లలితా సహస్రనామ ఫలశృతి 81-88 శ్లోకాలు తెలుగులో అర్థం
శ్రీలలితా సహస్రనామంలోని ఫలశ్రుతి భాగం, ఈ దివ్య నామాలను భక్తిశ్రద్ధలతో పారాయణం చేయడం వల్ల కలిగే మహిమలను వివరిస్తుంది. ఫలశ్రుతి ద్వారా ఈ సహస్రనామం కేవలం స్తోత్రమే కాక, భక్తుల జీవితాలను ఆధ్యాత్మికంగా మరియు లౌకికంగా ఉన్నత స్థితికి చేర్చే దివ్య సాధనమని తెలియజేయబడుతుంది. పరాశక్తి అయిన శ్రీలలితా మహాత్రిపురసుందరీ కృపను పొందడానికి ఈ నామాల జపం అత్యంత శ్రేష్ఠమైన మార్గంగా శాస్త్రాలు పేర్కొన్నాయి.
భక్తితో శ్రీలలితా సహస్రనామ ఫలశ్రుతిని చదవడం లేదా వినడం ద్వారా పాపక్షయం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానసౌభాగ్యం, విద్యా ప్రాప్తి, శత్రువుల నుండి రక్షణ వంటి అనేక శుభఫలితాలు లభిస్తాయని చెప్పబడింది. అంతేకాక, పరమాత్మసాక్షాత్కారం మరియు మోక్షప్రాప్తికి కూడా ఈ స్తోత్రం దోహదపడుతుందని ఫలశ్రుతి వివరిస్తుంది. ఇప్పుడు ఈ ఫలశ్రుతి శ్లోకాల యొక్క తెలుగు అర్థాన్ని తెలుసుకుందాం.
యో భక్తో లలితాదేవ్యాః స నిత్యం కీర్తయేదిదమ్
నాన్యథా ప్రీయతే దేవీ కల్పకోటిశతైరపి || 81 ||
లలితా దేవి భక్తుడైనవాడు ఈ సహస్ర నామములను నిత్యమూ పఠించవలెను. నిత్య పారాయణ చేసినవాడే దేవీ భక్తుడు.
తస్మాద్రహస్యనామాని శ్రీమాతుః ప్రయతః పఠేత్
ఇతి తే కథితం స్తోత్రం రహస్యం కుంభసంభవ || 82 ||
ఓ అగస్త్యుడా! దేవీ ప్రీతి కలుగును కనుక ఏకాగ్రత, శుచి కలవాడై లలితా రహస్య నామములను పారాయణం చేయాలని ఈ రహస్య స్తోత్రమును నీకు నేను చెప్పితిని.
నావిద్యావేదినే బ్రూయాత్ నాభక్తాయ కదాచన
యథైవ గోప్యా శ్రీవిద్యా తథా గోప్యమిదం మునే || 83 ||
ఓ అగస్త్యుడా! శ్రీవిద్యను తెలియనివారికి ఈ సహస్రనామ స్తోత్రమును చెప్పకూడదు. భక్తిలేని వారికి ఎప్పుడూ చెప్పకూడదు. శ్రీవిద్య ఎంత రహస్యమో ఈ స్తోత్రము కూడా అంత రహస్యము.
పశుతుల్యేషు న బ్రూయాత్ జనేషు స్తోత్రముత్తమమ్
యో దదాతి విమూఢాత్మా శ్రీవిద్యారహితాయ చ || 84 ||
ఈ స్తోత్రాన్ని పశుస్వభావం కల మానవులకు, మూఢుడైన వాడికీ చెప్పకూడదు.
తస్మై కుప్యంతి యోగిన్యః సోఽనర్థః సుమహాన్ స్మృతః
రహస్యనామసాహస్రం తస్మాత్సంగోపయేదిదమ్ || 85 ||
శ్రీవిద్య, భక్తి- రెండూ లేనివారికి ఎవరు ఈ స్తోత్రాన్ని చెప్తారో, వానియందు యోగినులు కోపము పొందుదురు. కాబట్టి దీనిని రహస్యముగా కాపాడవలెను.
స్వతంత్రేణ మయానోక్తం తవాపి కలశోద్భవ
లలితాప్రేరణేనైవ మయోక్తం స్తోత్రముత్తమమ్ || 86 ||
ఓ అగస్త్యుడా! నీవు విద్య, శ్రద్ధ, భక్తులు కలవాడవైనా నా అంతట నేను నీకు ఇది చెప్పలేదు. లలితా దేవి ఆజ్ఞతో నేను నీకు చెప్పితిని.
కీర్తనీయమిదం భక్త్యా కుంభయోనే నిరంతరం
తేన తుష్టా మహాదేవీ తవాభీష్టం ప్రదాస్యతి || 87 ||
ఓ అగస్త్యుడా! ఎప్పుడూ భక్తితో లలితాసహస్రనామ పారాయణ చేస్తే, లలితాదేవి సంతోషించి కోరికలను నెరవేర్చును.
శ్రీసూత ఉవాచ
ఇత్యుక్త్వా శ్రీహయగ్రీవో ధ్యాత్వా శ్రీలలితాంబికామ్
ఆనందమగ్నహృదయః సద్యః పులకితోఽభవత్ || 88 ||
శ్రీ హయగ్రీవుడు ఇలా పలికి, లలితాదేవిని ధ్యానం చేసి, వెంటనే ఆనందములో మునిగిన హృదయము కలవాడై గగుర్పాటు కలవాడాయెను.
ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీహయగ్రీవాగస్త్యసంవాదే శ్రీలలితాసహస్రనామస్తోత్ర ఫలనిరూపణం నామ తృతీయోఽధ్యాయః
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.



