగంటే, తెల్లని నూతన వస్త్రము పరచి, దాని మీద తూర్పు దిక్కుగా పన్నెండు గీతలు గీసి, అడ్డంగా ఐదు గీతలు గీసి అరవై గడులు వచ్చేలా చేస్తారు. తూర్పు దిక్కున బియ్యం పోసి, కలశం అమర్చి, ప్రభవనుంచి, క్షయ వరకు అరవై సంవత్సరాల అధిదేవతలను, ఆవాహన చేస్తారు.

ఇంకా త్రిమూర్తులు, చతుస్సముద్రాలు, పంచభూతాలు, సప్తలోకాలు, అష్టవసువులు, నవబ్రహ్మలు, దశదిశలు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, బ్రహ్మ, రెండు అయనాలు, ఆరు ఋతువులు, పన్నెండు మాసాలు, రెండు పక్షాలు, 60 సంవత్సరాలు ఇలా 360 రోజులను నడిపించే దేవతలను కలశరూపంలో ఆవాహన చేసి శాస్త్రోక్తంగా పూజలు జరిపిస్తారు.

వీరితో పాటు తిధులను, వారాలను, వారదేవతలను, నవగ్రహాలను, 12 రాశులను, నవదుర్గలను, అగ్ని, జలం, భూమి, విష్ణువు, ఇంద్రుడు, ప్రజాపతులు, సప్త చిరంజీవులు, మరుత్తులు, శివుడు, నవదుర్గలు, కుమారస్వామి, ఇరవైఏడు నక్షత్ర దేవతలను, 27 యోగములు, 11 కరణములు, దేవి, దేవతా స్వరూపాలను, మృత్యుంజయుని ఆవాహన చేసి, పురోహితుల సహాయంతో, వేదయుక్తంగా యజ్ఞ కార్యక్రమం జరిపిస్తారు. మహామృత్యుంజయ మంత్రాలు, నవగ్రహ మంత్రాలు, వేద పఠనం చేస్తూ హోమం జరిపిస్తారు. తరువాత శాంతి ప్రవచనాలు, పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఇంకా వీలున్నవారు సప్తశతీ పారాయణం, చండీ హోమం, శ్రీరామ పట్టాభిషేకం, భాగవత సప్తాహం, హరికథలు వంటి కార్యక్రమాలు కూడా చేయిస్తారు. పూజలు, హోమాలు అయిపోయిన తరువాత, ఆ కలశాలకు మళ్ళీ పూజ చేసి, ఆయా దేవతలను ఉద్వాసన చేయాలి.

మూడవ రోజు అవభృథ స్నానం చేయిస్తారు. అంటే ఏదైనా యజ్ఞాలు, హోమాలు, దీక్షలు స్వీకరించినపుడు అది పూర్తి అయ్యాక అవభృథ స్నానం చేస్తారు. దానికోసం హోమకుండానికి ఉత్తరాన కానీ, ఈశాన్యంలో కానీ, స్నానం కోసం ఏర్పాటు చేసిన మండపంలో పుత్ర పౌత్రాదులతో, భార్యతో యజమానిని, అలంకరించబడిన పీటలపైన కూర్చోబెట్టాలి. తరువాత, స్థాపించబడిన ఆ కలశాలోని నీటితోనే కర్తకు, అతడి భార్యకు- పురోహితులు , బ్రాహ్మణులు అవభృథ స్నానం చేయిస్తారు. ఈ స్నానంలో భాగంగా, వంద చిల్లులు గల ఘటాన్ని కానీ లేదా చిల్లులు గల జల్లెడ వంటి ఒక పళ్ళెములో కానీ నవరత్నాలులు వేసి లేదా నవరత్నాలు తాపడం చేసిన పళ్ళెములో గానీ కలశాలలోని నీరు పోస్తూ, దంపతుల తలపై పడేటట్లు స్నానం చేయిస్తారు. నవరత్నాలు లేకపోయినా, కలశాలలోని నీటితో అవభృథ స్నానం చేయించడం ముఖ్యం. ఇది అభిషేకము కాదు. అభిషేక మంత్రాలు పఠించరు. కేవలము పౌరాణిక, వేద మంత్రాలతో స్నానం చేయిస్తారు. దీనినే అవభృథ స్నానం అంటారు. తర్వాత కంచు పాత్రలో ఉంచిన దీపాలతో నీరాజనం ఇస్తారు. మంటపానికి నాలుగు దిక్కులా చిత్రాన్నం అంటే పసుపు కలిపిన అన్నంతో బలి ఇస్తారు.

