స్తోత్రాలకు తెలుగులో అర్థం » మూక పంచశతి – కటాక్ష శతకం 11-20 శ్లోకాలు
మూక పంచశతి కటాక్ష శతకం 11-20 శ్లోకాలు

మూక పంచశతి – కటాక్ష శతకం 11-20 శ్లోకాలు

మూక పంచశతి – కటాక్ష శతకం అనేది భక్తి సాహిత్యంలో అపూర్వమైన కృతి. దీనిని మూక కవి రచించారు. ఈ శతకం ప్రధానంగా శ్రీ కామాక్షి అమ్మవారు దివ్య కటాక్షాన్ని వర్ణిస్తుంది. కామాక్షి దేవి అనుగ్రహంతో మూగుడైన కవి వాక్కు పొందినదే ఈ కృతి యొక్క విశిష్టత. ఈ శ్లోకాలు భక్తి, శరణాగతి, దైవానుగ్రహాన్ని తెలియజేస్తూ మనసుకు శాంతిని ప్రసాదిస్తాయి.

కటాక్ష శతకం పారాయణం చేయడం వల్ల జ్ఞానం, వాక్పటుత్వం, మనోశాంతి లభిస్తాయని నమ్మకం. ఇది ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ముఖ్యంగా దేవి కటాక్షం ద్వారా జీవితంలో విజయాలు, అడ్డంకుల నివారణ కలుగుతాయని విశ్వాసం ఉంది. భక్తులకు ఇది ఆధ్యాత్మిక బలం, సానుకూల శక్తి ప్రసాదించే పవిత్ర గ్రంథంగా భావించబడుతుంది.

యాంతీ సదైవ మరుతామనుకూలభావం
భ్రూవల్లిశక్రధనురుల్లసితా రసార్ద్రా।
కామాక్షి కౌతుకతరంగితనీలకంఠా
కాదంబినీవ తవ భాతి కటాక్షమాలా ॥11॥

అమ్మా! కామాక్షీ! నీ చూపులు మేఘముల వరుసలైతే, అవి మాపై వర్షించుటకు వాయుదేవుడు మొదలైనవారు సహకరిస్తారు. నీ కనుబొమలు రంగులతో కూడిన ఇంద్రధనుస్సు వంటివి. ఏ విధముగా మబ్బులను చూసి మయూరము పురివిప్పి ఆనంద నృత్యం చేస్తుందో, అలాగే నీ కరుణాపూరిత చూపులతో ఈశ్వరుడు ఆనంద తాండవం చేస్తాడు.

గంగాంభసి స్మితమయే తపనాత్మజేవ
గంగాధరోరసి నవోత్పలమాలికేవ ।
వక్త్రప్రభాసరసి శైవలమండలీవ
కామాక్షి రాజతి కటాక్షరుచిచ్ఛటా తే ॥12॥

అమ్మా! నీ క్రీగంటి చూపుల శ్యామవర్ణపు కాంతులు, నీ చిరునవ్వుల తెలుపు వర్ణపు కాంతులతో కలిసి గంగా, యమునా నదుల సంగమమును తలపిస్తున్నాయి. అవి ఎలా ఉన్నాయో తెలుసా! తెల్లని మేనిఛాయతో ఉన్న ఈశ్వరుని గళములో నల్లకలువ పువ్వుల హారంలా ఉన్నాయి.

సంస్కారతః కిమపి కందలితాన్ రసజ్ఞ-
కేదారసీమ్ని సుధియాముపభోగయోగ్యాన్ ।
కల్యాణసూక్తిలహరీకలమాంకురాన్నః
కామాక్షి పక్ష్మలయతు త్వదపాంగమేఘః ॥13॥

జగన్మాతా! ఎలాగైతే మబ్బులు పంటపొలములలో వర్షించి వాటిని సస్యశ్యామలము చేస్తాయో, అలాగే నీ చూపులు పుణ్యాత్ముల హృదయములలో వర్షించి, భక్తి అనే బీజమును అంకురములుగా, మొక్కలుగా వృద్ధి చేస్తాయి. పొలములో ఎదిగే మొక్కలలాగా కవుల హృదయములో కవిత్వమనే అంకురములు ఎదిగి వృద్ధి పొందుతాయి.

చాంచల్యమేవ నియతం కలయన్ప్రకృత్యా
మాలిన్యభూః శృతిపథాక్రమజాగరూకః ।
కైవల్యమేవ కిము కల్పయతే నతానాం
కామాక్షి చిత్రమపి తే కరుణాకటాక్షః ॥14॥

విచిత్రమేమిటంటే, అమ్మా! చంచలమైన నీ చూపులు, కర్ణముల వరకు విస్తరించిన నేత్రములు కేవలము భక్తులకే కాక, నీకు నమస్కరించిన వారికి కూడా, వారు పతితులైనా, చంచల మనస్కులైనా సరే, కైవల్య పదమును కటాక్షిస్తాయి.

