స్తోత్రాలకు తెలుగులో అర్థం » మూక పంచశతి – కటాక్ష శతకం 51-60 శ్లోకాలు
మూక పంచశతి కటాక్ష శతకం 51-60 శ్లోకాలు

మూక పంచశతి – కటాక్ష శతకం 51-60 శ్లోకాలు

మూక పంచశతి – కటాక్ష శతకం అనేది భక్తి సాహిత్యంలో అపూర్వమైన కృతి. దీనిని మూక కవి రచించారు. ఈ శతకం ప్రధానంగా శ్రీ కామాక్షి అమ్మవారు దివ్య కటాక్షాన్ని వర్ణిస్తుంది. కామాక్షి దేవి అనుగ్రహంతో మూగుడైన కవి వాక్కు పొందినదే ఈ కృతి యొక్క విశిష్టత. ఈ శ్లోకాలు భక్తి, శరణాగతి, దైవానుగ్రహాన్ని తెలియజేస్తూ మనసుకు శాంతిని ప్రసాదిస్తాయి.

కటాక్ష శతకం పారాయణం చేయడం వల్ల జ్ఞానం, వాక్పటుత్వం, మనోశాంతి లభిస్తాయని నమ్మకం. ఇది ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ముఖ్యంగా దేవి కటాక్షం ద్వారా జీవితంలో విజయాలు, అడ్డంకుల నివారణ కలుగుతాయని విశ్వాసం ఉంది. భక్తులకు ఇది ఆధ్యాత్మిక బలం, సానుకూల శక్తి ప్రసాదించే పవిత్ర గ్రంథంగా భావించబడుతుంది.

కాషాయమంశుకమివ ప్రకటం దధానో
మాణిక్యకుండలరుచిం మమతావిరోధీ ।
శ్రుత్యంతసీమని రతః సుతరాం చకాస్తి
కామాక్షి తావకకటాక్షయతీశ్వరోఽసౌ ॥51॥

అమ్మా! కామాక్షీ! నీ దయ ఈ సంసారమును త్యజించిన మహా యోగి. నీ కర్ణాభరణములకు ఉన్న కాంతులు అతడు ధరించిన కాషాయ వస్త్రములు. ఆ యోగి మమత్వమును సన్యసించి, ఆగమములు – ఉపనిషత్తులలో విహరించుచున్నట్లుగా తోచుచున్నది.

పాషాణ ఏవ హరినీలమణిర్దినేషు
ప్రమ్లానతాం కువలయం ప్రకటీకరోతి ।
నౌమిత్తికో జలదమేచకిమా తతస్తే
కామాక్షి శూన్యముపమానం అపాంగలక్ష్మ్యాః ॥52॥

జగన్మాతా! నీ దయతో పోల్చదగినది మరేమీ లేదు. ఇంద్రనీల మణులతో సరిపోల్చుదామంటే అవేమో రాళ్ళు. కలువ పుష్పములతో పోలిక తెద్దామా అంటే అవి పగలు సమయంలోనే ముకులించుకుపోతాయి. మేఘముతో పోల్చుదామంటే అది కేవలము వర్షాకాలములోనే వర్షిస్తుంది.

శృంగారవిభ్రమవతీ సుతరాం సలజ్జా
నాసాగ్రమౌక్తికరుచా కృతమందహాసా ।
శ్యామా కటాక్షసుషమా తవ యుక్తమేతత్
కామాక్షి చుంబతి దిగంబరవక్త్రబింబమ్ ॥53॥

మాతా! నీ కటాక్షమనే స్త్రీమూర్తి నల్లగా ఉండి, ఎంతో చక్కగా అలంకరించుకుని, సిగ్గుల మొగ్గయై, ముక్కెరలో ప్రకాశిస్తున్న ముత్యపు కాంతి చిరునవ్వుగా కలిగి, దిక్కులే అంబరములుగా ఉన్న ఈశ్వరుని ముఖమును ముద్దిడుతున్నట్లు దర్శనమిస్తున్నది.

నీలోత్పలేన మధుపేన చ దృష్టిపాతః
కామాక్షి తుల్య ఇతి తే కథమామనంతి ।
శైత్యేన నిందతి యదన్వహమిందుపాదాన్
పాథోరుహేణ యదసౌ కలహాయతే చ ॥54॥

మాతా! నీ చూపులు కరుణా కటాక్షమును నల్ల కలువలతోనూ, నల్ల తుమ్మెదలతోనూ పోలుస్తారు. ఇది ఎంతమాత్రము సరికాదు. ఎందుకంటే, చంద్రకిరణములలోని చల్లదనమును నీచూపుల చల్లదనము, కమలముల కాంతిని నీ నల్లని చూపుల కాంతి ఎప్పుడో త్రోసిరాజన్నాయి.

