దామోదరాష్టకం | Damodarastakam Telugu

దామోదరాష్టకం

దామోదరాష్టకం

దామోదరాష్టకం అనేది శ్రీకృష్ణుడును స్తుతిస్తూ రాసిన పవిత్రమైన స్తోత్రం. ఇది పద్మ పురాణంలో భాగంగా ఉండి, ముఖ్యంగా కార్తీక మాసంలో పఠించడం అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది. “దామోదర” అనే నామం యశోదమ్మ కట్టిన తాడు గుర్తుగా శ్రీకృష్ణుని బాలలీలను సూచిస్తుంది. ఈ స్తోత్రం భక్తి, ప్రేమ మరియు వినయానికి ప్రతీకగా నిలుస్తుంది.

దామోదరాష్టకం పఠించడం వల్ల పాపాలు నశించి, మనస్సుకు శాంతి, ఆధ్యాత్మిక ఆనందం లభిస్తాయని విశ్వాసం. భక్తితో దీన్ని జపించడం ద్వారా కుటుంబ సుఖశాంతి, ఐశ్వర్యం మరియు దైవ అనుగ్రహం పొందవచ్చు. ముఖ్యంగా దీపారాధన సమయంలో పఠిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి.

నమామీశ్వరం సచ్చిదానందరూపం
లసత్కుండలం గోకులే భ్రాజమానమ్ ।
యశోదాభియోలూఖలాద్ధావమానం
పరామృష్టమత్యంతతో ద్రుత్య గోప్యా ॥ 1 ॥

శాశ్వతుడు, జ్ఞాన స్వరూపుడు, పరమానంద స్వరూపుడు, సొరచేప ఆకృతిలో వుండి ఊగుతున్న కర్ణ కుండలములు ధరించినవాడు, గోకులంలో అతి సౌందర్యంతో ప్రకాశించేవాడు, తల్లి చిలుకుతున్న వెన్నకుండను పగులగొట్టి, ఉట్టికి కట్టిన వెన్నకుండనుండి వెన్న దొంగిలించుటచే భయపడువాడు, చెక్కరోలునుండి పరుగెత్తువాడు, కానీ యశోదాదేవికి పట్టుబడిన వాడు అగు దేవదేవుడైన దామోదరునికి ప్రణమిల్లుచున్నాను.

రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం
కరాంభోజయుగ్మేన సాతంకనేత్రమ్ ।
ముహుః శ్వాసకంపత్రిరేఖాంకకంఠ-
స్థితగ్రైవ-దామోదరం భక్తిబద్ధమ్ ॥ 2 ॥

తల్లి చేతిలోని కర్రను చూసి ఏడుస్తూ, తన రెండు కళ్ళను చేతులతో మరల మరల నులుముకుంటున్నవాడు, భయంతో నిండిన నేత్రములు కలవాడు, ఏడ్చుట వలన, వేగంగా ఊపిరి పీల్చుటవలన ఊగుతున్న ముత్యాలహారము కంఠమునందున్నవాడు, తన ఉదరమునకున్న తాడుచేత కాక తన తల్లి ప్రేమచేత కట్టబడినవాడు అగు దేవదేవుడైన దామోదరునికి ప్రణమిల్లుచున్నాను.

ఇతీదృక్ స్వలీలాభిరానందకుండే
స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతమ్ ।
తదీయేషితాజ్ఞేషు భక్తైర్జితత్వం
పునః ప్రేమతస్తం శతావృత్తి వందే ॥ 3 ॥

తన బాల్య లీలలచేత గోకులవాసులను పారవశ్యంలో ముంచెత్తినవాడు, గౌరవం, అహంకారం, లౌకిక ఆశలు కలగని శుద్ధమైన ప్రేమ గాఢంగా గల భక్తులకు, మహోన్నతమైన దివ్య జ్ఞానంతో ఆయనను స్మరించే భక్తులకు వశమగుదునని అభయ మిచ్చినవాడు అగు దేవదేవుడైన దామోదరునికి, మిక్కిలి ప్రేమతో నేను మరల మరల అనేక వందల సార్లు ప్రణమిల్లుచున్నాను.

