స్తోత్రాలకు తెలుగులో అర్థం » మూక పంచశతి – కటాక్ష శతకం 81-90 శ్లోకాలు
మూక పంచశతి కటాక్ష శతకం 81-90 శ్లోకాలు

మూక పంచశతి – కటాక్ష శతకం 81-90 శ్లోకాలు

మూక పంచశతి – కటాక్ష శతకం అనేది భక్తి సాహిత్యంలో అపూర్వమైన కృతి. దీనిని మూక కవి రచించారు. ఈ శతకం ప్రధానంగా శ్రీ కామాక్షి అమ్మవారు దివ్య కటాక్షాన్ని వర్ణిస్తుంది. కామాక్షి దేవి అనుగ్రహంతో మూగుడైన కవి వాక్కు పొందినదే ఈ కృతి యొక్క విశిష్టత. ఈ శ్లోకాలు భక్తి, శరణాగతి, దైవానుగ్రహాన్ని తెలియజేస్తూ మనసుకు శాంతిని ప్రసాదిస్తాయి.

కటాక్ష శతకం పారాయణం చేయడం వల్ల జ్ఞానం, వాక్పటుత్వం, మనోశాంతి లభిస్తాయని నమ్మకం. ఇది ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ముఖ్యంగా దేవి కటాక్షం ద్వారా జీవితంలో విజయాలు, అడ్డంకుల నివారణ కలుగుతాయని విశ్వాసం ఉంది. భక్తులకు ఇది ఆధ్యాత్మిక బలం, సానుకూల శక్తి ప్రసాదించే పవిత్ర గ్రంథంగా భావించబడుతుంది.

కామాక్షి కేఽపి సుజనాస్త్వదపాంగసంగే
కంఠేన కందలితకాలిమసంప్రదాయాః ।
ఉత్తంసకల్పితచకోరకుటుంబపోషా
నక్తందివసప్రసవభూ నయనా భవంతి ॥81॥

మాతా కామాక్షీ! అతి కొద్దిమంది పుణ్యాత్ములు మాత్రమే నీ కరుణవలన, నీల కంఠము కలవారై, చకోర పక్షులను తన అమృత ధారలతో పోషించే చంద్రుని అలంకారము కలిగి, సూర్య చంద్రులు నయనాలుగా, ఈశ్వరుని సామీప్యమును పొందుతారు.

నీలోత్పలప్రసవకాంతినిదర్శనేన
కారుణ్యవిభ్రమజుషా తవ వీక్షణేన ।
కామాక్షి కర్మజలధేః కలశీసుతేన
పాశత్రయాద్వయమమీ పరిమోచనీయాః ॥82॥

జగన్మాతా! కామాక్షీ! నల్ల కలువ పూల కాంతి, కరుణారసపూరితమైన నీ విలాసము, కర్మ అనే అగస్త్యుని సముద్రముతో, మేము తాపత్రయములనుండి విముక్తి పొందెదము గాక.

అత్యంతచంచలమకృత్రిమమంజనం కిం
ఝంకారభంగిరహితా కిము భృంగమాలా ।
ధూమాంకురః కిము హుతాశనసంగహీనః
కామాక్షి నేత్రరుచినీలిమకందలీ తే ॥83॥

మాతా! కామాక్షీ! నీ నేత్రముల నల్లని కాంతులు చంచలముగా ఉన్న సహజమైన కాటుకయా, ఝంకార శబ్దము చేయని భ్రమరముల సమూహమా, అగ్ని లేని పొగ సమూహమా అర్ధం కావడము లేదు.

కామాక్షి నిత్యమయమంజలిరస్తు ముక్తి-
బీజాయ విభ్రమమదోదయఘూర్ణితాయ ।
కందర్పదర్పపునరుద్భవసిద్ధిదాయ
కల్యాణదాయ తవ దేవి దృగంచలాయ ॥84॥

జగదీశ్వరీ! కామాక్షీ! మాలో ముక్తి బీజమును అంకురింపచేసి, నీ శరీర కాంతులచే మాకు ఆనందమును ప్రసాదించి, మన్మథుని పునర్జీవుతుని చేసి, శుభప్రదాయినిగా ఉన్న నీ క్రీగంటి చూపునకు నా సాదర ప్రణామములు.