ఓష్ఠప్రభాపటలవిద్రుమముద్రితే తే
భ్రూవల్లివీచిసుభగే ముఖకాంతిసింధౌ ।
కామాక్షి వారిభరపూరణలంబమాన
కాలాంబువాహసరణిం లభతే కటాక్షః ॥55॥

అమ్మా! నీల వర్ణములో ఉన్న నీ క్రీగంటి చూపు వర్షాకాలపు మేఘమువలే సముద్రము అనే కాంతపై వర్షిస్తుండగా, ఆ వర్షపు నీరు ఎరుపు కాంతితో కూడిన పగడములవంటి పెదవులపై పడి ప్రకాశిస్తున్నది.

మందస్మితైర్ధవలితా మణికుండలాంశు-
సంపర్కలోహితరుచిః త్వదపాంగధారా ।
కామాక్షి మల్లికుసుమైర్నవపల్లవైశ్చ
నీలోత్పలైశ్చ రచితేవ విభాతి మాలా ॥56॥

కామాక్షీ! నీ చిరునవ్వేమో తెల్లనిది. నీ కర్ణాభరణముల కాంతులు ఎర్రనివి. నీ కన్నుల కాంతి ప్రవాహము నీలవర్ణము కలది. ఈ మూడు కలసి ఎలా దర్శనమిస్తున్నాయో తెలుసా, మల్లెపూలు, లేలేత కొత్త చిగుళ్ళు, నల్ల కలువపూలు కలిపి అమర్చిన హారములా అనిపిస్తోంది.

కామాక్షి శీతలకృపారస నిర్ఝరాంభః
సంపర్కపక్ష్మలరుచిః త్వదపాంగమాలా ।
గోభిః సదా పురరిపోరభిలష్యమాణా
దూర్వాకదంబకవిడంబనమాతనోతి ॥57॥

మాతా! కామాక్షీ! నీ కన్నుల చూపులనే కటాక్షములు దయారస ప్రవాహము. ఆ చూపులు ఏపుగా పెరిగిన గరిక పొదల వలె ఉన్నవి. ఆ గరికను ఆస్వాదించడానికి ఈశ్వరుడు అనే గోవు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

హృత్పంకజం మమ వికాసయతు ప్రముష్ణన్
ఉల్లాసముత్పలరుచేస్తమసాం నిరోద్ధా ।
దోషానుషంగజడతాం జగతాం ధునానః
కామాక్షి వీక్షణవిలాసదినోదయస్తే ॥58॥

మాతా! కామాక్షీ! నీ క్రీగంటి చూపుల నుండి ఉదయ కాంతిరేఖలు వెల్లివిరుస్తున్నాయి. అవి కారు చీకట్లను చీల్చుకుంటూ, సకల జగములలోని అజ్ఞానమును తొలగిస్తూ, నా హృదయమనే పద్మమును ఎంతగానో వికసింపచేస్తున్నాయి.

చక్షుర్విమోహయతి చంద్రవిభూషణస్య
కామాక్షి తావకకటాక్షతమఃప్రరోహః ।
ప్రత్యఙ్ముఖం తు నయనం స్తిమితం మునీనాం
ప్రాకాశ్యమేవ నయతీతి పరం విచిత్రమ్ ॥59॥

జగన్మాతా! కామాక్షీ! నీ క్రీగంటి చూపు అనే మొలక ఈశ్వరుని, మోహమునకు గురి చేస్తున్నది. అదే చూపు నిరంతరము అంతర్ముఖులై, ధ్యానమగ్నులైన మునీశ్వరులకు నీ ప్రకాశమనే వెలుగును ప్రసాదిస్తున్నది. ఇది ఎంత ఆశ్చర్యకరమో కదా!

కామాక్షి వీక్షణరుచా యుధి నిర్జితం తే
నీలోత్పలం నిరవశేషగతాభిమానమ్ ।
ఆగత్య తత్పరిసరం శ్రవణావతంస-
వ్యాజేన నూనమభయార్థనమ్ ఆతనోతి ॥60॥

మాతా! కామాక్షీ! నీ చూపులతో యుద్ధము చేసి పరాజితులైన నల్లకలువలు, నీ చెవులకు అలంకారప్రాయములై ఉండి, అక్కడనుండే తమపై కరుణ చూపమని నీ కన్నులను ప్రార్థిస్తున్నాయి.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top