వరం దేవ మోక్షం న మోక్షావధిం వా
న చాన్యం వృణేఽహం వరేషాదపీహ ।
ఇదం తే వపుర్నాథ గోపాలబాలం
సదా మే మనస్యావిరాస్తాం కిమన్యైః ॥ 4 ॥

ఓ దేవా! నువ్వు అన్ని వరములు అనుగ్రహించగలవాడైనప్పటికీ నేను నిరాకార ముక్తిగానీ, సర్వోత్తమ శాశ్వత ముక్తిగానీ, నవవిధ భక్తి ద్వారా పొందదగు మరెటువంటి వరమును కోరను. ఓ స్వామీ! నేను కేవలం బృందావనంలో నీ బాలగోపాలుని రూపము ఎల్లప్పుడు నా హృదయంలో కొలువై వుండాలని కోరుకొంటున్నాను. ఇంతకంటే యే యితర వరమైననూ నాకేమి ప్రయోజనము?

ఇదం తే ముఖాంభోజమత్యంతనీలైర్-
వృతం కుంతలైః స్నిగ్ధ-రక్తైశ్చ గోప్యా ।
ముహుశ్చుంబితం బింబరక్తధరం మే
మనస్యావిరాస్తాం అలం లక్షలాభైః ॥ 5 ॥

స్వామీ! మెత్తని, నల్లని కురులతో ఒప్పుచున్న నీ ముఖ పద్మమును నీ తల్లి యశోద పదే పదే ముద్దులాడుచున్నది. నీ పెదవులు దొండపండు వలే ఎర్రగా ఉన్నవి. నీ సుందర ముఖారవింద రూపము నాహృదయంలో నిలిచియుండుగాక! నాకు వేలకు వేల ఇతర వరముల వలన ఉపయోగమేమీ లేదు.

నమో దేవ దామోదరానంత విష్ణో
ప్రసీద ప్రభో దుఃఖజాలాబ్ధిమగ్నమ్ ।
కృపాదృష్టివృష్ట్యాతిదీనం బతాను
గృహాణేశ మాం అజ్ఞమేధ్యక్షిదృశ్యః ॥ 6 ॥

ఓ దేవాదిదేవా! నేను నీకు ప్రణమిల్లుచున్నాను. ఓ దామోదరా! అనంతా! ఓ విష్ణు! ఓ స్వామీ! నాపై కృప చూపుము. నాపై నీ కృప అనుగ్రహించి, సంసార దుఃఖ సాగరములో మునిగిన ఈ మూర్ఖుని దరిజేర్చి నాకు దర్శనమివ్వు.

కుబేరాత్మజౌ బద్ధమూర్త్యైవ యద్వత్
త్వయా మోచితౌ భక్తిభాజౌ కృతౌ చ ।
తథా ప్రేమభక్తిం స్వకం మే ప్రయచ్ఛ
న మోక్షే గ్రహో మేఽస్తి దామోదరేహ ॥ 7 ॥

ఓ దామోదరా! ఏవిధంగానైతే నీవు చెక్కరోటికి కట్టబడిన తర్వాత, కుబేరుని పుత్రులైన నలకూబర, మణిగ్రీవులకు ముక్తి కలిగించి మహాభక్తులుగా అనుగ్రహించావో అదే విధంగా నాకు నీ ప్రేమభక్తిని ప్రసాదించు. నేను కేవలం దీనికొరకే పరితపిస్తున్నాను. నాకు మరే రకమైన ముక్తిపైనా కోరికలేదు.

నమస్తేఽస్తు దామ్నే స్ఫురద్దీప్తిధామ్నే
త్వదీయోదరాయాథ విశ్వస్య ధామ్నే ।
నమో రాధికాయై త్వదీయప్రియాయై
నమోఽనంతలీలాయ దేవాయ తుభ్యమ్ ॥ 8 ॥

ఓ దామోదరా! ముందుగా నీ ఉదరమునకు కట్టబడిన త్రాడుకు నేను ప్రణమిల్లుతున్నాను. తరువాత ప్రపంచమంతటికీ నెలవైన నీ ఉదరమునకు ప్రణమిల్లుతున్నాను. నీకు ప్రియాతి ప్రియమైన రాధాదేవికి నేను వినయపూర్వకంగా ప్రణమిల్లుతున్నాను. అనంత లీలలు ప్రదర్శించే దేవాదిదేవుడవైన నీకు నా సమస్త ప్రణామములు అర్పించుచున్నాను.

ఇతి శ్రీమద్పద్మపురాణే శ్రీ దామోదరాష్టాకం సంపూర్ణమ్ ॥

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top