దర్పాంకురో మకరకేతనవిభ్రమాణాం
నిందాంకురో విదలితోత్పలచాతురీణామ్ ।
దీపాంకురో భవతమిస్రకదంబకానాం
కామాక్షి పాలయతు మాం త్వదపాంగపాతః ॥85॥

మాతా! కామకోటి నిలయా! నీ కన్నుల చూపులు మన్మథుని లీలా విలాసములా, నల్ల కలువ పూవుల సౌందర్యమును త్రోసిరాజను మొలకలా, లేక ఈ సంసారము అనే అజ్ఞానమునకు దీపపు మొలకలా అర్థముకాకున్నది. ఏది ఏమైనా, ఆ చూపులు నన్ను కటాక్షించుగాక.

కైవల్యదివ్యమణిరోహణపర్వతేభ్యః
కారుణ్యనిర్ఝరపయఃకృతమంజనేభ్యః ।
కామాక్షి కింకరితశంకరమానసేభ్యః
తేభ్యో నమోఽస్తు తవ వీక్షణవిభ్రమేభ్యః ॥86॥

అమ్మా! నీ చూపులు మోక్ష ఆరోహణకు సోపానములు. కరుణ అనే నదీ జలములలో జలకములాడినవి. ఈశ్వరుని హృదయమునే స్వాధీన పరచుకున్నవి. అటువంటి దివ్యమైన నీ చూపులకు నమస్కరిస్తున్నాను.

అల్పీయ ఏవ నవముత్పలమంబ హీనా
మీనస్య వా సరణిరంబురుహాం చ కిం వా ।
దూరే మృగీదృగసమంజసమంజనం చ
కామాక్షి వీక్షణరుచౌ తవ తర్కయామః ॥87॥

కామాక్షీ! నీ చూపుల విలాసము ఎటువంటిదంటే, కలువ పుష్పముల కాంతి, పద్మముల ఠీవి, చేప కన్నుల తీరుతెన్నులు, జింక కన్నుల చాంచల్యము, ఇవేవీ కూడా నీ కన్నుల విలాసములకు సాటి రానే రావు.

మిశ్రీభవద్గరలపంకిల శంకరోరస్-
సీమాంగణే కిమపి రింఖణమాదధానః ।
హేలావధూతలలితశ్రవణోత్పలోఽసౌ
కామాక్షి బాల ఇవ రాజతి తే కటాక్షః ॥88॥

తల్లీ! నీ చూపుల కటాక్షము ఎలా ఉందో తెలుసా! పరమేశ్వరుని వక్షస్థలము అనే వాకిలి దగ్గర తిరుగాడుచున్న బాలుడా అనిపిస్తున్నది. ఈశ్వరుని వక్షస్థలము గరళపు ఛాయతో ఉన్నది. అటువంటి వక్షస్థలముపై అమ్మ చూపులు అనే బాలకుడు కేరింతలు కొడుతున్నాడు. అక్కడినుండి చెవులపైకి పాకి, అక్కడ ఉన్న కలువ పూలను తీసి వేస్తున్నాడు.

ప్రౌఢీకరోతి విదుషాం నవసూక్తిధాటీ-
చూతాటవీషు బుధకోకిలలాల్యమానమ్ ।
మాధ్వీరసం పరిమలం చ నిరర్గలం తే
కామాక్షి వీక్షణవిలాసవసంతలక్ష్మీః ॥89॥

మాతా! కామాక్షీ! నీ క్రీగంటి చూపులను కవి వరేణ్యులు –వసంత ఋతువులో, మామిడి వనములలో, చెట్లపై, తీయని ఫలములను ఆరగిస్తూ, కుహు కుహు నాదములు చేస్తూ వసంత శోభను విస్తరింపచేస్తున్న కోకిలలుగా – వర్ణించారు.

కూలంకషం వితనుతే కరుణాంబువర్షీ
సారస్వతం సుకృతినః సులభం ప్రవాహమ్ ।
తుచ్ఛీకరోతి యమునాంబుతరంగభంగీం
కామాక్షి కిం తవ కటాక్షమహాంబువాహః ॥90॥

మాతా! కామాక్షీ! నీ దయారసపూరితమైన చూపులు వర్షాకాల మేఘము వంటివి. ఆ వర్షధారలు జ్ఞానులపై విస్తారముగా వర్షిస్తాయి. నీ చూపుల ప్రవాహము యమునా నదీ ప్రవాహమును మించి ఉధృతముగా ప్రవహిస్తున్నది.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top