చంద్రశేఖరాష్టకం
చంద్రశేఖరాష్టకం అనేది పరమశివుడిని స్తుతిస్తూ ఆది శంకరాచార్యులు రచించిన అత్యంత పవిత్రమైన శైవ స్తోత్రాలలో ఒకటి. “చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం” అనే మంత్రసమానమైన పదాలతో ప్రసిద్ధి చెందిన ఈ స్తోత్రం భక్తులకు భయం, దుఃఖం, నెగటివ్ ఎనర్జీ నుండి రక్షణ కలిగిస్తుందని నమ్మకం. శివ భక్తులు ప్రతిరోజూ దీనిని పారాయణం చేస్తే మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక శక్తి, ధైర్యం కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ చంద్రశేఖరాష్టకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది మహాదేవుని కరుణ, శక్తి, భక్తులపై ఆయన రక్షణను అద్భుతంగా వర్ణిస్తుంది. శివరాత్రి, సోమవారం, ప్రదోషకాలంలో ఈ స్తోత్రాన్ని పఠించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ।
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥
చంద్రుని శిరస్సుపై ధరించిన ఓ పరమేశ్వరా! నేను మిమ్ములను శరణు వేడుతున్నాను. మీరు నన్ను ఎల్లప్పుడూ రక్షించండి.
రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ ।
క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై-రభివందితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 1 ॥
రత్నములతో కూడిన కొండచరియలుగల మేరుపర్వతమును ధనస్సుగాను, పాములకు అధిపతియైన వాసుకిని అల్లెత్రాడుగాను, మహావిష్ణువును అగ్నిబాణముగాను చేసుకొని, త్వరితగతిని త్రిపురములను దహించి, దేవతలచే స్తుతింపబడునట్టి, చంద్రుని శిరస్సున ధరించిన శివుని నేను ఆశ్రయించితిని. యముడు నన్నేమి చెయ్యగలడు?
పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం
ఫాలలోచన జాతపావక దగ్ధ మన్మధ విగ్రహమ్ ।
భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవ మవ్యయం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 2 ॥
పంచవృక్షములయొక్క సుగంధభరితమైన పుష్పములచే శోభిల్లు పాదపద్మద్వయం కలవాడు, ఫాలనేత్రమునుండి వెలువడిన అగ్నిచే మన్మథుని రూపమును దహించిన వాడు, భస్మముచే నిండిన శరీరము కలిగి భవమును నశింపచేయువాడు, అధీయమైన పుట్టుక గలవాడు, శాశ్వతుడు ఐన చంద్రుని శిరస్సున ధరించిన శివుని నేను ఆశ్రయించితిని. యముడు నన్నేమి చెయ్యగలడు?
మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహమ్ ।
దేవ సింధు తరంగ శ్రీకర సిక్త శుభ్ర జటాధరం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 3 ॥
శ్రేష్టమైన మదపుటేనుగుయొక్క చర్మమును అందమైన ఉత్తరీయముగా చేసుకొని, బ్రహ్మ, విష్ణువులచే పూజించబడిన పాదపద్మములు కలవాడు, ఆకాశగంగ యొక్క అలల నీటి తుంపరలచే శుభ్రమైన జటలు కలవాడు, చంద్రుని శిరస్సున ధరించిన శివుని- నేను ఆశ్రయించితిని. యముడు నన్నేమి చెయ్యగలడు?
యక్ష రాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణం
శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరమ్ ।
క్షేళ నీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 4 ॥
కుబేరుని మిత్రుడు, పాములను ఆభరణములుగా ధరించి, పార్వతీదేవిచే అలంకరింపబడిన ఎడమభాగము కలవాడు, విషముచే నల్లబడిన కంఠము కలిగి, గండ్రగొడ్డలిని, మృగమును ధరించినవాడు, చంద్రుని శిరస్సు ధరించిన శివుని నేను ఆశ్రయించితిని. యముడు నన్నేమి చెయ్యగలడు?
కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం
నారదాది మునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరమ్ ।
అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 5 ॥
చుట్టగా చేయబడిన పామును చెవిపోగులుగా ధరించినవాడు, ఎద్దును వాహనముగా కలిగినవాడు, నారదాది మునీశ్వరులచే స్తుతింపబడిన వైభవముగల భువనేశ్వరుడు, అంధకాసురుని సంహరించి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమైనవాడు, యముని పాలిట యముడు, చంద్రుని శిరస్సున ధరించిన శివుని నేను ఆశ్రయించితిని. యముడు నన్నేమి చేయగలడు?
భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్ ।
భక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 6 ॥
పుట్టుక అనే రోగము కలవారికి మందు వంటివాడు, అన్ని ఆపదలను తొలగించువాడు, దక్షుని యజ్ఞమును నాశనమొనర్చినవాడు, మూడు గుణాలు, మూడు కన్నులు కలిగి భుక్తిని, ముక్తిని, ఫలాలను యిచ్చువాడు, సమస్త పాప సముదాయమును తొలగించువాడు, ఐన చంద్రుని శిరస్సున ధరించిన శివుని నేను ఆశ్రయించితిని. యముడు నన్నేమి చెయ్యగలడు?
భక్తవత్సల-మర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూత పతిం పరాత్పర-మప్రమేయ మనుత్తమమ్ ।
సోమవారిన భూహుతాశన సోమ పాద్యఖిలాకృతిం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 7 ॥
భక్తులపట్ల వాత్సల్యము కలవాడు, భక్తులచే అర్చించబడేవాడు, అక్షయనిధి వంటివాడు, ఆకుపచ్చని వస్త్రాలు ధరించి సర్వభూతాలకు అధిపతియైనవాడు, పరముకంటే పరమైనవాడు, కొలుచుటకు వీలులేనివాడు, తనకంటే ఉత్తముడు లేనివాడు, సోమరసమును వారుణిగా, భూమిని అగ్నిగా కలిగి సోమరస పానము చేయువారి అందరి రూపము తానే ధరించినవాడు, పాప సముదాయమును తొలగించువాడు ఐన, చంద్రుని శిరస్సున ధరించిన శివుని నేను ఆశ్రయించితిని. యముడు నన్నేమి చెయ్యగలడు?
విశ్వసృష్టి విధాయకం పునరేవపాలన తత్పరం
సంహరం తమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్ ।
క్రీడయంత మహర్నిశం గణనాథ యూథ సమన్వితం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 8 ॥
అసంఖ్యాకులైన లోకులకు నివాసమైన సమస్త ప్రపంచమును సృష్టి చేయువాడు, తాను సృష్టించినదానిని పాలించుటయందు నిమగ్నుడైయున్నవాడు, దానిని మరల సంహరించువాడు, గణములతో కలసి రాత్రింబగళ్ళు క్రీడించువాడు ఐన- చంద్రుని శిరస్సున ధరించిన శివుని నేను ఆశ్రయంచితిని. యముడు నన్నేమి చేయ్యగలడు?
ఫలశ్రుతి:
మృత్యుభీత మృకండుసూనుకృతస్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్ ।
పూర్ణమాయురరోగతామఖిలార్థసంపదమాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః ॥ 9 ॥
మృత్యుభయముచే మార్కండేయుడు చేసిన ఈ శివ స్తోత్రమును శివుని సన్నిథిలోకాని లేదా ఇంకెక్కడైనా గానీ పఠించినచో అతనికి మృత్యుభయము కలుగదు. సంపూర్ణమైన ఆయుష్షు ఆరోగ్యము, సర్వసంపదలు కలుగును.
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ।
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥
చంద్రుని శిరస్సుపై ధరించే ఓ పరమేశ్వరా, నేను మిమ్ములను శరణు వేడుతున్నాను. చంద్రుని శిరస్సుపై ధరించే ఓ పరమేశ్వరా, మీరు నన్ను ఎల్లవేళలా రక్షించండి.
// ఇతి మార్కండేయ కృత శ్రీ చంద్రశేఖరాష్టకమ్ సంపూర్ణమ్
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.