యజమాని నూతన వస్త్రాలు, గంధం , కుంకుమ ధరించి, పూలమాల ధరించి, రక్ష స్వీకరించి, ఒక కంచుతో చేసిన నేతి పాత్రలో అలక్ష్మీ పరిహారం కోసము తన ముఖపు ప్రతిబింబాన్ని చూసుకోవాలి. దక్షిణ తాంబూలతో ఆ నేతిపాత్రను బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. వీటితో కలిపి, బ్రాహ్మణులకు, దశదానాలు అంటే మొత్తం పదిరకాల దానాలు ఇవ్వాలి. దశదానాలు అంటే

  1. నల్ల నువ్వులు / లేక నువ్వుల నూనె ,
  2. గోఘృతము ( ఆవు నెయ్యి )
  3. భూదానము ( దానికి బదులుగా కొంత ధనము )
  4. గోదానము ( దానికి బదులుగా కొంత ధనము )
  5. హిరణ్య ( బంగారం ) దానము ( దానికి బదులుగా కొంత ధనము )
  6. రజత ( వెండి ) దానము ( దానికి బదులుగా కొంత ధనము )
  7. గుడ దానము ( బెల్లము )
  8. వస్త్ర దానము
  9. లవణ దానము
  10. కంబళి దానము

ఈ దానాల ఉద్దేశం, వానప్రస్థాశ్రమానికి చేరే వయసు కాబట్టి, ధనలోభం వదలి, తమ సంతతి అభ్యున్నతి కోసం వీలైనంతగా ఎన్ని దానాలు ఎక్కువగా ఇస్తే, అంత సంపద తన సంతతికీ, తన వారసులకూ వచ్చి చేరుతుంది. తమ శక్తి సామర్థ్యాల బట్టి కొందరు తక్కువ ఖర్చుతోను, కొందరు ఆడంబరంగానూ జరుపుకుంటారు. కానీ శ్రద్ధ భక్తులతో చేస్తే ఈ శాంతి వలన అందరికీ సమాన ఫలమే వస్తుంది.  ముఖ్య ఆచార్యుడికి, ప్రత్యేకంగా గోదానం ఇవ్వాలి. ఆచార్యుడిని ఒక పీఠముపైన కూర్చోబెట్టి , గంధపుష్ప తాంబూల వస్త్రాలిచ్చి, వేదబ్రాహ్మణులు మంత్రాలు పఠిస్తుండగా, గోవును, దూడను, పాలుపితకడానికి ఒక కంచుపాత్రనూ దానమివ్వాలి. ఈ మధ్యకాలంలో వీటికి బదులుగా కొంత ధనం ఇస్తున్నారు. తర్వాత కలశాలను దానమీయాలి. ఇతర బ్రాహ్మణులకు కలశ, వస్త్ర, ప్రతిమలను దానం చేయాలి. ఈ దానాలన్నీ కూడా మంత్ర పూర్వకంగా ఇవ్వాలి.

దానముల తరువాత మళ్ళీ స్నానం చేసి , వేరే వస్త్రాలు ధరించాలి. ఇవన్నీ షష్టిపూర్తి చేసుకొనే దంపతులకు అప మృత్యువును తొలగించి, శాశ్వత యశస్సు కలిగించి, పరమేశ్వర కటాక్షంతో పరిపూర్ణ ఆయువును కల్పిస్తాయి. ఈ కాలము వారు చేస్తున్నట్టు మళ్ళీ మంగళ సూత్రము కట్టడం, దండలు మార్చుకోవడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇటువంటివి మన శాస్త్రంలో లేవు. కేవలం జనాచారంగా, కాలానుగుణంగా ఏర్పడినవి. అర్థం లేనివి. ఆ తరువాత బ్రాహ్మణులకు , బంధువులకు భోజనాలు , మిగిలిన బ్రాహ్మణులకు దక్షిణలు, కానుకలు ఇచ్చి బ్రాహ్మణాశీర్వాదం పొందాలి. ఆ తరువాత దగ్గరి బంధువులతో కలసి వారు భోజనం చేయాలి.ఆర్ధిక స్తోమత లేనివారు అభ్యంగన స్నానం చేసి ఇంట్లో కుల దైవానికి, తలిదండ్రులు జీవించి ఉంటే వారికి, గోమాతకు పూజ చేసి ఇంటికి దగ్గరలో  ఉన్న దేవాలయ దర్శనం చేసి అక్కడ ఉన్న పేదలకు, యాచకులకు తోచిన సహాయం చేయాలి. ఇలానే షష్టిపూర్తి ఖచ్చితంగా జరుపుకోవాలి అని కఠోర నియమం ఏమీ లేదు. చేసుకోగలిగితే అదృష్టం. మామూలుగా పుట్టినరోజు జరుపుకున్నట్టే ఇది కూడా చేసుకోవచ్చు. పెద్దల ఆశీర్వాదం తీసుకొని, అన్నదానం వంటివి చేయవచ్చు.

మొదటి 60 సంవత్సరాలు మానవుని ఆలోచనా శక్తి అమోఘంగా ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత తిరిగి వారి మొదటి దశకు అనగా చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగి ఆలోచన పరిజ్ఞానం కాస్త తగ్గుతూ వస్తుంది. అందుకే 60 సంవత్సరాలు దాటిన తల్లిదండ్రులను పిల్లలు కన్నబిడ్డల్లా చూసుకోవాలని శాస్త్రం చెబుతోంది. బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకొనే అపురూప సందర్భం షష్టిపూర్తి. అన్నదమ్ములు, కోడళ్లు కొడుకులు,  అల్లుళ్ళు కూతుళ్ళు, మనుమలు మనుమరాళ్ళు,, బంధువులు, మిత్రులు…. ఇలా వీరందరి సమక్షంలో ఎంతో ఆంనందంగా చేసుకొనే వేడుక షష్టిపూర్తి.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top