సంజీవనే జనని చూతశిలీముఖస్య
సంమోహనే శశికిశోరకశేఖరస్య ।
సంస్తంభనే చ మమతాగ్రహచేష్టితస్య
కామాక్షి వీక్షణకలా పరమౌషధం తే ॥15॥

కామాక్షీ! నీ చూపులు పరమఔషధము. నీ చూపులు ప్రాణము పోయగలవు, భ్రాంతికి గురిచేయగలవు, చైతన్యమును ఆపగలవు. ఇవన్నీ కూడా ఔషధ లక్షణములే. నీ చూపులు కామదేవుడైన మన్మథుని పునర్జీవితుణ్ణి చేశాయి, ఈశ్వరుని మోహమునకు గురిచేశాయి, మాలోని మమత్వమును తొలగిస్తాయి.

నీలోఽపి రాగమధికం జనయన్పురారేః
లోలోఽపి భక్తిమధికాం దృఢయన్నరాణామ్ ।
వక్రోఽపి దేవి నమతాం సమతాం వితన్వన్
కామాక్షి నృత్యతు మయి త్వదపాంగపాతః ॥16॥

అమ్మా! పరస్వర విరుద్ధమైనవి నీ చూపులు. అవి నీలవర్ణమైన ఈశ్వరుని అనురాగమును వృద్ధిపరచాయి. చంచలమైన నీ చూపులు నీ చరణదాసుల భక్తిని మాత్రం స్థిరపరుస్తున్నాయి. వక్రభావములు కల వారిలో సమత్వభావనను పెంపొందిస్తున్నాయి. ఆ చూపులు నా మదిలో నాట్యము చేయుగాక.

కామద్రుహో హృదయయంత్రణజాగరూకా
కామాక్షి చంచలదృగంచలమేఖలా తే ।
ఆశ్చర్యమంబ భజతాం ఝటితి స్వకీయ-
సంపర్క ఏవ విధునోతి సమస్తబంధాన్ ॥17॥

జగన్మాతా! ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, నీ చూపులు కాముని జయించిన ఈశ్వరుని మనసునే ఆధీనములో ఉంచుకున్నవి. నిన్ను స్మరించి ప్రార్థించే భక్తుల పాశములన్నిటినీ అవి (నీ చూపులు) వెంటనే తొలగించి, మోక్షపదవిని ప్రసాదిస్తాయి.

కుంఠీకరోతు విపదం మమ కుంచితభ్రూ-
చాపాంచితః శ్రితవిదేహ భవానురాగః ।
రక్షోపకారమనిశం జనయంజగత్యాం
కామాక్షి రామ ఇవ తే కరుణాకటాక్షః ॥18॥

అమ్మా! నీ కనుబొమలు శివుని ధనువు. ఆ ధనువును వంచగా అది రెండుగా విడిపోయి, నీ చూపుల కాంతి జానకిని వరించినది. ఈ వివాహము జగత్తునకు రక్షణహేతువైనది. అంత మహిమగల నీ చూపులు నా ఆపదలను పోగొట్టి నన్ను రక్షించుగాక.

శ్రీకామకోటి శివలోచనశోషితస్య
శృంగారబీజవిభవస్య పునఃప్రరోహే ।
ప్రేమాంభసార్ద్రమచిరాత్ప్రచురేణ శంకే
కేదారమంబ తవ కేవలదృష్టిపాతమ్ ॥19॥

మాతా! కామకోటి కామాక్షీ! ఈశ్వరుని మూడవ కంటి మంటచే మన్మథుడు అనే బీజము మాడిపోయినది. నీ కరుణ అనే జలములో తడిసి అది మొలకెత్తుటకు సిద్ధమై, నీ దృష్టి అనే పొలములో మొలకెత్తి ఆ పొలము సస్యశ్యామలమైనది.

మాహాత్మ్యశేవధిరసౌ తవ దుర్విలంఘ్య-
సంసారవింధ్యగిరి కుంఠనకేలిచుంచుః ।
ధైర్యాంబుధిం పశుపతేశ్చులకీకరోతి
కామాక్షి వీక్షణవిజృంభణకుంభజన్మా ॥20॥

అమ్మా! నీ చూపు అగస్త్య మహర్షి వంటిది. అది వంచరానిదైన వింధ్య పర్వతమును వంచినది. నీ చూపు అనే అగస్త్యుడు ఈశ్వరుని నిగ్రహము అనే సముద్రమును అవపోసన చేసి, ఆయనను నీ వైపు ఆకర్షితుని చేసింది.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top